పట్నా: బీహార్లో దారుణం జరిగింది. గయ జిల్లాలోని ఒక గ్రామంలో దొంగలనే అనుమానంతో ముగ్గుర్ని గ్రామస్తులు కొట్టి చంపేశారు. విష్ణుగంజ్ గ్రామంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక ఇంట్లోకి చొరబడ్డ నలుగురిని కొంతమంది పట్టుకున్నారు. దీంతో మిగిలిన గ్రామస్తులంతా అక్కడ గుమిగూడారు. అంతే.. ఆగ్రహావేశాలకు గురైన వారంతా ఆ నలుగురిని వెదురు కర్రలతో కొట్టారు. ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడి చనిపోగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ సంఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేశామని గయ ఎస్పీ మను మహరాజ్ తెలిపారు. దొంగతనానికి వచ్చారనే అనుమానంతోనే ముగ్గురు వ్యక్తులను హత్యచేశారన్నారు. అయితే బీహార్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయని హేతువాదులంటున్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు రెండు డజన్ల మందికి పైగా ఇలా మృత్యువాత పడ్డారంటున్నారు.