lynch
-
బీదర్‌లో కిరాతకం.. హైదరాబాదీలపై వందమంది దాడి!
సాక్షి, బీదర్ : కర్ణాటకలోని బీదర్‌లో దారుణం చోటుచేసుకుంది. పిల్లలను ఎత్తుకెళ్లే కిడ్నాపర్లనే అనుమానంతో హైదరాబాదీలపై స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా ముర్కీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ఆజాం మృతిచెందగా.. నగరానికి చెందిన తహ్లా ఇస్మాయిల్, మహమ్మద్ సల్మాన్ గాయపడ్డారు. ఔరాద్ తాలూకా హండికేరాకు చెందిన మహమ్మద్ బషీర్ పిలుపు మేరకు వీరు అతడి స్వగ్రామాన్ని సందర్శించేందుకు నగరం నుంచి వెళ్లారు. బషీర్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వారు వాహనంలో హండికేరా వెళుతుండగా.. మార్గమధ్యంలో బాల్కూట్ తండా వద్ద అల్పాహారం తీసుకునేందుకు ఆగారు. ఈ సందర్భంగా ఇటీవల కతార్ నుంచి తిరిగివచ్చిన ఇస్మాయిల్ తాను తీసుకువచ్చిన చాక్లెట్లను స్థానిక బడి పిల్లలకు పంచినట్టు తెలుస్తోంది. వారు చేసిన ఈ మంచిపనే స్థానికులకు అనుమానం కలిగించినట్టు కనిపిస్తోంది. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో ఇటీవల హల్చల్ చేసిన వదంతులు, పుకార్ల నేపథ్యంలో వారు పిల్లల కిడ్నాపర్లు అని స్థానికులు అనుమానించారు. అంతే విచక్షణ కోల్పోయి.. సాటి మనుషులన్న కనికరం లేకుండా మహ్మద్ ఆజాం, అతని స్నేహితులపై దాడి చేశారు. బషీర్ వారికి నిజానిజాలు వివరించేందుకు ప్రయత్నించినా.. కోపోద్రిక్తులైన స్థానికులు పట్టించుకోలేదు. దీంతో అక్కడి నుంచి వారు కారులో తప్పించుకున్నప్పటికీ.. సమీపంలోని ముర్కీ గ్రామంవద్ద రోడ్డుకు అడ్డంగా చెట్టును పడేసి.. వారిని అడ్డుకున్నారు. వారిని కారులో నుంచి బయటకు లాక్కొచ్చి.. రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో మహ్మద్ ఆజాం మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు. విచక్షణ మరిచి దాదాపు 100 మంది స్థానికులు ఆటవికంగా ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులు 30మందిని అరెస్టు చేశారు. -
కర్ణాటక బీదర్ జిల్లా ఉద్గిర్లో దారుణం
-
పుకార్ల హత్యలు.. ఆనందంలో త్రిపుర : సీఎం
అగర్తలా : త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అనుమానితులుగా కనిపిస్తే మూకుమ్మడిగా దాడి చేస్తున్న ఘటనలపై మీరేంమంటారు? అని విప్లవ్‌ను మీడియా ప్రతినిధులు అడుగ్గా.. రాష్ట్రం ఆనందంలో ఉందని సమాధానం ఇచ్చారు. ‘నా ముఖం చూడండి. ఆనందంతో ఎంతలా వెలిగిపోతోందో’ అచ్చూ నాలానే రాష్ట్రంలోని ప్రజలు ఆనందంతో ఉన్నారని విప్లవ్ పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత నోరు జారానని తెలుసుకున్న సీఎం తప్పుగా అర్థం చేసుకోవద్దని మీడియా ప్రతినిధులను కోరారు. అగర్తల విమానాశ్రయాన్ని ఉద్దేశించి అన్నానని వివరణ ఇచ్చారు. ఈ ఎయిర్‌పోర్టుకు ఇటీవల ‘మహారాజా వీర్ విక్రమ్ మాణిక్య కిశోర్ ఎయిర్‌పోర్టు’గా నామకరణం చేశారు. గత నెల 28న త్రిపురలో మూడు ‘మాబ్ లించింగ్’ (కొట్టి చంపడం) ఘటనలు జరిగాయి. పిల్లల కిడ్నాపర్లుగా భావించి ఇద్దరిని, కిడ్నీ స్మగ్లర్ల్‌గా అనుమానించి కొట్టి చంపారు. -
ప్రాధేయపడినా కనికరించలేదు..
గువాహటి, అసోం : పిల్లల్నిఎత్తుకుపోయేవాళ్లనే ఉద్దేశంతో ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపిన దారుణ సంఘటన అసోంలోని కర్బిఅంగ్‌లాంగ్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అభిజిత్ నాథ్, నిలుత్‌పాల్ దాస్‌లు పిక్నిక్ స్పాట్ కాంథే లంగ్‌షుకు బయల్దేరారు. పంజూరీ కచారీ అనే గ్రామం వద్దకు వెళ్లిన వీరిని పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్‌గా భావించిన గ్రామస్థుల గుంపు దాడి చేసింది. వెదురు బొంగులు, కర్రలతో విపరీతంగా కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వేరే గ్రామానికి చెందిన కొందరు ఇద్దరు వ్యక్తులు నల్ల కారులో బాలుడిని ఎత్తుకుపోతున్నారని చెప్పడంతో పంజూరీ కచారీ గ్రామస్థులు వారిపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వదిలేయాలంటూ ఇరువురూ ప్రాధేయపడుతున్నా గ్రామస్థులు కనికరించలేదని చెప్పారు. కిందపడిపోయి కదలిక ఆగిపోయేంత వరకూ వారిని చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. రక్తం కారుతున్న దేహాలతో వదిలేయాలంటూ వారిద్దరూ బ్రతిమలాడుతున్న వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేశారని వెల్లడించారు. ఈ ఘటనలో నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. -
మృతుడిపై పోలీసు కేసు
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని సాత్న జిల్లాలో ఆదివారం ఇద్దరు ముస్లిం యువకులపై గోరక్షకులు చేసిన దాడిలో ఓ యువకుడు మరణించగా మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు రెండు కేసులు దాఖలు చేశారు. మరణించిన వ్యక్తి, ఆయన స్నేహితుడిపై గోహత్య కేసును.. వారిపై దాడిచేసిన వారిపై హత్యా, హత్యాయత్నం కేసులను దాఖలు చేశారు. ఈ సంఘటనలో మరణించిన వ్యక్తి పోలీసులు చెప్పినట్లు రియాజ్ ఖాన్ కాదు. షిరాజ్ ఖాన్ అతను. సాత్న జిల్లాలోని మైహార్ పట్టణంలో షిరాజ్ ఖాన్ కుట్టుమిషన్ నడుపుకుంటూ జీవిస్తుండగా, ఆయన స్నేహితుడు షకీల్ (38) సైకిల్ షాపు నడుపుకుంటున్నారు. షిరాన్ ఖాన్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఇద్దరు మిత్రులు సమీపంలోని పొరుగూరికి వెళ్లి ఆదివారం ఉదయం పట్టణానికి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో కొంత మంది గోరక్షకులు దాడిచేసి ఇనుప రాడ్లతో, చెక్క ఫలకలతో చితక్కొట్టారు. షిరాజ్ ఖాన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. షకీల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. షకీల్ కోలుకున్నాక ఆయన్ని అరెస్ట్ చేస్తామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సంఘటన జరిగిన చోట రెండు కిలోల ఆవు మాంసం దొరికిందని పోలీసులు చెబుతున్నారు. షిరాజ్ ఖాన్‌కు పొరుగూరులో ఒకరు డబ్బివ్వాల్సి ఉండగా, ఆ డబ్బుల కోసం స్నేహితుడిని తీసుకొని వస్తుండగా అన్యాయంగా వారిపై దుండగులు దాడి చేశారని షిరాజ్ ఖాన్ భార్య ఆరోపిస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలు జరపకుండా ఆవు మాంసం కలిగి ఉన్నారని ఎలా ఆరోపిస్తున్నారని షిరాజ్ ఖాన్ తమ్ముడు ఇమ్రాన్ ఖాన్ వాదిస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. -
మోదీ ఇలాకాలో ఇంత అంటరానితనమా!?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ‘గుజరాత్ తరహా అభివద్ధి’ దేశానికి అవసరమని అన్నారు. అందుకు కషి చేస్తానని హామీ కూడా ఇచ్చారు. గుజరాత్ తరహా అభివద్ధి ఆ రాష్ట్రంలో ఆర్థికంగా ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో తెలియదుగానీ సామాజిక అంతరాల్లో మాత్రం ఏ మాత్రం మార్పు తీసుకరాలేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఆదివారం నాడు దొంగతనం చేశాడనే అనుమానంపై 40 ఏళ్ల దళిత వ్యక్తిని ఓ స్తంభానికి కట్టేసి కొట్టి చంపేయడం. రాజ్‌కోట్ జిల్లాలో ముకేశ్ వానియా అనే వ్యక్తిని స్తంభానికి కట్టేసి కొడుతున్న