gau rakshak
-
‘మూడో బిడ్డను కంటే ఓటు హక్కు రద్దు చేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ : జనభాను నియంత్రించడానికి భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. దంపతులు ఇద్దరు పిల్లలకు మించి కనకుండా ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ఆదివారం ఆయన హరిద్వార్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏ మతానికి చెందిన వారైనా సరే అధిక సంతానాన్ని కనకూడదని ఆయన సూచించారు. ‘భారత జనాభా మరో 50 ఏళ్ల పాటు 150 కోట్లకు మించకూడదు. అంతకు మించి జనాభాకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి మనం సిద్ధంగా లేము. దంపతులు ఇద్దరు పిల్లలకు మించి కనకుండా ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలి. ఒక వేళ వారు మూడో బిడ్డను కంటే.. ఆ బిడ్డను ఓటు హక్కుకు దూరం చేసేలా చట్టం రూపొందించాలి. అలాగే, అతడు\ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలి. ఎటువంటి ప్రభుత్వ పథకాల లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలి’ అని రాందేవ్ సూచించారు. అలాగే మన దేశంలో గోవధలపై పూర్తిగా నిషేధం విధించాన్నారు. అలాంటప్పుడే ఆవుల అక్రమ రవాణాదార్లు, గోరక్షకులకు మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆగిపోతాయని రాందేవ్ వ్యాఖ్యానించారు. -
మోదీ పాలనలో గోరక్షణ హత్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో మూక హత్యలు ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా గోరక్షణ పేరిట, గోవులను హత్య చేశారనో, గోవులను అక్రమంగా తరలిస్తున్నారనో దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లరి మూకలు ఈ హత్యలకు పాల్పడ్డాయి. వీటిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాలకపక్ష బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు కొన్ని సామాజిక బృందాలు కూడా సమర్థించాయి. ఈ హత్యలను ప్రోత్సహించడంలో సామాజిక మీడియా ప్రధాన పాత్ర పోషించింది. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి అనే చిన్న పట్టణంలో 2015. సెప్టెంబర్ 28వ తేదీన తొలి మూక హత్య జరిగింది. మొహమ్మద్ అఖ్లాక్ ఇంట్లో లేగదూడను హత్య చేశారనే వార్త ప్రచారం కావడంతో స్థానిక గుడి వద్ద ఓ సామాజిక వర్గానికి చెందిన యువకులు సమావేశమయ్యారు. వారంతా వెళ్లి అఖ్లాక్ ఇంటిపై దాడి జరిపారు. ఆ ఇంటి ఫ్రిజ్‌లో భద్రపర్చిన మాంసాన్ని అవు మాంసంగా అనుమానించారు. అది మేక మాంసం అంటూ ఇంట్లోని ఆడవాళ్లు చెబుతున్న వినకుండా అఖ్లాక్, ఆయన కుమారుడు డానిష్‌ను చితకబాదారు. ఆ దాడిలో అఖ్లాక్ చనిపోగా, తీవ్రంగా గాయపడిన డానిష్‌కు ఏడాది తర్వాత మెదడుకు ఆపరేషన్ జరిగింది. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడైన రవి సిసోడియా ఏడాది తర్వాత మూత్రపిండాల వ్యాధితో చనిపోయారు. అప్పుడు కేంద్ర మంత్రి మహేశ్ శర్మ, రవి సిసోడియా భౌతిక దేహాన్ని సందర్శించి, ముఖిలిత హస్తాలతో నివాళి అర్పించడంతోపాటు దేశం కోసం మరణించిన వీరుడిలా ఆయన భౌతికకాయంపై జాతీయ జెండాను కప్పి గౌరవించారు. అంతకుముందు ఇదే మంత్రి దాద్రి సంఘటనను ఓ ‘యాక్సిడెంట్’గా అభివర్ణించారు. ఈ కేసులో అరెస్టయిన వారంతా ప్రస్తుతం బెయిల్‌పై బయటే ఉన్నారు. ఏ ఒక్కరికి శిక్ష పడలేదు. మొహమ్మద్ అఖ్లాక్ కుటుంబీకుల ఆక్రందన 2016, మార్చి నెలలో జార్ఖండ్‌లో పశువుల వ్యాపారులంటూ ఇద్దరిని కొట్టి చంపి, వారి శవాలను ఓ చెట్టుకు వేలాడదీశారు. 2016, జూలైలో గుజరాత్‌లోని ఉనాలో చనిపోయిన ఆవుల చర్మాలను ఒలుస్తున్న నలుగురు దళితులను గోరక్షకులు పట్టుకొని చితకబాదారు. వారే దళితులను చితకబాదుతున్న దృశ్యాలను వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2017లో రాజస్థాన్ పాల వ్యాపారి పెహ్లూ ఖాన్ ఆరుగురు చితక్కొట్టి వీడియోతీసి సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేశారు. పెహ్లూ ఖాన్ తన మరణ వాంగ్మూలంలో ఆరుగురు నిందితుల పేర్లను వెల్లడించినప్పటికీ పోలీసులు వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. 