minister comments
-
రాజస్తాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్ : అల్వార్ మూక హత్యపై దుమారం రేగిన నేపథ్యంలో రాజస్తాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవులకు సంబంధించిన వ్యాపారాన్ని ముస్లింలు నిలిపివేయాలని సూచించారు. హిందువుల మనోభావాలను అర్థం చేసుకుని ముస్లింలు ఆవుల స్మగ్లింగ్‌ను ఆపాలని మంత్రి జస్వంత్ యాదవ్ కోరారు. వారు ఈ వ్యాపారాన్ని తక్షణం విరమించాలని అన్నారు. రక్బర్ ఖాన్ మూక హత్యను మంత్రి ఖండిస్తూ దుండగులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. హర్యానాలోని తమ గ్రామానికి ఆవులను తీసుకువెళుతున్న రక్బర్ ఖాన్, అస్లాంలపై రాజస్తాన్‌లోని అల్వార్‌కు సమీపంలోని అటవీ ప్రాంతంలో కొందరు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అస్లాం ప్రాణాలతో బయటపడగా, రక్బర్ ఖాన్ మూక చేతిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. మూక హత్య కేసులో పోలీసులు ఇప్పటివరకూ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా సకాలంలో పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించిఉంటే ప్రాణాలు కాపాడేవారని రాజస్తాన్ హోంమంత్రి జీసీ కటారియా వ్యాఖ్యానించారు. గోవులను గోశాలకు తరలించడంపై పోలీసులు దృష్టిసారించడంతో బాధితుడిని ఆస్పత్రికి తీసుకువెళ్లడంలో జాప్యం జరిగిందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. -
‘ప్రధాని మన్మోహన్’ను కలిశాడా???
సాక్షి, చెన్నై : మన నేతల టాలెంట్ మరోసారి పబ్లిక్‌గా బయటపడింది. తమిళనాడుకు చెందిన ఓ మంత్రి నోరు జారి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. ఇండియాటుడే ప్రచురించిన కథనం ప్రకారం... అటవీ శాఖ మంత్రి శ్రీనివాసన్ ఈ మధ్య దిండిగల్‌లో నిర్వహించిన ఓ సమావేశానికి హాజరయ్యాడు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ... రాష్ట్ర అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ మధ్యే ఢిల్లీ వెళ్లి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి వచ్చాడని చెప్పారు. ఇంకేం శ్రీనివాసన్‌ను తమకు కావాల్సిన రీతిలో సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. అక్టోబర్ 12న పన్నీర్ సెల్వం కొంత మంది సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లి మోదీని కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీలో రాజకీయ అంశాలేవీ చర్చకు రాలేదని.. కేవలం రాష్ట్ర అభివృద్ధి, డెంగీ విజృంభణ-నివారణ చర్యల గురించి మాత్రమే చర్చించామని ఓపీఎస్ స్పష్టం చేశారు. -
మంత్రి నోట.. మళ్లీ అదే మాట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మళ్లీ అలాగే మాట్లాడారు. ముద్రగడ దీక్ష విషయంలో ఆయనను అనుమానించేలా, ఆయన నిజాయితీని అవమానించేలా మంత్రులు మాట్లాడటం తగదని ఒకవైపు కాపు ప్రముఖులు అందరూ చెబుతున్నా.. ఆయన మాత్రం మళ్లీ అదే పద్ధతిలో మాట్లాడారు. పదోరోజు నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కామినేని అన్నారు. మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, ముద్రగడ పద్మనాభం దీక్షను ఎద్దేవా చేశాలా వాళ్ల వ్యాఖ్యలు ఉంటున్నాయని దాసరి నారాయణరావు, చిరంజీవి తదితరులు ఇంతకుముందు విమర్శించారు. మంత్రులు ఇలా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని కూడా అన్నారు. అయినా మళ్లీ ఇదే తరహా వ్యాఖ్యలు వస్తుండటం గమనార్హం. -
మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా మద్యం దుకాణాలు బంద్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మంత్రి మృణాళిని వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేశారు. తాము లాభాలను కోల్పోయి వ్యాపారం చేస్తుంటే మంత్రి తమను తప్పుబట్టడం తగదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి మృణాళిని... ఎంఆర్పీకి మించి విక్రయాలు, బెల్ట్‌షాపులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారని ఎక్సైజ్ అధికారులపై, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వ్యాపారులపై మండిపడ్డారు. ఇలా అయితే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. మంత్రి వ్యాఖ్యలతో మద్యం వ్యాపారులు ఆవేదన చెందారు. జిల్లా వ్యాప్తంగా 202 దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. తమకొస్తున్న 18 శాతం కమీషన్లో 16 శాతం ప్రభుత్వానికి లెసైన్సు రూపేణా చెల్లిస్తున్నామని, రెండు శాతం లాభంతో వ్యాపారం చేయలేమని, మా డబ్బులను రిఫండ్ ఇస్తే మద్యం అమ్మకాలకు స్వస్తి చెబుతామని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిగతా 12జిల్లాలో ఎంఆర్పీకి మించి విక్రయాలు చేపడుతున్నారని, అటు వైపు ఒకసారి చూడాలని, అక్కడి కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్న తమపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని వాపోయారు. బొబ్బిలిలోనైతే ఎక్సైజ్ కార్యాలయం వద్ద డివిజన్ వ్యాపారులంతా నిరసన తెలియజేశారు. తమపై మండిపడుతున్న మృణాళిని... తన సొంత ఊరులో ఎంఆర్పీకి మించి జరుగుతున్న విక్రయాల్ని, బెల్ట్‌షాపులను ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించారు. రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో అధికారులే వ్యాపారులతో టెండర్లు వేయించడం వల్ల నూటికి నూరుశాతం దుకాణాలకు వేలం పాటలు జరిగాయని చెప్పారు. ఏజెన్సీలో అమ్మకాలు చేయలేని పరిస్థితి ఉన్నా అధికారులు బలవంతంగా మాతో దుకాణాలు నడిపిస్తున్నారని వాపోయారు. ఇవన్నీ తెలిసి మంత్రి సీరియస్ అయ్యారో మరేంటో గాని దుకాణాలు మూసేసిన వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్నం తరువాత ఒక్కొక్కరూ దుకాణాలు తెరిచారు. ఉదయం వరకూ దుకాణాలను బంద్ చేయడం వల్ల రూ.50 లక్షలమేర వ్యాపారం నిలిచిపోయింది.