షిరాజ్ ఖాన్, అతడి భార్య షాహిదున్నీషా (ఫైల్)
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని సాత్న జిల్లాలో ఆదివారం ఇద్దరు ముస్లిం యువకులపై గోరక్షకులు చేసిన దాడిలో ఓ యువకుడు మరణించగా మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు రెండు కేసులు దాఖలు చేశారు. మరణించిన వ్యక్తి, ఆయన స్నేహితుడిపై గోహత్య కేసును.. వారిపై దాడిచేసిన వారిపై హత్యా, హత్యాయత్నం కేసులను దాఖలు చేశారు. ఈ సంఘటనలో మరణించిన వ్యక్తి పోలీసులు చెప్పినట్లు రియాజ్ ఖాన్ కాదు. షిరాజ్ ఖాన్ అతను.
సాత్న జిల్లాలోని మైహార్ పట్టణంలో షిరాజ్ ఖాన్ కుట్టుమిషన్ నడుపుకుంటూ జీవిస్తుండగా, ఆయన స్నేహితుడు షకీల్ (38) సైకిల్ షాపు నడుపుకుంటున్నారు. షిరాన్ ఖాన్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఇద్దరు మిత్రులు సమీపంలోని పొరుగూరికి వెళ్లి ఆదివారం ఉదయం పట్టణానికి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో కొంత మంది గోరక్షకులు దాడిచేసి ఇనుప రాడ్లతో, చెక్క ఫలకలతో చితక్కొట్టారు. షిరాజ్ ఖాన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. షకీల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. షకీల్ కోలుకున్నాక ఆయన్ని అరెస్ట్ చేస్తామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సంఘటన జరిగిన చోట రెండు కిలోల ఆవు మాంసం దొరికిందని పోలీసులు చెబుతున్నారు.
షిరాజ్ ఖాన్‌కు పొరుగూరులో ఒకరు డబ్బివ్వాల్సి ఉండగా, ఆ డబ్బుల కోసం స్నేహితుడిని తీసుకొని వస్తుండగా అన్యాయంగా వారిపై దుండగులు దాడి చేశారని షిరాజ్ ఖాన్ భార్య ఆరోపిస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలు జరపకుండా ఆవు మాంసం కలిగి ఉన్నారని ఎలా ఆరోపిస్తున్నారని షిరాజ్ ఖాన్ తమ్ముడు ఇమ్రాన్ ఖాన్ వాదిస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment