TS Sudhir
-
అసలు లక్ష్యం అయోధ్యేనా?
ప్రజలను మతపరంగా చీల్చే సాంప్రదాయిక ధోరణి నుంచి బయటకు వచ్చి.. భక్తి, విశ్వాసాలకు సంబంధించిన మరింత ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తి వాటిని రగుల్కొల్పే అవకాశాన్ని శబరిమల ఉదంతం బీజేపీకి చక్కగా అందించింది. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ’అమలు చేయదగిన తీర్పులనే ఇవ్వాలని, ప్రజల విశ్వాసాలను వమ్ము చేసే తీర్పులను, ఆదేశాలను అవి జారీ చేయకూడద’ని అమిత్ షా చేసిన ప్రకటన కేరళకే పరిమితం అవుతుందా? అమిత్ షా సూచన శబరిమల విషయంలోనే కాకుండా రేపు సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వబోతున్న అయోధ్య విషయంలోనూ వర్తించబోతున్నదా? అన్నదే అన్నిటికంటే పెద్ద ప్రశ్న. రాజ్యసభ సభ్యుడిగా 2017 ఆగస్టు నెలలో తన ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా అమిత్ షా చేసిన ప్రమాణంలో ఇది కొంత భాగం: ‘అమిత్ షా అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని’. కానీ గత శనివారం కేరళలోని కన్నూర్‌లో, శబరిమలలో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో అమిత్ షానే మాట్లాడుతూ, ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ‘అమలు చేయదగిన తీర్పులనే ఇవ్వాలని’ సూచిస్తూ మరికాస్త జోడించారు. అదేమిటంటే, ‘ప్రజల విశ్వాసాలను వమ్ము చేసే తీర్పులను, ఆదేశాలను అవి జారీ చేయకూడదు’. బీజేపీ అధ్యక్షుడు ఈ భిన్న ప్రకటనల ద్వారా తన్ను తాను ఖండించుకుంటున్నారా? విశ్వాసాలతో, మతంతో ముడిపడివున్న సున్నితమైన అంశాలకు సంబంధించి భారత రాజ్యాంగం విధించిన శాసనాలకు కోర్టులు పూర్తిగా కట్టుబడకూడదని ఆయన సూచిస్తున్నారా? మనుషులందరినీ లింగ భేదం లేకుండా సమాన దృష్టితో చూడటానికి బదులుగా, శబరిమల ఉదంతంలో ప్రజల విశ్వాసం, సున్నితమైన మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నదే అమిత్ షా అభిమతమా? శబరిమల ఆందోళనకారులకు పూర్తి మద్దతు ఇస్తూ, బీజేపీ కార్యకర్తలు వారికి అన్ని విధాలా అండదండలుగా ఉంటున్న వైనం గమనిస్తే ఈ అంశంలో బీజేపీ వైఖరి ఆశ్చర్యం కలిగించదు. అక్టోబర్‌లో అయిదురోజులపాటు అయ్యప్ప మందిరాన్ని తెరిచి ఉంచినప్పుడు, 10 నుంచి 50 సంవత్సరాలలోపు వయసున్న మహిళలను ఆలయ సందర్శనకు అనుమతించబోమని బీజేపీ కార్యకర్తలు తేల్చిచెప్పారు. వయసు, లింగభేదంతో పనిలేకుండా ప్రతి భక్తుడిని, భక్తురాలినీ అయ్యప్ప ఆలయ సందర్శనకు అనుమతించాలంటూ సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ బీజేపీ కార్యకర్తలు దానికి తలొగ్గలేదు. శబరిమలలో అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచారి అని పేర్కొంటూ, శతాబ్దాలుగా అయ్యప్పను సందర్శించడానికి రుతుక్రమంలోకి వచ్చిన ఆడవారిని అనుమతించడం లేదు. కానీ మహిళా ఉద్యమ కార్యకర్తలు మాత్రం దీన్ని వివక్షాపూరితమైనదిగానూ, పితృస్వామిక చర్యగానూ చూస్తున్నారు. ఈ అంశంలో బీజేపీ చేస్తున్నదేమిటంటే, అయిదుగురు జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కంటే అయ్యప్ప స్వామిని అత్యున్నతంగా భావిస్తున్న భక్తులకు బాసటగా నిలబడటమే. అయ్యప్ప ఎలాంటి శాసనాధికారానికైనా అతీతమైనవాడని వీరు చెబుతున్నారు. అమిత్ షా కూడా దీనికి వంతపాడుతూ ‘తమ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చూస్తున్న’ భక్తుల పక్షాన తమ పార్టీ గట్టిగా నిలబడుతుందని చెప్పారు. కేరళలో రాజకీయ పునాదిని బలపర్చుకునే లక్ష్యంతోనే బీజేపీ–ఆరెస్సెస్ శక్తులు అయ్యప్ప ఉదంతంపై అలాంటి వైఖరిని ప్రదర్శిస్తున్నాయన్నది జగమెరిగిన సత్యమే. బీజేపీని ఆదరించి, అక్కున చేర్చుకోవడానికి కేరళ ఓటర్లు ఇంతవరకు అవకాశం ఇవ్వలేదు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత అధికంగా 5,000 ఆరెస్సెస్ శాఖలు కేరళలో ఉన్నప్పటికీ కేరళ అసెంబ్లీలో బీజేపీ ఇంతవరకు ఒక్క స్థానం మాత్రమే గెల్చుకుంది. ఆ పార్టీ అభ్యర్థి ఒ. రాజగోపాల్ 2016 శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ రాష్ట్రం నుంచి బీజేపీ ఇంతవరకు ఒక్క ఎంపీ స్థానాన్నీ గెలుపొందలేదు. ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ కూటముల మధ్య చీలిపోయిన కేరళలో రాజకీయాల్లో, బలమైన మూడో పక్షంగా బీజేపీ ఇంతవరకు ఆవిర్భ వించలేకపోయింది. కేరళలో రాజకీయంగా బలపడటానికి ప్రస్తుత మార్గమే సరైనదని బీజేపీ పసిగట్టింది. ఇంతవరకు ఎల్డీఎఫ్ కూటమికి సాంప్రదాయికంగా ఓటేస్తున్న అధిక సంఖ్యాకులైన హిందూ ఓటర్లకు బీజేపీ ఇప్పుడు చెబుతున్నది ఏమిటంటే, హిందువుల లక్ష్యసాధనకు, ఆగ్రహ ప్రదర్శనకు, ఆందోళనలకు బీజేపీ శిబిరం ఇప్పుడు అందుబాటులో ఉన్నదనే. గొడ్డు మాంసం వాడకం, లవ్ జిహాద్, మహాబలి చక్రవర్తి జయంతికి బదులుగా ఓనమ్ పండుగ రోజున వామన జయంతి గురించి మాట్లాడటం వంటి అంశాలపై ఆరెస్సెస్ శాఖలు.. ప్రజలను మతపరంగా చీల్చే ధోరణి నుంచి బయటకు వచ్చి.. భక్తి, విశ్వాసాలకు సంబంధించిన మరింత ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తి వాటిని ప్రేరేపించే అవకాశాన్ని శబరిమల ఉదంతం బీజేపీకి చక్కగా అందించింది. శబరిమల సమస్య కేరళ రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారనుందని బీజేపీ సరిగ్గానే గుర్తించింది. అందుకే హిందూ మలయాళీ ఓటు బ్యాంకును ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో కేరళ సరిహద్దులకు అవతల కూడా తనకు తలుపులు తెరుచుకునే అవకాశం ఉన్నట్లు బీజేపీకి స్పష్టమైంది. లడ్డులాగా దొరికిన ఈ అవకాశాన్ని బీజేపీ వదులుకోవడానికి సిద్ధపడదు కూడా. కానీ కేరళపై, భారత రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన కేరళ కాంగ్రెస్.. సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వాని స్తున్న తమ జాతీయ నాయకత్వం పం«థాకు కట్టుబడితే హిందూ ఓటును కొల్లగొట్టనున్న బీజేపీ ముందు తాను ప్రేక్షకుడిలా చూస్తుండిపోవలసిం దేనని గ్రహించింది. వామపక్ష కూటమి పట్టులో ఉన్న హిందూ నియోజకవర్గాలను తన గుప్పిట్లోకి తీసుకోవాలని కూడా కేరళ కాంగ్రెస్ ఆలోచిస్తోంది. దీన్ని అవకాశవాద బేరసారాలుగా విమర్శలు వస్తున్నప్పటికీ అది లెక్కచేయడం లేదు. ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం కోర్టు తీర్పును అమలుచేయడమే తన ప్రభుత్వ ధర్మమనే వైఖరిని చేపట్టారు. పైగా, ఆలయంలోకి మహిళలందరినీ అనుమతించాలని ఆయన ప్రభుత్వం తొలినుంచి వాదిస్తోంది. అయితే మహిళా భక్తులను ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల నుంచి దింపేయడం, నిషిద్ధ వయస్సులోని ఆడవారు అయ్యప్ప ఆలయంవైపు పయనిస్తుంటే వారిని వెదికి మరీ దింపేయడం వంటి ఘటనలతో వామపక్ష కూటమిలోనే కొంతమందిలో సందేహాలు నెలకొన్నాయి. దేవాదాయ మంత్రి కె సురేంద్రన్ సైతం డైలమాలో పడ్డారు. ఆలయం అనేది కార్యకర్తల బలప్రయోగ వేదిక కాదని కూడా ఆయన ప్రకటించారు. మరోవైపున రాజకీయాలతో సంబంధం లేని హిందూ మలయాళీలు అయితే శబరిమలపై జరుగుతున్న దాడిని చూసి అసౌకర్యంగా భావిస్తున్నారు. ఆలయ సందర్శనకు వస్తున్న మహిళలకు వేలాది పోలీసులు రక్షణగా రావడం చాలామంది సాంప్రదాయిక భక్తులను బాధించింది. ఇక అయ్యప్ప భక్తుల విషయానికి వస్తే ఆచారాన్ని అతిక్రమించి ఆలయ సందర్శనకు వచ్చే ప్రతి మహిళా అయ్యప్ప స్ఫూర్తిని ధిక్కరిస్తున్నట్లే భావిస్తున్నారు. అయితే ప్రదర్శనకారులు హింసకు దిగడం మాత్రం నిస్సందేహంగానే తప్పు. 3,500 మంది నిరసనకారులు ఇంతవరకు అరెస్టయ్యారు. కోర్టు తీర్పుపై వ్యతిరేకతను సహించబోనని, నవంబర్ మధ్యలో తిరిగి తెరుచుకునే అయప్ప ఆలయాన్ని హింసకు దూరంగా ఉంచుతానని ప్రభుత్వం ప్రకటిస్తోంది. మరోవైపున ఈ తరహా అరెస్టులు బీజేపీకి ఊపిరి పోస్తున్నాయి. అయ్యప్ప భక్తుల విశ్వాసాలను అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగిస్తోందంటూ అమిత్ షా నిందించారు. ఒకవైపున ధర్మానికీ, విశ్వాసానికీ, భక్తికీ మరోవైపున కేరళ ప్రభుత్వ అణచివేతకు మధ్య పోరాటంగా శబరిమల ఉదంతాన్ని వర్ణిస్తూ షా ట్వీట్ చేశారు కూడా. వామపక్ష ప్రభుత్వాన్ని అయ్యప్ప, హిందూ వ్యతిరేక సంఘటనగా చిత్రించడమే దీని లక్ష్యం. నవంబర్‌లో అమిత్ షా స్వయంగా శబరిమల యాత్రను చేపట్టే అవకాశం కనిపిస్తుండటంతో ఇది కేరళలో మరిన్ని ఘర్షణలకు తావీయవచ్చు కూడా. నిస్సందేహంగానే, 2019లో కేరళ ఎన్నికల్లో శబరిమల అత్యంత ప్రధాన సమస్యగా మారనుంది. ఇటీవలి కేరళ వరదలను నివారించడంలో పినరయి విజయన్ సమర్థత పక్కకు వెళ్లి, ఎన్నికల నాటికి మతం, విశ్వాసం కీలక పాత్ర వహించనున్నాయి. బీజేపీ రాజకీయ క్రీడను గ్రహించిన వామపక్ష కూటమి ఎదురుదెబ్బ తీయడం మొదలెట్టింది. శబరిమలలో జరిగిన గొడవలన్నింటికీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలే కారణమని ఎల్డీఎఫ్ విశ్వసిస్తోంది. అయ్యప్ప ఆలయం సమీపంలోకి నవంబర్‌లో మహిళలను అనుమతించడం సాధ్యపడగానే పరిణామాలు కుదురుకుంటాయని కూటమి భావిస్తోంది. శబరిమల పేరిట సమాజంలో చీలికలకు నారాయణ గురు వంటి సాంఘిక సంస్కర్తలు పుట్టిన కేరళ గడ్డ అనుమతించదని ప్రభుత్వం నమ్ముతోంది. శబరిమలలో విశ్వాసాలను ముందుకు తెస్తున్న బీజేపీ ట్రిఫుల్ తలాక్‌ని కూడా విశ్వాసాలకు సంబంధించిన సమస్యగా ఎందుకు చూడదని ప్రశ్న. లైంగిక సమానత్వం పేరిట ముస్లిం మహిళల గురించి మోదీ, షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు, అయ్యప్ప భక్తులైన హిందూ మహిళల విషయంలో ఆ మద్దతును వారు ఎందుకు ఇవ్వరు అనే ప్రశ్న తలెత్తకమానదు. రాజకీయ ప్రయోజనాల ప్రాతిపదికనే బీజేపీ లైంగిక న్యాయం ప్రదర్శితమవుతుందన్న వాదన కూడా ఇప్పటికే మొదలైంది. అయోధ్యపై తీర్పు కూడా తమకు వ్యతిరేకంగా వస్తే మత ఛాందస వాదులు ఎలా స్పందిస్తారు అనేందుకు షా ప్రస్తుత వైఖరిని ఉదాహరణగా చాలామంది చూస్తున్నారు. ముస్లిం సంస్థలు ఇప్పటికే ఈ కేసుపై పోరాడుతుండగా, అయోధ్యలో రాముడు జన్మించాడు అనే విశ్వాసం ప్రాతిపదికన హిందూ ప్రజానీకం వివాదాన్ని ప్రేరేపించక మానదు. దక్షిణ భారతదేశం మొత్తంలో బీజేపీకి శబరిమల ఒక ఆలయ సమస్యను నిక్షేపంగా అందించనుంది. అయితే ప్రజల విశ్వాసాన్ని వమ్ముచేసే చట్టపరమైన తీర్పులను కోర్టులు ఇవ్వకూడదంటూ అమిత్ షా చేస్తున్న సూచన శబరిమల విషయంలోనే కాకుండా రేపు అయోధ్య విషయంలోనూ వర్తించబోతున్నదా? అన్నదే అన్నిటికంటే పెద్ద ప్రశ్న. వ్యాసకర్త: టీఎస్ సుధీర్, సీనియర్ జర్నలిస్టు, tssmedia10@gmail.com -
ప్రజాయుద్ధమూ–ప్రజాస్వామ్యమూ!
భారత ప్రజాస్వామ్యం పండుగ చేసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే, ఎన్ని లోపాలున్నాగాని ప్రగతి, సామాజిక సమానత్వం సాధించడానికి ప్రజాస్వామ్యమే ఏకైక మార్గమనే అవగాహన ఏర్పడిందని గద్దర్ ఢిల్లీ సమావేశం చెబుతోంది. గత నాలుగేళ్లలో తెలంగాణలో అధికారం ఒక కులానికి బదులు మరో కులానికి దక్కిందని, దీని వల్ల బడుగు వర్గాలకు మేలేమీ జరగలేదని గద్దర్ చెబుతున్నారు. గద్దర్ వాదనలో నిజం ఎంత ఉందో తేల్చడం కష్టమే. కాని, నక్సల్ సిద్ధాంతాలు నమ్మిన ఓ అగ్రశ్రేణి ప్రచారకుడు బలహీన వర్గాల సాధికారతకు, వారికి ప్రాతినిధ్యం వహించడానికి తెలంగాణ చట్టసభకు వెళ్లాలనుకోవడం నిజంగా గొప్ప పరిణామం. గద్దర్‌గా అందరికీ తెలిసిన గుమ్మడి విఠల్ రావు జూలైలో మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఓటరుగా తన పేరు నమోదుచేయించుకున్నారు. 69 ఏళ్ల గద్దర్ ఇప్పటి వరకూ ఏ ఎన్నికల్లోనూ ఓటువేయలేదు. ఈ ప్రజా గాయకునికి గతంలో పూర్వపు నక్సల్ పార్టీ పీపుల్స్‌వార్‌తో అనుబంధం ఉన్నందున ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. గజ్వేలులో ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై పోటీకి సిద్ధమేనని గద్దర్ ఇప్పుడు చెబుతున్నారు. రాజ్యాధికారం తుపాకీ గొట్టం ద్వారానే వస్తుందిగాని ఈవీఎం ద్వారా కాదన్నది మావోయిస్టుల నమ్మకం. కాబట్టి ఎన్నికల్లో పోటీచేయాలన్న నిర్ణయం కొత్త మార్గంలో పయనించడం కాదా? అని ఆయనను ప్రశ్నించాను. మావోయిస్టులతో కలిసి ఉన్నంత కాలం ఎన్ని కలు బహిష్కరించాలన్న వారి పిలుపునకు గద్దర్ మద్దతు పలికేవారు. ‘‘ఇది ‘యూటర్న్’ కాదు. ఇది ముందడుగు కిందే లెక్క. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెట్టాలని నేను అప్పట్లో కోరాను. అది కూడా యూ టర్న్ అవుతుందా?’’అని గద్దర్ ప్రశ్నించారు. డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలంటూ మంచిర్యాల బొగ్గు గనుల ప్రాంతంలో నివసించే ప్రజలను మావోయిస్టులు ఈ వారాంతంలో ఓ ప్రకటనలో కోరారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలూ అవకాశవాద సంస్థలనీ, వాటిని ఈ ప్రాంతంలో ప్రచారం చేయ నీయబోమని మావోయిస్టులు ప్రకటించారు. కిందటి నెలలో అరకు ఎమ్మెల్యే సహా ఇద్దరు తెలుగుదేశం నేతలను ఆంధ్రా– ఒడిశా సరిహద్దు జోన్(ఏఓబీ) మావోయిస్టులు కాల్చిచంపారు. మావోయిస్టుల పంథాకు అద్దంపడుతున్న ఘటనలు అయితే, ఈ మూడు సంఘటనలకూ ప్రత్యక్ష సంబంధం లేదు. కాని, మావోయిస్టుల ధోరణి వీటిని బట్టి అర్థమౌతుంది. దశాబ్దం కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ప్రాంతాల్లో మావోయిస్టుల ఆధిపత్యం ఉండేది. వారి మాట నడిచేది. తెలంగాణలోని చాలా ప్రాంతం, గుంటూరు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతాలు, ఏఓబీ ప్రాంతాలను మావోయిస్టుల ప్రాంతంగా పరిగణించేవారు. రాజకీయ నేతలను నక్స లైట్లు సునాయాసంగా చంపేవారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబునాయుడుపై సైతం ‘వార్’ నక్సల్స్ హత్యాయత్నం చేశారు. ఎన్నికలు బహిష్కరించాలంటూ అనేక ప్రాంతాల్లో గోడలపై వారు అంటించిన పోస్టర్లలోని విషయాలను జనం సీరియస్‌గా పట్టించుకునే వారు. ఎక్కడేం జరుగుతున్నదీ వారికి చెప్పే వ్యక్తులు అనేక గ్రామాల్లో ఉండేవారు. అయితే, వారంతా కేవలం నక్సలైట్లంటే అభిమానంతోనే అలా వ్యవహరించలేదు. ఇలాంటి ప్రదేశాల్లో అత్యధిక ప్రజానీకం ఓ వైపు పోలీసులు, మరో వైపు నక్సలైట్ల తుపాకుల మధ్య చిక్కుకుపోయి నివసించేవారు. ఏం చేసినా ఇద్దరి నుంచి ముప్పు అని భయపడేవారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అంటే 2004– 2006 మధ్య కాలంలో చాకచక్యంగా నక్సల్ ఉద్యమాన్ని అదుపుచేశారు. ఫలితంగా తెలుగు ప్రాంతాల్లో గడచిన పదేళ్లలో మావోయిస్టుల ప్రాబ ల్యం బాగా తగ్గిపోయింది. తెలంగాణ ఉద్యమ కాలంలో మావోయి స్టులు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతు ఇచ్చారు. వారిలో కొందరైతే రాజకీయ ప్రధానస్రవంతిలో చేరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతే మావోయిస్టుల ప్రాబల్యం, పెత్తనం పెరుగుతుందనే భయంతో కొందరు రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. అయితే, తెలంగాణ వచ్చాక పోలీసులు నక్సౖలñ ట్లను అదుపులో పెట్టగలిగారు. గద్దర్ నిర్ణయం మంచిదే! 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కాలంలో మావోయిస్టుల విషయానికి వస్తే పరిస్థితి మారిపోయినట్టు నాకు కనిపిస్తోంది. ఎన్నికలు బహిష్క రించాలని సీపీఐ(మావోయిస్టు) పిలుపు ఇవ్వడమంటే నేడు ఈ పార్టీకి కొత్త ఆలోచనలేవీ లేవనీ, అతి కష్టం మీద ముందుకు నెట్టుకొస్తోందని స్పష్టమౌతోంది. మావోయిస్టులవి నేటి పరిస్థితులకు సరిపోని కాలం చెల్లిన అభిప్రాయాలు. ప్రజలను ఓటేయవద్దని ఒత్తిడి తేవాలన్న మావో యిస్టుల నిర్ణయం చూస్తే మారుతున్న కాలానికి అనుగుణంగా మారడా నికి వారు సిద్ధంగా లేరని అర్థమౌతోంది. వాస్తవానికి ప్రజలు ఏం కోరుకుంటున్నారో మావోయిస్టులకు తెలియడం లేదు. ఈ కారణాల వల్ల ఎన్నికల రాజకీయాల్లోకి దిగాలన్న గద్దర్ నిర్ణయం స్వాగతించ దగ్గది. కొన్ని దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్‌లో నక్సలిజానికి ప్రచార కర్తగా ఉపయోగపడిన గద్దర్ ఇలా మారడం మంచిదే. 1970ల ఆరం భంలో ఉద్యమానికి బాసటగా అవతరించిన జననాట్య మండలిలో భాగమైన గద్దర్ సామాజికంగా దోపిడీకి గురైన వర్గాలకు గొంతు అయ్యారు. నక్సల్ ఉద్యమం బలం పుంజుకుంటున్న కాలంలో వ్యవ సాయసంక్షోభంలో చిక్కుకున్న జనం కష్టాలను గద్దర్ తన పాటల ద్వారా వినిపించారు. చొక్కా లేకుండా గొంగళి పైన కప్పుకుని, ఎర్ర జెండా చుట్టిన కర్రతో, కాళ్లకు గజ్జెలు కట్టి వీధుల్లో గద్దర్ ఆటపాటలు లక్షలాది మందిని ఆకట్టుకున్నాయి. తెలంగాణలో కులం పేరుతో సాగిన అణచివేతను ఆయన పాటలు కళ్లకు కట్టిచెప్పేవి. అణచివేత, దోపిడీ బాధితులను తమ వైపు తిప్పుకోవడానికి నక్సలైట్లు చేసిన ప్రయత్నాలకు గద్దర్ ఉపయోగపడ్డారు. ‘‘పోదమురో జనసేనతో కలిసి, పోదమురో ఎర్రసేనతో కలిసి’’ అని గద్దర్ రాసి పాడిన పాటలు అసంతృప్తితో మండుతున్న యువత నక్సల్ ఉద్యమంలో చేరి తుపాకులు పట్టడానికి స్ఫూర్తినిచ్చాయి. ఇలా కొద్ది కాలంలోనే గద్దర్‌కు మంచి పేరొచ్చింది. 1980లలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్‌వార్ నాయకత్వంతో విభేదాలు రావడంతో 1990ల చివర్లో గద్దర్‌ను నక్సల్ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి చంద్రబాబు ప్రభు త్వంతో చర్చలకు సన్నాహాలు చేయడానికి 2002లో గద్దర్‌ను దూతగా పంపడానికి వార్ నాయకత్వం ఎంపిక చేసింది. 20 ఏళ్ల నుంచీ వెన్నులోనే బులెట్! 1997 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉన్న గద్దర్‌పై ముగ్గురు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అప్పుడు దిగిన ఓ బులెట్ ఇంకా గద్దర్ వెన్నుల్లోనే ఉంది. ఆంధ్రా పోలీసుల ప్రోద్బలంతోనే తనపై ఈ దాడి జరిగిందని గద్దర్ ఎప్పుడూ చెబుతారు. అత్యధిక గుర్తింపు ఉన్న నక్సలైట్ల సానుభూతిపరుడిని చంపే శక్తిసామర్థ్యాలు తమకు ఉన్నాయని చెప్పుకోవడానికే పోలీసులు తనపై హత్యాయత్నం చేయించారనేది గద్దర్ ఆరోపణ. అయితే పోలీసులు దీన్ని అంగీకరించరు. కాల్పులు జరిగి రెండు దశాబ్దాలు దాటినా ఈ కేసులో ఒక్కరినీ అరెస్టు చేయలేదని గద్దర్ అంటున్నారు. ఈ హత్యాయత్నంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతూ గద్దర్ భార్య ఈ ఏడాది ఆరంభంలోనే రాష్ట్రపతికి లేఖ రాశారు. రాష్ట్రపతి భవన్ ఈ లేఖను ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) పంపగా, పీఎంఓ తెలంగాణ ప్రభుత్వానికి పంపించింది. ఈ కేసు గురించి స్వయంగా వివరించే అవకాశం ఇవ్వా లంటూ మూడు నెలల క్రితం సీఎం కేసీఆర్‌కు గద్దర్ విడిగా ఉత్తరం రాశారు. అయితే, గద్దర్‌కు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇంకా ఇవ్వలేదు. సోనియా, రాహుల్‌తో భేటీకి విపరీత ప్రచారం కిందటివారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని గద్దర్ ఢిల్లీలో కలుసుకున్నారు. అయితే నేను ఈ పరి ణామాన్ని తెలంగాణ లేదా కాంగ్రెస్ రాజకీయాల కోణం నుంచి మాత్రమే చూడటం లేదు. కాంగ్రెస్‌ను నడుపుతున్న ఈ తల్లీకొడుకు లిద్దరితో దిగిన ఫొటోలకు తెలంగాణ సరిహద్దులు దాటి లభించిన ప్రచారం లభించింది. గద్దర్ కేసీఆర్‌పై పోటీచేసినా చేయకపోయినా ఇది వాస్తవం. ఈ భేటీ అందరికీ తెలిసిన మాజీ మావోయిస్టులో వచ్చిన మార్పుకు అద్దంపడుతోంది. భారత ప్రజాస్వామ్యం పండుగ చేసుకోవా ల్సిన సమయం ఇది. ఎందుకంటే, ఎన్ని లోపాలున్నాగాని ప్రగతి, సామాజిక సమానత్వం సాధించడానికి ప్రజాస్వామ్యమే ఏకైక మార్గ మనే అవగాహన ఏర్పడిందనడానికి గద్దర్ ఢిల్లీ సమావేశం చెబుతోంది. ప్రత్యేక తెలంగాణ కోసం పోరు కేవలం రాష్ట్ర ప్రతిపత్తి కోసమే కాదని ఉద్యమకాలంలోనే గద్దర్ చెప్పారు. సమానత్వం సాధించడానికే ఇది ఎక్కువ ఉపయోగపడాలనేది ఆయన విశ్వాసం. గత నాలుగేళ్లలో తెలం గాణలో అధికారం ఒక కులానికి బదులు మరో కులానికి దక్కిందని, దీని వల్ల బడుగు వర్గాలకు మేలేమీ జరగలేదని గద్దర్ చెబుతున్నారు. గద్దర్ వాదనలో నిజం ఎంత ఉందో తేల్చడం కష్టమే. కాని, నక్సల్ సిద్ధాంతాలు నమ్మిన ఓ అగ్రశ్రేణి ప్రచారకుడు బలహీన వర్గాల సాధి కారతకు వారికి ప్రాతినిధ్యం వహించడానికి తెలంగాణ చట్టసభకు వెళ్లాలనుకోవడం నిజంగా గొప్ప పరిణామం. 2017లోనే మావోయి స్టులతో గద్దర్ తెగతెంపులు చేసుకున్నారు. అర్బన్ నక్సల్ అనే కొత్త మాట ప్రచారంలోకి వచ్చిన ఈ సమయంలో బలహీనవర్గాల భాషతో జాతీయస్థాయి రాజకీయ చర్చ నాణ్యతను గద్దర్ పెంచాలని నేను భావిస్తున్నాను. ఇలాంటి నేతలను ‘నవ నక్సల్స్’ అని పిలవవచ్చు. వారి వల్ల ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఒక సంభాషణలో గద్దర్ నాతో ఒక పాత జ్ఞాపకాన్ని పంచు కున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గద్దర్‌తో మాట్లాడుతూ అతడు ‘‘మానసికంగా సాయుధుడు’’ అనీ, ఎందుకంటే తన పాటలతో జనాన్ని ఆయుధాలు చేపట్టాల్సిందిగా రెచ్చగొడుతున్నాడని పేర్కొన్నారట. అయితే అలాంటి వ్యక్తులు భగవద్గీతను చదవాలన్నది గద్దర్ వాదన. ఎందుకంటే కృష్ణ భగవానుడు కూడా మానసిక సాయుధుడే మరి. హిందీలో అత్యంత ప్రాచుర్యం పొందిన గద్దర్ పాటల్లో ఒకటి – ఆగ్ హై ఏ ఆగ్ హై, ఏ భూక్ పెట్ కే ఆగ్ హై (ఇది కాలే కడుపుల మంటరా). నక్సల్ ఇలా తిరిగి రావడాన్ని కూడా నేను దట్టించిన కొత్త జ్వాలగానే చూస్తున్నాను. టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు (tssmedia10@gmail.com) -
యోగి పాలనలో ఆటవిక రాజ్యం
వివేక్ తివారీ హత్య, ఆడపిల్లను పోలీసులు వేధించిన తీరు చూస్తే ఉత్తర్ ప్రదేశ్‌లో ఉన్నది జంగిల్‌రాజ్ కాక మరేంటి? తివారీ వంటి అమాయకుడు పొరపాటున హతుడైనా గాని మిగిలిన తొమ్మిది మంది నేరస్తులు ఎన్కౌంటర్లలో మరణించడం మంచిదేగా అనే ధోరణి మామూలు జనంలో కనిపిస్తోంది. చట్టబద్ధతపై నమ్మకం లేని పోలీసు బల గాలను ఆదిత్యనాథ్ సర్కారు జనంపై ప్రయోగిస్తోంది. ఎవరైనా చావాలా లేక బతకాలా అనే విషయాన్ని కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్లే ఒకట్రెండు క్షణాల్లో నిర్ణయిస్తున్నారు. పోలీసు దళం ఎన్కౌంటర్ స్పెషలిస్టుల బృందంగా మారిపోతోంది. కారు ఆపనందుకు ఓ సామాన్యుడిని పోలీసులు కాల్చిచంపే స్థాయికి ఎన్నడూ రాష్ట్రం దిగజారిపోలేదు. ఉత్తర్‌ప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మేరuŠ‡కు అధికార పర్యటనపై వెళ్లి, ‘‘ఈ రోజేమీ ఎన్కౌంటర్ చేయలేదు కదా?’’ అని శామ్లీ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అజయ్‌పాల్ శర్మను ప్రశ్నించారు. శర్మ నవ్వి ఊరుకున్నారు. తర్వాత ఈ విషయంపై శర్మ మాట్లాడుతూ డీజీపీ సరదాగా ఈ ప్రశ్న వేశారనీ, ఉదయం అదనంగా మరో రొట్టె తిన్నారా? అన్నట్టుగా భావించాలని ఇతర అధికారులకు చెప్పారు. ఇలా సర్కారీ ఆదేశాలపై జరిగే హత్యలపై సరదాగా మా ట్లాడడం అంటే, జనాన్ని చంపడానికి తమకు లైసెన్సు ఉన్నట్టుగా కింది స్థాయి పోలీసు వరకూ భావిస్తారు. ఎడాపెడా ఎన్కౌంటర్లు చేసే మని షిగా శర్మకు పేరుంది. కిందటి ఆగస్ట్‌లో ఇద్దరు పేరుమోసిన నేరస్తులను కాల్చిచంపినప్పుడు శర్మను స్థానికులు రథంలో ఊరేగించి సన్మా నించారు. హర్దువాగంజ్ పట్టణంలో కొందరు నేరస్తులతో ఎన్కౌంటర్ జరుగుతోందని అలీగఢ్‌లోని జర్నలిస్టులకు సెప్టెంబర్ ఉదయం ఆరున్నరకు కబురొచ్చింది. వెంటనే వారు సంఘటనా స్థలానికి వచ్చి ప్రత్యక్షంగా చిత్రీకరించారు. ఒక్కొక్కరి తలపై రూ.25 వేల వెలలున్న ఇద్దరు నేరగాళ్లను ముస్తాకీమ్, నౌషాద్‌గా గుర్తించారు. వారిద్దరూ ఈ ఎన్కౌంటర్లో మరణించారు. మొదట వారు కాల్పులు జరపగా, తాము వారిని వెంబడించామని ఎప్పటిలాగానే పోలీసులు చెప్పారు. నౌషాద్ తల్లి మాత్రం, తన కొడుకు, ముస్తాకీమ్‌ను తన ఇంటి నుంచే పోలీసులు పట్టుకుపోయి చంపేశారని తెలిపింది. కిందటి వారం ఓ యువతిని మేరuŠ‡ పోలీసులు విశ్వహిందూ పరిషద్ గూండాల నుంచి కాపాడారు. ముస్లిం స్నేహితుడితో కలిసి ఉన్న ఆమెను ఈ దుండగులు ‘లవ్ జిహాద్’ పేరుతో వేధించారు. తర్వాత పోలీసులు ముస్లిం కుర్రాడితో ఎందుకు తిరుగుతున్నావంటూ ఆమెను సతాయించి, దౌర్జన్యం చేయడం ఆమెను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. ‘‘అనేక మంది హిందువులుండగా, మీరు ముస్లింలంటేనే ఎందుకు ఇష్టపడతారు?’’ అంటూ ఓ అధికారి ప్రశ్నించడం పోలీసులు రికార్డు చేసిన వీడియోలో వినిపించింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఓ మహిళా అధికారి సహా నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. తర్వాత వారిని సీఎం యోగీ ఆదిత్యనాథ్ సొంత జిల్లా గోర ఖ్çపూర్‌కు బదిలీచేశారు. పోలీసు వృత్తికి తగని భయానక ప్రవర్తనకు ఇది శిక్షా లేక బహుమతా? అనేది స్పష్టం కాలేదు. లక్నో పోలీసు హత్య! సెప్టెంబర్ 28 రాత్రి రాష్ట్ర రాజధాని లక్నోలో జరిగిన ఘటనపై ఆశ్చర్య పడాల్సిందేమీ లేదని చెప్పడానికే పై మూడు ఘటనల గురించి నేను వివరించాను. ఆదిత్యనాథ్ ఏలుబడిలో దాడిచేసి, చంపడానికి పోలీసులకు లైసెన్సులిచ్చారు. యాపిల్ కంపెనీలో ఉన్నతాధికారిగా పని చేస్తున్న వివేక్ తివారీని శనివారం తెల్లవారుజామున ప్రశాంత్ చౌధరీ, సందీప్ రాణా అనే ఇద్దరు లక్నో పోలీసులు దగ్గర నుంచి కాల్చి చంపారు. రాత్రి గస్తీ పోలీసులు చెప్పినా తన కారు ఆపకుండా పోవడమే అతని నేరం. ఇలాంటి సందర్భాల్లో పోలీసులు వాహనం టైర్లను లేదా మరో భాగంపై మాత్రమే కాల్చాలి. తివారీ ముఖంపై ప్రశాంత్ చౌధరీ కాల్పులు జరిపాడు. తర్వాత తమ నేరం కప్పిపుచ్చడానికి పోలీసులు కట్టుకథలల్లారు. ఆఫీసులో ఓ కార్యక్రమం ముగిశాక తన సహోద్యోగి సనాను ఆమె ఇంటి వద్ద దింపడానికి తీసుకెళుతున్న తివారీ కారు అప్పుడు ఆగి ఉందని పోలీసులు చెప్పారు.అంటే వారు ‘అనుచిత’ పని చేయడానికి సిద్ధమౌతున్నారనే భావన కలిగేలా ఈ ప్రచారం చేశారు. మరణించిన వ్యక్తిపై బురద జల్లడానికి ఇలా ప్రయత్నించారు. అయితే, ఈ కథే నిజమనుకున్నా అతన్ని చంపడానికి అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? పోలీసుల మోటార్ సైకిల్‌ను తివారీ ఢీకొట్టి ఆగకుండా పోతున్న కారణంగా పోలీసులు కాల్పులు జరిపారనేది రెండో కట్టుకథ. తివారీ ప్రమాదం కారణంగా మరణించాడనేది మూడో కథనం. తివారీని అతి సమీపం నుంచి కాల్చారని శవపరీక్షలో తేలింది. అంటే ఇది కావాలని చేసిన హత్య. తివారీ కారును ఆపకుండా పోవడం అనేది యూపీలో శాంతి భద్రతల పరిస్థితికి అద్దంపడుతోంది. అర్ధరాత్రి రోడ్లపై బలవంతపు వసూళ్లు చేసే అలవాటు పోలీసులకు ఉంది. పోలీసులతో గొడవపడడం ఇష్టంలేకే తివారీ కారు ఆపలేదు. అదీగాక తనను ఆపిన ఇద్దరు కానిస్టేబుళ్లు పోలీసు దుస్తుల్లో ఉన్న పోలీసులా లేక నేరస్తులా అనే అనుమానం సహజంగానే పీడిస్తుంది. ఆదిత్యనాథ్ పాలనలో దాదాపు 1500 ఎన్కౌంటర్లు! ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దాదాపు 1500 ఎన్ కౌంటర్లు జరగడంతో యూపీకి ఎన్కౌంటర్ రాజ్యంగా ముద్ర పడింది. నేరస్తులని ముద్రవేసి 66 మందిని పోలీసులు చంపారు. వారం తా ముస్లింలే కావడంతో పౌరసమాజం వీటిని పట్టించుకోవడం లేదు. సామాజిక మాధ్యమాలు ముస్లింను ఉగ్రవాదిగా, నేరస్తునిగా చిత్రిం చడం వల్ల ఈ ఎన్కౌంటర్లను ఎవరూ ప్రశ్నించడం లేదు. తాము పోలీ సులకు లక్ష్యం కాలేదనే సంతోషంతో హిందువులు పోలీసులు చెప్పింది విని ఊరుకుంటున్నారు. బులెట్లతో అధికారంలో కొనసాగడానికి అనేక ఎన్కౌంటర్లు చేయడం తప్పుకాదనే అభిప్రాయానికి ప్రభుత్వ ఆమో దముద్ర లభిస్తోంది. నేరాలు నివారించడానికి అనుసరిస్తున్న వ్యూహంలో భాగమే పోలీసు ఎన్‌కౌంటర్లని యూపీ డీజీపీ పేర్కొన్నారు. ‘వృ త్తిపరమైన, వ్యూహాత్మక పద్ధతిలో నేరస్తులతో తలపడటమే ఎన్కౌంటర్,’అని ఆయన కొత్త నిర్వచనం చెప్పారు. పోలీసులు విచక్ష ణారహితంగా కాల్చిచంపడాన్ని సామాన్య ప్రజానీకం మద్దతు పలకడం మరింత చిరాకు పుట్టించే విషయం. తివారీ వంటి అమాయకుడు పొరపాటున హతుడైనాగానీ మిగిలిన తొమ్మిది మంది నేరస్తులు ఎన్‌కౌం టర్లలో మరణించడం మంచి దేగా అనే ఆలోచనా ధోరణి మామూలు జనంలో కనిపిస్తోంది. నేర స్తులను మొదట అరెస్ట్ చేసి, ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు విచారణ ప్రక్రియ వాడుకోవాలనే చట్టబద్ధ విధా నంపై నమ్మకం లేని, తగిన శిక్షణ లేని పోలీసు బలగాలను ఆదిత్యనాథ్ సర్కారు జనంపై ప్రయోగిస్తోంది. ఎవరైనా చావాలా లేక బతకాలా అనే విషయాన్ని కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్లే ఒకట్రెండు క్షణాల్లో నిర్ణయి స్తున్నారు. పోలీసు దళం మొత్తం ఎన్కౌంటర్ స్పెషలిస్టుల బృందంగా మారిపోతోంది. ఒక్క మేరఠ్ జోన్లోనే ఇప్పటి దాకా మూడో వంతు ఎన్కౌంటర్లు జరిగాయి. లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలోని బిహార్ పాలనను బీజేపీ నేతలు ‘ఆటవిక రాజ్యం’ అని నిందించేవారు. వివేక్ తివారీ హత్య, ఆడపిల్లను పోలీసులు వేధించిన తీరు చూస్తే ఉత్తర్ ప్రదేశ్‌లో ఉన్నది జంగిల్ రాజ్ కాక మరేంటి? పోలీసు యూనిఫాం ధరించినవారు నిబంధనలను తమకు అనుకూలంగా మార్చేయడం మరింత దారుణం. సమాజ్‌వాదీ పార్టీ పాలనలో పాలకపక్షం మద్దతుతో యాదవ కులానికి చెందిన గూండాలు రెచ్చిపోయారు. ఇది ఖచ్చితంగా తప్పే. కారు ఆపనందుకు ఓ సామాన్యుడిని పోలీసులు కాల్చిచంపే స్థాయికి అప్పుడు రాష్ట్రం దిగజారిపోలేదు. తివారీ హత్యపై ఎందుకింత కలవరం? తివారీ హత్యపై ఇప్పుడు రేగిన కలవరం గతంలో ఇలాంటి సందర్భాల్లో ఎందుకు కనపడలేదు? ఎందుకంటే తివారీ మన లాంటి వ్యక్తి. ఎగువ మధ్య తరగతి చెందిన తివారీ లక్నోలోని సంపన్న ప్రాంతంలో నివసిస్తూ బహుళజాతి కంపెనీలో పనిచేస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్య విషయం అతను హిందువు. తర్వాత అతని భార్య చెప్పినట్టు తివారీ కిందటేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేశాడు. ‘బీజేపీకి ఓటేశాక మాకు దక్కా ల్సింది ఇదేనా?’అని అతని కుటుంబం ప్రశ్నించింది. ‘ఇలాంటివి కశ్మీర్ లోనేగానీ యూపీలో జరగవని ఆశించాం,’అని మరో కుటుంబ సభ్యుడు బాధతో చెప్పాడు. కానీ, కశ్మీర్‌లోయలో అమాయకులను చంపడంలో తప్పేమీ లేదనే భావం స్ఫురించేలా మాట్లాడడం అన్యాయం. తివారీ హిందువు కాకపోతే ప్రభుత్వం స్పందన భిన్నంగా ఉండేదా? గత అను భవాలను గుర్తుచేసుకుంటే, మరణించిన వ్యక్తి ముస్లిం అయితే అతనికి ఐఎస్ఐ లేదా ఐఎస్ఐఎస్తో ముడిపెట్టి కట్టుకథలు మీడియా ద్వారా ప్రచారంలో పెట్టేవారు. తివారీ ఎన్కౌంటర్ విషయంలో కూడా పోలీ సుల్లో తప్పుచేశామనే భావన కనిపించలేదు. పోలీస్ స్టేషన్లో కాని స్టేబుల్ చౌధరీ మొండిగా వాదిస్తూ మాట్లాడాడు. ఈ కేసులో ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకోవాలంటూ తమ కుటుంబానికి జిల్లా కలెక్టర్ నుంచి బెదిరింపులు వచ్చాయని తివారీ కూతురు చెప్పింది. ఈ సంఘటనలో ఏకైక ప్రత్యక్ష సాక్షి సనాతో పోలీ సుల కథనం రాసిన తెల్ల కాగితంపై సంతకం చేయించారు. పొరపాటున తగిలిన బులెట్‌తో తివారీ మర ణించాడనే పోలీసుల కథనానికి సనా ఇలా అంగీకారం తెలపాల్సి వచ్చింది. జనాగ్రహం కట్టలు తెంచుకోవడంతో యూపీ ప్రభుత్వ నేతలు కొంత దిగిరావడంతో పోలీసు కానిస్టేబుళ్లలో గుట్టుతిరుగుబాటు తలె త్తుతోంది. తివారీని కాల్చి చంపిన ప్రశాంత్ చౌదరీకి మద్దతుగా ఆన్లైన్ ప్రచా రోద్యమాన్ని పోలీ సులు ప్రారంభించారు. చౌధరీ తరఫున కోర్టు ఖర్చు లకు విరాళాలు ఇవ్వాలని కోరగా, అక్టోబర్ ఒకటికి రూ.5 లక్ష లకుపైగా వసూ లయ్యాయి. ఇది రాష్ట్రంలో పోలీసుల ధోరణికి అద్దం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల, ఎన్నికలు కొన్ని మాసాల్లో వస్తున్న కారణంగా ఈ పోలీసు హత్యపై ముఖ్యమంత్రి స్పందించారు. ప్రజల నుంచి నిరసన వ్యక్తం కాగానే తివారీ కుటుం బాన్ని ఆదిత్యనాథ్ పరామర్శించి, అతని భార్యకు ఉద్యోగంతోపాటు నష్టపరిహారం ప్రకటించారు. ఇది ఈ కుటుంబానికి తాత్కాలిక ఊరట మాత్రమే. పోలీసు ఉద్యోగం అంటే ప్రజలను చంపే దుర్మార్గమైన బలగం కాదనే స్పృహ వారిలో ఆదిత్యనాథ్ కలిగించకపోతే యూపీలో ఎన్కౌంటర్ల పేరిట హత్యలు కొనసాగుతూనే ఉంటాయి. టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్: tssmedia10@gmail.com -
రసపట్టులో అన్నదమ్ముల సవాల్
పార్టీపై స్టాలిన్ పట్టుకు తిరుగులేదనీ, పార్టీ నాయకత్వంలో అళగిరిని ఆయన వేలుపెట్టనివ్వరనే విషయం పరిశీలకులందరికీ అర్థమైంది. మళ్లీ డీఎంకేలో చేర్చుకోవాలని డిమాండ్ చేసిన అళగిరి విషయంలో కరుకుగానే వ్యవహరించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. స్టాలిన్ పార్టీ మనిషిగానే వ్యవహరిస్తూ, కుటుంబ సంబంధాల ప్రభావం పార్టీపై పడకుండా చూడాలనేది వారి ఆకాంక్ష. సెప్టెంబర్ ఐదున తన మెరీనా యాత్రలో లక్ష మంది తన వెంట నడుస్తారని అళగిరి చెబుతున్నారు. అంత మంది జనం ఆయన వెంట రాకపోవచ్చుగాని, అళగిరి ర్యాలీ విజయవంతమైనట్టు కనిపించేలా చేయడానికి డీఎంకే వ్యతిరే పార్టీలు తమ వంతు పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. చెన్నైలోని మెరీనాలో తన తండ్రి ఎం.కరుణానిధి సమాధి వద్దకు ఆయన రెండో కొడుకు డీఎంకే మాజీ నేత ఎంకే అళగిరి నేడు (బుధవారం) ఊరేగింపుగా వెళుతున్నారు. 1980ల్లో తన ఇద్దరు కొడుకుల మధ్య వైరంతో విసిగిపోయిన కరుణానిధి పార్టీ దక్షిణాది వ్యవహారాలు చూసుకో మని అళగిరిని మదురైకు పంపించారు. ఉత్తర తమిళ నాడులో పార్టీ పనిని చెన్నై నుంచి నడపాలని స్టాలిన్‌కు అప్పగించారు. స్టాలిన్ కార్యక్షేత్రంలోనే ఆయనకు అన్న సవాలు విసురుతున్నారు. కుటుంబ పోరు ఇక బహిరంగమే. తోబుట్టువుల మధ్య ఈ యుద్ధంలో అళగిరే బలహీనుడు. ఆగస్టు చివరి వారం స్టాలిన్ తండ్రికి వారసునిగా డీఎంకే అధ్యక్ష పదవి చేపట్టారు. కరుణ ఈ పదవిలో 49 ఏళ్లున్నారు. 2014లో డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన అళ గిరి ప్రస్తుతం పార్టీ సభ్యుడు కూడా కాకపోవడంతో తమ్ముడిని అడ్డుకోలేకపోయారు. ప్రతి జిల్లాలో అన్ని పదవుల్లో్ల తన మనుషులను నియమిస్తూ గత నాలు గేళ్లలో పార్టీపై స్టాలిన్ పూర్తి పట్టు సాధించారు. ఈ నాలుగేళ్లలో అళగిరి రాజకీయాల్లో చురుకుగా లేరు. తమ్మునితో పోరు సలపకుండా వెనుదిరగడం ఆయ నకు ఇష్టం లేదు. మళ్లీ డీఎంకేలో చేరాలనుకున్న ఆయనకు కుటుంబ సభ్యుల మద్దతు లభించలేదు. దీంతో ఇక బాహాటంగానే స్టాలిన్‌తో తలపడాలను కుని, తన తండ్రికి నిజమైన, విధేయులైన కార్యకర్త లంతా నాతోపాటే ఉన్నారని చెప్పారు. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడైన స్టాలిన్ కార్యసాధకుడు కాదని, పార్టీని ఎన్నికల్లో గెలిపించే సత్తా ఆయనకు లేదని అళగిరి చెప్పారు. స్టాలిన్‌కు ఎక్కడ నొప్పి పుడు తుందో అక్కడే అళగిరి గురిచూసి కొడుతున్నారు. కరుణానిధి బతికుండగానే 2014 లోక్‌సభ, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోనే డీఎంకే పోటీచేసింది. డీఎంకేకు ఒక్క లోక్‌సభ సీటూ దక్క లేదు. రెండేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలితను గద్దె దింపలేకపోయింది. అందుకే, 2019 పార్లమెంటు ఎన్నికలు స్టాలిన్‌కు అగ్నిపరీక్ష వంటివి. మూడోసారి ఎన్నికల్లో డీఎంకేను గెలిపించ లేకపోతే స్టాలిన్‌కు ప్రమాదం ముంచుకొస్తుంది. అళగిరి పార్టీని చీల్చలేక పోయినా, స్టాలిన్‌ను ఇబ్బం దిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్న పేరెత్తని స్టాలిన్! అళగిరి విమర్శలకు స్టాలిన్ స్వయంగా స్పందించ లేదు. పార్టీ నేతలతోనే జవాబు చెప్పించారు. పార్టీపై స్టాలిన్ పట్టుకు తిరుగులేదనీ, పార్టీ నాయకత్వంలో అళగిరిని ఆయన వేలుపెట్టనివ్వరనే విషయం డీఎంకే వ్యవహారాలు గమనిస్తున్నవారందరికీ అర్థమైంది. మళ్లీ డీఎంకేలో చేర్చుకోవాలని డిమాండ్ చేసిన అళగిరి విషయంలో కరుకుగానే వ్యవహరించాలని పార్టీ నేతలు కోరారు. స్టాలిన్ పార్టీ మనిషి గానే వ్యవహరిస్తూ, కుటుంబ సంబంధాల ప్రభావం పార్టీపై పడకుండా చూడాలనేది వారి ఆకాంక్ష. సెప్టెంబర్ ఐదున తన మెరీనా యాత్రలో లక్ష మంది తన వెంట నడుస్తారని అళగిరి చెబుతున్నారు. అంత మంది జనం ఆయన వెంట రాక పోవచ్చుగాని, అళగిరి ర్యాలీ విజయవంతమైనట్టు కనిపించేలా చేయడానికి డీఎంకే వ్యతిరేక పార్టీలు తమ వంతు పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. జయలలిత మరణించాక ఏఐఏడీఎంకేలో వచ్చిన చీలిక, బల హీన నాయకత్వంలో పార్టీ నడవడాన్ని తమకు అను కూలంగా మార్చుకోవడానికి డీఎంకే ప్రయత్నిస్తున్నట్టే, డీఎంకేను నడిపే కరుణానిధి కుటుంబంలోని కీచులాటలను వాడుకోవడానికి కూడా అనేక శక్తులు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతానికి డీఎంకే నేతలు, కార్యకర్తలను చెప్పుకోదగ్గ సంఖ్యలో అళగిరి తనవైపుకు తిప్పుకోలేరు.. రెండేళ్ల క్రితం స్టాలిన్ అడ్డపంచె వదిలి ప్యాంటు, రంగు చొక్కా బదులు తెల్ల షర్టు వేసుకునేలా సలహాదారుల బృందం ఆయనను ఒప్పించింది. ఇలా ‘గెటప్’ మార్చితే తమిళనాడు యువతను వారిలా కనిపిస్తూ ఆకట్టుకోవవచ్చనేది ఈ సలహాబృందం అభిప్రాయం. కొత్త రూపంలోని స్టాలిన్ మీడియా తీసిన ఫొటోల్లో ఆసక్తికరంగానే కనిపించారుగాని ఎన్నికల్లో మాత్రం డీఎంకే గెలిచేస్థాయిలో ఓట్లు పడలేదు. కనీసం కరుణానిధి, జయలలిత లేని తమిళ రాజకీయక్షేత్రంలోనైనా ఎన్నికల్లో కొత్త అంశాలు జోడించి విజయానికి బాటలు వేయాలనే వత్తిడి స్టాలిన్‌పై పెరుగుతోంది. రెండేళ్లకు పైగా అధికారంలో ఉన్న పాలకపక్షమైన ఏఐడీఎంకేపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిపైనే పార్టీ గెలుపునకు పూర్తిగా ఆధారపడితే స్టాలిన్‌కు విజయం గ్యారంటీ అని చెప్పడం కష్టం. తన తండ్రి సీఎంగా అందించిన డీఎంకే పరిపాలన నాణ్యత తన నాయకత్వంలో బాగా మెరుగవుతుందని, సుపరిపాలనకు తన పార్టీ మంచి నమూనాగా నిలుస్తుందని స్టాలిన్ సరికొత్త ఇమేజ్‌తో ప్రజలను నమ్మించగలిగితేనే పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది. గతంలో మాదిరిగా పాలక పక్షంపై జనంలో పేరుకుపోయే వ్యతిరేకత ఈసారి డీఎంకే అధికారంలోకి రావడానికి తోడ్పడకపోవచ్చు. తమిళనాడులో 1984, 2016లో మినహా ప్రజలు అధికారంలో ఉన్న ద్రవిడ పార్టీలను ఓడించారు. డీఎంకే, ఏఐఏడీఎంకేలో ఈ రెండు సందర్భాల్లో తప్ప ప్రతిసారి ఒకదాని తర్వాత ఒకటి ఫోర్ట్ సెయింట్ జార్జిలో (తమిళ అధికారపీఠం ఉండే ప్రాంతం) అధికారం చేపట్టాయి. కరుడుగట్టిన ఏఐఏ డీఎంకే కార్యకర్తకు సీఎం పళనిస్వామి– ఓపీఎస్ నేతృత్వంలోని అసలు ఏఐఏడీఎంకేనుగాని, శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్ నాయకత్వంలోని చీలికవర్గమైన కొత్త పార్టీని(అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం)గాని ఎంచుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఏఐఏడీఎంకేలోని అసంతృప్తి జ్వాలలపైనే తమిళ నాడు ప్రభుత్వ పగ్గాలు చేపట్టడానికి స్టాలిన్ పూర్తిగా ఆధారపడలేరనేది వాస్తవం. ఖాయంగా అధికారం లోకి రావాలంటే కొత్త సీసాలో పాత సారా పోసి చూపించకుండా, తమిళనాడు ప్రగతికి కొత్త విజన్ ఏమిటో స్టాలిన్ ప్రజలకు చెప్పగలగాలి. కొత్త పార్టీ పెట్టినా పెద్దగా లాభం ఉండదు! అళగిరి కొత్తగా పార్టీ పెట్టినా ఎన్నికల ఫలితాలపై చెప్పుకోదగ్గ ప్రభావం చూపించే అవకాశం లేదు. ఎన్నికల్లో దక్షిణ తమిళనాడులో ఓట్లు చీల్చి డీఎంకేను ఓడించగలిగితే అళగిరికి అంతకన్నా ఆనందించే విషయం ఉండదు. ఈ లక్ష్య సాధనకు స్టాలిన్ రాజ కీయ ప్రత్యర్థులతో కలిసి పనిచేయడానికి కూడా ఆయన సిద్ధమే. ప్రస్తుతానికి ఏ రాజకీయ సంస్థతో అనుబంధం లేకుండా కనిపిస్తున్నాగాని కరుణానిధికి ప్రత్యామ్నాయ వారసునిగా అళగిరి తాను జనం ముందు కనిపించేలా ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత తనను తప్పనిసరిగా డీఎంకేలోకి తమ్ముడు స్టాలిన్ తీసుకునే పరిస్థితిని అళగిరి ఈలోగా సృష్టించగలగాలి. అంటే ఎన్నికల్లో తన వల్ల డీఎంకే దెబ్బతినేలా చూడాలి. రాజకీయంగా తన ఉనికి చాటాలనే ఆతృత ఆయనలో కనిపిస్తోంది. తన కొడుకులు, మనవళ్లకు డీఎంకేలో రాజకీయ, ఆర్థిక వారసత్వం, వాటా దక్కించుకోవాలనేది కూడా అళ గిరి కోరిక. భారీగా డబ్బున్న డీఎంకే నిర్వహణలోని ట్రస్టుల్లో అళగిరి కుటుంబసభ్యులెవరికీ సభ్యత్వం లేదు. ఆయనలో అసలు అసంతృప్తికి ఇదో ప్రధాన కారణం. అందుకే ఆయన కొంత తగ్గివచ్చి తమ్ముడికి కొత్త ప్రతిపాదన చేశారు. తనను డీఎంకేలోకి మళ్లీ తీసుకుంటే స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధమేనని ఇటీవల ప్రకటించారు. కరుణానిధి గోపా లపురం ఇంట్లో డీఎంకే ప్రథమ కుటుంబానికి సంబంధించి మరో కథ ప్రచారంలో ఉంది. కరు ణానిధి కన్నుమూసిన కొన్ని రోజులకే డీఎంకేలోకి తనను మళ్లీ చేర్చుకోవడానికి తన కుటుంబసభ్యుల ద్వారా అళగిరి ఒత్తిడి తెచ్చారట. తమ కుటుంబాన్ని ఐక్యంగా ఉంచే బాధ్యత తనపై ఉందని చెప్పుకునే ఆయన సోదరి సెల్వికూడా తన వంతు ప్రయత్నం చేశారు. తన సోదరులిద్దరూ కలిసి ఉండేలా చూడ డానికి అమె గట్టి కృషి చేశారు. కాని, అళగిరిని మళ్లీ పార్టీలోకి రానిచ్చే ప్రసక్తి లేదని స్టాలిన్ తేల్చి చెప్పారు. ఆయనకు ఈ విషయంలో సవతి చెల్లెలు కనిమొళి, దగ్గర బంధువులైన మారన్ సోదరులు బాసటగా నిలబడ్డారు. తన తండ్రి మంచి ఆరో గ్యంతో ఉన్నప్పుడే మళ్లీ పార్టీలో చేరడానికి తాను గట్టి ప్రయత్నాలు చేయాల్సిందనీ, కాని ఆ పని చేయలేదని మదురైలోని తన మద్దతుదారులతో మాట్లాడుతూ అళగిరి తన బాధ వెళ్లబోసుకుంటు న్నారని తెలుస్తోంది. తన తండ్రి నిర్ణయం మార్చా ల్సిన అవసరం కనిపించడం లేదని స్టాలిన్ అంటు న్నారు. సోషల్ మీడియా అత్యంత చురుకుగా పని చేస్తున్న ఈ రోజుల్లో అళగిరి తరహా దురుసు రాజ కీయాల వల్ల పార్టీకి చేటేగాని లాభం ఉండదని భావి స్తున్నారు. డీఎంకే అగ్రనాయకత్వం కూడా అళగిరి మళ్లీ పార్టీలోకి రావాలని కోరుకోవడం లేదు. 2001లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినం దుకు అళగిరిని సస్పెండ్ చేశారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీకి వ్యతిరేకంగా పని చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. తనకు పలుకుబడి ఉన్న మదురై చుట్టుపక్కల ప్రాంతాల్లో డీఎంకే అభ్య ర్థుల ఓటమికి ఆయన పనిచేశారనే ఆరోపణలు న్నాయి. అళగిరి దెబ్బతో పరాజయం పాలైనవారిలో డీఎంకే సీనియర్ నేత పీటీఆర్ పళనిరాజన్ కూడా ఉన్నారు. ఆయన 1996–2001 మధ్య తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. మదురై పశ్చిమ స్థానంలో ఆయన కేవలం 708 ఓట్ల తేడాతో ఓడి పోయారు. అళగిరి 17 ఏళ్ల క్రితంలా ఇప్పుడు లేకున్నా డీఎంకేను దెబ్బదీయడానికి ఆయనకున్న శక్తియుక్తులను ఎవరూ తక్కువగా అంచనావేయడం లేదు. అళగిరి పొరపాటు చేశారా? అంటే అవుననే చెప్పాలి. తన తండ్రి మరణించాక ఆయన కొంత కాలం వేచి చూడాల్సింది. వారంలోపే దూకుడుగా మాట్లాడారు. ఎన్నికల్లో స్టాలిన్ బోల్తాపడే వరకూ ఆగి తర్వాతే అళగిరి విమర్శిస్తే బావుండేది. తొంద రపడి తన బలహీనత బయటపెట్టుకున్నారు. బుధ వారం ర్యాలీకి తెలిసిన నేతలు, జనం తగినంత మంది హాజరుకాకపోతే అళగిరి రాజకీయ జీవితం ముగిసినట్టేననుకోవచ్చు. టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
అమెరికాకు స్పైడర్మాన్.. కేరళకు బోట్మాన్!
అమెరికాలో ప్రజలను రక్షించడానికి సినిమాల్లో చూపించే స్పైడర్మాన్, బాట్మాన్, సూపర్మాన్ ఉంటే కేరళకు బోట్మాన్ ఉన్నాడని వాట్సాప్‌లో విపరీతంగా అందరికీ పంపిన సందేశం కేరళ వరద బాధితులకు మత్స్యకారులు చేసిన సహాయాన్ని వెల్లడిస్తోంది. వరదలు మొదలైన కొన్ని గంటలకే, సైనిక దళాల రాకకు ముందే, చేపలు పట్టే ఈ బెస్తలు తమ పడవలతో వచ్చి జల దిగ్బంధంలో ఉన్న జనాన్ని కాపాడే పని చేపట్టారు. చేపల వేటతో బతికే ఈ వర్గం ప్రజలు దుర్వాసనతో ఉంటారని మిగిలిన ప్రజలు సాధారణంగా ఈసడించుకోవడం తెలిసిందే. అలాంటి ఈ గంగపుత్రులు తమ పడవల్లో వచ్చి వందలాది మంది ప్రాణాలు కాపాడారు. ఇక సైన్యం పాత్ర అసాధారణం. వరద నీటి నుంచి కాపాడిన పసిపాపను చేత్తో ఎత్తి పట్టుకున్న కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ పడవలో నిలబడిన దృశ్యం కేరళను అతలాకుతలం చేసిన వరదల తీవ్రతకు అద్దంపడుతోంది. నీట మునిగిన ప్రజలను రక్షించడానికి రంగంలోకి దిగిన సిబ్బందిని, జనాన్ని సమన్వయం చేయడానికి తన నియోజకవర్గమైన ఆలపూళలో మంత్రి నీటిలోకి వచ్చి సేవలందించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తీసుకుంటున్న సహాయ, రక్షణ చర్యల గురించి వివరించడం కూడా నీటితో ప్రాణాల కోసం పోరాడుతున్న ప్రజలకు ఊరటనిచ్చింది. ఎలాంటి నాటకీయ చర్యలకు తావులేకుండా ప్రశాం తంగా సాగిన ఈ సమావేశాన్ని టెలివిజన్ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇంటర్నెట్లో కూడా వెబ్సైట్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం అవసరమైంది. అలాగే, సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి కనిపిస్తూ వరద పరిస్థితులు, సహాయ చర్యలకు సంబంధించిన ఎంతో విలువైన సమాచారం ప్రజలకు అందించారు. సహాయ సిబ్బంది కృషి ఆదర్శప్రాయం కేరళ వరదలపై వస్తున్న నకిలీ ఇంకా చెప్పాలంటే తప్పుడు వార్తలు, పుకార్లను అడ్డుకోవడానికి ఈ విధమైన సమాచార ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. రాజధాని తిరువనంతపురంలోని రాష్ట్ర సచివాలయంలో, జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉన్నతాధికారులు, సిబ్బంది చేస్తున్న కృషి నిజంగా ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. వరద బాధితుల కోసం తీసుకొచ్చిన బియ్యం బస్తాలను వైనాడ్ జిల్లా కలెక్టర్, సబ్‌కలెక్టర్ లారీ నుంచి దింపి తమ వీపులపై వేసుకుని మోయడం ఉన్నతాధికారుల గొప్ప ప్రవర్తన తార్కాణంగా కనిపిస్తోంది. 1924 తర్వాత కేరళలో ఇంతటి తీవ్ర స్థాయిలో వరదలు రాలేదు. ఈ జల ప్రళయంలో ఇప్పటి వరకూ 300 మందికి పైగా మరణించారు. అయితే, కోట్లాది మందిని కుదిపేస్తున్న ఈ సంక్షోభంలో జరుగుతున్న సహాయక చర్యలపైన, అధికారుల అలసత్వంపైనా ఫిర్యాదులు, విమర్శలు రాకపోవడానికి ఇసాక్, విజయన్, ఇతర అధికారుల కృషే కారణం. ఈ వరద సహాయక కార్యక్రమాల్లో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం ఏమంటే, నీట మునిగిన ప్రజలను వరదల నుంచి కాపాడడానికి పాలనా యంత్రాంగంతో పౌర సమాజం చేతులు కలపడం. కేరళ సర్కారు సాయంపై లేనిపోని నిందలేయకుండా తోటి వారికి తోడ్పడాలనే లక్ష్యమే పౌర సమాజాన్ని అద్వితీయమైన చొరవతో ముందుకు నడిపిస్తోంది. ఇలాంటి కష్టకాలాల్లో చీటికి మాటికి ప్రభుత్వంపై వేలెత్తి చూపే ప్రతిపక్షం సైతం తమ కార్యకర్తలను సహాయ కార్యక్రమాల్లోకి దింపి ప్రజలకు సాయమందిస్తోంది. వరదల్లో చిక్కుకున్న జిల్లాల పరిస్థితులను స్వయంగా చూడడానికి ముఖ్యమంత్రి తన హెలికాప్టర్ పర్యటనల్లో తనతోపాటు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితలను వెంట తీసుకెళ్లారు. వరద సహాయ, రక్షణ చర్యల్లో రాజకీయాలకు తావులేదని చెప్పడమే సీఎం విజయన్ ఉద్దేశం. మత్స్యకారులు మానవతామూర్తులు అమెరికాలో ప్రజలను రక్షించడానికి సినిమాల్లో చూపించే స్పైడర్మాన్, బాట్మాన్, సూపర్మాన్ ఉంటే కేరళకు బోట్మాన్ ఉన్నాడని వాట్సాప్‌లో విపరీతంగా అందరికీ పంపిన సందేశం మత్స్యకారులు చేసిన సహాయాన్ని వెల్లడిస్తోంది. భారీ వర్షా లతో వరదలు మొదలైన కొన్ని గంటలకే సైనిక దళాల రాకకు ముందే చేపలు పట్టే ఈ బెస్తలు తమ పడవలతో వచ్చి జల దిగ్బంధంలో ఉన్న జనాన్ని కాపాడే పని చేపట్టారు. చేపల వేటతో బతికే ఈ వర్గం ప్రజలు దుర్వాసనతో ఉంటారని మిగిలిన ప్రజలు సాధారణంగా ఈసడించుకోవడం తెలిసిందే. అలాంటి ఈ గంగపుత్రులు తమ పడవల్లో వచ్చి వందలాది మంది ప్రాణాలు కాపాడారు. ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో సాయపడే కార్యక్రమాల్లో పాల్గొనే సిబ్బంది అందుకు అనువుగా చేతులు లేని చొక్కాలు ధరిస్తారు. అలాంటి దుస్తులు లేకుండానే మత్స్యకారులు రంగంలోకి దిగి నీటము నిగిన కేరళ రహదారుల్లోకి తమ గట్టి బోట్లతో వచ్చి ప్రమాదస్థితిలో ఉన్నవారిని చేరుకుని కాపాడారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం ఈ వరదల్లో స్పందించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా సైనిక దళాల సేవలు మరువలేనివి. నీటమునుగుతున్న ఇళ్ల పైకప్పులపై నిలబడిన వేలాది మందిని కాపాడిన ఘటనలు చెప్పలేనన్ని ఉన్నాయి. సాజిదా జాబిల్ అనే గర్భిణిని కూడా ఇలాగే రక్షించారు. ప్రసవానికి ముందు ఉమ్మ నీరు రావడంతో ఆమెను కొచ్చి నుంచి ఆస్పత్రికి వేగంగా తరలించారు. కాపాడిన కొన్ని గంటల్లోనే ఆమె మగ బిడ్డను ప్రసవించింది. మూడు రోజుల తర్వాత ఆమెను కాపాడిన ఇంటి పై కప్పు మీద ఆమె కుటుంబ సభ్యులు ‘థ్యాంక్స్’ అని పెద్దక్షరాలతో రాశారు. ఇలాంటి క్షణాలు కేరళ వరద సహాయ కార్యక్రమాల తీరు ఎంత సవ్యంగా, గొప్పగా ఉందో చెబుతున్నాయి. ఇలాంటి విపత్తుల సమయంలో నాటకీయంగా, అతి వ్యాఖ్యానాలతో వార్తా ప్రసార సాధనాలు పని చేస్తాయి. మలయాళ మీడియా మాత్రం సంయమనం పాటిస్తూ ప్రశంసాపూర్వకంగా వ్యవహరించింది. విలేకరులు, టీవీ యాంకర్లు అతిగా సోది చెప్పకుండా నిజంగా వరద దృశ్యాలు చూపిస్తూ సహాయక చర్యల గురించే వివరించారు. వరద సహాయచర్యల విషయంలో అంకితభావంతో ఏషియానెట్ న్యూస్ చానల్ రెండు రోజులపాటు వార్తల మధ్యలో వ్యాపార ప్రకటనల ప్రసారం కూడా నిలిపివేసింది. విపత్తు సమయంలో అధిక టీఆర్పీలను సొమ్ము చేసుకోకూడదనే ఆశయంతో ఈ పని చేసింది. వరదల వల్ల సొంతిళ్లు వదిలి వచ్చిన కనీసం ఒక కుటుంబానికి తమ ఇళ్లలో ఆశ్రయం ఇవ్వాలని కోరుతూ టీవీ చానల్ న్యూస్18 ‘ఓపెన్ యువర్ హార్ట్, ఓపెన్ యువర్ హౌస్’(మీ హృదయం తలుపులు, ఇంటి తలుపులు తెరవండి) అనే పిలుపుతో ఓ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం సోమవారం ప్రత్యక్ష ప్రసారమైన సమయంలో ఈ చానల్‌కు 90 ఫోన్ కాల్స్ వచ్చాయి. టీవీ విలేకరులు సొంత కబుర్లతో ఊదరగొట్టకుండా చూపించాల్సిన దృశ్యాలతో అవసరమైన మాటలే చెప్పారు. అనేకమంది జర్నలిస్టులు సొంత సమస్యలు, విషయాలు పక్కన పెట్టి తమ విధులకే ప్రాధాన్యమిచ్చారు. వారి ఇళ్లు లేదా బంధువుల గృహాలు నీటి మునిగి ఉన్నా వాటి గురించి పట్టించుకునే తీరిక వారికి లేదు. జనానికి సేవలందించడానికే వారు అంకితమయ్యారు. అవాంఛనీయ ధోర ణులకూ కొదవ లేదు! అయితే, కేరళ వరదల సమయంలో కొన్ని అవాంఛనీయ ధోరణులూ కనిపించాయి. ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి విరాళాలివ్వద్దని కోరుతూ సోషల్ మీడియాలో ప్రజలను కోరడంతో ఈ దుష్ప్రచారం మొదలైంది. సర్కారుకు ఇచ్చే సొమ్ము వరద బాధితులకు చేరదనీ, దాన్ని సక్రమంగా ఖర్చు చేయరనే నిందను ఈ రూపేణా ప్రచారం చేశారు కొందరు. అందుకే ఇతర ప్రైవేటు సహాయనిధులకు విరాళాలివ్వాలని వారు కోరుతూ రాష్ట్ర సర్కారు నిజాయితీని అనుమానించేలా ప్రయత్నించారు. క్రైస్తవ, ముస్లిం సంస్థలు తమ వర్గం ప్రజలకు ఎలాగూ సాయం చేస్తాయి కాబట్టి హిందువులకు మాత్రమే తోడ్పాటు అందించాలనే ప్రయత్నాలు జరిగాయి. మలయాళీలు గొడ్డుమాంసం తింటారు కాబట్టే వారికి ఇంతటి కష్టమొచ్చి పడిందనే ప్రచారాన్ని కూడా కొందరు చేశారు. హిందువులకు కీడుచేసే ప్రయత్నాలు, ఆవును పవిత్రంగా చూడకపోవడం వల్లే కేరళను వరదలు ముంచెత్తాయనే ప్రచారం కూడా చేశారు. 10–50 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలకు శబరిమల అయ్యప్ప స్వామి గుడిలోకి ప్రవేశం కల్పించే అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపు తున్న విషయం తెలిసిందే. ఈ కోర్టు పరిణామాలపై ఆయ్యప్పకు కోపమొచ్చిందనే సిద్ధాంతాన్ని కూడా సోషల్ మీడియాలో ప్రవేశపెట్టారు. రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్‌గా కొత్తగా నియమితులైన ఎస్.గురుమూర్తి కేరళ వరదలకు అయ్యప్ప గుడిలో మహిళల ప్రవేశానికి ముడిపెడుతూ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణకూ, భారీ వర్షాలకు మధ్య ఏదైనా సంబంధం ఉన్నదీ లేనిదీ సుప్రీంకోర్టు జడ్జీలు పరిశీలించాలని ఆయన తన ట్వీట్ల ద్వారా సూచించారు. వరదల కారణంగా ఇతర ప్రదేశాల మాదిరిగానే శబరిమలతో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. ‘‘ఒక వేళ రెంటికీ మధ్య పది లక్షల్లో ఒక అవకాశం ఉన్నా స్త్రీల ప్రవేశానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇవ్వాలనే ప్రజలు కోరుకుంటున్నట్టు భావించాలి’’ అని గురుమూర్తి తన ట్వీట్లో చెప్పారు. ఒకవేళ కోర్టు విచారణపై అయ్యప్ప స్వామి తన ఆగ్రహం వరదల ద్వారా వ్యక్తం చేశారని భావించినా, ఆయన పది నుంచి 50 ఏళ్ల వయసు మహిళలే ఈ జల విలయంలో బాధపడేలా చేసి ఉండేవారని నేను అనుకుం టున్నాను. పాత సంప్రదాయం కొనసాగించాలని కోరే పురుషులను వరద బాధితులను చేసేవారు కాదని నమ్ముతున్నాను. అయ్యప్ప సుప్రీంకోర్టు విచారణను జాగ్రత్తగా గమనిస్తున్నారని, స్త్రీల ప్రవేశం కోరుతున్న లక్షలాది మంది కేరళ ప్రజలపై కక్ష సాధించాలని ఆయన వ్యవహరించారని మనం నమ్మాలా? మత విద్వేషంతో నిండిన మితవాదులు కోట్లాది మందికి ఆరాధ్యదైవాన్ని తమ మాదిరిగానే ప్రతీకారం కోరుకునే వాడిగా చిత్రించినట్టు మనకు ఈ పరిణామాలను బట్టి అర్థమౌతోంది. తమ దేశ విజయగాథలో కేరళ ప్రజలు ఎప్పుడూ భాగస్వాములని దుబాయ్ ఉపాధ్యక్షుడు, పాలకుడు షేక్ మహ్మద్ అల్ మక్తూం మలయాళం, ఇంగ్లిష్, అరబిక్ భాషల్లో ట్వీట్ చేస్తూ, కేరళ వరద సాయం కింద రూ.700 కోట్లు ఇస్తామని వాగ్దానం చేశారు. కేరళకు నేడు ఆపన్న హస్తం అవసరం. దుష్ప్రచారం కాదు. - టీఎస్ సుధీర్ (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు) ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
మూకహత్యలకు రాజకీయాలే దన్ను
హాపూర్, ధూలే, మాల్డా, పులికాట్, హజారీబాగ్. దేశంలోని ఈ పట్టణాల పర్యటన కోసం వాటి పేర్లు ఇక్కడ రాయడం లేదు. నవ భారతంలో ప్రజలు సిగ్గుపడే ఘటనలు అంటే మూకహత్యలు ఈ ఊళ్లలో జరిగాయి. హిందూస్తాన్ లోని పట్టణాలు ఇలాంటి హత్యలకు అనువైన ప్రదే శాలుగా మారిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో పశువుల వ్యాపారి రక్బర్ ఖాన్ మూకల దాడిలో మర ణించాడు. 2010 నుంచీ దేశంలో మొదలైన మూక హత్యల్లో ఇది 87వది. అడ్డూఅదుపూ లేని మూకల దాడుల్లో ఇప్పటి వరకూ జరిగిన దాడుల్లో 34 మంది ప్రాణాలు కోల్పోగా, 240 మంది గాయపడ్డారు. 2014 మేలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి నప్పటి నుంచీ 98 శాతం మూకహత్యలు జరిగాయి. ఇలాంటి సంఘటనల్లో 56 శాతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంభవించాయి. ఇలాంటి నేరాలను ఎప్పటి కప్పుడు నమోదు చేసి వివరాలు సేకరించే ఇండియా స్పెండ్ అనే వెబ్సైట్ ఈ విషయాలు వెల్లడించింది. చావులతో కూడా ఈ లెక్కలను గణాంకాల సేకర ణకు ఇవ్వడం లేదు. వివక్షతో విచ్చలవిడిగా ప్రవ ర్తించే మూకలు బలోపేతమౌతూ దేశాన్ని మధ్య యుగాల భారతదేశంగా మార్చుతున్నాయనే వాస్త వాన్ని ఇవి సూచిస్తున్నాయి. మత విద్వేషాలు పెరగ డంతోపాటు చట్టాన్ని అమలు చేయాల్సిన భారత ప్రభుత్వ వ్యవస్థలు అరాచక శక్తులతో రాజీపడటం వల్ల మనుషులు ఆదిమానవులుగా మారుతున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేప థ్యంలో ఈ హత్యలు ప్రారంభం మాత్రమేనని నేను భావిస్తున్నాను. ‘జనం గొడ్డు మాంసం తినడం మానేస్తే మూకహత్యలు ఆగిపోతాయ’ని ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ మాటలు ఈ విషయాన్నే నొక్కి చెబుతున్నాయి. ఇదే పద్ధతిలో మాట్లాడే హైదరాబా ద్‌కు చెందిన బీజేపీ ఎమ్యెల్యే టి. రాజా సింగ్ ‘మొదట గో హత్యల గురించి ఎందుకు ప్రశ్నిం చరు?’ అంటూ రెచ్చగొడుతున్నారు. ఆయన తన పోకడలను వ్యతిరేకించే వారికి ఇలా హెచ్చరిస్తున్నా రనే విషయం మనం మర్చిపోకూడదు. మూకహత్య నిందితులకు ఎమ్మెల్యే మద్దతు! స్థానిక ఎమ్మెల్యే మద్దతు తమకుందని రాజస్తాన్‌లోని ఆల్వార్ మూకహత్య కేసులో నిందితులు ప్రకటిం చుకున్నారని వార్తలొచ్చాయి. ఇలాంటి దుర్మార్గాలకు కేవలం రాజకీయ నేతలేగాక ప్రభుత్వ ఉన్నతాధికా రులు కూడా కారణమౌతున్నారు. ఫలితంగా, దేశం లోని అనేక ప్రాంతాల్లో మత విద్వేషాలతో నిండిపో తున్నాయి. హిందువులు కాని ఇతర మతాల ప్రజల రోజులు దగ్గరపడ్డాయనే ధోరణి ప్రబలిపోతోంది. ఆవుల రవాణా మూకహత్యలకు దారితీసే సంద ర్భాల్లో ఎలాంటి నాగరిక దేశంలోనైనా మొదట పశు వులను గోశాలలకు తరలించడాని కన్నా దాడిలో గాయపడిన మనుషులను ఆస్పత్రికి తరలించడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఆల్వార్ పోలీసులు ఇదే పని చేయడమేగాక, పొరపాటు జరిగిందని చెప్పారు. పశువుల వ్యాపారి పేరు రక్బర్ఖాన్ కావడమే అతని హత్యకు కారణమా? సమాజంలో వర్గ విద్వేషాలు ఉన్నప్పుడు వాటిని వివరంగా వెల్లడించాల్సిన బాధ్యత జర్నలిస్టులకు లేదు. అయితే, ఈ రకమైన ఊచకోతలు ఓ పథకం ప్రకారం జరుగుతున్నట్టు కనిపిస్తే మీడియా వాటి గుట్టు విప్పాల్సిన అవసరం తప్పక ఉంటుంది. ఈ మూక హత్యల్లో మతపరమైన అంశం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, ఇలాంటి దాడు లకు గురైన వారిలో 56 శాతం, బాధితుల్లో 88 శాతం ముస్లింలేనని ఇండియా స్పెండ్ సంస్థ వెల్లడించింది. ఈ నెలలోనే ఉత్తర కర్ణాటకలోని బీదర్‌లో హైదరా బాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహ్మద్ ఆజంను పిల్లలను ఎత్తుకుపోయే వ్యక్తిగా అనుమానించి అప్ప టికప్పుడు గుమిగూడిన జనం కొట్టి చంపారు. ఇలాంటి మూకల దాడుల్లో గోసంరక్షకులైనా లేదా సాధారణ జన సమూహాలైనాగాని ముస్లింలనే పట్టుకు చంపుతున్నారని మలక్‌పేట్ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా అన్నారు. ‘‘ మూకహత్యల పేరుతో ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఈ సంఘటనలు సూచిస్తు న్నాయి. వీటి వెనుక ఉన్నది హిందుత్వ శక్తులే’’ అని ఆయన ఆరోపించారు. కాని, మహ్మద్ ఆజం హత్యలో మతం పాత్ర లేదని బీదర్ ఘటన గురించి తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. దాడి సందర్భంలో 9మంది పోలీసులు ఆజంను, అతని స్నేహితులిద్ద రినీ రెండు వేల మందికిపైగా ఉన్న మూకనుంచి కాపాడటానికి గట్టి ప్రయత్నమే చేశారు. ఆల్వార్‌లో పోలీసులే ఏం చేసిందీ పైన చెప్పాను. ఆల్వార్ వంటి ఘటనలు పరిశీలిస్తే, బలాలా చెప్పింది మనకు ఇబ్బంది కలిగించే వాస్తవమని గుర్తించక తప్పదు. హాపూర్‌లో జరిగిందే బీదర్‌లోనూ ! దాడికి గురైనవారిని ఎలా చూశారనే విషయానికి వస్తే హాపూర్ ఘటన బీదర్‌లో పునరావృతమైంది. బీదర్‌లో దుండగులు టెకీ ఆజం కుడి చేతికి తాడుకట్టి ముఖాన్ని నేల మీద ఈడ్చుకుంటూ పోయారు. ఆ సమయంలో మూకలు అతన్ని కొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఆజం కొన్ని నిమిషాల తర్వాత ఆస్పత్రికి తీసుకెళుతుండగా ప్రాణాలు విడిచాడు. జూన్ నెలలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్‌లో పశువుల వ్యాపారి ఖాసింను ఇదే తీరులో కొట్టి చంపారు. ప్రాణంపోయాక అతని మృత దేహాన్ని పోలీస్ జీపు దగ్గరికి జనం ఈడ్చుకుంటూ పోతుండగా, ముగ్గురు పోలీసులు వారితో పాటు నడిచారేగాని మరణించినవారి శరీరాలను పద్ధతిగా చూడాలనే స్పృహ వారిలో కలగలేదు. మూకలు ఖాసింను ఆవును మాంసం కోసం చంపే వ్యక్తి అని ఆరోపించగా, బీదర్‌లో ఆజంను పిల్లలను తన కారులో అపహరించుకుపోతున్న దొంగగా ముద్రవే శారు. ఇండియాలో 2018లో నోటి మాటగా లేదా వాట్సాప్ సందేశం ద్వారా వ్యాప్తిచేసే అబద్ధాలు అరాచక మూకలు మనుషుల ప్రాణాలు తీయడానికి తోడ్పడుతున్నాయి. ఇలాంటి మూకహత్యలపై ప్రభు త్వాలు స్పందించే తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మూకహత్యల నివారణకు కొత్త చట్టం చేయాలని పార్లమెంటును సుప్రీంకోర్టు కోరినా ఈ దిశగా కేంద్రం ఓ కమిటీ వేయడం మినహా చేసిందేమీ లేదు. శాంతి, భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశ మని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. జార్ఖండ్‌లోని రాంగఢ్‌లో ఓ ముస్లిం మాంసం వ్యాపా రిని కొట్టి చంపిన కేసులో దోషులుగా తేలిన ఏడుగురు హంతకులను కేంద్ర పౌరవిమానయాన మంత్రి జయంత్ సిన్హా సన్మానించారు. ‘ప్రధాని మోదీకి ప్రజాదరణ పెరగడం వల్లే ఇలాంటి మూక హత్యలు జరుగుతున్నాయని మరో కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ చెప్పడం మరీ దారుణం. ‘‘మోదీకి జనాదరణ పెరిగేకొద్దీ ఇలాంటి ఘటనలు జరుగుతాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవార్డులు వెనక్కి ఇచ్చేశారు. యూపీ ఎన్నికలప్పుడు మూకహత్యలు జరిగాయి. 2019 ఎన్నికల సమయంలో మరోటి మొదలవుతుంది’’ అని మేఘవాల్ వివరించారు. పథకం ప్రకారం చేసిన ఇలాంటి దారుణ హత్యలను ఎన్నికల పేరు చెప్పి ఈ బీజేపీ నేత సమర్ధించడం నిజంగా ఆందోళనకరం. బీజేపీ, కాంగ్రెస్ ‘నువ్వంటే–నువ్వు’ ఈ ఘటనలపై పాలకపక్షమైన బీజేపీ ప్రతినిధులు స్పందిస్తూ, కాంగ్రెస్ పాలనలో జరిగిన ఇలాంటి దారుణాల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ‘‘1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచ కోత, అస్సాంలో 1983 నాటి నెల్లీ మూకుమ్మడి హత్యాకాండ, 1947 దేశ విభజనలో జరిగిన హిందూ, ముస్లింల ఊచకోతలు కాంగ్రెస్ పాలనలో జరిగినవే కదా’’ అంటే ఇప్పటి దారుణాలను సమ ర్థించుకుంటున్నారు. అయితే, ఇది బీజేపీ–కాంగ్రెస్ మధ్య వాదన లేదా మాటల యుద్ధం కాదనే విషయం ఈ రెండు పార్టీలు మరిచిపోతున్నాయి. దేశ ప్రజలే రెండు వర్గాలుగా చీలిపోవడంతో జరుగు తున్న హత్యలివి. ఆవుల అక్రమ రవాణాదారు అనే ముద్రవేసి ప్రాణాలు తీసే క్రీడ ఇది. ఇలాంటి ఘట నలపై దర్యాప్తు చేసి, సత్యం ఏమిటో తేల్చాల్సిన వారు ఆ పనిలో విఫలమవుతున్నారు. కిందటేడాది ఏప్రిల్‌లో ఆల్వార్లోనే ఓ మూక చేతుల్లో మరణిం చిన పాల వ్యాపారి పెహ్లూ ఖాన్ ప్రాణాలు విడిచే ముందు తనపై దాడి చేసిన ఆరుగురి పేర్లు చెప్పాడు. కాని, వారిపై సాక్ష్యాధారాలు లేవని దీనిపై దర్యాప్తు జరిపిన సీఐడీ పోలీసులు ఆ ఆరుగురినీ విడిచి పెట్టారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి హత్యలు జరగడం మనం దిగులు పడాల్సిన విష యం. తీవ్ర ఆవేశంతోనో లేదా బాగా రెచ్చగొట్ట డంతోనే ఒక మనిషిని మరో మనిషి చంపడం సాధారణంగా జరుగుతుంది. మూకలు ఇలాంటి అమానుష హత్యలకు పాల్పడుతున్నాయంటే అవి సంపాదించిన అడ్డగోలు ధైర్యమే ఇందుకు కారణం. ఆవులను చంపి మాంసం తినేవారికి సమాజంలో బతికే హక్కు లేదని మూకలకు నూరిపోసే పథకం ప్రకారం ఇలాంటి హత్యలకు మనుషులను సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారంతో కావాలని మామూలు వ్యక్తులను రాక్షసులుగా మార్చేస్తున్నారు. 15 ఏళ్ల జునేద్ఖాన్ కిందటేడాది జూన్‌లో ఇంట్లో ఈద్ జరుపుకోవడానికి తోబుట్టువులతో రైలులో హరియాణాలోని ఇంటికి వెళుతుండగా మూక చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు. హంతకులు అతని సోదరుల గడ్డాలు పట్టుకుని ఎగతాళి చేయడమేగాక, వారిని ఆవు మాంసం తినే వ్యక్తులని ముద్రవేశారు. ఎన్నికలకు ముందు ఇలాంటి హింసా కాండ ఫలి తంగా ప్రజలు రెండు వర్గాలుగా చీలి పోవడాన్ని తమకు ప్రయోజనకరంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతాయనే భయం పీడిస్తోంది. వీటిని కేవలం ట్విట్టర్లో ఖండించడం వల్ల ప్రయోజనం లేదు. మహాత్మాగాంధీ ‘హింద్ స్వరాజ్’ అనే గ్రంథంలో ‘‘ ఆవుపై నా గుండె నిండా ఎంత జాలి ఉన్నా–దాని ప్రాణం కన్నా నా సోదరుడిని కాపాడటానికే నా ప్రాణ త్యాగం చేస్తాను’’ అని రాసిన మాటలు ఈ సందర్భంగా మనకు గుర్తుకొస్తే మంచిది. ఇదే మనం ఆచరించాల్సిన నియమం కావాలి. కానీ, 2018లో ఈ మాటలు ఎవరికీ వినిపించవు, కనిపించవు. - టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ : tssmedia10@gmail.com