మహిళపై గ్యాంగ్ రేప్, దోపిడీ
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘటన
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దుండగులు దారుణానికి ఒడిగట్టారు. యువ సైనికాధికారులను తీవ్రంగా కొట్టి, వారి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇండోర్ సమీపంలోని మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ పొందుతున్న ఇద్దరు అధికారులు, తమ స్నేహితురాళ్లతో కలిసి బుధవారం మధ్యాహ్నం చోటీ జామ్ వద్ద ఫైరింగ్ రేంజ్ సమీపంలోని ప్రదేశానికి పిక్నిక్‌కు వెళ్లారు.
తుపాకులు, కత్తులు, కర్రలతో వచ్చిన 8 మంది దుండగులు అకస్మాత్తుగా వారిని చుట్టుముట్టారు. నలుగురినీ చితకబాది వారివద్ద డబ్బు, విలువైన వస్తువులను దోచుకున్నారు. ఒక అధికారిని, అతడి స్నేహితురాలిని బందీలుగా ఉంచుకున్న దుండగులు రూ.10 లక్షలు తెస్తేనే విడిచిపెడతామంటూ మరో అధికారి, అతడి స్నేహితురాలిని పంపించారు. బాధితుడు హుటాహుటిన తన యూనిట్‌కు వెళ్లి కమాండింగ్ అధికారికి సమాచారమిచ్చారు.
ఈ మేరకు పోలీసులు, మిలటరీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోగా.. వారిని చూసి దుండగులు పారిపోయారు. నలుగురు బాధితులను పోలీసులు మోవ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరు అధికారులకు గాయాలయ్యాయి. ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. దోపిడీ, అత్యాచారం, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. మోవ్ ఘటనపై కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో శాంతి భద్రతలు మచ్చుకైనా కానరావడం లేదని దుయ్య బట్టారు. మహిళలపై జరుగుతున్న నేరాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆందోళనకర అంశమని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment