బాబు ఆయా.. జాబు గయా! | Unemployed desperation in TDP authority | Sakshi
Sakshi News home page

బాబు ఆయా.. జాబు గయా!

Published Mon, Jun 1 2015 12:17 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

Unemployed desperation  in TDP authority

నిరుద్యోగులను నట్టేట ముంచిన
   చంద్రబాబు
  ఇంటికొక ఉద్యోగం.. నిరుద్యోగుల భృతి గాలికి..
  ఏడాదైనా ఒక్క ఉద్యోగమూ రాని వైనం
  నిరాశలో నిరుద్యోగులు
 
 నేను మారలేదు..!!
 ‘‘నేను మారాను.. నన్ను నమ్మండి.. నన్ను గెలిపించండి.. జాబు రావాలంటే.. బాబు రావాలి. ఇంటికొక ఉద్యోగం ఇస్తాను. నిరుద్యోగులకు భృతి చెల్లిస్తాను.’’ ఇది ఏడాది క్రితం జరిగిన శాసన సభ ఎన్నికల సభల్లో చంద్రబాబు ప్రసంగం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతాం..  ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేస్తాం.. మీరు ధైర్యంగా ఉండండని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటై  ఏడాది కావస్తున్నా ఒక్క ఉద్యోగం సైతం ఇవ్వకపోగా..  కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌లను తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. ఎప్పుడు తమ ఉద్యోగాలు ఊడిపోతాయోనని బితుబితుకుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. చంద్రబాబు మాటలకే గానీ.. మనస్తత్వం ఏ మాత్రమూ మారలేదని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న హామీ కూడా ఆచరణకు రాలేదు.
 
 విజయనగరం  క్రైం: టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. ఇటీవలే మహానాడు కూడా ఏర్పాటు చేసి, ఆ పార్టీ నేతలు ఘనంగా సంబరాలు జరుపుకొన్నారు. అన్ని హామీలనూ అమలు చేస్తున్నామంటూ మహానాడు సాక్షిగా ఊదరగొట్టారు. వాస్తవ పరిస్థితి ఏమిటో ఆ నాయకులకు తెలియదా? ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఓట్లను ఆకర్షించేందుకు చంద్రబాబు.. ‘ఇంటికో ఉద్యోగం’ అంటూ హామీ గుప్పించారు. ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి నెలకు రూ.2 వేలు ఇస్తామంటూ చెప్పారు. ‘బాబు వస్తేనే జాబు’ అంటూ ప్రగల్భాలు పలికారు. బాబు మాటలు నమ్మి యువత ఓట్లు వేసి గెలిపించారు.
 
 నిరుద్యోగ భృతి మాట దేవుడెరుగు. బాబు అధికారంలోకి రాగానే ఉన్న ఉద్యోగాలను కూడా తొలగించారు. ఏడాది కావస్తున్నా.. ఒక్క ఉద్యోగమూ కల్పించలేదు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. జిల్లాలో 24 లక్షల మంది జనాభా ఉన్నారు. దాదాపుగా ఏడులక్షల కుటుంబాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ప్రకారం కుటుంబానికొక ఉద్యోగం అంటే.. ఏడు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. జిల్లాలో దాదాపుగా రెండు లక్షల మంది వరకూ నిరుద్యోగులు ఉన్నారు. వీరికి నెలకు రూ.2వేలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది. రెండు లక్షల మంది నిరుద్యోగులకు రూ.2 వేలు చొప్పున అంటే ఏడాదికి రూ.48లక్షలు చెల్లించాలి. కనీసం ఇంతవరకు ఒక్కపైసా కూడా చెల్లించలేదు.
 
  ఇంటికో ఉద్యోగమూ ఇవ్వలేదు. పైగా ఉన్న ఉద్యోగాలను తొలగించారు. వ్యవసాయశాఖలో ఆదర్శరైతుల స్థానంలో ఎం.పి.ఇ.ఓలను ఎంపిక చేయాలని భావించి పరీక్షలు నిర్వహించారు. ఇంకా నియామకాలు చేపట్టలేదు. జిల్లా గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్న 86 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. వ్యవసాయ విభాగంలో పనిచేసే ఆదర్శరైతులు 1,538 మందిని తొలగిచారు. ఇప్పుడు వారంతా రోడ్డున పడ్డారు. ఎనిమిదేళ్లుగా రూ.వెయ్యి భృతికి పని చేస్తున్నామని, ఇప్పుడు తమను అర్ధాంతరంగా తొలగించారని, తమ పరిస్థితి ఏంటని ఆదర్శ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు వచ్చారు.. జాబు పోయింది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 బితుకుబితుకుమంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులు..
 జిల్లాలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు  వివిధ శాఖల్లో  సుమారు పదివేల మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మెడికల్ అండ్  వైద్యవిధాన పరిషత్తులో 10రకాల ఉద్యోగాలకు గాను  12వందల మంది కాంట్రాక్ట్, అవుట్  సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఆర్వీఎంలో 1100మంది, గిరిజన వెల్ఫేర్‌లో 300, విద్యుత్ విభాగంలో 600, జె.ఎన్.టి.యు, ఆంధ్రా యూనివర్సిటీ విభాగంలో 100, ఐసీడీఎస్ విభాగంలో 50, ఐటీఐలో 30, రెవెన్యూలో 35, తోటపల్లి బ్యారేజ్  పనులు చేయడానికి  40, ఐకేపీలో 500, వ్యవసాయ విభాగంలో  500, ఫీల్డ్ అసిస్టెంట్‌లు 1200మంది వరకు ఉన్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న వారికి ఏడు నెలల నుంచి జీతాలు లేవు. వారిని కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. అధికార పార్టీ నాయకుల మాటలతో వీరంతా బిక్కుబిక్కుమంటున్నారు. తమ ఉద్యోగాలను తీసేసి, టీడీపీ వారిని వేసుకుంటారోనని నిత్యం భయాందోళన చెందుతున్నారు.
 
 ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో సంఖ్య ఇలా..
 జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో (గత మార్చి వరకూ) 55,664మంది నిరుద్యోగులు తమ  పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పదో తరగతిలో 11,174, ఇంటర్‌లో 16,544, డిగ్రీలో 8,465, స్టెనో/టైపిస్ట్ 1614, ఎస్‌జీటీ టీచర్స్ 3792, పాలిటెక్నిక్ 1896, ఐటీఐలో 6719, ఏఎన్‌ఎం/జీఎన్‌ఎం 1368, పదోతరగతిలోపు 4082 మంది విద్యార్థులు ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరంతా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.
 
 రాజకీయ కక్షతో దెబ్బకొట్టారు..
 ఎనిమిదేళ్లు అదే పనిగా నమ్ముకుని ఆదర్శరైతుగా పనిచేశా. కాంగ్రెస్ సర్కారు హయాంలో మమ్మల్ని నియమించారనే రాజకీయ కక్షతో మా పొట్టకొట్టారు. కేవలం రూ.1000లు గౌరవ వేతనం తీసుకుని సేవలు అందించాం. ఉన్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ, ఆదర్శరైతుగా గ్రామంలో అందరికీ అందుబాటులో ఉంటూ ఎండనక, వాన అనక సేవలు అందించాం. తాను వస్తే జాబు ఇస్తానంటూ చెప్పిన చంద్రబాబునాయుడు అధికారం చేపట్టి మా బతుకుల మీద దెబ్బకొట్టారు.
 - చింతల ప్రసాద్, లక్కవరపుకోట.
 
 ఉద్యోగం వ స్తుందని ఆశపడ్డాను..
 చంద్రబాబు  ఎన్నికల్లో  ఇచ్చిన  హమీలు  చూసి   ఉద్యోగం  లేదా  నిరుద్యోగభృతి దక్కుతుందని ఆశ పడ్డాను. పీజీ పూర్తిచేసి ఖాళీగా ఉన్నాను. ఒక  పక్క వయస్సు  అయిపోతోంది. ఉద్యోగం  లేకపోవడంతో  తీవ్ర ఇబ్బందులు  పడుతున్నాం. చంద్రబాబు  మాటలు నమ్మి  అతనికి  ఓటువేశాం. ఇప్పటికైనా నిరుద్యోగులుకు భృతి  ఇస్తారని  ఆశిస్తున్నాను.
 -  కొత్తలి ఎర్ని వెంకటరావు, నిరుద్యోగి.
 
 తల్లిదండ్రుల కూలి డబ్బులే ఆధారం..
 మా అమ్మా, నాన్నలు కూలి చేసి నన్ను పి.జి వరకూ చదివించారు. ఉన్న ఎకరా పొలంలో చేసే వ్యవసాయం తిండికే సరిపోతుంది. ఏడాదిపాటు వ్యవసాయం చేయడానికి మదుపులు పెట్టాలంటే అప్పులు చేయాలి. నాతో పాటూ మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను  ఉద్యోగ అవకాశాల కోసం వెదుకుతున్నా. పత్రికలు, దరఖాస్తులు కొనాలన్నా, దరఖాస్తు చేయాలన్నా డబ్బులు అవసరం. పోటీ పరీక్షలు  రాయాలంటే కోచింగ్‌లు  ఉండాలి. పరీక్షలకు వెళ్లేందుకు రవాణా చార్జీలు కావాలి. వీటన్నింటికీ అమ్మా..నాన్నలనే అడగాలి. వారి కూలి డబ్బులే నాకు ఆధారం. నిరుధ్యోగ భృతి వస్తుందని ఆశ పడ్డాం. అడిశాయే అయింది.
 - జి.అచ్యుతరావు, నిరుద్యోగి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement