lynched
-
అతికిరాతకంగా YSRCP కార్యకర్త హత్య
అన్నమయ్య, సాక్షి: ఎన్నికల కౌంటింగ్ ముందు హత్యారాజకీయాలతో ఏపీలో అలజడులు సృష్టించాలనే ప్రయత్నాలు మొదలయ్యాయా?. అన్నమయ్య జిల్లాలో తాజాగా జరిగిన ఘాతుకం అవుననే సంకేతాలిస్తోంది. మదనపల్లి శ్రీవారినగర్‌లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. మృతుడ్ని పుంగనూరు శేషాద్రిగా పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుఝామున శేషాద్రి ఇంట్లోకి చొరబడిన 30 మంది దుండగులు అతికిరాతకంగా నరికి చంపి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రక్తపు మడుగులో పడి ఉన్న శేషాద్రి మృతదేహాన్ని స్వాధీన పర్చుకున్నారు. శేషాద్రి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 70సార్లు నరికి.. శనివారం వేకువ ఝామున శేషాద్రి ఇంటి తలుపులు బద్ధలు కొట్టిన దుండగులు.. ఆయన భార్య కళ్ల ముందే అతి దారుణంగా వేట కొడవళ్లతో నరికి చంపారు. కాళ్ల మీద పడి చంపొద్దని వేడుకున్నా.. ఆ కిరాతకులు కనికరించలేదు. జిల్లా ఆస్పత్రిలో శేషాద్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు.. శరీరంపై కత్తిపోట్లు చూసి విస్తూపోయారు. సుమారు 70 కత్తి పోట్లు ఉన్నాయని వైద్యులు తెలిపినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. దుండగులు భూ దందాల ముఠా సభ్యులై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
అనుమానంతో ఓ వ్యక్తిపై 10 మంది దాడి..మృతి
ముంబై: పిల్లలను అపహరిస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు థానేలోని వాగ్లే ఎస్టేట్ ప్రాంతానికి చెందిన అయిదుగురిని ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..రామవ్తార్ ధోబీ అనే వ్యక్తి తన కూతురిని అపహరించడానికి ప్రయత్నిస్తున్నాడనే అనుమానంతో ఆమె తండ్రి అతడిని వెంబడించాడు. తర్వాత ఓ పదిమంది కలిసి అతడిపై దాడి చేయడంతో ధోబీ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. అయితే వీరిలో అరెస్ట్ అయిన నిందితులను అతిక్ ఖాన్, మొహసిన్ షేక్, అఫ్సర్ వస్తా, హరీష్ సోలంకి, మహ్మద్ అన్సారీలుగా గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన మిగితా నిందితులను పట్టుకోవడాకి వేట కొనసాగుతోందని తెలిపారు. వీరిపై భారత శిక్షాస్మృతి, మహారాష్ట్ర పోలీసు చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు వెల్లడించారు. (చదవండి: భారతీయ అమెరికన్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష) -
పోలీసు కోసం జనం పోరాటం!
ముంబై: సాధారణంగా పోలీసులకు, ప్రజలకు మధ్య అంత సత్సబంధాలు ఉండవు. సినిమాలో మాత్రమే నిజాయితీ గల పోలీసు ఆఫీసర్‌కు ఏదైన జరిగితే జనం పోరాడటం చూస్తూ ఉంటాం. అయితే అలాంటి ఘటన ఒకటి మహారాష్ట్రలోని పాల్ఘర్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే... నిజాయితీగా పనిచేస్తున్న పాల్ఘర్ జిల్లా ఎస్పీని మహారాష్ట్ర హోం మినిస్టర్ అనిల్ దేశ్ ముఖ్ సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అయితే ఆయనను వెనక్కి తీసుకురావాలంటూ పాల్ఘర్ గ్రామస్థులు ఆన్లైన్లో క్యాంపెయిన్ నిర్వహిస్తూ సంతకాలు స్వీకరిస్తోన్నారు. పాల్ఘర్ మూక దాడులకు సంబంధించి ఎస్పీ గౌరవ్ సింగ్‌ని 5 రోజుల క్రితం అత్యవసర సెలవు తీసుకొని వెళ్లాల్సిందిగా మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అయితే గౌరవ్ వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఇసుక మాఫీయా, గుట్కా, లిక్కర్ మాఫియాని అన్నింటిని అరికట్టారని పాల్ఘర్ ప్రజలు తెలిపారు. ఆయన వచ్చినప్పటి నుంచే ప్రజలకు, పోలీసులకు మధ్య మంచి బంధం ఏర్పడిందని చెప్పారు. గౌరవ్ వారందరి ఆస్తి అని, ఆయన సూపర్ కాప్ అని పేర్కొన్నారు. (ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ ఛాన్స్!) అయితే పాల్ఘర్లో మూకదాడి జరిగిన వెంటనే ప్రభుత్వం అయనను వెంటనే మే 8 తేదీన సెలవు మీద పంపించేసింది. ఆయనను మళ్లీ వెనక్కి రప్పించడానికి సుజిత్‌సింగ్, సామాజిక కార్యకర్త కరణ్ చౌదరి ఆధ్వర్యలో ఒక ఆన్లైన్ క్యాంపెయిన్‌ను నడిపిస్తూ సంతకాలు కూడా స్వీకరిస్తోన్నారు. ఇప్పటి వరకు 350 మంది దీని మీద సంతకాలు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాఖ్రేకి గౌరవ్‌సింగ్‌ని వెనక్కి తీసుకురావాలంటూ విజ్ఞప్తి చేస్తోన్నారు. పాల్ఘర్ మూకదాడులలో ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు కేసుకు సంబంధించి రాష్ట్ర క్రిమినల్ ఇన్వేస్టిమెంట్ డిపార్ట్మెంట్ 12 మందిని అరెస్ట్ చేసింది. వారిలో ఒక మైనర్ కూడా ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన నిందితుల సంఖ్య 146 కి చేరింది. (సుప్రీంలో తొలిసారి ఏకసభ్య ధర్మాసనాలు) -
‘అసమ్మతి లేని ప్రజాస్వామ్యం ఉండదు’
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా దళితులు, మైనారిటీలపై హింసాత్మక ఘటనలు పెచ్చు మీరుతున్న నేపథ్యంలో.. ఈ ఘటనలను ఖండిస్తూ వివిధ రంగాల ప్రముఖులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సినిమా సెలబ్రిటీలు అదూర్ గోపాలకృష్ణ, మణిరత్నం, అనురాగ్ కశ్యప్‌లు, అపర్ణ సేన్, కొంకణా సేన్ శర్మలతో పాటు మొత్తం 49 మంది ప్రముఖులు ఈ లేఖపై సంతకం చేశారు. ‘అధిక వర్గాలకు జై శ్రీరాం పవిత్రమైనది.. దానిని అపవిత్రం చేయడం మనేయండి. దళితులు, క్రైస్తవులు, ముస్లింలపై జరుగుతున్న అమానుష ఘటనలను, ఊచకోతలను వెంటనే అరికట్టాలి. 2016లో ఇలాంటి ఘటనలు దాదాపు 840 కేసులు నమోదయిన విషయాన్ని నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) ద్వారా తెలిసి మేము అశ్చర్యపోయాము. జై శ్రీరాం నినాదం ఇప్పుడు దేశంలో హింసాత్మకంగా మారింది. ఈ దీన స్థితికి మేము చింతిస్తున్నాము’ అని ’ అని లేఖలో పేర్కొన్నారు. ‘దళితులు, ముస్లింల జరుగుతున్న ఊచకోతపై మీరు పార్లమెంటులో స్పందించిన విషయం తెలుసు గానీ.. వాటిని ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి’ అని ప్రధాని మోదీని కోరారు. కాగా చారిత్రకవేత్త రామచంద్ర గుహ, సామాజిక వేత్తలు డాక్టర్ బినాయక్ సేన్, ఆశిష్ నంద్యా కూడా లేఖపై సంతకాలు చేశారు. ‘అసమ్మతి లేని ప్రజాస్వామ్యం ఉండదు. అలాగని ప్రజలను దేశ వ్యతిరేకులుగా, అర్బన్ నక్సల్‌గా ముద్ర వేయకూడదని, అసమ్మతిని కారణంగా చూపి ప్రజలకే శిక్షలు వేయకూడదని వీరంతా లేఖలో పేర్కొన్నారు. -
అతడి భార్యకు 5 లక్షల నష్ట పరిహారం
రాంచి : జార్ఖండ్ మూకదాడిలో మృతి చెందిన తబ్రేజ్ అన్సారీ కుంటుబానికి రూ. 5 లక్షల నష్ట పరిహారం అందజేస్తామని ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ గురువారం ప్రకటించారు. మృతుడి భార్యకు ఈ మొత్తాన్ని ఇస్తామన్నారు. తబ్రేజ్ అన్సారీ భార్యకు ఢిల్లీ వక్ఫ్ బోర్డులో ఉద్యోగంతో పాటు న్యాయ సహాయం అందించనున్నట్టు తెలిపారు. గతవారం జార్ఖండ్‌లోని సెరైకేలా ఖర్సావన్ జిల్లాలో తబ్రేజ్ అన్సారీని దొంగగా భావించి కొంతమంది అతన్ని స్తంభానికి కట్టేసి కర్రలతో చితకబాదుతూ మూకదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జై శ్రీరామ్’, ‘జై హనుమాన్’ నినాదాలు చేయాలంటూ తబ్రేజ్‌పై అల్లరి మూక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం రాజ్యసభలో స్పందించారు. ఈ మూకదాడి తనను బాధించిందన్నారు. దాడి చేసిన నేరస్తులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రతిపక్షాలు ఈ ఘటనను ఆసరాగా తీసుకొని జార్ఖండ్ ‘మూకదాడులకు నిలయం’ అంటూ విమర్శించడం సరికాదన్నారు. జార్ఖండ్ రాష్ట్రాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. ఈ ఘటనలో 11 మందిని అరెస్టు చేసి దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశారు. -
‘ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మా ఓటు’
సాక్షి, న్యూఢిల్లీ : ‘మేము ఓటర్లలో సగం. దేశంలో పెరిగిపోతున్న మూక హత్యలకు వ్యతిరేకంగా మేము ఈ సారి ఓటు వేస్తాం. పట్టపగలు, పలువురు చూస్తుండగా ఈ హత్యలు జరుగుతుండడం దారణం. మా రాజ్యాంగ హక్కులు హరించుకుపోయాయి. మా భావప్రకటనా స్వేచ్ఛను అణచి వేస్తున్నారు’ అని 58 ఏళ్ల మంజూ శర్మ వ్యాఖ్యానించారు. ఆమె ఓ సామాజిక కార్యకర్త. గురువారం నాడు ఢిల్లీ మండి హౌజ్ నుంచి జంతర్ మంతర్‌కు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మహిళల్లో ఆమె ఒకరు. మహిళలు, ట్రాన్స్జెండర్లు, రైతులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, కళాకారులకు సంబంధించిన పలు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన ఈ ర్యాలీలో కొన్ని వందల మంది మహిళలు పాల్గొన్నారు. వీరంతా ఒక్క ఢిల్లీ నుంచే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, అజ్మీర్, చెన్నై, అహ్మదాబాద్ నగరాల నుంచి కూడా వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ మహిళలకు పిలుపు ఇవ్వడంలో భాగంగానే ఈ ర్యాలీ జరిగిందని ర్యాలీలో పాల్గొన్న సామాజిక కార్యకర్త షబ్నమ్ హష్మీ తెలిపారు. పెద్దనోట్ల రద్దు కారణంగా దేశంలో ఎంతో మంది మహిళలు ఉద్యోగాలను కోల్పోయారని ఆమె చెప్పారు. పితృస్వామిక వ్యవస్థ, ఫాసిజం, కులతత్వం నశించాలంటూ ర్యాలీలో పాల్గొన్న పలువురు మహిళలు నినదించారు. సోమాసేన్, సుధా భరద్వాజ్ అనే సామాజిక కార్యకర్తలను విడుదల చేయాలంటూ కూడా వారు ప్లే కార్డులను ప్రదర్శించారు. పుణెకు సమీపంలోని భీమా కోరెగావ్‌లో సమావేశంలో పాల్గొన్న తొమ్మిది మందితోపాటు ఈ ఇరువురిని జూన్ నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజు జరిగిన విధ్వంసకాండకు ఆ సమావేశమే కారణం అంటూ వారిపై కేసులు నమోదు చేశారు. దేశంలో విద్వేష రాజకీయాలు పెరిగిపోయి విధ్వంసం, హింసాత్మక సంఘటనలు పెరిగిపోయాయని, మహిళలకు భద్రత కరవైందని, మరోపక్క నిరుద్యోగం పెరిగిపోయిందని, ఈ ఎన్నికల్లో ప్రధానాంశం నిరుద్యోగమేనని 50 ఏళ్ల అఫ్రోజ్ గుల్జార్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మహిళ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నట్లు ర్యాలీలో పాల్గొన్న పలువురు మహిళలు ఆరోపించారు. -
మోదీ పాలనలో గోరక్షణ హత్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో మూక హత్యలు ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా గోరక్షణ పేరిట, గోవులను హత్య చేశారనో, గోవులను అక్రమంగా తరలిస్తున్నారనో దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లరి మూకలు ఈ హత్యలకు పాల్పడ్డాయి. వీటిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాలకపక్ష బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు కొన్ని సామాజిక బృందాలు కూడా సమర్థించాయి. ఈ హత్యలను ప్రోత్సహించడంలో సామాజిక మీడియా ప్రధాన పాత్ర పోషించింది. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి అనే చిన్న పట్టణంలో 2015. సెప్టెంబర్ 28వ తేదీన తొలి మూక హత్య జరిగింది. మొహమ్మద్ అఖ్లాక్ ఇంట్లో లేగదూడను హత్య చేశారనే వార్త ప్రచారం కావడంతో స్థానిక గుడి వద్ద ఓ సామాజిక వర్గానికి చెందిన యువకులు సమావేశమయ్యారు. వారంతా వెళ్లి అఖ్లాక్ ఇంటిపై దాడి జరిపారు. ఆ ఇంటి ఫ్రిజ్‌లో భద్రపర్చిన మాంసాన్ని అవు మాంసంగా అనుమానించారు. అది మేక మాంసం అంటూ ఇంట్లోని ఆడవాళ్లు చెబుతున్న వినకుండా అఖ్లాక్, ఆయన కుమారుడు డానిష్‌ను చితకబాదారు. ఆ దాడిలో అఖ్లాక్ చనిపోగా, తీవ్రంగా గాయపడిన డానిష్‌కు ఏడాది తర్వాత మెదడుకు ఆపరేషన్ జరిగింది. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడైన రవి సిసోడియా ఏడాది తర్వాత మూత్రపిండాల వ్యాధితో చనిపోయారు. అప్పుడు కేంద్ర మంత్రి మహేశ్ శర్మ, రవి సిసోడియా భౌతిక దేహాన్ని సందర్శించి, ముఖిలిత హస్తాలతో నివాళి అర్పించడంతోపాటు దేశం కోసం మరణించిన వీరుడిలా ఆయన భౌతికకాయంపై జాతీయ జెండాను కప్పి గౌరవించారు. అంతకుముందు ఇదే మంత్రి దాద్రి సంఘటనను ఓ ‘యాక్సిడెంట్’గా అభివర్ణించారు. ఈ కేసులో అరెస్టయిన వారంతా ప్రస్తుతం బెయిల్‌పై బయటే ఉన్నారు. ఏ ఒక్కరికి శిక్ష పడలేదు. మొహమ్మద్ అఖ్లాక్ కుటుంబీకుల ఆక్రందన 2016, మార్చి నెలలో జార్ఖండ్‌లో పశువుల వ్యాపారులంటూ ఇద్దరిని కొట్టి చంపి, వారి శవాలను ఓ చెట్టుకు వేలాడదీశారు. 2016, జూలైలో గుజరాత్‌లోని ఉనాలో చనిపోయిన ఆవుల చర్మాలను ఒలుస్తున్న నలుగురు దళితులను గోరక్షకులు పట్టుకొని చితకబాదారు. వారే దళితులను చితకబాదుతున్న దృశ్యాలను వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2017లో రాజస్థాన్ పాల వ్యాపారి పెహ్లూ ఖాన్ ఆరుగురు చితక్కొట్టి వీడియోతీసి సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేశారు. పెహ్లూ ఖాన్ తన మరణ వాంగ్మూలంలో ఆరుగురు నిందితుల పేర్లను వెల్లడించినప్పటికీ పోలీసులు వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. 2018లో కూడా ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌లో గోరక్షణ పేరిట ఓ మూక హత్య జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టింది. పిల్లల దొంగల పేరిట మూక హత్యలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన దొంగలు పిల్లల్ని ఎత్తుకు పోతున్నారంటూ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన వదంతుల వల్ల కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో మూక హత్యలు జరిగాయి. పశ్చిమ బెంగాల్లో 14 ఏళ్ల బాలికను ఎత్తుకుపోయారన్న వార్తతో 2017, జూన్ 27వ తేదీన మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ యువతిని కొట్టి చంపారు. 2018, జూన్ నెలలో అస్సాంలో పిల్లల దొంగలన్న అనుమానంతో ఇద్దరు యువకులను కొట్టి చంపారు. బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చిన హిందీ మాట్లాడే దొంగలు పిల్లలను ఎత్తుకుపోతున్నారనే ప్రచారం జరగడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు దాడులు జరిగాయి. రెండు నెలల తర్వాత మహారాష్ట్రలో సంచార తెగకు చెందిన నలుగురు యువకులను కొట్టి చంపారు. 117 గోరక్షణ దాడులు 2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేశంలో గోరక్షణ పేరిట 117 దాడులు జరిగాయని ‘ఇండియా స్పెండ్’ గణాంకాలు తెలియజేస్తుండగా, ఇదే కాలంలో జరిగిన మూక హత్యల్లో 88 మంది మరణించారని ‘క్వింట్’ లెక్కలు చెబుతున్నాయి. గోరక్షణ చర్యలు, దాడుల వల్ల ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. ముఖ్యంగా ఇతర దేశాలకు గోమాంసం, చర్మాల ఎగుమతి నిలిచిపోయింది. కొనేవారులేక ముసలి, ముతక గోవులను వదిలేస్తే అవి రైతుల పొలాలను మేస్తున్నాయి. దూరంగా వదిలేస్తే అధికారులు వచ్చి రైతులపై ‘కల్పబుల్ హోమిసైడ్’గా పోలీసులు కేసులు పెడుతున్నారు. ఈ సంఘటనలపై 2017లో మొదటిసారి నోరు విప్పిన ప్రధాని నరేంద్ర మోదీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. -
పనికోసం వెళితే దొంగ అనుకుని..
లక్నో : యూపీలో దారుణం చోటుచేసుకుంది. దొంగ అనే అనుమానంతో ముజఫర్‌నగర్‌లోని బీజోపూర్‌లో కపిల్ త్యాగి అనే వ్యక్తిని స్ధానికులు చితకబాదడంతో మరణించాడు. పోస్ట్‌మార్టం నివేదికలో బాధితుడి శరీరంపై 11 గాయాలున్నట్టు గుర్తించామని చాపర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుభాష్ రాధోడ్ తెలిపారు. బాధితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని, ఈ ఘటనపై దర్యాప్తుం చేస్తున్నామని చెప్పారు. త్యాగిని చావబాదిన దుండగుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారికోసం గాలిస్తున్నామని చెప్పారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. త్యాగి అమాయకుడని, పని కోసం బీజోపూర్ వెళ్లగా స్ధానికులు అతడిని చితకబాదారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. -
మూకహత్యలకు రాజకీయాలే దన్ను
హాపూర్, ధూలే, మాల్డా, పులికాట్, హజారీబాగ్. దేశంలోని ఈ పట్టణాల పర్యటన కోసం వాటి పేర్లు ఇక్కడ రాయడం లేదు. నవ భారతంలో ప్రజలు సిగ్గుపడే ఘటనలు అంటే మూకహత్యలు ఈ ఊళ్లలో జరిగాయి. హిందూస్తాన్ లోని పట్టణాలు ఇలాంటి హత్యలకు అనువైన ప్రదే శాలుగా మారిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో పశువుల వ్యాపారి రక్బర్ ఖాన్ మూకల దాడిలో మర ణించాడు. 2010 నుంచీ దేశంలో మొదలైన మూక హత్యల్లో ఇది 87వది. అడ్డూఅదుపూ లేని మూకల దాడుల్లో ఇప్పటి వరకూ జరిగిన దాడుల్లో 34 మంది ప్రాణాలు కోల్పోగా, 240 మంది గాయపడ్డారు. 2014 మేలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి నప్పటి నుంచీ 98 శాతం మూకహత్యలు జరిగాయి. ఇలాంటి సంఘటనల్లో 56 శాతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంభవించాయి. ఇలాంటి నేరాలను ఎప్పటి కప్పుడు నమోదు చేసి వివరాలు సేకరించే ఇండియా స్పెండ్ అనే వెబ్సైట్ ఈ విషయాలు వెల్లడించింది. చావులతో కూడా ఈ లెక్కలను గణాంకాల సేకర ణకు ఇవ్వడం లేదు. వివక్షతో విచ్చలవిడిగా ప్రవ ర్తించే మూకలు బలోపేతమౌతూ దేశాన్ని మధ్య యుగాల భారతదేశంగా మార్చుతున్నాయనే వాస్త వాన్ని ఇవి సూచిస్తున్నాయి. మత విద్వేషాలు పెరగ డంతోపాటు చట్టాన్ని అమలు చేయాల్సిన భారత ప్రభుత్వ వ్యవస్థలు అరాచక శక్తులతో రాజీపడటం వల్ల మనుషులు ఆదిమానవులుగా మారుతున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేప థ్యంలో ఈ హత్యలు ప్రారంభం మాత్రమేనని నేను భావిస్తున్నాను. ‘జనం గొడ్డు మాంసం తినడం మానేస్తే మూకహత్యలు ఆగిపోతాయ’ని ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ మాటలు ఈ విషయాన్నే నొక్కి చెబుతున్నాయి. ఇదే పద్ధతిలో మాట్లాడే హైదరాబా ద్‌కు చెందిన బీజేపీ ఎమ్యెల్యే టి. రాజా సింగ్ ‘మొదట గో హత్యల గురించి ఎందుకు ప్రశ్నిం చరు?’ అంటూ రెచ్చగొడుతున్నారు. ఆయన తన పోకడలను వ్యతిరేకించే వారికి ఇలా హెచ్చరిస్తున్నా రనే విషయం మనం మర్చిపోకూడదు. మూకహత్య నిందితులకు ఎమ్మెల్యే మద్దతు! స్థానిక ఎమ్మెల్యే మద్దతు తమకుందని రాజస్తాన్‌లోని ఆల్వార్ మూకహత్య కేసులో నిందితులు ప్రకటిం చుకున్నారని వార్తలొచ్చాయి. ఇలాంటి దుర్మార్గాలకు కేవలం రాజకీయ నేతలేగాక ప్రభుత్వ ఉన్నతాధికా రులు కూడా కారణమౌతున్నారు. ఫలితంగా, దేశం లోని అనేక ప్రాంతాల్లో మత విద్వేషాలతో నిండిపో తున్నాయి. హిందువులు కాని ఇతర మతాల ప్రజల రోజులు దగ్గరపడ్డాయనే ధోరణి ప్రబలిపోతోంది. ఆవుల రవాణా మూకహత్యలకు దారితీసే సంద ర్భాల్లో ఎలాంటి నాగరిక దేశంలోనైనా మొదట పశు వులను గోశాలలకు తరలించడాని కన్నా దాడిలో గాయపడిన మనుషులను ఆస్పత్రికి తరలించడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఆల్వార్ పోలీసులు ఇదే పని చేయడమేగాక, పొరపాటు జరిగిందని చెప్పారు. పశువుల వ్యాపారి పేరు రక్బర్ఖాన్ కావడమే అతని హత్యకు కారణమా? సమాజంలో వర్గ విద్వేషాలు ఉన్నప్పుడు వాటిని వివరంగా వెల్లడించాల్సిన బాధ్యత జర్నలిస్టులకు లేదు. అయితే, ఈ రకమైన ఊచకోతలు ఓ పథకం ప్రకారం జరుగుతున్నట్టు కనిపిస్తే మీడియా వాటి గుట్టు విప్పాల్సిన అవసరం తప్పక ఉంటుంది. ఈ మూక హత్యల్లో మతపరమైన అంశం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, ఇలాంటి దాడు లకు గురైన వారిలో 56 శాతం, బాధితుల్లో 88 శాతం ముస్లింలేనని ఇండియా స్పెండ్ సంస్థ వెల్లడించింది. ఈ నెలలోనే ఉత్తర కర్ణాటకలోని బీదర్‌లో హైదరా బాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహ్మద్ ఆజంను పిల్లలను ఎత్తుకుపోయే వ్యక్తిగా అనుమానించి అప్ప టికప్పుడు గుమిగూడిన జనం కొట్టి చంపారు. ఇలాంటి మూకల దాడుల్లో గోసంరక్షకులైనా లేదా సాధారణ జన సమూహాలైనాగాని ముస్లింలనే పట్టుకు చంపుతున్నారని మలక్‌పేట్ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా అన్నారు. ‘‘ మూకహత్యల పేరుతో ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఈ సంఘటనలు సూచిస్తు న్నాయి. వీటి వెనుక ఉన్నది హిందుత్వ శక్తులే’’ అని ఆయన ఆరోపించారు. కాని, మహ్మద్ ఆజం హత్యలో మతం పాత్ర లేదని బీదర్ ఘటన గురించి తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. దాడి సందర్భంలో 9మంది పోలీసులు ఆజంను, అతని స్నేహితులిద్ద రినీ రెండు వేల మందికిపైగా ఉన్న మూకనుంచి కాపాడటానికి గట్టి ప్రయత్నమే చేశారు. ఆల్వార్‌లో పోలీసులే ఏం చేసిందీ పైన చెప్పాను. ఆల్వార్ వంటి ఘటనలు పరిశీలిస్తే, బలాలా చెప్పింది మనకు ఇబ్బంది కలిగించే వాస్తవమని గుర్తించక తప్పదు. హాపూర్‌లో జరిగిందే బీదర్‌లోనూ ! దాడికి గురైనవారిని ఎలా చూశారనే విషయానికి వస్తే హాపూర్ ఘటన బీదర్‌లో పునరావృతమైంది. బీదర్‌లో దుండగులు టెకీ ఆజం కుడి చేతికి తాడుకట్టి ముఖాన్ని నేల మీద ఈడ్చుకుంటూ పోయారు. ఆ సమయంలో మూకలు అతన్ని కొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఆజం కొన్ని నిమిషాల తర్వాత ఆస్పత్రికి తీసుకెళుతుండగా ప్రాణాలు విడిచాడు. జూన్ నెలలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్‌లో పశువుల వ్యాపారి ఖాసింను ఇదే తీరులో కొట్టి చంపారు. ప్రాణంపోయాక అతని మృత దేహాన్ని పోలీస్ జీపు దగ్గరికి జనం ఈడ్చుకుంటూ పోతుండగా, ముగ్గురు పోలీసులు వారితో పాటు నడిచారేగాని మరణించినవారి శరీరాలను పద్ధతిగా చూడాలనే స్పృహ వారిలో కలగలేదు. మూకలు ఖాసింను ఆవును మాంసం కోసం చంపే వ్యక్తి అని ఆరోపించగా, బీదర్‌లో ఆజంను పిల్లలను తన కారులో అపహరించుకుపోతున్న దొంగగా ముద్రవే శారు. ఇండియాలో 2018లో నోటి మాటగా లేదా వాట్సాప్ సందేశం ద్వారా వ్యాప్తిచేసే అబద్ధాలు అరాచక మూకలు మనుషుల ప్రాణాలు తీయడానికి తోడ్పడుతున్నాయి. ఇలాంటి మూకహత్యలపై ప్రభు త్వాలు స్పందించే తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మూకహత్యల నివారణకు కొత్త చట్టం చేయాలని పార్లమెంటును సుప్రీంకోర్టు కోరినా ఈ దిశగా కేంద్రం ఓ కమిటీ వేయడం మినహా చేసిందేమీ లేదు. శాంతి, భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశ మని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. జార్ఖండ్‌లోని రాంగఢ్‌లో ఓ ముస్లిం మాంసం వ్యాపా రిని కొట్టి చంపిన కేసులో దోషులుగా తేలిన ఏడుగురు హంతకులను కేంద్ర పౌరవిమానయాన మంత్రి జయంత్ సిన్హా సన్మానించారు. ‘ప్రధాని మోదీకి ప్రజాదరణ పెరగడం వల్లే ఇలాంటి మూక హత్యలు జరుగుతున్నాయని మరో కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ చెప్పడం మరీ దారుణం. ‘‘మోదీకి జనాదరణ పెరిగేకొద్దీ ఇలాంటి ఘటనలు జరుగుతాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవార్డులు వెనక్కి ఇచ్చేశారు. యూపీ ఎన్నికలప్పుడు మూకహత్యలు జరిగాయి. 2019 ఎన్నికల సమయంలో మరోటి మొదలవుతుంది’’ అని మేఘవాల్ వివరించారు. పథకం ప్రకారం చేసిన ఇలాంటి దారుణ హత్యలను ఎన్నికల పేరు చెప్పి ఈ బీజేపీ నేత సమర్ధించడం నిజంగా ఆందోళనకరం. బీజేపీ, కాంగ్రెస్ ‘నువ్వంటే–నువ్వు’ ఈ ఘటనలపై పాలకపక్షమైన బీజేపీ ప్రతినిధులు స్పందిస్తూ, కాంగ్రెస్ పాలనలో జరిగిన ఇలాంటి దారుణాల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ‘‘1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచ కోత, అస్సాంలో 1983 నాటి నెల్లీ మూకుమ్మడి హత్యాకాండ, 1947 దేశ విభజనలో జరిగిన హిందూ, ముస్లింల ఊచకోతలు కాంగ్రెస్ పాలనలో జరిగినవే కదా’’ అంటే ఇప్పటి దారుణాలను సమ ర్థించుకుంటున్నారు. అయితే, ఇది బీజేపీ–కాంగ్రెస్ మధ్య వాదన లేదా మాటల యుద్ధం కాదనే విషయం ఈ రెండు పార్టీలు మరిచిపోతున్నాయి. దేశ ప్రజలే రెండు వర్గాలుగా చీలిపోవడంతో జరుగు తున్న హత్యలివి. ఆవుల అక్రమ రవాణాదారు అనే ముద్రవేసి ప్రాణాలు తీసే క్రీడ ఇది. ఇలాంటి ఘట నలపై దర్యాప్తు చేసి, సత్యం ఏమిటో తేల్చాల్సిన వారు ఆ పనిలో విఫలమవుతున్నారు. కిందటేడాది ఏప్రిల్‌లో ఆల్వార్లోనే ఓ మూక చేతుల్లో మరణిం చిన పాల వ్యాపారి పెహ్లూ ఖాన్ ప్రాణాలు విడిచే ముందు తనపై దాడి చేసిన ఆరుగురి పేర్లు చెప్పాడు. కాని, వారిపై సాక్ష్యాధారాలు లేవని దీనిపై దర్యాప్తు జరిపిన సీఐడీ పోలీసులు ఆ ఆరుగురినీ విడిచి పెట్టారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి హత్యలు జరగడం మనం దిగులు పడాల్సిన విష యం. తీవ్ర ఆవేశంతోనో లేదా బాగా రెచ్చగొట్ట డంతోనే ఒక మనిషిని మరో మనిషి చంపడం సాధారణంగా జరుగుతుంది. మూకలు ఇలాంటి అమానుష హత్యలకు పాల్పడుతున్నాయంటే అవి సంపాదించిన అడ్డగోలు ధైర్యమే ఇందుకు కారణం. ఆవులను చంపి మాంసం తినేవారికి సమాజంలో బతికే హక్కు లేదని మూకలకు నూరిపోసే పథకం ప్రకారం ఇలాంటి హత్యలకు మనుషులను సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారంతో కావాలని మామూలు వ్యక్తులను రాక్షసులుగా మార్చేస్తున్నారు. 15 ఏళ్ల జునేద్ఖాన్ కిందటేడాది జూన్‌లో ఇంట్లో ఈద్ జరుపుకోవడానికి తోబుట్టువులతో రైలులో హరియాణాలోని ఇంటికి వెళుతుండగా మూక చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు. హంతకులు అతని సోదరుల గడ్డాలు పట్టుకుని ఎగతాళి చేయడమేగాక, వారిని ఆవు మాంసం తినే వ్యక్తులని ముద్రవేశారు. ఎన్నికలకు ముందు ఇలాంటి హింసా కాండ ఫలి తంగా ప్రజలు రెండు వర్గాలుగా చీలి పోవడాన్ని తమకు ప్రయోజనకరంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతాయనే భయం పీడిస్తోంది. వీటిని కేవలం ట్విట్టర్లో ఖండించడం వల్ల ప్రయోజనం లేదు. మహాత్మాగాంధీ ‘హింద్ స్వరాజ్’ అనే గ్రంథంలో ‘‘ ఆవుపై నా గుండె నిండా ఎంత జాలి ఉన్నా–దాని ప్రాణం కన్నా నా సోదరుడిని కాపాడటానికే నా ప్రాణ త్యాగం చేస్తాను’’ అని రాసిన మాటలు ఈ సందర్భంగా మనకు గుర్తుకొస్తే మంచిది. ఇదే మనం ఆచరించాల్సిన నియమం కావాలి. కానీ, 2018లో ఈ మాటలు ఎవరికీ వినిపించవు, కనిపించవు. - టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
రాజస్తాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్ : అల్వార్ మూక హత్యపై దుమారం రేగిన నేపథ్యంలో రాజస్తాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవులకు సంబంధించిన వ్యాపారాన్ని ముస్లింలు నిలిపివేయాలని సూచించారు. హిందువుల మనోభావాలను అర్థం చేసుకుని ముస్లింలు ఆవుల స్మగ్లింగ్‌ను ఆపాలని మంత్రి జస్వంత్ యాదవ్ కోరారు. వారు ఈ వ్యాపారాన్ని తక్షణం విరమించాలని అన్నారు. రక్బర్ ఖాన్ మూక హత్యను మంత్రి ఖండిస్తూ దుండగులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. హర్యానాలోని తమ గ్రామానికి ఆవులను తీసుకువెళుతున్న రక్బర్ ఖాన్, అస్లాంలపై రాజస్తాన్‌లోని అల్వార్‌కు సమీపంలోని అటవీ ప్రాంతంలో కొందరు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అస్లాం ప్రాణాలతో బయటపడగా, రక్బర్ ఖాన్ మూక చేతిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. మూక హత్య కేసులో పోలీసులు ఇప్పటివరకూ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా సకాలంలో పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించిఉంటే ప్రాణాలు కాపాడేవారని రాజస్తాన్ హోంమంత్రి జీసీ కటారియా వ్యాఖ్యానించారు. గోవులను గోశాలకు తరలించడంపై పోలీసులు దృష్టిసారించడంతో బాధితుడిని ఆస్పత్రికి తీసుకువెళ్లడంలో జాప్యం జరిగిందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. -
మనిషా, పశువా లేదా పశువా, మనిషా!
జైపూర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల వ్యాపారి పెహ్లూ ఖాన్ మూక హత్య జరిగి ఏడాది గడిచిందో లేదో రాజస్థాన్‌లోని అదే అల్వార్ జిల్లాలో శనివారం నాడు మరో మూక హత్య చోటు చేసుకుంది. అల్వార్ జిల్లా లాల్వండి గ్రామంలో రక్బర్ ఖాన్, ఆయన మిత్రుడు అస్లాంలు కలిసి రెండు ఆవులను, వాటి దూడలను తోలుకొని వెళుతుండగా వారిపై సాయుధులైన గోరక్షకులు దాడి జరిపారు. తమపై అనుమానాలుంటే పోలీసులకు పట్టించి విచారించాల్సిందిగా వేడుకున్న వినకుండా తీవ్రంగా కొట్టారని అదే దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అస్లాం తెలిపారు. దేశంలో కొనసాగుతున్న మూక హత్యలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని నివారించడం కోసం పార్లమెంట్ ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకరావాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం మరింత విచారకరం. మూక హత్యలు జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుల పహారాను పెంచాల్సిందిగా సుప్రీం కోర్టు చేసిన సూచనలను కూడా ఇక్కడ పట్టించుకోక పోవడం రాజస్థాన్ ప్రభుత్వం వైఫల్యం. ఇక శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసు వ్యవస్థ మరీ దారుణంగా ఉంది. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రక్బర్ ఖాన్‌ను అస్పత్రికి తీసుకెళ్లడానికి పోలీసులకు నాలుగున్నర గంటలు పట్టిందంటే వారి అలసత్వం అర్థమవుతూనే ఉంది. ముందుగా స్వాధీనం చేసుకున్న గోవులను గోరక్షణ శాలకు తరలించడంపై దృష్టి పెట్టిన పోలీసులు గాయపడిన ఖాన్‌ను పట్టించుకోకపోగా, మార్గమధ్యంలో తీరిగ్గా టీ తాగి మరీ ఆస్పత్రికి తీసుకెళ్లారని స్థానిక మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. ఓ మనిషి ప్రాణంకన్నా ఓ గోవు ప్రాణానికి ఎక్కువ విలువనిస్తున్న వసుంధర రాజె ప్రభుత్వం దృక్పథం వంటబట్టి పోలీసులు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారా, సహజసిద్ధంగానే వారి నరాల్లోనే నిర్లక్ష్యం పేరుకుపోయిందా? మనిషి ప్రాణానికి రూ.26, గోవు ప్రాణానికి రూ.70 దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద రోజుకు 26.65 రూపాయలను ఖర్చు చేస్తోంది. అదే ఆవు సంరక్షణకు రోజుకు 70 రూపాయలను, దూడపై రోజుకు 35 రూపాయలను ఖర్చు చేస్తోంది. ఈ మొత్తాన్ని 33 రకాల ప్రజల లావాదేవీలపై ‘ఆవు సెస్సు’ విధించడం ద్వారా రాబడుతోంది. రాష్ట్రంలోని పలు గోసంరక్షణ శాలలను ఆధునీకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి సరిగ్గా మేత అందుతుందో, లేదో పర్యవేక్షించడం కోసం సీసీటీవీ కెమేరాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా రాజస్థాన్‌లో గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. ఈ శాఖకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకన్నా ఏటా ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారంటే ఆశ్చర్య పోనక్కర్లేదు. రాష్ట్రంలో గోవుల సంఖ్య ఇప్పటికే 5 లక్షలు దాటిందని ఓ అంచనా. సకల చరాచర ప్రపంచంలో జంతువుల పట్ల కారణ్యం కలిగి ఉండాలని వాదించే నేటి రోజుల్లో పాలిచ్చే ఆవు పట్ల మరింత శ్రద్ధ ఉండాల్సిందే. కానీ మానవ జీవితాలను పణంగా పెట్టి కాదు. మనిషి ప్రాణాలకన్నా గోవు ప్రాణాలకే విలువ ఇవ్వదల్చుకుంటే ‘మనిషివా, పశువువా!’ అని తిట్టేబదులు ‘పశువువా, మనిషివా!’ అంటూ ఇక తిట్టాలి కాబోలు. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న ఓ సగటు రిక్షా కార్మికుడు రోజుకు 70 రూపాయల నుంచి వంద రూపాయలు సంపాదిస్తున్నాడు. అందులో 28 రూపాయలు గుడిశె అద్దెకు చెల్లించాలి. మిగతా డబ్బుతో భార్య, ఇద్దరు పిల్లలను పోషించాలి. దారిద్య్ర రేఖకు దిగువనున్న రాష్ట్ర పేద ప్రజల్లో 30 శాతం మంది ఇలాంటి రిక్షా కార్మికులే ఉన్నారు. మోది ప్రతిష్టను దెబ్బతీయడానికా! దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దెబ్బతీయడం కోసం కొంత మంది కుట్ర పన్ని ఇలాంటి మూక హత్యలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి అర్జున్ మెఘ్వాల్ ఆరోపించడం, హిందువులకు చెడ్డ పేరు తీసుకరావడం కోసం పోలీసులే ఖాన్‌ను చంపేశారని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజ ఆరోపించడంలో అర్థముందా! -
