విజయనగరం రూరల్: జిల్లాలో మద్యం వ్యాపారులపై ప్రభుత్వ పెద్దలు, ఎక్సైజ్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా జిల్లాలోని మద్యం వ్యాపారులు శనివారం మద్యం దుకాణాలు మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని 202 మద్యం దుకాణాలకు గత జూలైలో ఎక్సైజ్‌శాఖ అధికారులు లాటరీ నిర్వహించగా 201 మద్యం దుకాణాల లెసైన్సులను మద్యం వ్యాపారులు దక్కించుకున్నారు. వాస్తవంగా మద్యం వ్యాపారంలో లాభాలు ఆశించినంతగా లేవని సుమారు 60 మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం మద్యం బాటిళ్లపై వ్యాపారులకు ఇస్తున్న కమీషను పెంపుదల చేస్తామని హామీనివ్వడంతో మిగిలిపోయిన మద్యం దుకాణాలకు వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే లాటరీ వ్యవహారం ముగిసిన తర్వాత పెంచుతామన్న కమీషను నేటివరకు పెంచకపోవడంతో ఎంఆర్‌పీ కంటే అదనంగా అమ్మకాలు సాగించాలని మద్యం వ్యాపారులు అధికారులను కోరారు.
ఇటీవల సంక్రాంతి పండగ, కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని మద్యం వ్యాపారులు ఎంఆర్‌పీపై అదనంగా ఐదు రూపాయలు పెంచి అమ్మకాలు సాగించారు. దీంతో జిల్లా మంత్రి ఆదేశాలతో ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాలపై దాడులు ముమ్మురం చేశారు. ఎంఆర్‌పీ కంటే అదనంగా అమ్మిన 21 దుకాణాలపై కేసులు నమోదు చేసి రూ.21 లక్షతు అపరాధ రుసుం విధించారు. అలాగే ఇటీవల సీఎం చంద్రబాబు సైతం మద్యం అమ్మకాలపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో ఎక్సైజ్ అధికారులు ప్రతి మద్యం దుకాణం వద్ద ఎంఆర్‌పీకే మద్యం అమ్మకాలు సాగించాలని, ఫిర్యాదులు చేయడానికి ఎక్సైజ్ కార్యాలయంలో ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేశారు.
అలాగే గతంలో ఎంఆర్‌పీకంటే అధికంగా అమ్మకాలు సాగిస్తే విధించే లక్ష రూపాయల అపరాధ రుసుంను రెండు లక్షలకు పెంచడంతో మద్యం వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మద్యం వ్యాపారుల అసోసియేషన్ రెండురోజులుగా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారి ఇబ్బందులను ఏకరువు పెడుతున్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఎంఆర్‌పీకంటే అదనంగా రూ.10 పెంచి మద్యం అమ్మకాలు సాగిస్తున్నా ప్రభుత్వ పెద్దలకు కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఎంఆర్‌పీకంటే అదనంగా కొన్ని నెలలుగా అమ్మకాలు సాగిస్తున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదన్నారు.
కేవలం విజయనగరం జిల్లాలో మద్యం వ్యాపారులపై కక్ష సాదింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని వాపోయారు. కేవలం ఒక నెలలో పండగలను పురస్కరించుకుని ఐదు రూపాయలు పెంచి అమ్మకాలు సాగిస్తే ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారని అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారమయ్యే దాకా మద్యం దుకాణాలను తెరిచేది లేదని స్పష్టంచేశారు. ఎలాగూ మద్యం వ్యాపారంలో పూర్తిగా నష్ట పోయామని, ఇప్పుడు కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ఆదివారం కూడా మద్యం దుకాణాలు తెరిచేది లేదని, ప్రభుత్వ పెద్దలు స్పందించి తమకు న్యాయం చేసేవరకు నిరసన తెలుపుతూనే ఉంటామన్నారు.
కోటి రూపాయల అమ్మకాలు బంద్
శనివారం మద్యం దుకాణాలు మూసివేయడంతో జిల్లా వ్యాప్తంగా కోటి రూపాయల వరకు మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. అలాగే రెండు రోజులుగా ఐఎంఎల్ డిపో నుంచి మద్యం వ్యాపారులు మద్యాన్ని తీసుకువెళ్లకపోవడంతో స్టాకు నిలిచిపోయింది. ఆదివారం మద్యం దుకాణాలు బంద్ అయితే మరో కోటి రూపాయల వరకు మద్యం అమ్మకాలు నిలిచిపోతాయి.
మద్యం దుకాణాల బంద్
Published Sun, Feb 15 2015 3:04 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement