మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా మద్యం దుకాణాలు బంద్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మంత్రి మృణాళిని వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేశారు. తాము లాభాలను కోల్పోయి వ్యాపారం చేస్తుంటే మంత్రి తమను తప్పుబట్టడం తగదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి మృణాళిని... ఎంఆర్‌పీకి మించి విక్రయాలు, బెల్ట్‌షాపులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారని ఎక్సైజ్ అధికారులపై, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వ్యాపారులపై మండిపడ్డారు. ఇలా అయితే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. మంత్రి వ్యాఖ్యలతో మద్యం వ్యాపారులు ఆవేదన చెందారు.
జిల్లా వ్యాప్తంగా 202 దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. తమకొస్తున్న 18 శాతం కమీషన్‌లో 16 శాతం ప్రభుత్వానికి లెసైన్సు రూపేణా చెల్లిస్తున్నామని, రెండు శాతం లాభంతో వ్యాపారం చేయలేమని, మా డబ్బులను రిఫండ్ ఇస్తే మద్యం అమ్మకాలకు స్వస్తి చెబుతామని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిగతా 12జిల్లాలో ఎంఆర్‌పీకి మించి విక్రయాలు చేపడుతున్నారని, అటు వైపు ఒకసారి చూడాలని, అక్కడి కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్న తమపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని వాపోయారు. బొబ్బిలిలోనైతే ఎక్సైజ్ కార్యాలయం వద్ద డివిజన్ వ్యాపారులంతా నిరసన తెలియజేశారు. తమపై మండిపడుతున్న మృణాళిని... తన సొంత ఊరులో ఎంఆర్‌పీకి మించి జరుగుతున్న విక్రయాల్ని, బెల్ట్‌షాపులను ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించారు.
రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో అధికారులే వ్యాపారులతో టెండర్లు వేయించడం వల్ల నూటికి నూరుశాతం దుకాణాలకు వేలం పాటలు జరిగాయని చెప్పారు. ఏజెన్సీలో అమ్మకాలు చేయలేని పరిస్థితి ఉన్నా అధికారులు బలవంతంగా మాతో దుకాణాలు నడిపిస్తున్నారని వాపోయారు. ఇవన్నీ తెలిసి మంత్రి సీరియస్ అయ్యారో మరేంటో గాని దుకాణాలు మూసేసిన వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్నం తరువాత ఒక్కొక్కరూ దుకాణాలు తెరిచారు. ఉదయం వరకూ దుకాణాలను బంద్ చేయడం వల్ల రూ.50 లక్షలమేర వ్యాపారం నిలిచిపోయింది.