సీఎంను ముందే కలిసిన మంత్రి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలు రసవత్తరంగా మారాయి. ఒకరినొకరు దెబ్బతీసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు అసమ్మతి నాయకులంతా సిద్ధమై విజయవాడ వెళ్లగా, ఈలోపే హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబునాయుడిని కలిసి అసమ్మతివాదులందరికీ మంత్రి మృణాళిని ఝలక్ ఇచ్చారు. అసమ్మతి వాదులు ఫిర్యాదు చేయాలనుకున్న విషయాలపై తన తప్పులేదన్న కచ్చితమైన ఆధారాలతో వివరించినట్టు మంత్రి తెలిసింది. నేతల గూడు పుఠాణి, బదిలీలపై నేతల వైఖరీని స్పష్టంగా తెలియజేసినట్టు సమాచారం. అన్నీ విన్న చంద్రబాబు మీ పద్ధతిలోనే వెళ్లాలంటూ సూచించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తమ మాట చెల్లుబాటు కావడం లేదని మంత్రి మృణాళినిపై ముగ్గురు ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీలోని కీలక నాయకులు తీవ్ర అసంతృప్తితో అటు అధినేతకు, ఇటు కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈమేరకు వారంతా బుధవారం సాయంత్రం విజయవాడ బయలుదేరి వెళ్లారు.
గురువారం జరిగే రాష్ట్ర పార్టీ సర్వ సభ్య సమావేశంలో తమకెదురైన పరిణామాలు, అవమానాలను తెలియజేసి తద్వారా లబ్ధి పొందాలని భావిస్తున్నారు. ఇవన్నీ పసిగట్టిన మంత్రి మృణాళిని ముందే అప్రమత్తమై సీఎం చంద్రబాబునాయుడిని బుధవారం సాయంత్రమే కలిశారు. ఒక్కొక్కరి అవినీతి చిట్టాను, అక్రమ వ్యవహారాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ముఖ్యంగా సెటిల్‌మెంట్ దందాలు, ఇతరత్ర వసూళ్లుపై క్లుప్తంగా వివరించినట్టు తెలియవచ్చింది. బదిలీల విషయానికొచ్చేసరికి డ్వామా పీడీ, డీఆర్‌డీఎ పీడీ పోస్టుల తప్ప మిగతా వాట్లో తమ ప్రమేయమేది లేదని, ఆయా మంత్రులే బదిలీలు చేసుకున్నారని వివరణ ఇచ్చినట్టు తెలిసింది. డ్వామా, డీఆర్‌డీఎ పీడీలుగా నియమితులైన ఢిల్లీరావు,
ప్రశాంతిలను వారి పనితీరు ఆధారంగా నియమించామని చెప్పినట్టు తెలిసింది. వారిద్దరి పనితీరు విషయంలో ఉన్నతాధి
కారులు సంతృప్తి చెందడం వల్లే జిల్లాకు తెచ్చుకున్నామంటూ వివరించినట్టు తెలుస్తోంది. ఇక, ఏజేసీ, ఆర్డీఓలకు రిటెన్షన్ ఇవ్వాలని కోరుతూ అసమ్మతిరాగం విన్పిస్తున్న ఎమ్మెల్యేలంతా లేఖలిచ్చారని, వాటిని ఆధారంగా చేసుకుని సంబంధిత శాఖామంత్రులు సానుకూలంగా స్పందించారన్న విషయాన్ని కూడా తెలియజేసినట్టు సమాచారం. మిగతా అధికారుల బదిలీల విషయంలో తమకెటువంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేసినట్టు తెలిసింది.అన్నీ విన్న తర్వాత చంద్రబాబు స్పందిస్తూ తమకు ఇంటిలీజెన్స్ నివేదికలు ఉన్నాయని,
ఎవరేంటో తెలుసని, మీ పద్ధతిలో ముందుకెళ్లాలని మంత్రి మృణాళినికి సూచించినట్టు విశ్వసనీయ ంగా తెలిసింది. అయితే, మంత్రి వద్ద ఈ విధంగా స్పందించిన చంద్రబాబునాయుడు గురువారం అసమ్మతివాదులు కలిసిన తర్వాత ఎలా మాట్లాడుతారో చూడాలి. మృణాళిని చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకుని అసమ్మతివాదులకు క్లాస్ తీసుకుంటారా...? లేదంటే అసమ్మతివాదులు చెప్పిన దానికి కరిగిపోయి తిరిగి మంత్రిని హెచ్చరిస్తారేమో చూడాలి. మొత్తానికి టీడీపీ పరిణామాలు రసకందాయంలో పడ్డాయి.