
అన్నమయ్య, సాక్షి: ఎన్నికల కౌంటింగ్ ముందు హత్యారాజకీయాలతో ఏపీలో అలజడులు సృష్టించాలనే ప్రయత్నాలు మొదలయ్యాయా?. అన్నమయ్య జిల్లాలో తాజాగా జరిగిన ఘాతుకం అవుననే సంకేతాలిస్తోంది.
మదనపల్లి శ్రీవారినగర్‌లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. మృతుడ్ని పుంగనూరు శేషాద్రిగా పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుఝామున శేషాద్రి ఇంట్లోకి చొరబడిన 30 మంది దుండగులు అతికిరాతకంగా నరికి చంపి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రక్తపు మడుగులో పడి ఉన్న శేషాద్రి మృతదేహాన్ని స్వాధీన పర్చుకున్నారు. శేషాద్రి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
70సార్లు నరికి..
శనివారం వేకువ ఝామున శేషాద్రి ఇంటి తలుపులు బద్ధలు కొట్టిన దుండగులు.. ఆయన భార్య కళ్ల ముందే అతి దారుణంగా వేట కొడవళ్లతో నరికి చంపారు. కాళ్ల మీద పడి చంపొద్దని వేడుకున్నా.. ఆ కిరాతకులు కనికరించలేదు. జిల్లా ఆస్పత్రిలో శేషాద్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు.. శరీరంపై కత్తిపోట్లు చూసి విస్తూపోయారు. సుమారు 70 కత్తి పోట్లు ఉన్నాయని వైద్యులు తెలిపినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. దుండగులు భూ దందాల ముఠా సభ్యులై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment