అర లక్ష ఇస్తే...అంతా ఓకే ఇదీ నేతల వైన్‌ం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : అధికారం అడ్డం పెట్టుకుని దండుకునే కార్యక్రమంలో కొందరు నేతలు నిమగ్నమయ్యారు. ముగ్గురు ప్రజాప్రతినిధులైతే నైతికమా, అనైతికమా అన్నది పక్కన పెట్టి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అనుకున్నది జరగని చోట తమ పవర్ చూపిస్తున్నారు. కొన్నిచోట్ల అధికారులను ఉసిగొల్పి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. దీనికి మద్యం వ్యాపారస్తులతో జరుగుతున్న లోపాయికారీ ఒప్పందాలే ఉదాహరణ. బెల్ట్‌షాపులు మూసేస్తుండడం వల్ల తమ వ్యాపారాలు తగ్గిపోయాయని, మరోవైపు ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే దాడులు నిర్వహిస్తుండడంతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నామని గగ్గోలు పెడుతున్న మద్యం వ్యాపారస్తులతో డీల్ కుదుర్చుకునే పనిలో పలువురు అధికార పార్టీ నేతలు బిజీగా ఉన్నారు. మధ్యవర్తుల జోక్యంతో రంగంలోకి దిగిన నేతలుఒప్పందాలు చేసుకుంటు న్నారు. ఒక్కొక్క లెసైన్స్ షాపు ప్రతి నెలా రూ.50 వేలు చొప్పున ఇస్తే ఆ షాపు పరిధిలో నాలుగు బెల్ట్‌షాపులు నడుపుకోవడానికి, ప్రతి బాటిల్‌పై రూ.5 నుంచి 10 అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పిస్తామని ఆఫర్ ఇస్తున్నారు.
ఈ క్రమంలో కొన్నిచోట్ల అం గీకారం కుదరడంతో ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు విక్రయాలు జరగడమే కాకుండా బెల్ట్‌షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయన్న వాదనలు ఉన్నాయి. ఎక్కడైతే డిమాండ్ చేసినట్టు రూ.50 వేలు ఇవ్వడం లేదో ఆ షాపులపై అధికారులతో దాడులు చేయిస్తున్నట్టు తెలిసింది. అడిగినంతా ఇచ్చేందుకు ఆసక్తి చూపని చోట (బేరసారాలు కొలిక్కిరాని ఏరియా) దారికితెచ్చుకునే వ్యూహంలో భాగంగా వారికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. బెల్ట్‌షాపులన్ని మూసేయాలని, ఎంఆర్‌పీకి మించి విక్రయాలు చేస్తే చర్యలు తీసుకో వాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశిస్తున్నారు. అది కూడా హెచ్చరించినట్టు ఉండాలని పరోక్షంగా అధికారులకు సూచిస్తున్నారు. దీం తో తూచ తప్పకుండా అధికారులు దాడులకు ఉపక్రమించి హడావుడి చేస్తున్నారు. ఈక్రమంలోనే దారికి తెచ్చేలా రాయబేరాలను సాగిస్తున్నారని సమాచారం.
సందట్లో సడేమియా...పట్టుబడుతున్న తెలుగు తమ్ముళ్లు
నేతలు డీల్ కుదుర్చుకునే పనిలో నిమగ్నమవగా క్షేత్రస్థాయిలో ఉన్న తెలుగు తమ్ముళ్లు సందట్లో సడేమియాలా అనధికారంగా మద్యం రవా ణా చేస్తున్నారు. తమ పార్టీ నేతల షాపుల నుంచి కేసులను తీసుకుని అనధికార విక్రయాలు చేపడుతున్నారు. దొరకకుండా దర్జాగా వ్యాపా రం చేసుకుంటున్నారు. దొరికితే తమ నేతల సిఫారసులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పూసపా టిరేగ మండలం చల్లవానితోట పరిధిలో అదే జరిగింది. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు తమకు సమీపంలో ఉన్న టీడీపీ నేత వైన్‌షాపు నుంచి పెద్ద ఎత్తున మద్యం సీసాలు తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డారు. కానీ, వారి నుంచి పట్టుకున్న సీసాలు సొం తంగా తాగేందుకు తీసుకెళ్తున్నవే తప్ప విక్రయించడానికి కాదనే కోణంలో కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి. అయితే, దీని లోగుట్టు సదరు ఎక్సైజ్ అధికారులకే ఎరుక. ఇక్కడొక చోటే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే తరహా తంతు నడుస్తోంది.