న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కేసు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఉమా భారతి స్వాగతించారు. అయోధ్య వివాదం కోర్టు బయటే పరిష్కారం అవుతుందనే నమ్మకం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా బాబ్రీ మసీదు వివాదంపై అత్యవసరంగా విచారణ జరపాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది.
పిటిషనర్లు, ప్రతివాదులతో చర్చించి కోర్టు బయట వివాదాన్ని పరిష్కరించుకోవాలని న్యాయస్థానం సూచనలు చేసింది. అయితే చర్చల ద్వారా పరిష్కారం దొరక్కపోతే తాము కల్పించుకుంటామని తెలిపింది. మరోవైపు సుప్రీం వ్యాఖ్యలను షాహి ఇమామ్ బుఖారీ స్వాగతించారు. కాగా అయోధ్యలో రామమందిరం వివాదాన్ని 2019 ఎన్నికలలోపే.. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించాలని శివసేన నేత సంజయ్ కాంత్ డిమాండ్ చేశారు.