రాజస్తాన్ మంత్రి జస్వంత్ యాదవ్ (ఫైల్‌ఫోటో)
జైపూర్ : అల్వార్ మూక హత్యపై దుమారం రేగిన నేపథ్యంలో రాజస్తాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవులకు సంబంధించిన వ్యాపారాన్ని ముస్లింలు నిలిపివేయాలని సూచించారు. హిందువుల మనోభావాలను అర్థం చేసుకుని ముస్లింలు ఆవుల స్మగ్లింగ్‌ను ఆపాలని మంత్రి జస్వంత్ యాదవ్ కోరారు. వారు ఈ వ్యాపారాన్ని తక్షణం విరమించాలని అన్నారు. రక్బర్ ఖాన్ మూక హత్యను మంత్రి ఖండిస్తూ దుండగులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు.
హర్యానాలోని తమ గ్రామానికి ఆవులను తీసుకువెళుతున్న రక్బర్ ఖాన్, అస్లాంలపై రాజస్తాన్‌లోని అల్వార్‌కు సమీపంలోని అటవీ ప్రాంతంలో కొందరు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అస్లాం ప్రాణాలతో బయటపడగా, రక్బర్ ఖాన్ మూక చేతిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు.
మూక హత్య కేసులో పోలీసులు ఇప్పటివరకూ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా సకాలంలో పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించిఉంటే ప్రాణాలు కాపాడేవారని రాజస్తాన్ హోంమంత్రి జీసీ కటారియా వ్యాఖ్యానించారు. గోవులను గోశాలకు తరలించడంపై పోలీసులు దృష్టిసారించడంతో బాధితుడిని ఆస్పత్రికి తీసుకువెళ్లడంలో జాప్యం జరిగిందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment