తర్జనభర్జన
- హైవేల పక్కన మద్యం దుకాణాల తొలగింపునకు ‘సుప్రీం’ ఆదేశం
- జిల్లాలో 247 మద్యం దుకాణాల్లో 179 హైవేల పక్కనున్నవే
- తొలగింపునకు ఈ నెల 31 డెడ్‌లైన్..
- ఎక్సైజ్ అధికారులు, మద్యం దుకాణాదారుల్లో టెన్షన్
అనంతపురం సెంట్రల్ : జాతీయ, రాష్ట్రీయ రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాల తొలగింపుపై ఎక్సైజ్ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ద్వారా అధికశాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారికి ఆనుకుని మద్యం షాపులు, బార్లు ఉండడం ద్వారా ప్రజలు మరింత ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తాగి హైవేలపై రయ్‌మంటూ వాహనాలు నడుపుతున్నారు. వారు నష్టపోవడంతో పాటు ఎదురుగా వస్తున్న అమాయకుల ప్రాణాలను సైతం బలిగొంటున్నారు. ఈ అంశంపై రెండు నెలల క్రితం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. జాతీయ రహదారుల పక్కన మద్యం దుకాణాలను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందుకు మార్చి 31 గడువు విధించింది. జిల్లాలో మెజార్జీ మద్యం దుకాణాలు హైవేపైనే ఉన్నాయని అధికారుల సర్వేలో తేలింది. మొత్తం 247 మద్యం షాపులలో జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన 179 షాపులు ఉన్నట్లు గుర్తించారు. వ్యాపార కోణంలో ఆలోచించి ప్రతి ఒక్కరూ హైవే పక్కనే ఏర్పాటు చేసుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ షాపులను ఏం చేయాలో అర్థం కాక అధికారులు సతమతమవుతున్నారు. సదరు మద్యం దుకాణాలకు జూన్ వరకూ లైసెన్స్ గడువు ఉంది. దీంతో రెండు నెలలు మినహాయించాలని దుకాణాదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో న్యాయంస్థానం నుంచి ఎలాంటి కబురు వస్తుందో అనే టెన్షన్ ఇటు అధికారుల్లోనూ, మద్యం దుకాణాదారుల్లోనూ నెలకొంది.
ఆదేశాలు రాలేదు
జిల్లాలో మద్యం దుకాణాలకు జూన్ వరకూ గడువు ఉంది. న్యాయస్థానం మార్చి 31లోగా హైవేల పక్కన ఉన్న వాటిని తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొంతమంది దుకాణాదారులు మరికొంత గడువు కావాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ఉత్తర్వులను అనుసరించి చర్యలు తీసుకుంటాం.
- అనుసూయదేవి, డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్