ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన రెండు ప్రకటనలు గమనించారా! విజయవాడ వరద బాధితులందరికి ఆహార పదార్థాలను సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన చెప్పారు. కరకట్టలోని తన అక్రమ నివాసంలోకి నీరు వచ్చిన సంగతిని ఆయన ఒప్పుకున్నారు. కానీ.. ఈ రెండు విషయాలను ఆయన ఒప్పుకున్న తీరు మాత్రం విమర్శలకు తావిచ్చేదే. తప్పంతా ఇతరులదే కానీ తనది ఏమాత్రం కాదన్న రీతిలో మాట్లాడే ప్రయత్నం చేశారాయన. పైగా.. వరద బాధితులకు ఆహారం అందకపోవడం వారి తప్పే అన్నట్లు ప్రత్యారోపణ చేసేశారు.
కరకట్టపై అక్రమంగా కట్టిన ఇంట్లోకి నీళ్లు రావడంపై కూడా ఆయన తనదైన వ్యాఖ్య చేశారు. తన ఇంట్లోకి నీళ్లు వస్తే ఏమిటట? అని ఎదురు ప్రశ్నించి అక్కడ ఉన్న మీడియాను ఆశ్చర్యపరిచారు. విజయవాడను వరద ముంచెత్తిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. మంగళవారం రాత్రి బాగా పొద్దు పోయాక ప్రభుత్వ వైఫల్యం, తనింట్లోకి నీళ్లు చేరడాన్ని ఒప్పుకుంటూనే తనకే సాధ్యమైన శైలిలో బుకాయింపులకు దిగారు.
చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే వయసులో పెద్దవాడైనందుకైనా ఆయనకు గౌరవం దక్కేది. కానీ ఈ సందర్భాన్ని కూడా ప్రతిపక్ష వైసీపీపై, జగన్‌పై విమర్శలకు వాడుకోవడం, బురద రాజకీయాలకు దిగడం చేశారు. బాబు మాటలకు తందాన పలిక ఈనాడు, ఆంధ్రజ్యోతులు యథా ప్రకారం వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
వైఫల్యం ఉందని బాబు స్వయంగానైనా ఒప్పుకున్నారేమో కానీ.. ఆయనకు వంతపాడే మీడియా మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. పునాదులు, భవంతులు నీట మునిగి ఉన్నది ప్రత్యక్షంగా కనిపిస్తున్నా సరే.. రాజధాని ప్రాంతం అమరావతికి ఏం కాలేదని అబద్ధాలు రాసేశాయి. ఇదే నిజమని అనుకుంటే చంద్రబాబు ఇల్లు ఉన్నదెక్కడ? రాజధాని ప్రాంతంలోనే కదా? ఈ విషయంపై మాత్రం సదరు పత్రికలు నోరు విప్పవు. కరకట్ట నివాసంలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరిందన్న విషయాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ మీడియా నానా ప్రయత్నాలూ చేసింది. ఆంగ్ల పత్రికలు కొన్ని మాత్రమే ఈ సమాచారాన్ని అందించాయి.
చంద్రబాబు వరద బాధితుల పరామర్శకు పలుమార్లు వెళ్లారు. కానీ ఈ పర్యటనల వల్ల ప్రజల కష్టాలు మరిన్ని పెరిగాయే కానీ తగ్గింది లేదు. ఆయన బోటు ‘షికార్ల’కు ఏడెనిమిది మంది అధికారులు వెంట రావడంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఇబ్బంది అయ్యిందని కొందరు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జేసీపీ పొక్లెయిన్ ఎక్కి ఏదో ఊరేగింపుగా వరద ప్రాంతాల్లో పర్యటించడం కూడా విమర్శలకు గురైంది. ప్రచారం కోసం ఇలాంటి గిమ్మిక్కులు మామూలు రోజుల్లో చేస్తే ఓకేనేమో కానీ.. ఒక పక్క ప్రజలు పీకల్లోతు నీటి కష్టాల్లో ఉండగా... వీడియో షూట్ల కోసమో, ఫోటోల కోసమో ఇలా చేయడం వల్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశాలే ఎక్కువ.
బాధితులకు ఆహారం అందించే విషయంలో తాను ఎంత సిద్ధం చేసినా అధికారులు అందరికీ అందించడంలో విఫలమయ్యారని.. ముందున్న కాలనీల్లోని బాధితులు ఎక్కువ ప్యాకెట్లు తీసుకోవడంతో అందరికీ అందలేదని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడవచ్చా! సరిపడినన్ని వాహనాలు రెడీ చేసి, ఆయా ప్రాంతాలకు పంపించి ఉంటే జనం ఎందుకు ఎగబడతారు? మూడు రోజులుగా భోజనం, నీరు, పాలు వంటివి సరిగా అందక ప్రజలు అల్లాడుతున్నారు. వీరిని రక్షించేందుకు తగినన్ని పడవలూ ఏర్పాటు చేయలేదు. దాంతో ప్రైవేటు బోట్ల వారు ప్రజలను అప్పనంగా దోచుకున్నారని కూడా సమాచారం. ఈ విషయాలన్నిటిలో ప్రభుత్వ వైఫల్యం అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా చంద్రబాబు మాత్రం అదేదో అధికారుల వైఫల్యంగా చిత్రించి తప్పుకునే యత్నం చేశారు.
తుఫాను, వాయుగుండం వంటివి వస్తున్నప్పుడు వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరికలు చేస్తుంది. ఆ వెంటనే ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులను, అధికారులను అప్రమత్తం చేసి చేసి సమీక్షలు నిర్వహించి తగు భద్రతా చర్యలు తీసుకోవాలి. ముందస్తుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను తరలించాలి. వీటిలో ఒక్కటి కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించలేదన్నది వాస్తవం. బుడమేరుకు వెలగలేరు గేట్లను ఎత్తడానికి ముందు ప్రజలను ఎందుకు హెచ్చరించలేదు? గతంలో వలంటీర్ల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం పంపేవారు. చంద్రబాబు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. దాని ప్రభావం ఇప్పుడు తెలిసింది. తీరా సమస్య తీవ్రమైన తర్వాత చంద్రబాబు వరద పీడిత ప్రాంతాలలో తిరిగితే ఏమి ప్రయోజనం? సరిగ్గా అదే జరిగింది. ముఖ్యమంత్రి తిరిగినా, ప్రజల కష్టాలు తీరలేదని అంటున్నారు. అధికారులు సీఎం చుట్టూరా తిరగడానికే టైమ్ కేటాయించాల్సి వచ్చింది. తెలుగుదేశం మీడియా ఇదంతా జిల్లా స్థాయి అధికారుల వైఫల్యంగా చిత్రీకరించింది. నిజానికి ఇప్పుడు ఉన్న అధికారులంతా టీడీపీ ప్రభుత్వం ఏరికోరి తెచ్చుకున్న వారే. గతంలో కలెక్టర్లు, ఎస్పీలుగా ఉన్న పలువురిని రెడ్ బుక్ పేరుతో బదిలీ చేశారు. పలువురికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇప్పుడేమో కొత్తగా వచ్చిన అధికారులు సరిగా పని చేయలేదని వీరే అంటున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి?
‘‘కరకట్ట లోపల ఉన్న ఇంటిలోకి నీరు వస్తే ఏంటట? అందరి ఇళ్లలోకి వచ్చాయి’’ అని చంద్రబాబు అనడం విడ్డూరమే. ఆయన అక్రమ కట్టడంలో ఉంటున్నారా? లేదా? నది తీరంలో నిషేధిత జోన్‌లో నివసిస్తున్నారా లేదా? వీటి గురించి మాట్లడకుండా ప్రజలను ప్రశ్నించడం ద్వారా ఏమి చెప్పదలచుకున్నారు? సీఎం వరద బాధితుడిగా మారి కలెక్టరేట్ కు వెళ్లి పోతే సాధారణ ప్రజలను ఏలా రక్షిస్తారు అన్న ప్రశ్న రాదా ? బుడమేరు రెగ్యూలేటర్ గేట్లను ఎత్తివేయడం గురించి జగన్ చేసిన ఆరోపణలు తోసి పుచ్చడానికి యత్నించారు .ప్రకాశం బ్యారేజీ వద్దకు కొట్టుకువచ్చిన పడవల గురించి మాట్లడుతూ ఒక వైపు ప్రమాదం అంటూ, మరోవైపు కుట్ర అంటూ అనుమానం వ్యక్తం చేయడం శోచనీయం. అన్ని చోట్ల ఆవు కథలు చెప్పినట్టు... ఇక్కడ కూడా మాజీ మంత్రి వివేక హత్య కేసును ప్రస్తావించడం ఏ మాత్రం బాధ్యతగా లేదు. అలాగే గుడ్లవెల్లెరు కాలేజీ విషయం కూడా ఇక్కడ మాట్లాడడం ఎందుకో అర్ధం కాలేదు.
బుడమేరు వరదలపై ముందస్తు హెచ్చరికల గురించి అడిగితే ...గత ప్రభుత్వం టైంలో గండ్లు పూడ్చకపోవడం వల్ల వరదలు వచ్చాయని సంబంధం లేని సమాధానం చెబుతారు. అమరావతి రాజధాని ప్రాంతం వరదకు గురి అవుతోందని చెప్పడంపై ఆయన మండిపడుతున్నారు. దాన్ని దుష్పప్రచారం అంటున్నారు. అక్కడ వర్షం వల్లే నీరు వచ్చింది అని... వరద కాదని ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ప్రచారం చేసింది.దీన్ని బట్టి వారు ఎంత కంగారు పడుతుందన్నది చెప్పవచ్చు. ఎంత సేపూ అమరావతి రియల్ ఎస్టేట్ గొడవ తప్ప.. అక్కడ వరద రాకుండా ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టలేకపోతున్నారు.
రాజధాని ప్రాంతం అంతా బాగుంటే సచివాలయ ఉద్యోగులను ముందుగా ఎందుకు ఇంటికి పంపించారు? అలాగే హైకోర్టు మధ్యాహ్న రెండు గంటలకే ఎందుకు వాయిదా పడింది? నది ఒడ్డున ఉన్న భవనాలకు నీరు ఏలా చేరింది? అదంతా రాజధాని ప్రాంతం కాదా? కృష్ణ లంక వద్ద వరద నీరు రాకుండా జగన్ నిర్మించిన భారీ గోడను తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు. తెలుగు దేశం మీడియా కూడా అలాంటి ప్రచారం చేయడానికి తంటాలు పడింది. కానీ స్థానికులకు వాస్తవం తెలుసు కనుక జగన్ ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు జనం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో జగన్ పర్యటించి ప్రజల సమస్యలను వాకబు చేసినప్పుడు వారు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారని, అర్ధరాత్రి వేళ వెలగలేరు లాక్‌లు ఎత్తివేయడంతోనే ఈ సమస్య వచ్చిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రజలకు క్షమపణ చెప్పి... బాధితులను అదుకోవాలన్నారు. జగన్ టూర్ ఎఫెక్ట్ కొంత పనిచేయ బట్టి, చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని పెద్ద ఎత్తున రంగంలోకి దించుతున్నట్టు ప్రకటించారన్న అభిప్రాయం ఏర్పడింది. అయినా మంగళవారం, బుధవారం సైతం ప్రజలు తగు రీతిలో సదుపాయాలు అందక అల్లాడుతూనే ఉన్నారు.
రెడ్ బుక్ రాజ్యంగం అంటూ పెద్ద ఎత్తున హింసాకాండకు దిగిన తెలుగు దేశం ప్రభుత్వం ఇలాంటి సంక్షోభాల్లో ప్రజలకు వరదల రెడ్ అలెర్ట్ ఇవ్వడంలో విఫలం అయ్యింది. అందువల్లే ప్రజలు గతంలో జగన్ టైంలో వరద సహయ చర్యలను భాదితులను అదుకున్న తీరును గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం యథా ప్రకారం వైసీపీని విమర్శిస్తూ ఇలాంటి సమయంలో కూడా తన రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా, విమర్శలు కురిపించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరో కీలక మంత్రి లోకేష్ వంటివారు ఈ వరదల సమయంలో ఎక్కడ ఉన్నారో తెలియదు. అదే కొసమెరుపు. తాను పర్యటిస్తే అధికారుల విధులకు ఆటంకం కలుగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే వరద ప్రాంతాలలో తిరుగుతూ చంద్రబాబు తప్పు చేస్తున్నారని ఆయన అంటున్నారా!
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment