జనం సొమ్ముతో పార్టీ ప్రచారం | Tdp party campaign with peoples money | Sakshi
Sakshi News home page

జనం సొమ్ముతో పార్టీ ప్రచారం

Published Sat, Jul 28 2018 3:19 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Tdp party campaign with peoples money - Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడమే ఏకైక ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపరీతంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ ఈ తరహాలో అధికారాన్ని స్వలాభం కోసం వాడుకోలేదు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును చంద్రబాబు తన పార్టీ ప్రచారానికి ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల టీడీపీ పరిపాలనపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని జిల్లా కలెక్టర్లు నివేదిక ఇవ్వడంతో చంద్రబాబులో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది.

దీంతో ప్రభుత్వ ధనాన్ని, అధికార యంత్రాంగాన్ని విచ్చలవిడిగా వాడుకుంటే తప్ప వచ్చే ఎన్నికల్లో నెగ్గలేమని ఆయన నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. కిందిస్థాయి నుంచి పైస్థాయి దాకా మొత్తం అధికార యంత్రాంగాన్ని పార్టీ ప్రచారం కోసం వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అంటే ప్రభుత్వ అధికారులను అచ్చంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మార్చేస్తారన్నమాట.  

ప్రచార ఆర్భాటంతో గెలిచేద్దాం..
టీడీపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నట్లు తేలడంతో చంద్రబాబు హడావుడిగా నష్టనివారణ చర్యలు మొదలుపెట్టారు. ప్రభుత్వ అధికారులను, సిబ్బందిని పార్టీ కోసం ఉపయోగించుకోవడంతోపాటు ప్రచార ఆర్భాటంతో ప్రజల్లో భ్రమలు కల్పించి, ఓట్లు కొల్లగొట్టాలని నిర్ణయానికొచ్చారు. వచ్చే ఆరు నెలలు ప్రతి జిల్లాలోనూ ఆర్భాటంగా శంకస్థాపనలు చేసి, శిలాఫలకాలు వేసి భారీగా ప్రచారం పొందాలని యోచిస్తున్నారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతిపాదనల దశలోనే ఉన్న పరిశ్రమలకు ఆగమేఘాలపై శంకుస్థాపనలు చేసి, పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చేస్తున్నాయంటూ ప్రచార పర్వానికి తెరలేపేందుకు సన్నద్ధమవుతున్నారు. పింఛన్లు, రేషన్‌ కార్డులు...కమ్యూనిటీ సెంటర్లు... తాగునీటి పథకాలు... వచ్చే ఆరు నెలల్లో ఏ ఒక్కటీ పూర్తయ్యే అవకాశం లేకున్నా శంకుస్థాపనలతోనే సరిపెట్టి, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించాలని చంద్రబాబు ఎత్తుగడ వేశారు.

ఓట్ల దర్శిని
గ్రామదర్శిని, నగర దర్శిని పేరుతో సర్కారు సొమ్మును తెలుగుదేశం పార్టీ ప్రచారానికి ఖర్చు చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. గ్రామదర్శిని కింద ఆగస్టు నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు 150 రోజులపాటు అధికార యంత్రాంగాన్ని గ్రామాల పర్యటనకు పంపాలని నిర్ణయించారు.

ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం ఆదేశించారు. టీడీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో సాధించిన ఘన కార్యాలను వివరించడంతోపాటు సర్కారుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వీలైనంతమేర తగ్గించడమే గ్రామదర్శిని, నగర దర్శిని అసలు ఉద్దేశం. ఈ కార్యక్రమం అమలు కోసం గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిల్లో ప్రత్యేకంగా నోడల్‌ ఆఫీసర్లను నియమించారు.

సాధికార మిత్రల డ్యూటీ అదే..
సాధికార మిత్రలను కూడా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. వీరికి ప్రభుత్వ సొమ్ముతో ఐదు లక్షల 4జీ స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. ఫోన్ల కొనుగోలుకు ఐటీ శాఖ శుక్రవారం టెండర్‌ నోటిఫికేషన్‌ సైతం జారీ చేసింది. సాధికార మిత్రలు తమ పరిధిలోని ఓటర్ల సమాచారాన్ని సమగ్రంగా సేకరించడంతోపాటు స్మార్ట్‌ ఫోన్ల ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాల్సి ఉంటుంది.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే ఓటు వేసేలా ఓటర్లను సన్నద్ధం చేయడమే సాధికార మిత్రల విధి. ఈ మేరకు సాధికార మిత్రలకు త్వరలో శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లను కూడా తన పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్నికల దాకా వీరంతా అధికార పార్టీ కార్యకర్తలుగా పని చేయాల్సి ఉంటుంది.

ప్రచారానికి ప్రత్యేక విభాగాలు
టెంకాయ కొట్టి, ఓ శిలాఫలకం వేసిన మరుక్షణమే దానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. త్రీడీ యానిమేషన్‌తో ప్రచార చిత్రాలను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో కో–ఆర్డినేటర్‌ను ఈ పని కోసమే నియమించుకున్నారు. త్రీడీ యానిమేషన్‌ చిత్రాల కోసం ప్రత్యేకంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సాఫ్ట్‌వేర్లు సిద్ధం చేస్తున్నారు.

చూడగానే అక్కడేదో అద్భుతం జరిగిపోతోందనే రీతిలో చిత్ర నిర్మాణం ఉండేలా కసరత్తు చేస్తున్నారు. ఉదాహరణకు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే ఆలస్యం.. అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో అది పూర్తయినట్టు, గాల్లోకి విమానాలు ఎగురుతున్నట్టు, ఆ ప్రాంతంలో భారీగా పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు వచ్చేసినట్టు భ్రాంతి కలిగించేలా త్రీడీ యానిమేషన్‌ వీడియోలను తయారు చేయనున్నారు. సోషల్‌ మీడియాలో ప్రచారానికి కూడా ప్రత్యేక బృందాలను నియమిస్తున్నారు.


ఇదే ప్రభుత్వం మళ్లీ వచ్చేలా పనిచేయాలి 
సాధికార మిత్రలకు ఎంఈవో ఉద్బోధ 
నరసరావుపేట రూరల్‌:  ప్రభుత్వాధికారులు అధికార పార్టీ నాయకుల అవతారం ఎత్తుతున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండల విద్యాశాఖాధికారి(ఎంఈవో) ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయ ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

నరసరావుపేట ఎంఈవో కె.జ్యోతికిరణ్‌ శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో సాధికార మిత్రల శిక్షణ శిబిరంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే మళ్లీ ఎన్నికయ్యేలా సాధికార మిత్రలు పని చేయాలని సూచించారు. తిరిగి ఈ ప్రభుత్వం ఎన్నిక కాకుంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిలిచిపోతాయన్నారు. ఎంఈవో చేసిన వ్యాఖ్యలపై సమావేశంలో పాల్గొన్న వారంతా విస్మయం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement