జైపూర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల వ్యాపారి పెహ్లూ ఖాన్ మూక హత్య జరిగి ఏడాది గడిచిందో లేదో రాజస్థాన్‌లోని అదే అల్వార్ జిల్లాలో శనివారం నాడు మరో మూక హత్య చోటు చేసుకుంది. అల్వార్ జిల్లా లాల్‌వండి గ్రామంలో రక్బర్ ఖాన్, ఆయన మిత్రుడు అస్లాంలు కలిసి రెండు ఆవులను, వాటి దూడలను తోలుకొని వెళుతుండగా వారిపై సాయుధులైన గోరక్షకులు దాడి జరిపారు. తమపై అనుమానాలుంటే పోలీసులకు పట్టించి విచారించాల్సిందిగా వేడుకున్న వినకుండా తీవ్రంగా కొట్టారని అదే దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అస్లాం తెలిపారు.
దేశంలో కొనసాగుతున్న మూక హత్యలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని నివారించడం కోసం పార్లమెంట్ ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకరావాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం మరింత విచారకరం. మూక హత్యలు జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుల పహారాను పెంచాల్సిందిగా సుప్రీం కోర్టు చేసిన సూచనలను కూడా ఇక్కడ పట్టించుకోక పోవడం రాజస్థాన్ ప్రభుత్వం వైఫల్యం. ఇక శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసు వ్యవస్థ మరీ దారుణంగా ఉంది.
తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రక్బర్ ఖాన్‌ను అస్పత్రికి తీసుకెళ్లడానికి పోలీసులకు నాలుగున్నర గంటలు పట్టిందంటే వారి అలసత్వం అర్థమవుతూనే ఉంది. ముందుగా స్వాధీనం చేసుకున్న గోవులను గోరక్షణ శాలకు తరలించడంపై దృష్టి పెట్టిన పోలీసులు గాయపడిన ఖాన్‌ను పట్టించుకోకపోగా, మార్గమధ్యంలో తీరిగ్గా టీ తాగి మరీ ఆస్పత్రికి తీసుకెళ్లారని స్థానిక మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. ఓ మనిషి ప్రాణంకన్నా ఓ గోవు ప్రాణానికి ఎక్కువ విలువనిస్తున్న వసుంధర రాజె ప్రభుత్వం దృక్పథం వంటబట్టి పోలీసులు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారా, సహజసిద్ధంగానే వారి నరాల్లోనే నిర్లక్ష్యం పేరుకుపోయిందా?
మనిషి ప్రాణానికి రూ.26, గోవు ప్రాణానికి రూ.70
దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద రోజుకు 26.65 రూపాయలను ఖర్చు చేస్తోంది. అదే ఆవు సంరక్షణకు రోజుకు 70 రూపాయలను, దూడపై రోజుకు 35 రూపాయలను ఖర్చు చేస్తోంది. ఈ మొత్తాన్ని 33 రకాల ప్రజల లావాదేవీలపై ‘ఆవు సెస్సు’ విధించడం ద్వారా రాబడుతోంది. రాష్ట్రంలోని పలు గోసంరక్షణ శాలలను ఆధునీకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి సరిగ్గా మేత అందుతుందో, లేదో పర్యవేక్షించడం కోసం సీసీటీవీ కెమేరాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
దేశంలో ఎక్కడాలేని విధంగా రాజస్థాన్‌లో గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. ఈ శాఖకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకన్నా ఏటా ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారంటే ఆశ్చర్య పోనక్కర్లేదు. రాష్ట్రంలో గోవుల సంఖ్య ఇప్పటికే 5 లక్షలు దాటిందని ఓ అంచనా. సకల చరాచర ప్రపంచంలో జంతువుల పట్ల కారణ్యం కలిగి ఉండాలని వాదించే నేటి రోజుల్లో పాలిచ్చే ఆవు పట్ల మరింత శ్రద్ధ ఉండాల్సిందే. కానీ మానవ జీవితాలను పణంగా పెట్టి కాదు. మనిషి ప్రాణాలకన్నా గోవు ప్రాణాలకే విలువ ఇవ్వదల్చుకుంటే ‘మనిషివా, పశువువా!’ అని తిట్టేబదులు ‘పశువువా, మనిషివా!’ అంటూ ఇక తిట్టాలి కాబోలు.
రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న ఓ సగటు రిక్షా కార్మికుడు రోజుకు 70 రూపాయల నుంచి వంద రూపాయలు సంపాదిస్తున్నాడు. అందులో 28 రూపాయలు గుడిశె అద్దెకు చెల్లించాలి. మిగతా డబ్బుతో భార్య, ఇద్దరు పిల్లలను పోషించాలి. దారిద్య్ర రేఖకు దిగువనున్న రాష్ట్ర పేద ప్రజల్లో 30 శాతం మంది ఇలాంటి రిక్షా కార్మికులే ఉన్నారు.
మోది ప్రతిష్టను దెబ్బతీయడానికా!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దెబ్బతీయడం కోసం కొంత మంది కుట్ర పన్ని ఇలాంటి మూక హత్యలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి అర్జున్ మెఘ్వాల్ ఆరోపించడం, హిందువులకు చెడ్డ పేరు తీసుకరావడం కోసం పోలీసులే ఖాన్‌ను చంపేశారని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజ ఆరోపించడంలో అర్థముందా!
Comments
Please login to add a commentAdd a comment