మంత్రి కోర్టులో నిధుల బంతి ! | differences between TDP leaders | Sakshi
Sakshi News home page

మంత్రి కోర్టులో నిధుల బంతి !

Published Wed, Nov 26 2014 3:11 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

మంత్రి కోర్టులో నిధుల బంతి ! - Sakshi

మంత్రి కోర్టులో నిధుల బంతి !

 తెలుగుదేశం ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న విభేదాలు ఇప్పట్లో సమసిపోయేటట్టు కనిపించడం లేదు. అదును చూసుకుని ఒక వర్గం మరో వర్గాన్ని దెబ్బతీస్తోంది. ఇప్పుడు బంతి మంత్రి కోర్టుకు వచ్చింది. నిన్నమొన్నటి వరకూ మంత్రిని ఖాతరు చేయని  కొందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆమెను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో మంత్రి ఎలా స్పందిస్తారోనని ఆ పార్టీకి చెందిన నేతలు ఎదురుచూస్తున్నారు.
 
  సాక్షి ప్రతినిధి, విజయనగరం : పై ఫొటో చూశారా?... గిరిజన యూనివర్సిటీని జిల్లాకే కేటాయించాలని  విశాఖలో చంద్రబాబును కలిసి టీడీపీ నేతలు కోరుతున్న దృశ్యమిది. కానీ ఆ ఫొటో మంత్రి మృణాళిని ముం దెక్కడా కనిపించరు. అసలామె కలిశారా ? అనే సందేహం రాక మానదు. వాస్తవానికైతే అందరితో పాటే సీఎంను మంత్రి కలిశారు. ఫొటోను పరిశీలించి చూస్తే   నేతలందరి వెనుక ఆమె కనిపిస్తారు.   చూసిన ప్రతి ఒక్కరకూ ఆమె స్థానమదా? అని ఆశ్చర్యపోక తప్పదు.   మంత్రై ఉండి వెనక నిలబడటమేంటని ఎవరికైనా సందేహం రాకమానదు. కొందరు టీడీపీ నేతల్ని కదిపితే మాత్రం ఆమె తీరే దానికి కారణమని చెబుతారు. ‘ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు.
 
 ఇతర ప్రజాప్రతినిధుల్ని లెక్క చేయడం లేదు. మమ్మల్ని గౌరవించని వ్యక్తికి మేమెందుకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అంటూ ఆ ఫొటో సంగతి వివరిస్తున్నా రు. అందరికీ ముందు నిలబడి గిరిజన యూనివర్సిటీ కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన మంత్రి ఇలా వెనుక ఉండటమేంటని మరికొంతమంది నేతలను ఆరాతీస్తే ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకొస్తున్నారు. తమను పట్టించుకోకపోవడం వల్లే తాము అదే ధోరణితో వ్యవహరించామని కొంద రు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సైతం గిరిజన యూనివర్సిటీ కోసం  మద్దతు లేఖలిస్తే మంత్రిగా ఆ స్థాయి చొరవ చూపలేదని కొందరు చెబుతున్నారు.   కారణమేదైనా మంత్రికి  ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇచ్చిన గౌరవమేంటో అర్థం చేసుకోవచ్చు. వారి మధ్య ఎంత అంతరం ఉందో ఇట్టే గ్రహించవచ్చు.   
 
 బంతి మంత్రి కోర్టులో....
  ఇలా ఎడమొహం, పెడమొహం రాజకీయాలు చేస్తున్న  ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఊహించని పరిణామం ఎదురు కాబోతోంది.  గత ప్రభుత్వ హయాంలో మంజూరైన  ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్),   నియోజకవర్గ అభివృద్ధి నిధి(సీడీపీ) సొమ్మును వినియోగించుకోవాలంటే మంత్రి ఆమోదం ఉండాలి. ఆమె చేతనే మంజూరు చేయించుకోవాలి. అంటే నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మెట్టు దిగాల్సిందే...ఆ పనులు దక్కించుకోవడానికి మంత్రిని ఆశ్రయించాల్సిందే. ఇప్పుడిదే ఆ అసమ్మతి నేతల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్) కింద మంజూరైన సొమ్ములో రూ.9.28కోట్లు ఖర్చు కాలేదు. వాటికి సంబంధించిన 333 పనులు ప్రారంభం కాలేదు. అలాగే గత ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి నిధి(సీడీపీ) కింద మంజూరు చేసిన సొమ్ములో సుమారు రూ.నాలుగు కోట్లు ఖర్చు కాలేదు.
 
 వాటికి సంబంధించిన 305 పనులు ప్రారంభం కాలేదు.  అధికారంలోకి వచ్చేసరికి ఈ పనులు ప్రారంభం కాకపోవడంతో టీడీపీ సర్కార్ ఎక్కడివక్కడ  ఆపేసింది. తాజాగా వాటిని రద్దు చేసి కొత్త పనులు ప్రాతిపాదించాలని నిర్ణయం తీసుకుంది. వాటి మంజూరు అధికారం మంత్రికే ఉందని పరోక్షంగా తెలియజేసింది. దీంతో అసమ్మతి వాదుల్లో గుబులు రేగింది. ఈ నిర్ణయం వారికి మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో పెండింగ్ నిధుల పనులైనా దక్కించుకోకపోతే వచ్చిన అవకాశాకాలు చేజారిపోతాయని పలువురు నేతలు ఇప్పటికే అంత్మధనంలో పడ్డారు. అధినేత నిర్ణయం తీసుకున్న నిర్ణయంపై కాసింత అసహనంతో ఉన్నారు. వారికే సర్వాధికారాలైతే తమకే  ఇబ్బందులే అన్న అభిప్రాయానికొచ్చారు. మంత్రి కూడా అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారని,  ఎలా రారో వేచి చూద్దామని ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది.    పంతం, ప్రతిష్ట అని  కూర్చొంటే కష్టమేనని, అనుచరులు  అసమ్మతి నేతలకు   నూరి పోస్తున్నారు. దీంతో  పనుల కోసం మంత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి గతాన్ని గుర్తు చేసుకుంటారో లేదంటే బదిలీల మాదిరిగా తనదైన శైలీలో వెళ్తారో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement