15 ఏళ్లలో ఏం చేశారు?
♦ ప్రతిపక్షాలకు ఉద్ధవ్ సూటి ప్రశ్న
♦ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేయలేదేం?
♦ రైతుల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం
ముంబై : రైతు రుణాలు మాఫీ చేయలేదని అసెంబ్లీ సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు, గత 15 ఏళ్లలో ఏం చేశాయని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. శాసనమండలి సమావేశాలను విపక్షాలు అడ్డుకుంటుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్ధవ్, రైతు రుణమాఫీ చేయాలని డిమాండు చేస్తున్న ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నపుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ‘గత 15 ఏళ్లుగా మీరు అధికారంలో ఉన్నారు.
మరి మీరెందుకు రుణమాఫీ చేయలేదు? ఎందుకీ నాటకాలు?’ అని నిలదీశారు. ‘ప్రతిపక్షాల పాఠాలు మాకు అవసరం లేదు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే రైతు రుణాల కోసం పోరాటాలు చేశాం. ప్రభుత్వాన్ని ఎలా నడపాలా మీ నుంచి నేర్చుకోవాల్సిన గత్యంతరం మాకు పట్టలేదు’ అని చెప్పారు. ప్రతిపక్షం ప్రతిపక్షంలా ప్రవర్తిస్తే మంచిదని సూచించారు. రైతుల పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందని నాసిక్‌లో ఉద్ధవ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.