ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం విజయవాడను ముంచేసిన వరదల విషయంలో సాయం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వరద బాధితులు పడుతున్న కష్టాలు, నష్టాల తీవ్రతను తగ్గించడం సంగతి ఎలా ఉన్నా మూడు నాలుగు రోజుల నిష్క్రియాపరత్వంతో దెబ్బతిన్న ప్రభుత్వ ప్రతిష్టను పునరుద్ధరించుకునేందుకే తంటాలు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.
వాస్తవానికి ప్రచారం చేసుకునే విషయంలో చంద్రబాబును మించిన వారెవరూ లేరు. కానీ.. ఆచంట మల్లన్న టైపు నేతలకు కూటమి ప్రభుత్వంలో లోటేమీ లేనట్టు స్పష్టమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంతి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్‌లు కూడా బాబును పొగడ్డమే తమ కర్తవ్యం అన్నట్టుగా వ్యవహరించారు. కాకపోతే పవన్ కళ్యాణ్ భజన కాస్తా వికటించి ఆయన పరువే తీసినట్టుగా కనిపిస్తోంది.
ఐదు రోజుల క్రితం విజయవాడను వరద చుట్టేసిన తరువాత చంద్రబాబు చేయని విన్యాసమంటూ లేదు. రోజూ రెండు మూడు సార్లు మీడియాతో మాట్లాడటం, జేసీబీపై ఎక్కి ఒకసారి.. పడవలో వెళ్లి ఇంకోసారి, మోకాలి లోతు నీళ్లలో మరోసారి వెళ్లి తాను జనంలోనే ఉన్నట్లు.. వారి కోసమే పని చేస్తున్నట్లు గట్టి కృషే చేశారు. ఏదో ఒక పేరుతో వరద ప్రాంతాల్లో తిరుగుతూండటంతో అధికారులే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బాబు గారు మాత్రం మీడియా కవరేజీ కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.
భజన మీడియా కూడా తనవంతుగా బాబుగారి ప్రచారానికి పోటాపోటీలు పడుతున్నాయి. అదేదో సినిమాలో ఉన్నట్లు.. ‘‘అన్న నడిచొస్తే మాస్.. అన్న మడతేస్తే.. మాస్.. మ మ మాస్’’ అనేలా ఉంది వీరి రాతలు. వరదలొచ్చిన ఐదు రోజులకు ఈనాడు ఓ కథనంలో... బుడమేరు వరదకు చంద్రబాబు చలించిపోయారని, బాధితులు, రైతుల కష్టాలు విన్నప్పుడు ఆయన కళ్లు చెమ్మగిల్లాయని, రాసుకొచ్చింది. విజయవాడలో వరదల కారణంగా ఇప్పటి వరకూ యాభై మంది మరణించారన్న సమాచారానికి మాత్రం అస్సలు ప్రాధాన్యత ఇవ్వలేదు. మొక్కుబడిగా కొన్ని వార్తలు రాసి చేతులు దులుపుకుంది.
వరద సహాయ చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి తీసుకునే చర్యల గురించి రాయడం తప్పు కాదు. కానీ ప్రజల బాధల కన్నా చంద్రబాబు గురించే ఈనాడు, తదితర మీడియాలు కొన్ని తెగ దుఃఖిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అతిగా చేసే ప్రచారం ఒక్కోసారి నష్టం కూడా చేయవచ్చు. కేంద్ర మంత్రి చౌహాన్ వరద బాధితుల దగ్గరకు వెళ్లి పరామర్శ చేశారో, లేదో కాని, టీడీపీ ప్రభుత్వానికి సర్టిఫికెట్ మాత్రం ఇచ్చేశారు. వరద సహాయ చర్యలు బాగానే చేసిందని తేల్చేశారు. మిత్రపక్షం కనుక మర్యాద కోసం ఒక మాట అంటే ఫర్వాలేదు కాని, డబ్బా కొట్టినట్లు మాట్లాడితే ప్రజలలో బీజేపీ నవ్వులపాలు కాదా? చంద్రబాబు ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తోందని చౌహాన్ కితాబు ఇచ్చారు. ఇల్లు మునిగిపోయి చంద్రబాబు తన బస కలెక్టరేట్‌కు మార్చిన విషయాన్ని చెప్పకుండా చెప్పకుండా, ఆయన సారథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కలెక్టరేట్‌నే సచివాలయంగా మార్చుకుని చేస్తోందని వ్యాఖ్యానించడం విశేషం.
వరదల వల్ల ఆస్తి నష్టం భారీగా జరిగినా ప్రాణ నష్టం మాత్రం స్వల్పంగా ఉందని కేంద్ర మంత్రి స్వయంగా చెబితే ఏమని అనుకోవాలి? వరదల కారణంగా యాభై మంది మరణిస్తే అది తక్కువ సంఖ్య అవుతుందా? మృతులు ఎందరో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ చెప్పలేని స్థితిలో ఉంటే... చౌహాన్ మాత్రం ఇలా విడ్డూరంగా మాట్లాడారు. పైగా తొలిసారి డ్రోన్ల ద్వారా బాధితులకు సాయం అందించారన్న చౌహాన్ మెచ్చుకోలు కూడా ఇప్పుడు విమర్శల పాలవుతోంది. ఉత్తరాఖండ్, కేరళల్లోనూ వరద సహాయక చర్యలకు డ్రోన్లను వాడిన విషయం కేంద్ర మంత్రికి తెలియదా? అని నెటిజన్లు ఎద్దేవ చేస్తున్నారు. కేంద్ర మంత్రి వరద నీటిలో అల్లాడుతున్న ప్రజలను పలకరిస్తే వారి బాధలు తెలుస్తాయి.
పైపైన తిరిగి, ఎగ్జిబిషన్ పోటోలు చూసి, చంద్రబాబును పొగిడి, తన బాధ్యత తీరిపోయిందని అయిందని అనుకున్నట్లుగా ఉంది చౌహాన్ వ్యవహారం. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. ఈయనతై బాధితులను స్వయంగా చూడలేదు కానీ చంద్రబాబును మాత్రం ఆకాశానికి ఎత్తుతూ పొగిడేస్తున్నారు. పవన్ ఈ స్థాయిలో బాబుకు లొంగిపోతారని ఊహించ లేదు. గతంలో నర్రా రాఘవరెడ్డి అని సీపీఎం ఎమ్మెల్యే ఒకరు ఉండేవారు. పవన్ కళ్యాణ్‌లా లొంగిపోయే వారిపై సామెతలు కొన్ని చెబుతుండేవారు.. ‘‘పొగడరా, పొగడరా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత’’ అని చెప్పాడని ఎద్దేవ చేసేవారు. పవన్ కళ్యాణ్ తీరు కూడా అలాగే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ సృష్టించిన ఫోటోలను ఎక్స్‌లో పవన్ పెట్టి చంద్రబాబుకు బాకా ఊది ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు.
ఒక వృద్దురాలు డ్రోన్ ద్వారా నడుం లోతు నీళ్లలో ఆహారపొట్లం అందుకున్నట్లు ఉన్న పోటోను పోస్టు చేశారు. ఇది తనకు సంతృప్తి ఇచ్చిందని, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కానీ అది కృత్రిమ ఫోటో కావడంతో ఆయన నవ్వుల పాలవయ్యారు. సోషల్ మీడియాలో దానిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో పవన్ తన వ్యాఖ్యను మార్చేశారు. చంద్రబాబుతోపాటు తిరగకుండా ఈయన ఏమి నేర్చుకున్నారో అర్ధం కాదు. చంద్రబాబే అధికార యంత్రాంగం విఫలం అయిందని ఒప్పుకుంటే ఈయన మాత్రం ప్రభుత్వం బాగా పనిచేసిందని గొప్పలు చెబుతున్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా వరదల్లాంటి విపత్తులు వచ్చినప్పుడు అధికారులకు ఆదేశాలిచ్చి.. అవి అమలయ్యాక జనం వద్దకు వెళ్లడాన్ని కూడా పవన్ తప్పుపట్టిన విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నాడు. వరదపీడిత ప్రాంతాలకు వెళితే అధికారుల విధులకు ఆటంకం అవుతుందని అంటున్నారు. మరి చంద్రబాబు పదే,పదే తిరుగుతూ అధికారులకు ఇబ్బంది కలిగించడం లేదా అని అంటే మాత్రం బాజా వాయిస్తారు.
మీడియా తలచుకుంటే ఎలా ప్రచారం చేయవచ్చనడానికి ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలి. చంద్రబాబు బుడమేరు వంతెనపై నిలబడి ఉంటే ,ఆ పక్కగుండా రైలు వెళ్లింది. దానికి ఏమని ప్రచారం చేశారో తెలుసా! చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పిందని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ఇచ్చాయి. అదేమిటా అని పరిశీలిస్తే ఆ పక్కనే రైల్వే ట్రాక్ ఉంటే రైలు వెళ్లింది. ఆ టైమ్ లో ఆయన చుట్టూరా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. ఆయన రైలు వస్తున్న విషయం గమనించి ,అటువైపు తిరిగి చూస్తూ నిలబడ్డారు. మరి ఇందులో ప్రమాదం ఏమిటో అర్థం కాదు. ఇలా రాయమని చంద్రబాబు చెప్పి ఉండకపోవచ్చు.
అయినా అతి భక్తి కల మీడియా ఇలా ప్రచారం చేసిందన్నమాట. ఈ నేపధ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం మీడియాలో ప్రచారం కోసమే తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఒరుగుతున్నది లేదని వ్యాఖ్యానించారు. పత్రికలు చేతిలో ఉండడంతో ఆయనను ఆకాశానికి ఎత్తుతున్నాయని ఎద్దేవ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ బుడమేరు ఆక్రమణల గురించి మాట్లాడడాన్ని ప్రస్తావించి, చంద్రబాబుతో మాట్లాడి కృష్ణా కరకట్టే మీద ఉన్న అక్రమ నివాసం నుంచి ఖాళీ చేయించాలని రాంబాబు సూచించారు. పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ ధైర్యంగా ఆ విషయం మాట్లాడగలరా? ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వ్యవహార శైలి చూస్తుంటే అది అయ్యే పని కాదనిపిస్తుంది.
తెలుగుదేశం నేతలకన్నా ఎక్కువగా పోటీపడి చంద్రబాబును పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు. వరద ప్రాంతాలవారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలోను, వరద బాధితులను ఆదుకోవడంలోను విఫలం అవడంతో నాలుగైదు రోజులపాటు ప్రజలు అల్లాడిపోయారు. ఇళ్లలోని సామానంతా పాడైపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో వారుంటే చంద్రబాబు, ప్రభుత్వ నేతలు తమ జబ్బలు తామే చరుచుకుని మురిసిపోతున్నారు.
వరద బాధితులు అందరికి రేషన్ ఇవ్వలేకపోయామని అంటారు. వారి ఇళ్లకు రేషన్ చేర్చకుండా రేషన్ షాపుల వద్దకే వెళ్లి సరుకులు తీసుకోవాలని చంద్రబాబు చెప్పడం మాత్రం శోచనీయం. ఇది పెద్ద వైఫల్యం కాదా! అయినా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నేతలు ఒకరినొకరు పొగుడుకుని ఆత్మవంచన చేసుకుంటున్నారు. అనుకూల మీడియా ప్రచారం ద్వారా బాధితుల కష్టాలను కప్పిపుచ్చాలని చూస్తున్నారు. జనం ఈ ప్రచారానికే అన్నీ బాధలు మర్చిపోతారా!
- కొమ్మినేని శ్రీనివాస రావు
సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment