అవసరానికి వాడుకోవడం.. అవసరం తీరాక మోహంచాటేయడం.. మాట విననివారికి వెన్నుపోటు పొడవడం వంటివి చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య!. ఓటర్లు, నాయకులు, సొంత బంధువులపైనా ఆయనది అదే ధోరణి!. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార దాహంతో రగిలిపోతున్నారు. దీనికోసం పార్టీకి దశాబ్దాల తరబడి సేవలందించిన సీనియర్ నాయకులను కాదని డబ్బున్నోళ్లకే సీట్లు కేటాయించేందుకు రెడీ అవుతుండడంతో ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేగుతోంది. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును కొన్ని వర్గాలవారు బహిరంగంగానే విమర్శిస్తుండగా, మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వారంతా ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు... సుదీర్ఘ కాలంగా తెలుగుదేశంపార్టీలో విశేషమైన సేవలు అందించినవారు... అందులోనూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా! టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఆ పార్టీను, అధినేత చంద్రబాబును నమ్ముకునే ఇన్నాళ్లూ ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యం చెందినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబును ప్రజలు ఛీదరించుకున్నప్పటికీ ఆయన వెన్నంటే ఉంటూ నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చారు.
తీరా 2014 ఎన్ని కలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నో దశాబ్దాలుగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వారి కష్టాన్ని గుర్తించకుండా వారి దగ్గర డబ్బు సంచులు లేవనే నెపంతో ఇప్పుడు వారిని పక్కనపెట్టేసి కోట్లకు పడగలెత్తిన ప్రవాస భారతీయులను, పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు నాయకులు ఎవరైనా సరే అవసరానికి వాడుకొని కరివేపాకులా పక్కనపడేస్తారన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది. బీసీ జపం చేసే చంద్రబాబు ఆచరణలోకి వచ్చేసరికి గెలుపుగుర్రాల పేరుతో ధనబలం ఉన్న వారివైపే మొగ్గు చూపిస్తున్నారని జిల్లాలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
వీరి నాయకత్వానికి తిలోదకాలు!
ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఎస్.కోట, నెల్లిమర్ల, పార్వతీపురం నియోజకవర్గాల్లో టీడీపీ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే నాయకులు కోళ్ల అప్పలనాయుడి కోడలు కోళ్ల లలితకుమారి, పతివాడ నారాయణస్వామినాయుడు, బొబ్బిలి చిరంజీవులు. ఈ ముగ్గురు నాయకులు టీడీపీలో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్నావారే. కానీ ప్రస్తుతం వారి ముగ్గురి పరిస్థితి త్రిశంకుస్వర్గంలా మారింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్ దక్కే అవకాశాలు దాదాపుగా లేవనే చర్చలు సాగుతున్నాయి. ఆ ముగ్గురు సీనియర్ నాయకులు జిల్లాలోని ప్రధాన సామాజిక వర్గాలైన కొప్పలవెలమ, తూర్పుకాపు, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం.
45 ఏళ్ల సీనియార్టీకి చిక్కులు
ఎస్.కోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుటుంబానికి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. ఆమె మామ కోళ్ల అప్పలనాయులు ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అందులో ఆరు సార్లు టీడీపీ నుంచే కావడం గమనార్హం. ఒకసారి మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన కోడలు లలిత కుమారి రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఐదేళ్లూ ప్రతిపక్షంలో సైతం టీడీపీ అండగా ఉన్నారు.
అయితే, ఆమె దగ్గర ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి రూ.కోట్లలో డబ్బులు లేవని, ఉన్నా ఖర్చు చేయరనే ఒకేఒక్క సందేహంతో చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఆమెను పక్కనపెట్టేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలే రాజకీయ తెరంగేట్రం చేసిన ప్రవాస భారతీయుడు గొంప కృష్ణకు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడం అందుకు ఊతమిస్తోంది. వేపాడ మండలానికి చెందిన ఆయనకు రాజకీయ నేపథ్యం లేకున్నా డబ్బులు బాగానే ఉన్నాయని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. పార్టీలో తనకు జరిగిన అవమానంపై లలితకుమారి కొన్నాళ్లుగా అగ్గి మీద గుగ్గిలం మాదిరిగా రగిలిపోయినా చంద్రబాబు ఏమి మంత్రం వేశారో కానీ తర్వాత చల్లబడిపోయారు.
లోకేశ్‌తో డీల్... చిరంజీవులుకు ఎసరు!
పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టిక్కెట్ బోనెల విజయచంద్రకేనని చంద్రబాబు విస్పష్టంగా చెప్పేశారు. ప్రవాస భారతీయుడైన ఆయనకు ఏమాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా కేవలం ధనబలం ఉందన్న కారణంతోనే టిక్కెట్ ఇస్తున్నారనే విమర్శలు ఆ పార్టీలోనే వస్తున్నాయి. నేరుగా నారా లోకేశ్‌తో డీల్ కుదుర్చుకొని వచ్చి ఇంతవరకు ఆ పార్టీ బాధ్యతలు చూసుకున్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు టిక్కెట్‌కు ఎసరు పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పతివాడకు తీవ్ర పరాభవం...
నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ వింత ఆచారానికి తెరతీసింది. నలభై సంవత్సరాలుగా టీడీపీలో ఎనలేని సేవలు అందిస్తూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపొందిన పతివాడ నారాయణస్వామినాయుడిది ఒక రికార్డు. ప్రోటెం స్పీకర్‌గా, చక్కెర, వాణిజ్యశాఖా మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం ఆయనను, ఆయన వారసులను కనీసం పట్టించుకోవడం లేదు. వారిని పక్కనబెట్టి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కర్రోతు బంగార్రాజును ఏడాది కిందట టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా చంద్రబాబు నియమించారు.
కానీ ఇప్పుడు టీడీపీ–జనసేన పొత్తులో భాగంగా నెల్లిమర్ల టీడీపీ టిక్కెట్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవికి కేటాయించడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో బంగార్రాజు వర్గం కంగుతింది. విజయనగరానికి చెందిన ఆమె, ఆమె భర్త మిరాకిల్ ఇంజినీరింగ్ కాలేజీ, మిరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అధిపతులు. కోట్లాది రూపాయల సంపద ఉన్న వారి ముందు పతివాడ 40 ఏళ్ల అనుభవం, కర్రోతు బంగార్రాజు సామాజిక బలం చంద్రబాబుకు కనిపించకుండాపోయాయనే చర్చ సాగుతోంది.
ఎక్కువ కాలం విదేశాల్లోనే ఉన్న మాధవి జనసేన పార్టీ తరఫున నెల్లిమర్ల టిక్కెట్ తనకే వస్తుందన్న ధీమాలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోవైపు గంటా శ్రీనివాసరావు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఐదేళ్లకోసారి నియోజకవర్గం మార్చేసే ఆయన ఈసారి నెల్లిమర్ల నుంచి టీడీపీ టిక్కెట్‌తో బరిలోకి దిగుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. ధన బలం ఉన్న లోకం మాధవి, గంటా శ్రీనివాసరావుల పేరు తప్ప పతివాడ కుటుంబం పేరు ఎక్కడా టీడీపీ–జనసేనలో వినిపించలేదు. కనిపించట్లేదు!
Comments
Please login to add a commentAdd a comment