విద్వేషానికి వీర సత్కారం
-
విద్వేషానికి వీర సత్కారం
సాక్షి, న్యూఢిల్లీ : అది రాంచీలోని జయప్రకాష్ నారాయణ్ కేంద్ర కారాగారం. శుక్రవారం వర్షం పడుతున్నా లెక్క చేయకుండా రెండు బృందాలు జైలు వెలుపల ఆత్రుతతో ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాయి. జైలు తలుపులు తెరుచుకున్నప్పుడల్లా ఆ రెండు బృందాలు ఒకరికొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంతలో జైలు తలుపులు తెరచుకోగానే ఆరుగురు వ్యక్తులు బయటకు వచ్చారు. అంతే రెండు బృందాలు పోటీ పడి వారి వద్దకు దూసుకెళ్లి వారి మెడల్లో దండలు వేశాయి. తమ వెంట రావాలంటే తమ వెంట రావాలంటూ ఆ ఆరుగురు వ్యక్తులను ఆహ్వానించాయి. ఆ రెండు బృందాల్లో ఒకటి రామ్‌గఢ్ మాజీ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు శంకర్ చౌధరి అనుచర బృందం కాగా, మరో బృందం కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా విధేయుడైన రామ్‌గఢ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పప్పు బెనర్జీ అనుచర బృందం. చివరకు ఆ రెండు బృందాల మధ్య ఏదో అంగీకారం కుదిరింది. ఆ ఆరుగురు నిందితులు పప్పు బెనర్జీ వెంట కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ఇంటికి వెళ్లారు. ఆయన అక్కడ ఆ ఆరుగురు వ్యక్తులకు బంతిపూల దండలతో సాదరంగా స్వాగతం చెప్పారు. ఆయన వారికి స్వీట్లు కూడా తినిపించారు. అటు జైలు ముందు, ఇటు జయంత్ ఇంటి ముందు సత్కార ఆర్భాటాలు చూస్తుంటే బ్రిటీష్ కాలం నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. దేశ స్వాతంత్య్రం కోసం జైలుకెళ్లి తిరుగొచ్చిన వీరులకు ఇలాగే సత్కారం లభించేది. ఇప్పుడు సత్కారం అందుకుంటున్న ఈ వీరులెవరు? వారు దేనికోసం పోరాటం జరిపారు? సత్కారం అందుకున్న ఆరుగురు వ్యక్తులు ఏడాది క్రితం జరిగిన అమీలుద్దీన్ అన్సారీ హత్య కేసులో శిక్ష పడిన నేరస్థులు. వారికి జార్ఖండ్ ట్రయల్ కోర్టు ఆ ఆరుగురు సహా 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, అది పెద్ద శిక్షంటూ దాన్ని రద్దు చేసిన జార్ఖండ్ హైకోర్టు జూన్ 29న బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లాంఛనాలు పూర్తిచేసి ఏడుగురు నేరస్థుల్లో ఒకరు గురువారమే జైలు నుంచి విడుదలకాగా, ఆరుగురు శుక్రవారం విడుదలయ్యారు. మరో నలుగురు జైలు నుంచి ఇంకా విడుదల కావాల్సి ఉంది. వారి న్యాయపోరాటానికి మొత్తం ఖర్చును జయంత్ సిన్హా పెట్టారని పప్పు బెనర్జీ చెబుతుండగా, ఆయన క్రెడిట్ కోసం కేసు చివరి దశలో జోక్యం చేసుకున్నారని, మొదటి నుంచి కేసుకు ఖర్చు పెడుతున్నదే తానని మాజీ బీజేపీ ఎంపీ శంకర్ చౌధరి మీడియాతో వ్యాఖ్యానించారు. హంతకులతో కలిసి దిగిన జయంత్ సిన్హా ఫొటో జాతీయ పత్రికల్లో ప్రముఖంగా రావడంతో చౌధరి నొచ్చుకున్నారు. నాడు ఏంజరిగింది? అమీలుద్దీన్ అన్సారీ హత్య 2017, జూన్ 27వ తేదీ ఉదయం జరిగింది. రామ్‌గఢ్ జిల్లాలోని మనువా గ్రామానికి చెందిన అన్సారీ బొగ్గుల వ్యాపారి. ఆ రోజున మారుతీ వ్యాన్‌లో రామ్‌గఢ్‌కు వెళ్లారు. అక్కడ ఓ అల్లరి మూక ఆయన కారును అడ్డగించి ఆవును చంపి మాంసాన్ని కారులో తరలిస్తున్నావంటూ వాగ్వాదానికి దిగారు. రామ్‌గఢ్ జిల్లా బీజేపీ మీడియా ఇంచార్జి నిత్యానంద్ మెహతో (శిక్షపడిన వారిలో ఒకరు) అన్సారీని కారు నుంచి లాగగా అల్లరి మూక ఆయన్ని కొట్టడం మొదలుపెట్టింది. దీన్ని అల్లరి మూకలో ఒకరిద్దరు సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసి ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో పెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అన్సారీ 16 ఏళ్ల కుమారుడు సహబాన్ ఆ వీడియోను చూశారు. తండ్రిని కాపాడుకోవాలనే తొందరలో ఆ కుర్రాడు డ్రైవింగ్ రాకపోయినా తండ్రి స్కూటర్‌ను తీసి స్టార్ట్ చేశారు. ఒక్కసారిగా గేర్ మార్చి వదిలేయడంతో అది ముందుకు ఎగిరి పడిపోవడంతో కాలుకు గాయం అయింది. తల్లి వచ్చి స్కూటర్ ఎందుకు తీశావంటూ కొట్టబోతే వాట్సాప్ వీడియోను చూపించారు. అప్పుడు అన్సారీ భార్య, కుమారుడు ఇరుగు పొరుగు వారి సహాయంతో హుటాహుటిన రామ్‌గఢ్ వచ్చారు. అప్పటికే అన్సారీ రోడ్డుపై శవంగా పడి ఉండగా, ఆయన మారుతి వ్యాన్‌ను అల్లరి మూక ధ్వంసంచేసి తగులబెట్టింది. ఆ వీధిలో దాదాపు 200 కిలోల మాంసం ముద్దలు పడి ఉండడం కూడా ఫొటోల్లో కనిపించింది. అవి కారులో నుంచి పడ్డాయనే దానికి వీడియోలో కూడా ఎలాంటి ఆధారం లభించలేదు. అంత పెద్ద మొత్తంలో మాంసం తీసుకెళ్లడానికి అన్సారీ మాంసం వ్యాపారీ కాదు. ఇంట్లో ఫంక్షన్ కూడా లేదు. ఆ మాంసం ముద్దలు ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పటికీ మిస్టరీనే. 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష కేసును విచారించిన రామ్‌గఢ్ పోలీసులు నిందితులందరిని వీడియో ఆధారంగా అరెస్ట్ చేశారు. జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేసును త్వరితగతిన విచారించి మొత్తం 11 మంది దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గోరక్షణ పేరిట జరిగిన దాడి కేసులో శిక్ష పడిన మొదటి కేసు, పెద్ద కేసు ఇదే. కేసు విచారణ సందర్భంగా కీలక సాక్షి తన భార్యతో పాటు కోర్టుకు వచ్చారు. అన్సారీ కుమారుడు సహబాన్తో (అప్పటికి స్కూటర్ నడపడం నేర్చుకున్నారు) ఆమెను స్కూటర్‌పై పంపారు. స్కూటర్‌పై వెళుతున్న వీరిని వెనక నుంచి ఓ ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన సాక్షి భార్య మరణించింది. సాక్షిని బెదిరించడంలో భాగంగానే ఈ యాక్సిడెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు చేసినా భయపడకుండా అన్సారీ భార్య, కుమారుడు పోరాడటం వల్ల నేరస్థులకు శిక్ష పడింది. నేరస్థులకు ఎలాంటి శిక్షను కోరుకుంటున్నారని తుది విచారణలో కోర్టు జడ్జీ ప్రశ్నించినప్పుడు కూడా అన్సారీ భార్య ‘నా భర్త హత్య కేసులో న్యాయం చేయండని కోరుతున్నాను. అంతుకుమించి నేనేమి చెప్పలేను. నాకేమీ అక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు. శిక్ష పడిన నేరస్థుల్లో స్థానిక బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నారు. అంత ఉన్నత చదువులు చదివి కూడా విడుదలైన వారిని స్వాగతించడంలో బీజేపీ నాయకులు ఇక్కడ పోటీ పడుతుంటే అంత ఉన్నత చదువులు చదివిన జయంతి సిన్హాకు ఏమైందంటూ సోషల్ మీడియా తీవ్రంగా విమర్శిస్తోంది. ఢిల్లీ ఐఐటీలో డిగ్రీ, పెన్సిల్వేనియా యూనివర్శిటీలో ఎంఎస్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసిన జయంత్ సిన్హా కొంతకాలం బాస్టన్‌లోని ‘మ్యాక్‌కిన్సే అండ్ కంపెనీ’లో పనిచేసి భారత్‌కు వచ్చి రాజకీయాల్లో స్థిరపడ్డారు. జయంత్ సిన్హాను బీజేపీ హయాంలో కేంద్రంలో విదేశాంగ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా పనిచేసిన తండ్రి యశ్వంత్ సిన్హా కూడా ఘాటుగానే విమర్శించారు. అప్పుడు నేను ‘నాలాయక్’:యశ్వంత్ సిన్హా ‘ఒకప్పుడు నేను మంచి కొడుక్కి మంచి తండ్రిని కాదు (నాలాయక్ బాప్ ఆఫ్ లాయక్ బేటా). ఇప్పుడు మా పాత్రలు తిరగబడ్డాయి. అదే ట్విట్టర్ మహిమ. నా కొడుకు చర్యను నేను ఎప్పటికీ ఆమోదించలేను. నాకు తెలుసు ఇది కూడా మరింత ఛండాలానికి దారితీస్తుంది. అయినా నీవెప్పటికీ గెలవవు’ యశ్వంత్ సిన్హా తన కుమారుడిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. Earlier I was the Nalayak Baap of a Layak Beta. Now the roles are reversed. That is twitter. I do not approve of my son's action. But I know even this will lead to further abuse. You can never win. — Yashwant Sinha (@YashwantSinha) 7 July 2018 -
కిందపడ్డ వ్యక్తిని దొంగ అనుకొని..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడిన వ్యక్తిని చేరదీయాల్సిందిబోయి.. పశువుల దొంగని కొట్టి చంపారు. ఈ ఘటన యూపీలోని హాపూర్ జిల్లాలో పిలఖువా ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖాసీం(45), అతని స్నేహితుడు సమీయుద్దీన్ ఇద్దరు పశువుల ఉండే చోట ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడి గాయాలపాలయ్యారు. పశువుల పాకలోని గేదె, దూడను దొంగిలించేందుకు వచ్చారనే అనుమానంతో వారిద్దరిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. ఈ ఘటనలో 45 ఏళ్ల ఖాసీం తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతిచెందగా, అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జనమంతా చుట్టుముట్టగా బాధితుడు ఖాసీం తీవ్రగాయాలతో దాహం వేస్తుందని నీళ్లు అడుగుతున్నట్టు కనిపిస్తోంది. కాగా ఆ వీడియో తమకు అందలేదని పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 25 మంది స్థానికులపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. -
పశువులను దొంగిలించారని పైశాచికం
సాక్షి, రాంచీ : జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. పశువులను దొంగిలించారనే అనుమానంతో ఇద్దరు ముస్లింలను గ్రామస్థులు కొట్టి చంపారు. గొద్దా జిల్లాలోని దుల్లు గ్రామంలో బుధవారం రాత్రి మున్షి ముర్ము ఇంటి నుంచి అయిదుగురు వ్యక్తులు బర్రెలను దొంగిలించారనే అనుమానంతో గ్రామస్థులు వారిపై దాడి చేసిన ఘటన వెలుగుచూసిందని డీఐజీ అఖిలేష్ కుమార్ ఝా చెప్పారు.బర్రెలు కనిపించకపోవడంతో ముర్ముతో పాటు ఇతర గ్రామస్థులు అయిదుగురు వ్యక్తుల కోసం గాలించగా గురువారం తెల్లవారుజామున సమీప బంటకి గ్రామంలో వారిని గుర్తించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు సిరాబుద్దీన్ అన్సారి (35), ముర్తజా అన్సారీ(30)లను చావబాదారు. మిగిలిన ముగ్గురు తప్పించుకుని పారిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సంబంధించి ముర్ముతో పాటు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కాగా బాధితులు ఇదే జిల్లాకు చెందిన తలిజారి గ్రామస్తులని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు గ్రామంలో పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. -
పోలీస్ స్టేషన్ నుంచి లాక్కొచ్చి మరీ చంపేశారు
ఇటానగర్ : చిన్నారిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డ ఇద్దరిని ప్రజలు కొట్టి చంపిన షాకింగ్ ఘటన అరుణాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ నుంచి లాక్కొచ్చి మరీ ప్రజలు ఈ ఘటనకు పాల్పడ్డారు. సుమారు 400 నుంచి 1000 మంది ప్రజలు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వాక్రో సర్కిల్లోని నామ్గో గ్రామంలో ఓ చిన్నారి(12) ఈ నెల 12వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ఐదురోజుల తర్వాత సమీపంలోని టీ గార్డెన్లో నగ్నంగా చిన్నారి శవం లభ్యమైంది. పోస్టుమార్టంలో బాలిక పైశాచికంగా అత్యాచారానికి గురైనట్లు తేలింది. ఘటనపై ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అస్సాంకు చెందిన వలస కూలీలు సంజయ్ సబర్(30), జగదీశ్ లోహర్(25)లుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహాంతో ఉన్న నామ్గో గ్రామస్థులు నిందితులు తేజూ పోలీస్ స్టేషన్లో ఉన్న విషయం తెలుసుకున్నారు. కర్రలతో ఒక్కసారిగా స్టేషన్‌పై దాడి చేశారు. వారిని అడ్డుకోవటానికి పోలీసులు చేసిన యత్నం ఫలించలేదు. ఇద్దరినీ బయటకు లాక్కొచ్చి నగ్నంగా మార్చారు. ఆపై రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. కాగా, ఘటనపై ముఖ్యమంత్రి ప్రేమ ఖండూ ఖండించారు. ఘటనకు సంబంధించి ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసిన పోలీస్ శాఖ.. ఎస్పీని బదిలీ చేసింది. ఖండూ ప్రభుత్వం ఘటనపై మెజిస్టేరియల్ విచారణకు ఆదేశించింది. ఈశాన్య రాష్ట్రాల్లో గత మూడేళ్లలో జరిగిన రెండో ఉదంతం ఇది. 2015లో దిమాపూర్(నాగాలాండ్)లో ఇలాగే ఓ రేప్ నిందితుడిని జనాలు కొట్టి చంపారు. -
ప్రజలకు చిక్కారు... చచ్చారు!
పాట్నా: బలవంతమైన సర్పం చలి చీమల చేత చిక్కి చావదే సుమతి అన్నట్లు ప్రజలను బాధించిన నలుగురు నేరస్తులు చివరకు వారి చేతిలోనే చావాల్సి వచ్చింది. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో జరిగింది. రోహ్తా జిల్లా కోత్ ప్రాంతంలో ఓ వ్యక్తిపై నలుగురు నేరస్తులు తుపాకితో కాల్పులు జరిపారు. జిల్లా కౌన్సిల్ మెంబర్ భర్త అయిన అరుణ్ చౌదరి నుంచి డబ్బులు లాక్కెళ్లే ప్రయత్నంలో ఆయనపై కాల్పులు జరపగా అది గురితప్పింది. బుల్లెట్ తగిలి మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ కాల్పుల శబ్దం విని స్థానికులు పరుగున వచ్చి పారిపోతున్న ఆ నలుగురిని ఛేజ్ చేసి పట్టుకున్నారు. కర్రలు, ఇటుకలతో కొట్టడంతో వారు నలుగురూ అక్కడికక్కడే మృతిచెందారని, వారు 20 ఏళ్ల లోపు ఉంటారని పోలీసు అధికారి అలోక్ కుమార్ తెలిపారు. మృతులను ఇంకా గుర్తించలేదన్నారు. బిహార్‌లో ఇలా జనం చేతిలో ఈ సంవత్సరంలో చనిపోయిన సంఘటనలు రెండు డజన్ల వరకు ఉంటాయని తెలుస్తోంది. , , -
నృత్య వేడుక చూశాడని కొట్టి చంపేశారు
-
గుజరాత్లో దారుణం
అహ్మదాబాద్: ‘గార్భ’ నృత్య వేడుక చూశాడనే ఆగ్రహంతో ఉన్నత స్థాయి పటేల్ వర్గీయులు ఓ దళిత యువకుడిని దారుణంగా కొట్టి చంపిన ఘటన గుజరాత్లో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆనంద్ జిల్లాలోని భద్రనియా గ్రామంలో పటేల్ వర్గీయులు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున ‘గార్భ’ నృత్య వేడుక చేసుకుంటున్నారు. ఆ వేడుకకు సమీపంలో ఓ ఇంటి దగ్గర దళిత యువకులు జయేశ్ సోలంకి, ప్రకాశ్ సోలంకి, మరో ఇద్దరు కూర్చున్నారు. అటుగా వచ్చిన పటేల్ వర్గీయులు.. ‘గార్భ నృత్యం చూసే హక్కు దళితులకు లేదు’ అని వీరిని బూతులు తిట్టి మరికొందరు పటేల్ వర్గీయులను అక్కడికి పిలిచారు. తర్వాత పటేల్ వర్గీయులంతా కలసి మూకుమ్మడిగా ఈ దళిత యువకులను చితకబాదారు. ఈ సందర్భంగా జయేశ్ తలను గోడకేసి బాదారు. తీవ్రంగా గాయపడిన జయేశ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. ఈ కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై హత్యాచారం, అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. పథకం ప్రకారం హత్య జరిగిందన్న ఆరోపణలను డిప్యూటీ ఎస్పీ(ఎస్సీ, ఎస్టీ సెల్) ఏఎం పటేల్ తోసిపుచ్చారు. క్షణికావేశంలో ఈ ఘటన చోటుచేసుకుందని, రెండు వర్గాల మధ్య ఎటువంటి శత్రుత్వం లేదని వెల్లడించారు. అన్నికోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. మీసాలు పెంచుతారా అంటూ... మీసాలు పెంచినంత మాత్రాన దళితులు.. రాజ్‌పుత్‌లు కాలేరని హెచ్చరించి దళితులను రాజ్‌పుత్‌లు చితకబాదారు. గత నెల 25, 29వ తేదీల్లో గాంధీనగర్ జిల్లా లింబోదారా గ్రామంలో జరిగిన రెండు వేర్వేరు దాడి ఘటనలకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. -
ఆవుల స్మగ్లర్‌ను కొట్టిచంపిన జనం
నహన్(హిమాచల్): ఆవులను అక్రమంగా తరలిస్తున్న ఓ స్మగ్లర్‌ను ప్రజలు కొట్టిచంపిన ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. ఐదు ఆవులు, పది ఎద్దులున్న ట్రక్కు వెళుతుండడాన్ని గమనించిన స్థానికులు వెంటాడారు. డ్రైవర్ వాహనాన్ని లవాసా వద్ద నిలిపేసి.. అందులోని కొన్ని జీవాల్ని కిందకు తోసేశాడు. ఓ ఆవు చనిపోగా, మరో ఐదు జీవాలు గాయపడ్డాయి. ట్రక్కులోని ఐదుగురు స్మగ్లర్లు దగ్గర్లోని అడవుల్లోకి పరారయ్యారు. స్థానికుల సాయంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్లమీద ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రామస్తులు పోలీసులు వారిస్తున్నా వినకుండా వారిని తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన నోమన్(22) అనే ఆవుల స్మగ్లర్‌ను ఆస్పత్రికి తరలించగా.. అక్కడే మరణించాడు. అతణ్ని ఉత్తరప్రదేశ్‌లోని సహరన్పూర్ జిల్లాకు చెందిన రాంపూర్ గ్రామవాసిగా గుర్తించారు. గ్రామస్తులపై హత్య కేసు నమోదైంది. -
దొంగలను కొట్టి చంపిన గ్రామస్తులు
పట్నా: బీహార్‌లో దారుణం జరిగింది. గయ జిల్లాలోని ఒక గ్రామంలో దొంగలనే అనుమానంతో ముగ్గుర్ని గ్రామస్తులు కొట్టి చంపేశారు. విష్ణుగంజ్ గ్రామంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక ఇంట్లోకి చొరబడ్డ నలుగురిని కొంతమంది పట్టుకున్నారు. దీంతో మిగిలిన గ్రామస్తులంతా అక్కడ గుమిగూడారు. అంతే.. ఆగ్రహావేశాలకు గురైన వారంతా ఆ నలుగురిని వెదురు కర్రలతో కొట్టారు. ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడి చనిపోగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేశామని గయ ఎస్పీ మను మహరాజ్ తెలిపారు. దొంగతనానికి వచ్చారనే అనుమానంతోనే ముగ్గురు వ్యక్తులను హత్యచేశారన్నారు. అయితే బీహార్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయని హేతువాదులంటున్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు రెండు డజన్ల మందికి పైగా ఇలా మృత్యువాత పడ్డారంటున్నారు.