మోదీ పాలనలో గోరక్షణ హత్యలు | Lynching Incidents In Narendra Modi Govt | Sakshi
Sakshi News home page

మోదీ పాలనలో గోరక్షణ హత్యలు

Published Mon, Feb 25 2019 3:55 PM | Last Updated on Mon, Feb 25 2019 4:23 PM

Lynching Incidents In Narendra Modi Govt - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో మూక హత్యలు ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా గోరక్షణ పేరిట, గోవులను హత్య చేశారనో, గోవులను అక్రమంగా తరలిస్తున్నారనో దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లరి మూకలు ఈ హత్యలకు పాల్పడ్డాయి. వీటిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాలకపక్ష బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు కొన్ని సామాజిక బృందాలు కూడా సమర్థించాయి. ఈ హత్యలను ప్రోత్సహించడంలో సామాజిక మీడియా ప్రధాన పాత్ర పోషించింది. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి అనే చిన్న పట్టణంలో 2015. సెప్టెంబర్‌ 28వ తేదీన తొలి మూక హత్య జరిగింది.

మొహమ్మద్‌ అఖ్లాక్‌ ఇంట్లో లేగదూడను హత్య చేశారనే వార్త ప్రచారం కావడంతో స్థానిక గుడి వద్ద ఓ సామాజిక వర్గానికి చెందిన యువకులు సమావేశమయ్యారు. వారంతా వెళ్లి అఖ్లాక్‌ ఇంటిపై దాడి జరిపారు. ఆ ఇంటి ఫ్రిజ్‌లో భద్రపర్చిన మాంసాన్ని అవు మాంసంగా అనుమానించారు. అది మేక మాంసం అంటూ ఇంట్లోని ఆడవాళ్లు చెబుతున్న వినకుండా అఖ్లాక్, ఆయన కుమారుడు డానిష్‌ను చితకబాదారు. ఆ దాడిలో అఖ్లాక్‌ చనిపోగా, తీవ్రంగా గాయపడిన డానిష్‌కు ఏడాది తర్వాత మెదడుకు ఆపరేషన్‌ జరిగింది. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడైన రవి సిసోడియా ఏడాది తర్వాత మూత్రపిండాల వ్యాధితో చనిపోయారు. అప్పుడు కేంద్ర మంత్రి మహేశ్‌ శర్మ, రవి సిసోడియా భౌతిక దేహాన్ని సందర్శించి, ముఖిలిత హస్తాలతో నివాళి అర్పించడంతోపాటు దేశం కోసం మరణించిన వీరుడిలా ఆయన భౌతికకాయంపై జాతీయ జెండాను కప్పి గౌరవించారు. అంతకుముందు ఇదే మంత్రి దాద్రి సంఘటనను ఓ ‘యాక్సిడెంట్‌’గా అభివర్ణించారు. ఈ కేసులో అరెస్టయిన వారంతా ప్రస్తుతం బెయిల్‌పై బయటే ఉన్నారు. ఏ ఒక్కరికి శిక్ష పడలేదు.


మొహమ్మద్‌ అఖ్లాక్‌ కుటుంబీకుల ఆక్రందన

2016, మార్చి నెలలో జార్ఖండ్‌లో పశువుల వ్యాపారులంటూ ఇద్దరిని కొట్టి చంపి, వారి శవాలను ఓ చెట్టుకు వేలాడదీశారు. 2016, జూలైలో గుజరాత్‌లోని ఉనాలో చనిపోయిన ఆవుల చర్మాలను ఒలుస్తున్న నలుగురు దళితులను గోరక్షకులు పట్టుకొని చితకబాదారు. వారే దళితులను చితకబాదుతున్న దృశ్యాలను వీడియోతీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 2017లో రాజస్థాన్‌ పాల వ్యాపారి పెహ్లూ ఖాన్‌ ఆరుగురు చితక్కొట్టి వీడియోతీసి సోషల్‌ మీడియా ద్వారా ప్రసారం చేశారు. పెహ్లూ ఖాన్‌ తన మరణ వాంగ్మూలంలో ఆరుగురు  నిందితుల పేర్లను వెల్లడించినప్పటికీ పోలీసులు వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. 2018లో కూడా ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌లో గోరక్షణ పేరిట ఓ మూక హత్య జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టింది.

పిల్లల దొంగల పేరిట మూక హత్యలు
బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన దొంగలు పిల్లల్ని ఎత్తుకు పోతున్నారంటూ సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందిన వదంతుల వల్ల కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో మూక హత్యలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో 14 ఏళ్ల బాలికను ఎత్తుకుపోయారన్న వార్తతో 2017, జూన్‌ 27వ తేదీన మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ యువతిని కొట్టి చంపారు. 2018, జూన్‌ నెలలో అస్సాంలో పిల్లల దొంగలన్న అనుమానంతో ఇద్దరు యువకులను కొట్టి చంపారు. బీహార్, జార్ఖండ్‌ నుంచి వచ్చిన హిందీ మాట్లాడే దొంగలు పిల్లలను ఎత్తుకుపోతున్నారనే ప్రచారం జరగడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు దాడులు జరిగాయి. రెండు నెలల తర్వాత మహారాష్ట్రలో సంచార తెగకు చెందిన నలుగురు యువకులను కొట్టి చంపారు.

117 గోరక్షణ దాడులు
2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేశంలో గోరక్షణ పేరిట 117 దాడులు జరిగాయని ‘ఇండియా స్పెండ్‌’ గణాంకాలు తెలియజేస్తుండగా, ఇదే కాలంలో జరిగిన మూక హత్యల్లో 88 మంది మరణించారని ‘క్వింట్‌’ లెక్కలు చెబుతున్నాయి. గోరక్షణ చర్యలు, దాడుల వల్ల ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. ముఖ్యంగా ఇతర దేశాలకు గోమాంసం, చర్మాల ఎగుమతి నిలిచిపోయింది. కొనేవారులేక ముసలి, ముతక గోవులను వదిలేస్తే అవి రైతుల పొలాలను మేస్తున్నాయి. దూరంగా వదిలేస్తే అధికారులు వచ్చి రైతులపై ‘కల్పబుల్‌ హోమిసైడ్‌’గా పోలీసులు కేసులు పెడుతున్నారు. ఈ సంఘటనలపై 2017లో మొదటిసారి నోరు విప్పిన ప్రధాని నరేంద్ర మోదీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement