మంత్రి మృణాళినిపై సీఎంకు ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గపోరు రాజుకుంటోంది. గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి మృణాళినిపై సీఎంకు ఫిర్యాదు చేసేందుకు ఇటీవల యత్నించి విఫలమైన ఆమె వ్యతిరేక వర్గీయులు ఇప్పుడు మరో ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నారని తెలిసింది. తాము సూచించిన పనులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకునేందుకు జిల్లా తమ్ముళ్లు గురువారం హైదరాబాద్ బయలుదేరారు. పనిలో పనిగా డీసీసీబీ బినామీ రుణాల బాగోతం పైనా చంద్రబాబుకు వివరించనున్నారు. మరో పక్క వారేం చెబుతారో చూద్దామనే ధోరణిలో మంత్రి వర్గీయులు ఉన్నట్టు కనిపిస్తోంది. అసమ్మతి వర్గీయులే కాకుండా, వివిధ పనులపై జిల్లాలోని పలువురు తెలుగు దేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అపాయింట్‌మెంట్ కోరడంతో వారందరితో శుక్రవారం ఉదయం చంద్రబాబు మాట్లాడనున్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు, తెలుగు మహిళ రాష్ట్ర ఆధ్యక్షురాలు శోభ హైమావతి, జెడ్పీ చైర్‌పర్సన్ భర్త గణేష్‌లు చంద్రబాబును కలిసేందుకు వెళ్లినవారిలో ఉన్నారు. జిల్లా నుంచి హైదరాబాద్ బయలుదేరిన వారిలో చాలా మంది మంత్రి కిమిడి మృణాళినే లక్ష్యంగా ఫిర్యాదులు చేసేందుకు వెళ్తున్నారని సమాచారం. జిల్లాలో తమకు తెలియకుండా బదిలీలు జరుగుతున్నాయనీ, బదిలీలు జరిగిపోయిన తరువాత తాము తెలుసుకోవాల్సి వస్తోందని పలువురు నేతలు ఆవేదన చెందుతున్నారు. అంతే కాకుండా తాము సూచించిన మండలాల్లో తహశీల్దార్లను నియమించడం కానీ, బదిలీ చేయడం కానీ చేయలేదని మంత్రి వ్యతిరేక వర్గీయులు వాపోతున్నారు.
కలెక్టర్ ఎంఎం నాయక్ కూడా తాము చెప్పిన పనులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, దీనికి కూడా మంత్రే కారణమనీ వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఈ వర్గమంతా తమ ఇబ్బందులను చంద్రబాబుకు చెప్పకునేందుకు విజయవాడలో జరిగిన రాష్ట్ర పార్టీ సమావేశం సందర్భంగా ప్రయత్నించినా వీలుపడ లేదు. అయితే తెలివిగా వ్యవహరించిన మంత్రి మృణాళిని వీరికన్నా ముందుగా సీఎంను కలిసి ఇక్కడి విషయాలను పూసగుచ్చినట్టు వివరించారని సమాచారం. శుక్రవారం తనను కలుసుకునేలా జిల్లా నేతలకు చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తహతహలాడుతున్నారు. పనిలో పనిగా ఇటీవల డీసీసీబీలో బయటపడిన బినామీ రుణాల వ్యవహారాన్ని కూడా చంద్రబాబుకు వివరించేందుకు వీరు సిద్ధమవుతున్నారు. తాజా పరిస్థితిని వివరిస్తూ , తమకు అనుకూలంగా ఎలా మలుచుకోవచ్చో చెప్పేందుకు వెళ్తున్నారని తెలిసింది.
చూద్దామంటున్న మంత్రి వర్గీయులు
అసంతృప్తి నేతలు చంద్రబాబుతో భేటీ కావడంపై మంత్రి వర్గీయులు కూడా దీటుగానే స్పందిస్తున్నట్టు సమాచారం. ఎందుకు కొన్ని విషయాల్లో తటస్థంగా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందో తెలియజేసే కారణాలను కూడా వీరు సిద్ధం చేసుకున్నట్టు భోగట్టా. అసమ్మతి వర్గీయులు చేస్తున్న అవినీతి కార్యకలాపాలు కూడా వివరించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. సీఎం వివరణ కోరితే తమ వాదనను వినిపిస్తామంటున్నారు.