క్రైమ్: మానవ మృగాల అకృత్యాలు రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. వావివరుసలు, వయసు తారతమ్యాలు లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. సామూహిక అత్యాచారానికి గురై.. అత్యంత దీనస్థితిలో ఓ మైనర్ బాలిక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
సాత్నా జిల్లా మైహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగు చూసింది. అర్కండికి చెందిన 11 ఏళ్ల బాలిక బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని.. బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. అయితే శుక్రవారం ఉదయం మైహర్ శివారులోని అడవుల్లో శారదా దేవి ఆలయం సమీపంలో రక్తపు మడుగులో బాలిక కనిపించింది.
నగ్నంగా పడి ఉన్న బాలికను గమనించిన కొందరు భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను మైహర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందని.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఒంటి నిండా పంటి గాయాలు ఉన్నాయని.. పదునైన ఆయుధాలతో ఆమె అంతర్గత అవయవాలనూ గాయపరిచారని వైద్యులు నివేదిక ఇచ్చారు. బాలిక పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వెల్లడించారు.
ఈ ఘటన స్థానికుల్లో ఆగ్రవేశాలను రగిల్చింది. ఆస్పత్రికి చేరుకుని ‘‘న్యాయం చేయాలనే’’ నినాదాలతో హోరెత్తించారు వాళ్లు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. వాళ్లను శాంతపరిచారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
మైహర్ మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్ ఘటన రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్.. బీజేపీ సర్కార్ మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో విఫలమైందని విమర్శించగా.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అత్యున్నత స్థాయి విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment