హాపూర్, ధూలే, మాల్డా, పులికాట్, హజారీబాగ్. దేశంలోని ఈ పట్టణాల పర్యటన కోసం వాటి పేర్లు ఇక్కడ రాయడం లేదు. నవ భారతంలో ప్రజలు సిగ్గుపడే ఘటనలు అంటే మూకహత్యలు ఈ ఊళ్లలో జరిగాయి. హిందూస్తాన్ లోని పట్టణాలు ఇలాంటి హత్యలకు అనువైన ప్రదే శాలుగా మారిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో పశువుల వ్యాపారి రక్బర్ ఖాన్ మూకల దాడిలో మర ణించాడు. 2010 నుంచీ దేశంలో మొదలైన మూక హత్యల్లో ఇది 87వది. అడ్డూఅదుపూ లేని మూకల దాడుల్లో ఇప్పటి వరకూ జరిగిన దాడుల్లో 34 మంది ప్రాణాలు కోల్పోగా, 240 మంది గాయపడ్డారు. 2014 మేలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి నప్పటి నుంచీ 98 శాతం మూకహత్యలు జరిగాయి. ఇలాంటి సంఘటనల్లో 56 శాతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంభవించాయి.
ఇలాంటి నేరాలను ఎప్పటి కప్పుడు నమోదు చేసి వివరాలు సేకరించే ఇండియా స్పెండ్ అనే వెబ్‌సైట్ ఈ విషయాలు వెల్లడించింది. చావులతో కూడా ఈ లెక్కలను గణాంకాల సేకర ణకు ఇవ్వడం లేదు. వివక్షతో విచ్చలవిడిగా ప్రవ ర్తించే మూకలు బలోపేతమౌతూ దేశాన్ని మధ్య యుగాల భారతదేశంగా మార్చుతున్నాయనే వాస్త వాన్ని ఇవి సూచిస్తున్నాయి. మత విద్వేషాలు పెరగ డంతోపాటు చట్టాన్ని అమలు చేయాల్సిన భారత ప్రభుత్వ వ్యవస్థలు అరాచక శక్తులతో రాజీపడటం వల్ల మనుషులు ఆదిమానవులుగా మారుతున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేప థ్యంలో ఈ హత్యలు ప్రారంభం మాత్రమేనని నేను భావిస్తున్నాను. ‘జనం గొడ్డు మాంసం తినడం మానేస్తే మూకహత్యలు ఆగిపోతాయ’ని ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ మాటలు ఈ విషయాన్నే నొక్కి చెబుతున్నాయి. ఇదే పద్ధతిలో మాట్లాడే హైదరాబా ద్‌కు చెందిన బీజేపీ ఎమ్యెల్యే టి. రాజా సింగ్ ‘మొదట గో హత్యల గురించి ఎందుకు ప్రశ్నిం చరు?’ అంటూ రెచ్చగొడుతున్నారు. ఆయన తన పోకడలను వ్యతిరేకించే వారికి ఇలా హెచ్చరిస్తున్నా రనే విషయం మనం మర్చిపోకూడదు.
మూకహత్య నిందితులకు ఎమ్మెల్యే మద్దతు!
స్థానిక ఎమ్మెల్యే మద్దతు తమకుందని రాజస్తాన్‌లోని ఆల్వార్ మూకహత్య కేసులో నిందితులు ప్రకటిం చుకున్నారని వార్తలొచ్చాయి. ఇలాంటి దుర్మార్గాలకు కేవలం రాజకీయ నేతలేగాక ప్రభుత్వ ఉన్నతాధికా రులు కూడా కారణమౌతున్నారు. ఫలితంగా, దేశం లోని అనేక ప్రాంతాల్లో మత విద్వేషాలతో నిండిపో తున్నాయి. హిందువులు కాని ఇతర మతాల ప్రజల రోజులు దగ్గరపడ్డాయనే ధోరణి ప్రబలిపోతోంది. ఆవుల రవాణా మూకహత్యలకు దారితీసే సంద ర్భాల్లో ఎలాంటి నాగరిక దేశంలోనైనా మొదట పశు వులను గోశాలలకు తరలించడాని కన్నా దాడిలో గాయపడిన మనుషులను ఆస్పత్రికి తరలించడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఆల్వార్ పోలీసులు ఇదే పని చేయడమేగాక, పొరపాటు జరిగిందని చెప్పారు.
పశువుల వ్యాపారి పేరు రక్బర్‌ఖాన్ కావడమే అతని హత్యకు కారణమా? సమాజంలో వర్గ విద్వేషాలు ఉన్నప్పుడు వాటిని వివరంగా వెల్లడించాల్సిన బాధ్యత జర్నలిస్టులకు లేదు. అయితే, ఈ రకమైన ఊచకోతలు ఓ పథకం ప్రకారం జరుగుతున్నట్టు కనిపిస్తే మీడియా వాటి గుట్టు విప్పాల్సిన అవసరం తప్పక ఉంటుంది. ఈ మూక హత్యల్లో మతపరమైన అంశం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, ఇలాంటి దాడు లకు గురైన వారిలో 56 శాతం, బాధితుల్లో 88 శాతం ముస్లింలేనని ఇండియా స్పెండ్ సంస్థ వెల్లడించింది. ఈ నెలలోనే ఉత్తర కర్ణాటకలోని బీదర్‌లో హైదరా బాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మహ్మద్ ఆజంను పిల్లలను ఎత్తుకుపోయే వ్యక్తిగా అనుమానించి అప్ప టికప్పుడు గుమిగూడిన జనం కొట్టి చంపారు.
ఇలాంటి మూకల దాడుల్లో గోసంరక్షకులైనా లేదా సాధారణ జన సమూహాలైనాగాని ముస్లింలనే పట్టుకు చంపుతున్నారని మలక్‌పేట్ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా అన్నారు. ‘‘ మూకహత్యల పేరుతో ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఈ సంఘటనలు సూచిస్తు న్నాయి. వీటి వెనుక ఉన్నది హిందుత్వ శక్తులే’’ అని ఆయన ఆరోపించారు. కాని, మహ్మద్ ఆజం హత్యలో మతం పాత్ర లేదని బీదర్ ఘటన గురించి తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. దాడి సందర్భంలో 9మంది పోలీసులు ఆజంను, అతని స్నేహితులిద్ద రినీ రెండు వేల మందికిపైగా ఉన్న మూకనుంచి కాపాడటానికి గట్టి ప్రయత్నమే చేశారు. ఆల్వార్‌లో పోలీసులే ఏం చేసిందీ పైన చెప్పాను. ఆల్వార్ వంటి ఘటనలు పరిశీలిస్తే, బలాలా చెప్పింది మనకు ఇబ్బంది కలిగించే వాస్తవమని గుర్తించక తప్పదు.
హాపూర్‌లో జరిగిందే బీదర్‌లోనూ !
దాడికి గురైనవారిని ఎలా చూశారనే విషయానికి వస్తే హాపూర్ ఘటన బీదర్‌లో పునరావృతమైంది. బీదర్‌లో దుండగులు టెకీ ఆజం కుడి చేతికి తాడుకట్టి ముఖాన్ని నేల మీద ఈడ్చుకుంటూ పోయారు. ఆ సమయంలో మూకలు అతన్ని కొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఆజం కొన్ని నిమిషాల తర్వాత ఆస్పత్రికి తీసుకెళుతుండగా ప్రాణాలు విడిచాడు. జూన్ నెలలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్‌లో పశువుల వ్యాపారి ఖాసింను ఇదే తీరులో కొట్టి చంపారు. ప్రాణంపోయాక అతని మృత దేహాన్ని పోలీస్ జీపు దగ్గరికి జనం ఈడ్చుకుంటూ పోతుండగా, ముగ్గురు పోలీసులు వారితో పాటు నడిచారేగాని మరణించినవారి శరీరాలను పద్ధతిగా చూడాలనే స్పృహ వారిలో కలగలేదు.
మూకలు ఖాసింను ఆవును మాంసం కోసం చంపే వ్యక్తి అని ఆరోపించగా, బీదర్‌లో ఆజంను పిల్లలను తన కారులో అపహరించుకుపోతున్న దొంగగా ముద్రవే శారు. ఇండియాలో 2018లో నోటి మాటగా లేదా వాట్సాప్ సందేశం ద్వారా వ్యాప్తిచేసే అబద్ధాలు అరాచక మూకలు మనుషుల ప్రాణాలు తీయడానికి తోడ్పడుతున్నాయి. ఇలాంటి మూకహత్యలపై ప్రభు త్వాలు స్పందించే తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మూకహత్యల నివారణకు కొత్త చట్టం చేయాలని పార్లమెంటును సుప్రీంకోర్టు కోరినా ఈ దిశగా కేంద్రం ఓ కమిటీ వేయడం మినహా చేసిందేమీ లేదు. శాంతి, భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశ మని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.
జార్ఖండ్‌లోని రాంగఢ్‌లో ఓ ముస్లిం మాంసం వ్యాపా రిని కొట్టి చంపిన కేసులో దోషులుగా తేలిన ఏడుగురు హంతకులను కేంద్ర పౌరవిమానయాన మంత్రి జయంత్ సిన్హా సన్మానించారు. ‘ప్రధాని మోదీకి ప్రజాదరణ పెరగడం వల్లే ఇలాంటి మూక హత్యలు జరుగుతున్నాయని మరో కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ చెప్పడం మరీ దారుణం. ‘‘మోదీకి జనాదరణ పెరిగేకొద్దీ ఇలాంటి ఘటనలు జరుగుతాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవార్డులు వెనక్కి ఇచ్చేశారు. యూపీ ఎన్నికలప్పుడు మూకహత్యలు జరిగాయి. 2019 ఎన్నికల సమయంలో మరోటి మొదలవుతుంది’’ అని మేఘవాల్ వివరించారు. పథకం ప్రకారం చేసిన ఇలాంటి దారుణ హత్యలను ఎన్నికల పేరు చెప్పి ఈ బీజేపీ నేత సమర్ధించడం నిజంగా ఆందోళనకరం.
బీజేపీ, కాంగ్రెస్ ‘నువ్వంటే–నువ్వు’
ఈ ఘటనలపై పాలకపక్షమైన బీజేపీ ప్రతినిధులు స్పందిస్తూ, కాంగ్రెస్ పాలనలో జరిగిన ఇలాంటి దారుణాల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ‘‘1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచ కోత, అస్సాంలో 1983 నాటి నెల్లీ మూకుమ్మడి హత్యాకాండ, 1947 దేశ విభజనలో జరిగిన హిందూ, ముస్లింల ఊచకోతలు కాంగ్రెస్ పాలనలో జరిగినవే కదా’’ అంటే ఇప్పటి దారుణాలను సమ ర్థించుకుంటున్నారు. అయితే, ఇది బీజేపీ–కాంగ్రెస్ మధ్య వాదన లేదా మాటల యుద్ధం కాదనే విషయం ఈ రెండు పార్టీలు మరిచిపోతున్నాయి.
దేశ ప్రజలే రెండు వర్గాలుగా చీలిపోవడంతో జరుగు తున్న హత్యలివి. ఆవుల అక్రమ రవాణాదారు అనే ముద్రవేసి ప్రాణాలు తీసే క్రీడ ఇది. ఇలాంటి ఘట నలపై దర్యాప్తు చేసి, సత్యం ఏమిటో తేల్చాల్సిన వారు ఆ పనిలో విఫలమవుతున్నారు. కిందటేడాది ఏప్రిల్‌లో ఆల్వార్‌లోనే ఓ మూక చేతుల్లో మరణిం చిన పాల వ్యాపారి పెహ్లూ ఖాన్ ప్రాణాలు విడిచే ముందు తనపై దాడి చేసిన ఆరుగురి పేర్లు చెప్పాడు. కాని, వారిపై సాక్ష్యాధారాలు లేవని దీనిపై దర్యాప్తు జరిపిన సీఐడీ పోలీసులు ఆ ఆరుగురినీ విడిచి పెట్టారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి హత్యలు జరగడం మనం దిగులు పడాల్సిన విష యం. తీవ్ర ఆవేశంతోనో లేదా బాగా రెచ్చగొట్ట డంతోనే ఒక మనిషిని మరో మనిషి చంపడం సాధారణంగా జరుగుతుంది.
మూకలు ఇలాంటి అమానుష హత్యలకు పాల్పడుతున్నాయంటే అవి సంపాదించిన అడ్డగోలు ధైర్యమే ఇందుకు కారణం. ఆవులను చంపి మాంసం తినేవారికి సమాజంలో బతికే హక్కు లేదని మూకలకు నూరిపోసే పథకం ప్రకారం ఇలాంటి హత్యలకు మనుషులను సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారంతో కావాలని మామూలు వ్యక్తులను రాక్షసులుగా మార్చేస్తున్నారు. 15 ఏళ్ల జునేద్‌ఖాన్ కిందటేడాది జూన్‌లో ఇంట్లో ఈద్ జరుపుకోవడానికి తోబుట్టువులతో రైలులో హరియాణాలోని ఇంటికి వెళుతుండగా మూక చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు.
హంతకులు అతని సోదరుల గడ్డాలు పట్టుకుని ఎగతాళి చేయడమేగాక, వారిని ఆవు మాంసం తినే వ్యక్తులని ముద్రవేశారు. ఎన్నికలకు ముందు ఇలాంటి హింసా కాండ ఫలి తంగా ప్రజలు రెండు వర్గాలుగా చీలి పోవడాన్ని తమకు ప్రయోజనకరంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతాయనే భయం పీడిస్తోంది. వీటిని కేవలం ట్విట్టర్‌లో ఖండించడం వల్ల ప్రయోజనం లేదు. మహాత్మాగాంధీ ‘హింద్ స్వరాజ్’ అనే గ్రంథంలో ‘‘ ఆవుపై నా గుండె నిండా ఎంత జాలి ఉన్నా–దాని ప్రాణం కన్నా నా సోదరుడిని కాపాడటానికే నా ప్రాణ త్యాగం చేస్తాను’’ అని రాసిన మాటలు ఈ సందర్భంగా మనకు గుర్తుకొస్తే మంచిది. ఇదే మనం ఆచరించాల్సిన నియమం కావాలి. కానీ, 2018లో ఈ మాటలు ఎవరికీ వినిపించవు, కనిపించవు.
- టీఎస్ సుధీర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
ఈ–మెయిల్ : tssmedia10@gmail.com
Comments
Please login to add a commentAdd a comment