సిండి కేట్ల దందా ! | Liquor mafia in Vizianagaram | Sakshi
Sakshi News home page

సిండి కేట్ల దందా !

Published Thu, Oct 9 2014 12:56 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

సిండి కేట్ల దందా ! - Sakshi

సిండి కేట్ల దందా !

మద్యం సిండికేట్లుమళ్లీ చెలరేగిపోతున్నాయి. ఎంఆర్‌పీకి మించి విక్రయిస్తున్నారు. నాడు మద్యం మాఫియాను వ్యతిరేకించిన నాయకులే నేడు అండగా నిలుస్తున్నారు. భారీగా ముడుపులు

 మద్యం సిండికేట్లుమళ్లీ చెలరేగిపోతున్నాయి. ఎంఆర్‌పీకి మించి విక్రయిస్తున్నారు. నాడు మద్యం మాఫియాను వ్యతిరేకించిన నాయకులే నేడు అండగా నిలుస్తున్నారు. భారీగా ముడుపులు తీసుకుని బెల్ట్ షాపులను ప్రోత్స హిస్తున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే లక్ష్యాలను చేరుకోవాలంటే ఉదాసీనంగా ఉండకతప్పదని పరోక్షంగా చెప్పుకొస్తున్నారు. పనిలో పనిగా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీంతో మూడు పువ్వులు- ఆరు కాయలుగా సిండి కేట్ల హవా సాగిపోతోంది.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం :  ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం ఇచ్చే టార్గెట్‌ను భారీగా పెంచింది. ఆ స్థాయికి విక్రయా లు పెంచాలని వైన్‌షాపులపై ఒత్తిళ్లు మొ దలయ్యాయి. ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉంటే తప్ప విక్రయాలు పెరగవని వ్యాపారులు మొండికేయడంతో వ్యాపారులు, అధికార పార్టీ నేతలు, ఎక్సైజ్ అధికారులు ఒక ఒప్పందానికి వచ్చారని తెలిసింది. తలో ఇంతని అనుకుని ముందుకెళ్లితేనే అందరికీ మంచిదని నిర్ణయానికొచ్చారని సమాచారం. అందులో భాగంగా ఎవరికివ్వాల్సింది వారికిచ్చేశారు. అడ్డుకునేదెవరని బరితెగించి విక్రయాలకు దిగారు. క్వార్టర్ బాటిల్‌పై ఎంఆర్‌పీకి అదనంగా రూ.5 నుంచి రూ. 10 పెంచి యథేచ్ఛగా విక్రయాలు చేస్తున్నారు. మందు బాబులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎంఆర్‌పీకి మించి విక్రయంచడమే కాకుండా బెల్ట్‌షాపులను కూడా నడుపుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాలకు రాత్రిపూట సరుకు తరలించి, రోజంతా అమ్మకాలు సాగిస్తున్నారు.
 
 చివరికి విక్రయాల నిషేధం రోజైన పైడితల్లి అమ్మ పండగనాడు మిగతా రోజుల కంటే అధికంగా విక్రయాలు జరిపారు. ఎక్కడికక్కడా బెల్ట్‌షాపులు పెట్టి దర్జాగా అమ్మకాలు సాగించారు.  ప్రశ్నించే వారికి రకరకాలగా ప్రలోభ పెట్టి దారికితెచ్చుకున్నారు.  ప్రజాప్రతినిధులకు ఇప్పుడు మద్యం వ్యవహారం కాసులు కురిపిస్తోంది. పైసా పెట్టుబడి పెట్టకుండా, ఎటువంటి ప్రయాసకు లోనవ్వకుండా లక్షలు చేతికందడంతో వారు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.  ఇలా తమను చూసుకుంటే మీ జోలికి రామంటూ మద్యం వ్యాపారులకు భరోసా ఇస్తున్నారు. ప్రజల వద్ద చెడ్డ అయిపోకుండా ఉండేందుకు  అప్పుడప్పుడు చేసే ప్రకటనలను పట్టించుకోవద్దని   చెప్పేస్తున్నారు. వారే అంత సహకరించినప్పుడు ఇక అడ్డుఆపూ ఉండదని దర్జాగా విక్రయాలు చేసుకోవచ్చనే ధీమాకు సిండికేట్లు వచ్చేశారు.
 
 ఎక్సైజ్ అధికారులు నాటకీయ పాత్ర పోషిస్తున్నారు. కళ్లముందు ఎంఆర్‌పీకి మించి విక్రయిస్తున్నా చూసీ చూనడట్టు వదిలేస్తున్నారు. బెల్ట్‌షాపుల పట్లా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. విమర్శలు రాకుండా అప్పుడప్పుడు  నామ్‌కే వాస్తేగా దాడులతో హడా వుడి చేస్తున్నారు. ఎంఆర్‌పీకి మించి విక్రయాలు, బెల్ట్‌షాపుల నిర్వహణ వ్యవహారంలో   ఎక్సైజ్ అధికారులే సూత్రధారులన్న విమ ర్శలు కూడా ఉన్నాయి. వారి కనుసన్నల్లోనే అంతా నడుస్తోందని వాదనలు విన్పిస్తున్నాయి.  మొత్తానికి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పుట్టుకొచ్చిన మద్యం సిండికేట్ విషసర్పం మళ్లీ బుసకొడుతోంది.  బెల్ట్‌షాపులు తీసేస్తాం, అధిక ధరలను అడ్డుకుంటామని గొప్పలు పలికిన టీడీపీ నాయకులంతా ఇప్పుడు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.  మద్యం మాఫియాలో భాగస్వామ్యులై నాలుగు డబ్బులు వెనకేసుకుంటున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement