నవనిర్మాణ దీక్ష లోగో
విజయనగరం గంటస్తంభం : ఏమీ చేయకపోయినా... రూపాయి పని చేసి కోట్లాది రూపాయలు పని చేసినట్లు ప్రచారం చేసుకోవడంలోనూ సీఎం చంద్రబాబునాయుడుకు మించిన వారు లేరనే వాదన ప్రజల్లో ఉంది. గత నాలుగేళ్లలో ఈ విషయం ఎన్నోసార్లు రుజవైంది. పథకాలు ప్రకటించి వాటిని ప్రజలకు అందినట్లు... వాటితో ప్రజలు జీవితాలు మారిపోతున్నట్లు ప్రచారం చేస్తారు. దీనికి అధికారపార్టీ నాయకులతో అధికారులను వాడుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పుడు మరో ప్రచార కార్యక్రమానికి సీఎం తెరతీస్తున్నారు. నవనిర్మాణ దీక్ష పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. దీనిపై అధికారుల నుంచి సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏమీ చేయకుండా అన్ని చేశామని ఎలా అబద్ధం చెబుతామని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
నాలుగేళ్లలో...
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మభూమి, మీఇంటికి మీభూమి, వారోత్సవాలు, పక్షోత్సవాలంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించింది. నవనిర్మాణ దీక్ష పేరుతో ఇప్పటికే మూడుసార్లు కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ జూన్ 2వతేదీ నుంచి 8వతేదీ వరకు వారం రోజుల పాటు నవనిర్మాణ దీక్ష కార్యక్రమం చేపట్టాలని జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈసారి గ్రామాలు, వార్డులు వారీగా...
నవ నిర్మాణ దీక్షలు ఇప్పటివరకు నియోజకవర్గాలు వారీగా రోజుకో అంశంతో ఏడు రోజులపాటు నిర్వహించారు. ఈసారి గ్రామాల వారీగా, పురపాలకసంఘం వార్డులు వారీగా ప్రచారం చేసుకోవాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఒక్కోరోజు ఒక్కో అంశాన్ని వివరించాలి. ఒక్కో అంశానికి ఒకరు చొప్పున ఏడుగురు ప్రత్యేకాధికారులను ప్రతి వార్డు, గ్రామానికి నియమించాలని ప్రభుత్వం సూచిం చింది. అంటే, గ్రామస్థాయిలో పని చేసే అధికారులు ఒక్కో అంశంపై ప్రజలకు చెబుతారన్న మాట. ఇకపోతే మండల ప్రత్యేకాధికారి మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.
రోజుకో అంశంపై సభ
గ్రామాల్లో రోజుకో అంశంపై సభ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా 2న ప్రతిజ్ఞ కార్యక్రమం, 3న నీటి భద్రత కరువు రహిత రాష్ట్రం, 4న రైతుసంక్షేమం, ఆహారభద్రత, 5న సంక్షేమం, సాధికారిత, 6న జ్ఞానభూమి, ఉపాధికల్పన, 7న మౌలిక సదుపాయాలు, మెరుగైన జీవనం, 8న సుపరిపాలన, అవినీతి రహిత సమాజంపై కార్యక్రమాలు ఉంటాయన్నారు. అదేరోజు మహా సంకల్పం చేసి కార్యక్రమాన్ని ముగిస్తారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు కార్యక్రమం నిర్వహిస్తారు. రోజూ సీఎం ప్రసంగం, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆయా అంశాలతోపాటు నాలుగేళ్లులో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, చేయబోయే అంశాలు గురించి చెప్పాలని సూచనలు ఇచ్చారు. దీనికోసం జిల్లాకు రూ.కోటి కేటాయించారు. ఈ నిధులను కలెక్టర్ మండలాలు, పురపాలక సంఘాల వారీగా విభజిస్తారు.
నిలదీస్తారన్న బెంగ...
దీక్షల పేరుతో ప్రచారం చేయాలన్న టీడీపీ నేతలు మరోవైపు బెంగపడుతున్నట్టు సమాచారం. రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదు. మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ అటకెక్కించారు. పెట్టుబడి రాయితీ రూ.10వేలు కూడా పూర్తిగా ఇవ్వలేదు. బెల్ట్‌షాపులు నిషేధం జరగలేదు. యువతకు నిరుద్యోగ భృతికి అతీగతీ లేదు. పరిశ్రమలు రాలేదు... యువతకు ఉపాధి దొరకలేదు. పోనీ అభివృద్ధి కార్యక్రమాలైనా జరగాయంటే అదీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉపాధిహామీ నిధులతో చెరువు పనులు, సీసీరోడ్లు కొంతమేర జరిగాయి. పింఛన్లు, ఇళ్లు నేటికీ చాలామంది అర్హులకు దక్కలేదు. రుణాలు కోసం రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు తిరుగుతున్నా అందని పరిస్థితి. ఇదే అంశంపై అధికారుల్లో కూడా ఆందోళన మొదలైంది. గ్రామాలకు వెళితే జనం నిలదీస్తారేమోనని భయపడుతున్నా రు. జనవరి నెలలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో గత మూడేళ్లు లేనివిధంగా అధికా రులను నిలదీసిన విషయం వారు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈనేపథ్యంలో నవ నిర్మాణ దీక్ష ఎలా జరుగుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment