దేశంలోని పలు ప్రాంతాల్లో హృదయవిదారక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. బృందావన్ ధామ్‌లోని ఒక ఇంట్లో ఫ్రిజ్‌లో ఒక మహిళ మృతదేహం బయటపడటంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది.
ఒక ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దేవాస్ పోలీసు అధికారి అమిత్ సోలంకి తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి ఆ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. తాళాలు బద్దలుకొట్టి తలుపు తెరిచారు. లోపలున్న ఒక ఫ్రిజ్‌లో పోలీసులకు ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఆ మృతదేహానికి చేతులు, కాళ్లు కట్టివేసివున్నాయి. ఈ ఉదంతం వెలుగు చూసిన కొద్ది గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు.
పోలీసుల దర్యాప్తు(Police investigation)లో ఆ ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవాస్తవ అని, ఆయన ఈ ఇంటిని 2023 జూలైలో సంజయ్ పాటిదార్‌కు అద్దెకు ఇచ్చారని తేలింది. సంజయ్ జూన్ 2024లో ఇల్లు ఖాళీ చేశాడు. కానీ ఒక ఫ్రిజ్‌తో సహా కొన్ని వస్తువులను ఒక గదిలోనే వదిలేశాడు. కాగా సంజయ్ పాటిదార్ గత ఐదు సంవత్సరాలుగా ప్రతిభా అలియాస్ పింకీ ప్రజాపతితో సహజీవనం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రతిభ వివాహం కోసం ఒత్తిడి తీసుకురావడంతో, ఆందోళనకు గురైన సంజయ్, తన స్నేహితుడు వినోద్ దేవ్‌తో కలిసి 2024 మార్చిలో ఆమెను గొంతు కోసి చంపాడు. తరువాత ఆ మృతదేహానికి చేతులు, కాళ్లు కట్టేసి ఫ్రిజ్(Fridge)లో దాచిపెట్టాడు.
ఈ కేసులో సంజయ్ పాటిదార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని స్నేహితుడు వినోద్ ఇప్పటికే రాజస్థాన్‌లోని ఒక జైలులో ఉన్నాడు. సంజయ్ వివాహితుడని, వ్యవసాయ పనులు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. కాగా దేవాస్‌లో జరిగిన ఈ సంఘటన ఢిల్లీలోని శ్రద్ధా వాకర్(Shraddha Walker) హత్యను తలపించేలా ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా తన లివ్-ఇన్ పార్టనర్ శ్రద్ధను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో ఉంచాడు. తరువాత ఆ ముక్కలను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ సంఘటన స్థానికులను భయకంపితులను చేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: ట్రంప్‌ను ఓడించేవాడిని: బైడెన్ పశ్చాత్తాపం
Comments
Please login to add a commentAdd a comment