2018లో కూడా ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌లో గోరక్షణ పేరిట ఓ మూక హత్య జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టింది. పిల్లల దొంగల పేరిట మూక హత్యలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన దొంగలు పిల్లల్ని ఎత్తుకు పోతున్నారంటూ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన వదంతుల వల్ల కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో మూక హత్యలు జరిగాయి. పశ్చిమ బెంగాల్లో 14 ఏళ్ల బాలికను ఎత్తుకుపోయారన్న వార్తతో 2017, జూన్ 27వ తేదీన మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ యువతిని కొట్టి చంపారు. 2018, జూన్ నెలలో అస్సాంలో పిల్లల దొంగలన్న అనుమానంతో ఇద్దరు యువకులను కొట్టి చంపారు. బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చిన హిందీ మాట్లాడే దొంగలు పిల్లలను ఎత్తుకుపోతున్నారనే ప్రచారం జరగడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు దాడులు జరిగాయి. రెండు నెలల తర్వాత మహారాష్ట్రలో సంచార తెగకు చెందిన నలుగురు యువకులను కొట్టి చంపారు. 117 గోరక్షణ దాడులు 2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేశంలో గోరక్షణ పేరిట 117 దాడులు జరిగాయని ‘ఇండియా స్పెండ్’ గణాంకాలు తెలియజేస్తుండగా, ఇదే కాలంలో జరిగిన మూక హత్యల్లో 88 మంది మరణించారని ‘క్వింట్’ లెక్కలు చెబుతున్నాయి. గోరక్షణ చర్యలు, దాడుల వల్ల ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. ముఖ్యంగా ఇతర దేశాలకు గోమాంసం, చర్మాల ఎగుమతి నిలిచిపోయింది. కొనేవారులేక ముసలి, ముతక గోవులను వదిలేస్తే అవి రైతుల పొలాలను మేస్తున్నాయి. దూరంగా వదిలేస్తే అధికారులు వచ్చి రైతులపై ‘కల్పబుల్ హోమిసైడ్’గా పోలీసులు కేసులు పెడుతున్నారు. ఈ సంఘటనలపై 2017లో మొదటిసారి నోరు విప్పిన ప్రధాని నరేంద్ర మోదీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. -
మనిషా, పశువా లేదా పశువా, మనిషా!
జైపూర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల వ్యాపారి పెహ్లూ ఖాన్ మూక హత్య జరిగి ఏడాది గడిచిందో లేదో రాజస్థాన్‌లోని అదే అల్వార్ జిల్లాలో శనివారం నాడు మరో మూక హత్య చోటు చేసుకుంది. అల్వార్ జిల్లా లాల్వండి గ్రామంలో రక్బర్ ఖాన్, ఆయన మిత్రుడు అస్లాంలు కలిసి రెండు ఆవులను, వాటి దూడలను తోలుకొని వెళుతుండగా వారిపై సాయుధులైన గోరక్షకులు దాడి జరిపారు. తమపై అనుమానాలుంటే పోలీసులకు పట్టించి విచారించాల్సిందిగా వేడుకున్న వినకుండా తీవ్రంగా కొట్టారని అదే దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అస్లాం తెలిపారు. దేశంలో కొనసాగుతున్న మూక హత్యలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని నివారించడం కోసం పార్లమెంట్ ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకరావాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం మరింత విచారకరం. మూక హత్యలు జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుల పహారాను పెంచాల్సిందిగా సుప్రీం కోర్టు చేసిన సూచనలను కూడా ఇక్కడ పట్టించుకోక పోవడం రాజస్థాన్ ప్రభుత్వం వైఫల్యం. ఇక శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసు వ్యవస్థ మరీ దారుణంగా ఉంది. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రక్బర్ ఖాన్‌ను అస్పత్రికి తీసుకెళ్లడానికి పోలీసులకు నాలుగున్నర గంటలు పట్టిందంటే వారి అలసత్వం అర్థమవుతూనే ఉంది. ముందుగా స్వాధీనం చేసుకున్న గోవులను గోరక్షణ శాలకు తరలించడంపై దృష్టి పెట్టిన పోలీసులు గాయపడిన ఖాన్‌ను పట్టించుకోకపోగా, మార్గమధ్యంలో తీరిగ్గా టీ తాగి మరీ ఆస్పత్రికి తీసుకెళ్లారని స్థానిక మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. ఓ మనిషి ప్రాణంకన్నా ఓ గోవు ప్రాణానికి ఎక్కువ విలువనిస్తున్న వసుంధర రాజె ప్రభుత్వం దృక్పథం వంటబట్టి పోలీసులు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారా, సహజసిద్ధంగానే వారి నరాల్లోనే నిర్లక్ష్యం పేరుకుపోయిందా? మనిషి ప్రాణానికి రూ.26, గోవు ప్రాణానికి రూ.70 దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద రోజుకు 26.65 రూపాయలను ఖర్చు చేస్తోంది. అదే ఆవు సంరక్షణకు రోజుకు 70 రూపాయలను, దూడపై రోజుకు 35 రూపాయలను ఖర్చు చేస్తోంది. ఈ మొత్తాన్ని 33 రకాల ప్రజల లావాదేవీలపై ‘ఆవు సెస్సు’ విధించడం ద్వారా రాబడుతోంది. రాష్ట్రంలోని పలు గోసంరక్షణ శాలలను ఆధునీకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి సరిగ్గా మేత అందుతుందో, లేదో పర్యవేక్షించడం కోసం సీసీటీవీ కెమేరాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా రాజస్థాన్‌లో గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. ఈ శాఖకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకన్నా ఏటా ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారంటే ఆశ్చర్య పోనక్కర్లేదు. రాష్ట్రంలో గోవుల సంఖ్య ఇప్పటికే 5 లక్షలు దాటిందని ఓ అంచనా. సకల చరాచర ప్రపంచంలో జంతువుల పట్ల కారణ్యం కలిగి ఉండాలని వాదించే నేటి రోజుల్లో పాలిచ్చే ఆవు పట్ల మరింత శ్రద్ధ ఉండాల్సిందే. కానీ మానవ జీవితాలను పణంగా పెట్టి కాదు. మనిషి ప్రాణాలకన్నా గోవు ప్రాణాలకే విలువ ఇవ్వదల్చుకుంటే ‘మనిషివా, పశువువా!’ అని తిట్టేబదులు ‘పశువువా, మనిషివా!’ అంటూ ఇక తిట్టాలి కాబోలు. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న ఓ సగటు రిక్షా కార్మికుడు రోజుకు 70 రూపాయల నుంచి వంద రూపాయలు సంపాదిస్తున్నాడు. అందులో 28 రూపాయలు గుడిశె అద్దెకు చెల్లించాలి. మిగతా డబ్బుతో భార్య, ఇద్దరు పిల్లలను పోషించాలి. దారిద్య్ర రేఖకు దిగువనున్న రాష్ట్ర పేద ప్రజల్లో 30 శాతం మంది ఇలాంటి రిక్షా కార్మికులే ఉన్నారు. మోది ప్రతిష్టను దెబ్బతీయడానికా! దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దెబ్బతీయడం కోసం కొంత మంది కుట్ర పన్ని ఇలాంటి మూక హత్యలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి అర్జున్ మెఘ్వాల్ ఆరోపించడం, హిందువులకు చెడ్డ పేరు తీసుకరావడం కోసం పోలీసులే ఖాన్‌ను చంపేశారని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజ ఆరోపించడంలో అర్థముందా! -
విద్వేషానికి వీర సత్కారం
-
విద్వేషానికి వీర సత్కారం
సాక్షి, న్యూఢిల్లీ : అది రాంచీలోని జయప్రకాష్ నారాయణ్ కేంద్ర కారాగారం. శుక్రవారం వర్షం పడుతున్నా లెక్క చేయకుండా రెండు బృందాలు జైలు వెలుపల ఆత్రుతతో ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాయి. జైలు తలుపులు తెరుచుకున్నప్పుడల్లా ఆ రెండు బృందాలు ఒకరికొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంతలో జైలు తలుపులు తెరచుకోగానే ఆరుగురు వ్యక్తులు బయటకు వచ్చారు. అంతే రెండు బృందాలు పోటీ పడి వారి వద్దకు దూసుకెళ్లి వారి మెడల్లో దండలు వేశాయి. తమ వెంట రావాలంటే తమ వెంట రావాలంటూ ఆ ఆరుగురు వ్యక్తులను ఆహ్వానించాయి. ఆ రెండు బృందాల్లో ఒకటి రామ్‌గఢ్ మాజీ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు శంకర్ చౌధరి అనుచర బృందం కాగా, మరో బృందం కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా విధేయుడైన రామ్‌గఢ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పప్పు బెనర్జీ అనుచర బృందం. చివరకు ఆ రెండు బృందాల మధ్య ఏదో అంగీకారం కుదిరింది. ఆ ఆరుగురు నిందితులు పప్పు బెనర్జీ వెంట కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ఇంటికి వెళ్లారు. ఆయన అక్కడ ఆ ఆరుగురు వ్యక్తులకు బంతిపూల దండలతో సాదరంగా స్వాగతం చెప్పారు. ఆయన వారికి స్వీట్లు కూడా తినిపించారు. అటు జైలు ముందు, ఇటు జయంత్ ఇంటి ముందు సత్కార ఆర్భాటాలు చూస్తుంటే బ్రిటీష్ కాలం నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. దేశ స్వాతంత్య్రం కోసం జైలుకెళ్లి తిరుగొచ్చిన వీరులకు ఇలాగే సత్కారం లభించేది. ఇప్పుడు సత్కారం అందుకుంటున్న ఈ వీరులెవరు? వారు దేనికోసం పోరాటం జరిపారు? సత్కారం అందుకున్న ఆరుగురు వ్యక్తులు ఏడాది క్రితం జరిగిన అమీలుద్దీన్ అన్సారీ హత్య కేసులో శిక్ష పడిన నేరస్థులు. వారికి జార్ఖండ్ ట్రయల్ కోర్టు ఆ ఆరుగురు సహా 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, అది పెద్ద శిక్షంటూ దాన్ని రద్దు చేసిన జార్ఖండ్ హైకోర్టు జూన్ 29న బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లాంఛనాలు పూర్తిచేసి ఏడుగురు నేరస్థుల్లో ఒకరు గురువారమే జైలు నుంచి విడుదలకాగా, ఆరుగురు శుక్రవారం విడుదలయ్యారు. మరో నలుగురు జైలు నుంచి ఇంకా విడుదల కావాల్సి ఉంది. వారి న్యాయపోరాటానికి మొత్తం ఖర్చును జయంత్ సిన్హా పెట్టారని పప్పు బెనర్జీ చెబుతుండగా, ఆయన క్రెడిట్ కోసం కేసు చివరి దశలో జోక్యం చేసుకున్నారని, మొదటి నుంచి కేసుకు ఖర్చు పెడుతున్నదే తానని మాజీ బీజేపీ ఎంపీ శంకర్ చౌధరి మీడియాతో వ్యాఖ్యానించారు. హంతకులతో కలిసి దిగిన జయంత్ సిన్హా ఫొటో జాతీయ పత్రికల్లో ప్రముఖంగా రావడంతో చౌధరి నొచ్చుకున్నారు. నాడు ఏంజరిగింది? అమీలుద్దీన్ అన్సారీ హత్య 2017, జూన్ 27వ తేదీ ఉదయం జరిగింది. రామ్‌గఢ్ జిల్లాలోని మనువా గ్రామానికి చెందిన అన్సారీ బొగ్గుల వ్యాపారి. ఆ రోజున మారుతీ వ్యాన్‌లో రామ్‌గఢ్‌కు వెళ్లారు. అక్కడ ఓ అల్లరి మూక ఆయన కారును అడ్డగించి ఆవును చంపి మాంసాన్ని కారులో తరలిస్తున్నావంటూ వాగ్వాదానికి దిగారు. రామ్‌గఢ్ జిల్లా బీజేపీ మీడియా ఇంచార్జి నిత్యానంద్ మెహతో (శిక్షపడిన వారిలో ఒకరు) అన్సారీని కారు నుంచి లాగగా అల్లరి మూక ఆయన్ని కొట్టడం మొదలుపెట్టింది. దీన్ని అల్లరి మూకలో ఒకరిద్దరు సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసి ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో పెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అన్సారీ 16 ఏళ్ల కుమారుడు సహబాన్ ఆ వీడియోను చూశారు. తండ్రిని కాపాడుకోవాలనే తొందరలో ఆ కుర్రాడు డ్రైవింగ్ రాకపోయినా తండ్రి స్కూటర్‌ను తీసి స్టార్ట్ చేశారు. ఒక్కసారిగా గేర్ మార్చి వదిలేయడంతో అది ముందుకు ఎగిరి పడిపోవడంతో కాలుకు గాయం అయింది. తల్లి వచ్చి స్కూటర్ ఎందుకు తీశావంటూ కొట్టబోతే వాట్సాప్ వీడియోను చూపించారు. అప్పుడు అన్సారీ భార్య, కుమారుడు ఇరుగు పొరుగు వారి సహాయంతో హుటాహుటిన రామ్‌గఢ్ వచ్చారు. అప్పటికే అన్సారీ రోడ్డుపై శవంగా పడి ఉండగా, ఆయన మారుతి వ్యాన్‌ను అల్లరి మూక ధ్వంసంచేసి తగులబెట్టింది. ఆ వీధిలో దాదాపు 200 కిలోల మాంసం ముద్దలు పడి ఉండడం కూడా ఫొటోల్లో కనిపించింది. అవి కారులో నుంచి పడ్డాయనే దానికి వీడియోలో కూడా ఎలాంటి ఆధారం లభించలేదు. అంత పెద్ద మొత్తంలో మాంసం తీసుకెళ్లడానికి అన్సారీ మాంసం వ్యాపారీ కాదు. ఇంట్లో ఫంక్షన్ కూడా లేదు. ఆ మాంసం ముద్దలు ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పటికీ మిస్టరీనే. 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష కేసును విచారించిన రామ్‌గఢ్ పోలీసులు నిందితులందరిని వీడియో ఆధారంగా అరెస్ట్ చేశారు. జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేసును త్వరితగతిన విచారించి మొత్తం 11 మంది దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గోరక్షణ పేరిట జరిగిన దాడి కేసులో శిక్ష పడిన మొదటి కేసు, పెద్ద కేసు ఇదే. కేసు విచారణ సందర్భంగా కీలక సాక్షి తన భార్యతో పాటు కోర్టుకు వచ్చారు. అన్సారీ కుమారుడు సహబాన్తో (అప్పటికి స్కూటర్ నడపడం నేర్చుకున్నారు) ఆమెను స్కూటర్‌పై పంపారు. స్కూటర్‌పై వెళుతున్న వీరిని వెనక నుంచి ఓ ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన సాక్షి భార్య మరణించింది. సాక్షిని బెదిరించడంలో భాగంగానే ఈ యాక్సిడెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు చేసినా భయపడకుండా అన్సారీ భార్య, కుమారుడు పోరాడటం వల్ల నేరస్థులకు శిక్ష పడింది. నేరస్థులకు ఎలాంటి శిక్షను కోరుకుంటున్నారని తుది విచారణలో కోర్టు జడ్జీ ప్రశ్నించినప్పుడు కూడా అన్సారీ భార్య ‘నా భర్త హత్య కేసులో న్యాయం చేయండని కోరుతున్నాను. అంతుకుమించి నేనేమి చెప్పలేను. నాకేమీ అక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు. శిక్ష పడిన నేరస్థుల్లో స్థానిక బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నారు. అంత ఉన్నత చదువులు చదివి కూడా విడుదలైన వారిని స్వాగతించడంలో బీజేపీ నాయకులు ఇక్కడ పోటీ పడుతుంటే అంత ఉన్నత చదువులు చదివిన జయంతి సిన్హాకు ఏమైందంటూ సోషల్ మీడియా తీవ్రంగా విమర్శిస్తోంది. ఢిల్లీ ఐఐటీలో డిగ్రీ, పెన్సిల్వేనియా యూనివర్శిటీలో ఎంఎస్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసిన జయంత్ సిన్హా కొంతకాలం బాస్టన్‌లోని ‘మ్యాక్‌కిన్సే అండ్ కంపెనీ’లో పనిచేసి భారత్‌కు వచ్చి రాజకీయాల్లో స్థిరపడ్డారు. జయంత్ సిన్హాను బీజేపీ హయాంలో కేంద్రంలో విదేశాంగ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా పనిచేసిన తండ్రి యశ్వంత్ సిన్హా కూడా ఘాటుగానే విమర్శించారు. అప్పుడు నేను ‘నాలాయక్’:యశ్వంత్ సిన్హా ‘ఒకప్పుడు నేను మంచి కొడుక్కి మంచి తండ్రిని కాదు (నాలాయక్ బాప్ ఆఫ్ లాయక్ బేటా). ఇప్పుడు మా పాత్రలు తిరగబడ్డాయి. అదే ట్విట్టర్ మహిమ. నా కొడుకు చర్యను నేను ఎప్పటికీ ఆమోదించలేను. నాకు తెలుసు ఇది కూడా మరింత ఛండాలానికి దారితీస్తుంది. అయినా నీవెప్పటికీ గెలవవు’ యశ్వంత్ సిన్హా తన కుమారుడిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. Earlier I was the Nalayak Baap of a Layak Beta. Now the roles are reversed. That is twitter. I do not approve of my son's action. But I know even this will lead to further abuse. You can never win. — Yashwant Sinha (@YashwantSinha) 7 July 2018 -
మృతుడిపై పోలీసు కేసు
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని సాత్న జిల్లాలో ఆదివారం ఇద్దరు ముస్లిం యువకులపై గోరక్షకులు చేసిన దాడిలో ఓ యువకుడు మరణించగా మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు రెండు కేసులు దాఖలు చేశారు. మరణించిన వ్యక్తి, ఆయన స్నేహితుడిపై గోహత్య కేసును.. వారిపై దాడిచేసిన వారిపై హత్యా, హత్యాయత్నం కేసులను దాఖలు చేశారు. ఈ సంఘటనలో మరణించిన వ్యక్తి పోలీసులు చెప్పినట్లు రియాజ్ ఖాన్ కాదు. షిరాజ్ ఖాన్ అతను. సాత్న జిల్లాలోని మైహార్ పట్టణంలో షిరాజ్ ఖాన్ కుట్టుమిషన్ నడుపుకుంటూ జీవిస్తుండగా, ఆయన స్నేహితుడు షకీల్ (38) సైకిల్ షాపు నడుపుకుంటున్నారు. షిరాన్ ఖాన్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఇద్దరు మిత్రులు సమీపంలోని పొరుగూరికి వెళ్లి ఆదివారం ఉదయం పట్టణానికి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో కొంత మంది గోరక్షకులు దాడిచేసి ఇనుప రాడ్లతో, చెక్క ఫలకలతో చితక్కొట్టారు. షిరాజ్ ఖాన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. షకీల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. షకీల్ కోలుకున్నాక ఆయన్ని అరెస్ట్ చేస్తామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సంఘటన జరిగిన చోట రెండు కిలోల ఆవు మాంసం దొరికిందని పోలీసులు చెబుతున్నారు. షిరాజ్ ఖాన్‌కు పొరుగూరులో ఒకరు డబ్బివ్వాల్సి ఉండగా, ఆ డబ్బుల కోసం స్నేహితుడిని తీసుకొని వస్తుండగా అన్యాయంగా వారిపై దుండగులు దాడి చేశారని షిరాజ్ ఖాన్ భార్య ఆరోపిస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలు జరపకుండా ఆవు మాంసం కలిగి ఉన్నారని ఎలా ఆరోపిస్తున్నారని షిరాజ్ ఖాన్ తమ్ముడు ఇమ్రాన్ ఖాన్ వాదిస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. -
యుద్ధానికి సన్నద్ధమంటే ఎవరి మీద?
సాక్షి, న్యూఢిల్లీ : యుద్ధానికి సన్నద్ధం కావాలంటే భారత సైన్యానికి ఆరు నెలలు పడుతుందని, అదే తమ ఆరెస్సెస్ కార్యకర్తలకైతే మూడు రోజులు పడుతుందని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెల్సిందే. మోహన్ భాగవత్ భారత సైన్యాన్ని అవమానించారని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. అయితే అసలు యుద్ధానికి సన్నద్ధం కావడానికి ఆరెస్సెస్ ఏమిటీ? అది భారత సైన్యంలో భాగమా? అదో సాంస్కృత సంస్థ. అలాంటి సంస్థకు యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ? ఎవరి మీద యుద్ధం చేస్తుంది? ఎవరూ మీదయినా యుద్ధం చేయాల్సిందే భారత సైన్యమే. అందుకు అవసరమైతే ఆదేశాలు జారీ చేయాల్సింది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన భారత ప్రభుత్వమే. మోహన్ భాగవత్ తన మాటల ద్వారా పరోక్షంగా యుద్ధానికి ఆరెస్సెస్ కార్యకర్తలను సిద్ధం చేస్తున్నట్లుంది. అయితే ఎవరి మీద ? పాకిస్థాన్ మీదనా? పాకిస్థాన్ సైన్యానికి ఎదుర్కొనే శక్తి లేదు. పైగా అది భారత సైన్యానికి సంబంధించిన అంశం. ఇకపోతే దేశంలోని ముస్లింలపై యుద్ధమా? దేశంలోని ముస్లింలపై జరిపే దాడులను యుద్ధం అనలేం. హింస అని అంటాం. ఇప్పటికే ఆరెస్సెస్ కార్యకర్తల్లో కావాల్సినంత హింస దాగి ఉంది. అలాంటి హింసను మరీ రెచ్చగొట్టడం ఏమిటీ? ఇప్పటికే దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో తమకుతాము సైన్యంగా చెప్పుకునే దళాలు పెరిగిపోయాయి. భజరంగ్ దళ్ సైనిక శిబిరాల్లాంటివి ఏర్పాటు చేసుకొని వాటిలో ఆయుధ శిక్షణ తీసుకుంటుండగా, గోరక్ష దళాలు లైసెన్స్‌లేని తుపాకులను పట్టుకొని దేశంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కొన్ని చోట్ల దాడులకు కూడా దిగుతున్నాయి. శివసేన ఆర్మీ ఆఫ్ శివాజీ అని చెప్పుకుంటోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన ‘హిందూ యువ వాహిణి’ని ఇప్పుడు ‘హిందూ యూత్ ఆర్మీ’ అని చెప్పుకుంటోంది. తమపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని ఉత్తరప్రదేశ్‌లోని దళితులు భీమ్ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి సన్నద్ధం అంటే వివిధ మితవాద సంస్థల్లో పేరుకుపోయిన హింసాత్మక ధోరణులను రెచ్చగొట్టడమే. ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. -
కఠిన చర్యలే మందు
పక్షం రోజుల వ్యవధిలో రెండోసారి ప్రధాని నరేంద్ర మోదీ గోరక్షణ పేరుతో చెల రేగిపోతున్న మూకల గురించి మాట్లాడవలసి వచ్చింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మత హింసను అరికట్టడానికి సహకరించమని కూడా ఆయన అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేశారు. గత నెలాఖరున అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు ఆయన ఆవు పేరిట వివిధచోట్ల దాడులపై ఆందోళన వ్యక్తంచేశారు. గాంధీ పుట్టిన గడ్డపై పుట్టామన్న సంగతి మరిచి కొందరు హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి దాడుల్లో బాధి తులుగా మారుతున్నవారంతా ప్రధానంగా దళితులు, ముస్లిం, సిక్కులు. ఇవి ఏదో ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో పరిమితమై లేవు. స్థాయీ భేదం ఉండొచ్చు తప్ప ఈశాన్య రాష్ట్రాలతో మొదలుపెట్టి దాదాపు అన్నిచోట్లా అవి అడపా దడపా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ఘటనలు ఇతరత్రా హింసాత్మక ఉదంతాలకు సైతం స్ఫూర్తినిచ్చాయి. 2015 అక్టోబర్‌లో ఆవు మాంసం ఇంట్లో ఉన్నదన్న అనుమా నంతో అఖ్లాక్ అనే ఒక కుటుంబ పెద్దను మూకలు కొట్టి చంపాయి. అతని కుమా రుణ్ణి తీవ్రంగా గాయపరిచాయి. గత నెల 22న ఈద్ పండుగ సందర్భంగా కొత్త బట్టలు కొనుక్కుని ఉత్సాహంతో రైల్లో స్వస్థలం వెళ్తున్న పదిహేనేళ్ల బాలుడితో, అతని స్నేహితులతో కొందరు దుండగులు తగాదా పడి, మతం పేరుతో దూషిం చారు. ఆవును చంపి తినడం తప్పుకాదంటున్నాడని లేనిపోని మాటలు పుట్టిం చారు. తీవ్రంగా కొట్టి నడుస్తున్న రైలు నుంచి బయటకు నెట్టారు. ఆ బాలుడికి సకాలంలో వైద్య సాయం అందకపోవడంతో ప్లాట్‌ఫాంపైనే కన్నుమూశాడు. రాజస్థాన్‌లో నిరుపేద మహిళలు గత్యంతరం లేక కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వెళ్లినప్పుడు వారిని సర్కారీ సిబ్బంది ఫొటోలు తీయడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నాడని ఆగ్రహించి జాఫర్ ఖాన్ అనే వ్యక్తిని కొట్టి చంపారు. మూడు రోజులక్రితం యూపీలోని మొయిన్‌పురి వద్ద రైల్లో వెళ్తున్న ముస్లిం కుటుంబంపై గుంపు దాడి చేశారు. మరో స్టేషన్ సమీపించేలోపు తమ ముఠాను ఫోన్లు చేసి పిలిపించుకుని అందరూ కలిసి ఇనుప రాడ్లతో ఆ కుటుంబసభ్యులను తీవ్రంగా కొట్టారు. మహిళలు, పిల్లలు అన్న విచక్షణ కూడా చూపలేదు. కుటుంబంలో మతి స్థిమితం లేని బాలుణ్ణి కూడా వదల్లేదు. ఇంత ద్వేషం, ఇంత అసహనం, ఇంత ఆగ్రహం ఈ గుంపులకు ఎక్కడినుంచి వస్తోంది? అకారణంగా ఎందుకిలా దాడులకు తెగిస్తున్నారు? కారణం స్పష్టమే. ప్రభుత్వాలు ఇలాంటి ఉదంతాల్లో ఉదాసీనంగా ఉంటున్నాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించని పోలీసులపై చర్యలకు సిద్ధపడటం లేదు. దర్యాప్తు ఎలా జరుగుతున్నదో, చార్జిషీటు దాఖలులో జాప్యం, నిందితులకు బెయిల్ రావడం వగైరాలపై ఆరా ఉండటం లేదు. దానికితోడు కొందరు బీజేపీ నేతలు మొదలుకొని మంత్రి పదవుల్లో ఉన్నవారి వరకూ బాధ్యతారహితంగా మాట్లాడటం పరోక్షంగా గోరక్షణ పేరుతో రెచ్చిపోతున్న మూకలకు బలాన్నిస్తోంది. ఇలాంటి దౌర్జన్యాల అవసరం లేకుండానే గోరక్షణకు చట్టాలున్నాయి. వాటిని ఉల్లంఘించినవారిపై సమాచారమిస్తే ప్రభుత్వ యంత్రాంగాలు చర్యలు తీసుకుంటాయి. అలా తీసుకోని పక్షంలో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావొచ్చు. కానీ దీన్ని వదిలిపెట్టి వీ«ధుల్లో స్వైరవిహారం చేయడం, హత్యలకు ఒడిగట్టడం, జనాన్ని భయపెట్టాలని చూడటం దారుణం. ఇలాంటి మూకలపై రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మోదీ సూచించడం హర్షించదగ్గదే. అయితే ఆ మాటను పదే పదే చెప్పించుకునే స్థితిలో ప్రభుత్వాలుండటం ఆందోళన కలిగిస్తుంది. శాంతిభద్రతల అంశం మౌలికంగా రాష్ట్రాల పరిధిలోనిది. గోరక్షణ పేరుతో హింసకు పాల్పడేవారూ లేదా దాన్ని ప్రోత్స హించేవిధంగా మాట్లాడేవారూ ఏ పార్టీకి చెందినవారైనా వెనువెంటనే కేసులు పెట్టి అరెస్టు చేయాలని ఒక్క ఉత్తర్వు జారీచేస్తే పోలీసులు కాదంటారా? పాలకులుగా ఉన్నవారు చేతగానితనంతో ఉండిపోవడం వల్ల మాత్రమే ఇదంతా కొనసాగు తోంది. మత హింసను అరికట్టడంలో విపక్షాలు సహకారం అందించాలనడం అభినందనీయమే అయినా అలాంటి ఉదంతాలపై ధర్నాలు, ఆందోళనలు నిర్వ హించడం ద్వారా ఆ పార్టీలు ప్రభుత్వాల దృష్టికి తెస్తూనే ఉన్నాయి. కదలిక లేని దల్లా ప్రభుత్వాల్లోనే. శాంతిభద్రతల విషయంలో విఫలమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం సంజాయిషీ కోరడం అసాధారణమేమీ కాదు. గతంలో అలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా చేస్తే కనీసం సంజాయిషీ ఇచ్చుకోవాలన్న భయంతోనైనా ప్రభుత్వాలు కదులుతాయి. మోదీ చెప్పారు గనుక కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ దిశగా దృష్టి పెట్టాలి. ఎప్పుడెప్పుడు గోరక్షణ పేరుతో మూకలు దాడులకు, హత్యలకు దిగాయన్న అంశంపై సమగ్రమైన నివేదికలు తెప్పించుకోవాలి. ఆ ఉదంతాల్లో తీసుకున్న చర్యలేమిటో, అందుకు సంబంధించిన కేసుల దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందో, అందులో నిందితులకు శిక్షలు పడినవెన్నో సేకరించాలి. చర్యలు సరిగా లేవనుకున్నప్పుడు తగిన సూచనలు చేయాలి. ఆ విషయంలో ఏమవుతున్నదో ఎప్పటికప్పుడు ఆరా తీయాలి. బాధిత కుటుంబాలకు వైద్య చికిత్స, ఆర్ధిక సాయం, పునరావాసం ఏమేరకు అందాయో తెలుసుకోవాలి. ఇవన్నీ చేయడానికి ముందు పార్లమెంటు ఉభయసభల్లో సమగ్రమైన చర్చ జరగాలి. అధికార, విపక్ష సభ్యులు పరస్పర విమర్శలు, ఆరోపణలతో కాలక్షేపం చేయకుండా మూక దాడులను ఆపడానికి ఏం చేయాలన్న అంశంపై కేంద్రీకరించాలి. ప్రభుత్వం కప్పదాటు వైఖరిని విడనాడాలి. కొందరు సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నట్టు ప్రత్యేక చట్టం తెచ్చే అంశాన్ని సైతం పరిశీలించాలి. కేవలం మాటల వల్ల ఫలితం ఉండటం లేదని అర్ధమయ్యాక కఠిన చర్యలకు ఉపక్రమించడమే వివేకవంతమైన పని. అప్పుడు మాత్రమే చట్టబద్ధ పాలనలో ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. అరా చకం అంతమవుతుంది. -
‘హిందువులను మోదీ అవమానించారు’
న్యూఢిల్లీ: గో రక్షకులను సంఘ విద్రోహ శక్తులుగా పేర్కొని ప్రధాని మోదీ వారిని అవమానించారని విశ్వ హిందూ పరిషత్ విమర్శించింది. వీహెచ్‌పీ అగ్రనేత ప్రవీణ్ తొగాడియా మాట్లాడుతూ ‘గో రక్షకుల వివరాలు సేకరించాల్సిందిగా మోదీ రాష్ట్రాలను ఆదేశించారు. హిందువులు గోవును రక్షించడానికి ప్రాణాలను సైతం అర్పిస్తారు. కాబట్టి ఆయన జాతి పరంగా జాబితా సిద్ధం చేయమన్నట్లే’ అని తప్పుపట్టారు. దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోదీ.. గో హంతకులకు క్లీన్చిట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అదే సమయంలో గోరక్షకులను బాధితులుగా మారుస్తున్నారని మండిపడ్డారు. గోమాతనే కాకుండా, హిందువులను కూడా మోదీ అవమానించారని తొగాడియా విమర్శించారు. -
'ఓట్లు కోసమే అలా అంటున్నారు'
న్యూఢిల్లీ: దేశంలో దళితులపై జరుగుతున్న దాడి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు ప్రమోద్ తివారి విమర్శించారు. 'దళిత సోదరులపై కాదు.. నన్ను కాల్చండి' అంటూ దళిత ఓట్లకు మోదీ గాలం వేస్తున్నారని ఆరోపించారు. జమ్మూకశ్మీర్, రాంచీలో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ ఇదే విధమైన ఆందోళన ఎందుకు వ్యక్తం చేయడం లేదని ప్రశ్నించారు. నకిలీ గోవు రక్షకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రమోద్ తివారి స్పందించారు. నిజమైన గో హంతకులు ఎక్కడనున్నారో తాను చెబుతానని అన్నారు. 500 ఆవుల మరణానికి కారణమైన రాజస్థాన్ ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు. కాగా, కొందరు దళితులను పీడించి సమస్యలు సృష్టించాలనుకుంటున్నారని, దాడి చేయాలనుకుంటే తనపై చేయాలని ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల మహా సమ్మేళనంలో నరేంద్ర మోదీ అన్నారు.