
ప్రజలను మతపరంగా చీల్చే సాంప్రదాయిక ధోరణి నుంచి బయటకు వచ్చి.. భక్తి, విశ్వాసాలకు సంబంధించిన మరింత ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తి వాటిని రగుల్కొల్పే అవకాశాన్ని శబరిమల ఉదంతం బీజేపీకి చక్కగా అందించింది. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ’అమలు చేయదగిన తీర్పులనే ఇవ్వాలని, ప్రజల విశ్వాసాలను వమ్ము చేసే తీర్పులను, ఆదేశాలను అవి జారీ చేయకూడద’ని అమిత్ షా చేసిన ప్రకటన కేరళకే పరిమితం అవుతుందా? అమిత్ షా సూచన శబరిమల విషయంలోనే కాకుండా రేపు సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వబోతున్న అయోధ్య విషయంలోనూ వర్తించబోతున్నదా? అన్నదే అన్నిటికంటే పెద్ద ప్రశ్న.
రాజ్యసభ సభ్యుడిగా 2017 ఆగస్టు నెలలో తన ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా అమిత్ షా చేసిన ప్రమాణంలో ఇది కొంత భాగం: ‘అమిత్ షా అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని’. కానీ గత శనివారం కేరళలోని కన్నూర్‌లో, శబరిమలలో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో అమిత్ షానే మాట్లాడుతూ, ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ‘అమలు చేయదగిన తీర్పులనే ఇవ్వాలని’ సూచిస్తూ మరికాస్త జోడించారు.
అదేమిటంటే, ‘ప్రజల విశ్వాసాలను వమ్ము చేసే తీర్పులను, ఆదేశాలను అవి జారీ చేయకూడదు’. బీజేపీ అధ్యక్షుడు ఈ భిన్న ప్రకటనల ద్వారా తన్ను తాను ఖండించుకుంటున్నారా? విశ్వాసాలతో, మతంతో ముడిపడివున్న సున్నితమైన అంశాలకు సంబంధించి భారత రాజ్యాంగం విధించిన శాసనాలకు కోర్టులు పూర్తిగా కట్టుబడకూడదని ఆయన సూచిస్తున్నారా? మనుషులందరినీ లింగ భేదం లేకుండా సమాన దృష్టితో చూడటానికి బదులుగా, శబరిమల ఉదంతంలో ప్రజల విశ్వాసం, సున్నితమైన మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నదే అమిత్ షా అభిమతమా?
శబరిమల ఆందోళనకారులకు పూర్తి మద్దతు ఇస్తూ, బీజేపీ కార్యకర్తలు వారికి అన్ని విధాలా అండదండలుగా ఉంటున్న వైనం గమనిస్తే ఈ అంశంలో బీజేపీ వైఖరి ఆశ్చర్యం కలిగించదు. అక్టోబర్‌లో అయిదురోజులపాటు అయ్యప్ప మందిరాన్ని తెరిచి ఉంచినప్పుడు, 10 నుంచి 50 సంవత్సరాలలోపు వయసున్న మహిళలను ఆలయ సందర్శనకు అనుమతించబోమని బీజేపీ కార్యకర్తలు తేల్చిచెప్పారు.
వయసు, లింగభేదంతో పనిలేకుండా ప్రతి భక్తుడిని, భక్తురాలినీ అయ్యప్ప ఆలయ సందర్శనకు అనుమతించాలంటూ సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ బీజేపీ కార్యకర్తలు దానికి తలొగ్గలేదు. శబరిమలలో అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచారి అని పేర్కొంటూ, శతాబ్దాలుగా అయ్యప్పను సందర్శించడానికి రుతుక్రమంలోకి వచ్చిన ఆడవారిని అనుమతించడం లేదు. కానీ మహిళా ఉద్యమ కార్యకర్తలు మాత్రం దీన్ని వివక్షాపూరితమైనదిగానూ, పితృస్వామిక చర్యగానూ చూస్తున్నారు.
ఈ అంశంలో బీజేపీ చేస్తున్నదేమిటంటే, అయిదుగురు జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కంటే అయ్యప్ప స్వామిని అత్యున్నతంగా భావిస్తున్న భక్తులకు బాసటగా నిలబడటమే. అయ్యప్ప ఎలాంటి శాసనాధికారానికైనా అతీతమైనవాడని వీరు చెబుతున్నారు. అమిత్ షా కూడా దీనికి వంతపాడుతూ ‘తమ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చూస్తున్న’ భక్తుల పక్షాన తమ పార్టీ గట్టిగా నిలబడుతుందని చెప్పారు.
కేరళలో రాజకీయ పునాదిని బలపర్చుకునే లక్ష్యంతోనే బీజేపీ–ఆరెస్సెస్ శక్తులు అయ్యప్ప ఉదంతంపై అలాంటి వైఖరిని ప్రదర్శిస్తున్నాయన్నది జగమెరిగిన సత్యమే. బీజేపీని ఆదరించి, అక్కున చేర్చుకోవడానికి కేరళ ఓటర్లు ఇంతవరకు అవకాశం ఇవ్వలేదు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత అధికంగా 5,000 ఆరెస్సెస్ శాఖలు కేరళలో ఉన్నప్పటికీ కేరళ అసెంబ్లీలో బీజేపీ ఇంతవరకు ఒక్క స్థానం మాత్రమే గెల్చుకుంది. ఆ పార్టీ అభ్యర్థి ఒ. రాజగోపాల్ 2016 శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ రాష్ట్రం నుంచి బీజేపీ ఇంతవరకు ఒక్క ఎంపీ స్థానాన్నీ గెలుపొందలేదు. ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ కూటముల మధ్య చీలిపోయిన కేరళలో రాజకీయాల్లో, బలమైన మూడో పక్షంగా బీజేపీ ఇంతవరకు ఆవిర్భ వించలేకపోయింది.
కేరళలో రాజకీయంగా బలపడటానికి ప్రస్తుత మార్గమే సరైనదని బీజేపీ పసిగట్టింది. ఇంతవరకు ఎల్డీఎఫ్ కూటమికి సాంప్రదాయికంగా ఓటేస్తున్న అధిక సంఖ్యాకులైన హిందూ ఓటర్లకు బీజేపీ ఇప్పుడు చెబుతున్నది ఏమిటంటే, హిందువుల లక్ష్యసాధనకు, ఆగ్రహ ప్రదర్శనకు, ఆందోళనలకు బీజేపీ శిబిరం ఇప్పుడు అందుబాటులో ఉన్నదనే. గొడ్డు మాంసం వాడకం, లవ్ జిహాద్, మహాబలి చక్రవర్తి జయంతికి బదులుగా ఓనమ్ పండుగ రోజున వామన జయంతి గురించి మాట్లాడటం వంటి అంశాలపై ఆరెస్సెస్ శాఖలు.. ప్రజలను మతపరంగా చీల్చే ధోరణి నుంచి బయటకు వచ్చి.. భక్తి, విశ్వాసాలకు సంబంధించిన మరింత ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తి వాటిని ప్రేరేపించే అవకాశాన్ని శబరిమల ఉదంతం బీజేపీకి చక్కగా అందించింది.
శబరిమల సమస్య కేరళ రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారనుందని బీజేపీ సరిగ్గానే గుర్తించింది. అందుకే హిందూ మలయాళీ ఓటు బ్యాంకును ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో కేరళ సరిహద్దులకు అవతల కూడా తనకు తలుపులు తెరుచుకునే అవకాశం ఉన్నట్లు బీజేపీకి స్పష్టమైంది. లడ్డులాగా దొరికిన ఈ అవకాశాన్ని బీజేపీ వదులుకోవడానికి సిద్ధపడదు కూడా.
కానీ కేరళపై, భారత రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన కేరళ కాంగ్రెస్.. సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వాని స్తున్న తమ జాతీయ నాయకత్వం పం«థాకు కట్టుబడితే హిందూ ఓటును కొల్లగొట్టనున్న బీజేపీ ముందు తాను ప్రేక్షకుడిలా చూస్తుండిపోవలసిం దేనని గ్రహించింది. వామపక్ష కూటమి పట్టులో ఉన్న హిందూ నియోజకవర్గాలను తన గుప్పిట్లోకి తీసుకోవాలని కూడా కేరళ కాంగ్రెస్ ఆలోచిస్తోంది. దీన్ని అవకాశవాద బేరసారాలుగా విమర్శలు వస్తున్నప్పటికీ అది లెక్కచేయడం లేదు.
ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం కోర్టు తీర్పును అమలుచేయడమే తన ప్రభుత్వ ధర్మమనే వైఖరిని చేపట్టారు. పైగా, ఆలయంలోకి మహిళలందరినీ అనుమతించాలని ఆయన ప్రభుత్వం తొలినుంచి వాదిస్తోంది. అయితే మహిళా భక్తులను ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల నుంచి దింపేయడం, నిషిద్ధ వయస్సులోని ఆడవారు అయ్యప్ప ఆలయంవైపు పయనిస్తుంటే వారిని వెదికి మరీ దింపేయడం వంటి ఘటనలతో వామపక్ష కూటమిలోనే కొంతమందిలో సందేహాలు నెలకొన్నాయి. దేవాదాయ మంత్రి కె సురేంద్రన్ సైతం డైలమాలో పడ్డారు. ఆలయం అనేది కార్యకర్తల బలప్రయోగ వేదిక కాదని కూడా ఆయన ప్రకటించారు.
మరోవైపున రాజకీయాలతో సంబంధం లేని హిందూ మలయాళీలు అయితే శబరిమలపై జరుగుతున్న దాడిని చూసి అసౌకర్యంగా భావిస్తున్నారు. ఆలయ సందర్శనకు వస్తున్న మహిళలకు వేలాది పోలీసులు రక్షణగా రావడం చాలామంది సాంప్రదాయిక భక్తులను బాధించింది. ఇక అయ్యప్ప భక్తుల విషయానికి వస్తే ఆచారాన్ని అతిక్రమించి ఆలయ సందర్శనకు వచ్చే ప్రతి మహిళా అయ్యప్ప స్ఫూర్తిని ధిక్కరిస్తున్నట్లే భావిస్తున్నారు. అయితే ప్రదర్శనకారులు హింసకు దిగడం మాత్రం నిస్సందేహంగానే తప్పు. 3,500 మంది నిరసనకారులు ఇంతవరకు అరెస్టయ్యారు. కోర్టు తీర్పుపై వ్యతిరేకతను సహించబోనని, నవంబర్ మధ్యలో తిరిగి తెరుచుకునే అయప్ప ఆలయాన్ని హింసకు దూరంగా ఉంచుతానని ప్రభుత్వం ప్రకటిస్తోంది.
మరోవైపున ఈ తరహా అరెస్టులు బీజేపీకి ఊపిరి పోస్తున్నాయి. అయ్యప్ప భక్తుల విశ్వాసాలను అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగిస్తోందంటూ అమిత్ షా నిందించారు. ఒకవైపున ధర్మానికీ, విశ్వాసానికీ, భక్తికీ మరోవైపున కేరళ ప్రభుత్వ అణచివేతకు మధ్య పోరాటంగా శబరిమల ఉదంతాన్ని వర్ణిస్తూ షా ట్వీట్ చేశారు కూడా. వామపక్ష ప్రభుత్వాన్ని అయ్యప్ప, హిందూ వ్యతిరేక సంఘటనగా చిత్రించడమే దీని లక్ష్యం. నవంబర్‌లో అమిత్ షా స్వయంగా శబరిమల యాత్రను చేపట్టే అవకాశం కనిపిస్తుండటంతో ఇది కేరళలో మరిన్ని ఘర్షణలకు తావీయవచ్చు కూడా.
నిస్సందేహంగానే, 2019లో కేరళ ఎన్నికల్లో శబరిమల అత్యంత ప్రధాన సమస్యగా మారనుంది. ఇటీవలి కేరళ వరదలను నివారించడంలో పినరయి విజయన్ సమర్థత పక్కకు వెళ్లి, ఎన్నికల నాటికి మతం, విశ్వాసం కీలక పాత్ర వహించనున్నాయి. బీజేపీ రాజకీయ క్రీడను గ్రహించిన వామపక్ష కూటమి ఎదురుదెబ్బ తీయడం మొదలెట్టింది. శబరిమలలో జరిగిన గొడవలన్నింటికీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలే కారణమని ఎల్డీఎఫ్ విశ్వసిస్తోంది. అయ్యప్ప ఆలయం సమీపంలోకి నవంబర్‌లో మహిళలను అనుమతించడం సాధ్యపడగానే పరిణామాలు కుదురుకుంటాయని కూటమి భావిస్తోంది. శబరిమల పేరిట సమాజంలో చీలికలకు నారాయణ గురు వంటి సాంఘిక సంస్కర్తలు పుట్టిన కేరళ గడ్డ అనుమతించదని ప్రభుత్వం నమ్ముతోంది.
శబరిమలలో విశ్వాసాలను ముందుకు తెస్తున్న బీజేపీ ట్రిఫుల్ తలాక్‌ని కూడా విశ్వాసాలకు సంబంధించిన సమస్యగా ఎందుకు చూడదని ప్రశ్న. లైంగిక సమానత్వం పేరిట ముస్లిం మహిళల గురించి మోదీ, షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు, అయ్యప్ప భక్తులైన హిందూ మహిళల విషయంలో ఆ మద్దతును వారు ఎందుకు ఇవ్వరు అనే ప్రశ్న తలెత్తకమానదు. రాజకీయ ప్రయోజనాల ప్రాతిపదికనే బీజేపీ లైంగిక న్యాయం ప్రదర్శితమవుతుందన్న వాదన కూడా ఇప్పటికే మొదలైంది.
అయోధ్యపై తీర్పు కూడా తమకు వ్యతిరేకంగా వస్తే మత ఛాందస వాదులు ఎలా స్పందిస్తారు అనేందుకు షా ప్రస్తుత వైఖరిని ఉదాహరణగా చాలామంది చూస్తున్నారు. ముస్లిం సంస్థలు ఇప్పటికే ఈ కేసుపై పోరాడుతుండగా, అయోధ్యలో రాముడు జన్మించాడు అనే విశ్వాసం ప్రాతిపదికన హిందూ ప్రజానీకం వివాదాన్ని ప్రేరేపించక మానదు. దక్షిణ భారతదేశం మొత్తంలో బీజేపీకి శబరిమల ఒక ఆలయ సమస్యను నిక్షేపంగా అందించనుంది. అయితే ప్రజల విశ్వాసాన్ని వమ్ముచేసే చట్టపరమైన తీర్పులను కోర్టులు ఇవ్వకూడదంటూ అమిత్ షా చేస్తున్న సూచన శబరిమల విషయంలోనే కాకుండా రేపు అయోధ్య విషయంలోనూ వర్తించబోతున్నదా? అన్నదే అన్నిటికంటే పెద్ద ప్రశ్న.
వ్యాసకర్త: టీఎస్ సుధీర్, సీనియర్ జర్నలిస్టు, tssmedia10@gmail.com