వీడియా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెల్సిందే. ఓ స్థానిక ఫ్యాక్టరీ వద్ద జరిగిన ఈ సంఘటనలో ముకేశ్ భార్యను కూడా చితక్కొట్టారు. ముకేశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మరణించగా, ఆయన భార్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె కథనం ప్రకారం ఫ్యాక్టరీ సమీపంలో పాత ఇనుప సామాను ఏరుకుంటున్న ఆ దళిత దంపతులను ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన కొందరు వ్యక్తులు పిలిచారు. కులం గురించి వాకబు చేశారు. దళితులమని చెప్పడంతో ఫ్యాక్టరీ సమీపంలోని చెత్తా చెదారాన్ని పూర్తిగా ఏరివేయాల్సిందిగా ఆదేశించారు. అందుకు ఆ దంపతులు తిరస్కరించడంతో చితకబాదారు. ఈ సంఘటన నాడు 2016, గుజరాత్‌లోని ఉనాలో జరిగిన సంఘటనను గుర్తు చేస్తోంది. ఆవు చర్మాన్ని వలుస్తున్నారన్న అనుమానంపై గోసంర క్షకులు నలుగురు దళితులను చితక బాదిన విషయం తెల్సిందే. దేశంలోకెల్లా గుజురాత్లోనే దళితులు ఎక్కువగా అణచివేతకు, అంటరానితనానికి గురవుతున్నారని 2010లో ‘నవ్‌సర్జన్’ అనే స్వచ్ఛంద సంస్థ విస్తతంగా నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. ఆ సంస్థ రాష్ట్రంలోని 98.4 శాతం గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించింది. 97.6 గ్రామాల్లో దళితులు హిందువుల వంటపాత్రలు, మంచినీటి బిందెలు ముట్టుకోరాదు. అలా ముట్టుకుంటే అవన్నీ కలుషితం అయినట్లు హిందువులు భావిస్తారు. 98 శాతం గ్రామాల్లో హిందువులు దళితులకు టీ పోయరు. కొందరు వారికి కేటాయించిన ప్రత్యేక కప్పుల్లో పోస్తారు. ఇక మతపరమైన కార్యక్రమాలకు దళితులను మరింత దూరంగా పెడతారు. 98 శాతం గ్రామాల్లో మతానికి సంబంధించిన వస్తువులను దళితులు అసలు తాకరాదు, ఈ అంటరానితరం కారణంగా బడులు, గుడుల వద్ద, గ్రామంలోని బావుల వద్ద తరచుగా దళితులపై దాడులు జరుగుతుంటాయి. దేశంలోని అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగంలోని 17వ అధికరణం గురించి హిందువులుగానీ, పాలకులుగానీ పట్టించుకోరు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాల క్రితమే భూసంస్కరణలు అమలు చేయగా, గుజరాత్లో మాత్రం ఇంతవరకు భూసంస్కరణలు అమలుకాలేదు. ఈ విషయమై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇటీవల భానూభాయ్ వాంకర్ అనే ఓ దళిత కార్యకర్త సజీవంగా దహనం చేసుకున్నారు. రాష్ట్రంలో భూసంస్కరణలను అమలు చేయకపోవడం అటుంచి స్థానిక బీజేపీ ప్రభుత్వం ధనిక రైతులు, పారిశ్రామికవేత్తలు చిన్న రైతుల భూములను సులభంగా కొనుక్కోవడం లేదా కాజేసే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగిపోయి చిన్న రైతులు తమ పొలాలను అమ్ముకోవడం లేదా అప్పగించడం జరగకుండా ఎప్పటి నుంచో అమల్లో ఉన్న రక్షణ నిబంధనలను ఎత్తివేసింది. దళితుల తరఫున మాట్లాడుతున్న వారిని కూడా గుజరాత్ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ‘నవ్‌సర్జన్’ ఎన్జీవో సంస్థ రాష్ట్రంలోని దాదాపు మూడువేల గ్రామాల్లో దళితుల సంక్షేమం కోసం కషి చేస్తోంది. 2017లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్జీవోలకు విదేశీ విరాళాలను నిలిపివేయడంతో నవ్‌సర్జన్ సంస్థ ఉనికికే ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఓట్ల కోసమైనా దళితులను ఆకర్షించేందుకు కొన్ని చర్యలు తీసుకున్నారు. గుజరాత్లో ఏ రాజకీయ పార్టీ కూడా దళితుల కోసం కషి చేయడం లేదు. దళితుల పక్షమంటే హిందువుల ఓట్లు కోల్పోవడంగానే ఆ పార్టీలు భావిస్తాయి. -
జైల్లోంచి లాక్కొచ్చి కొట్టి చంపారు
పశ్చిమ ఆఫ్రికా దేశం గినియాలో దారుణం చోటుచేసుకుంది. బంగారం వ్యాపారిని హత్య చేసినట్లు అనుమానిస్తున్న నలుగురు నిందితులను ప్రజలు జైల్లోంచి బయటకు లాక్కొచ్చి కొట్టి చంపారు. గినియాలోని కురోస్సా అనే చిన్న పట్టణంలో కబా కమరా అనే వ్యక్తి బంగారం వ్యాపారం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి హత్య చేశారు. పోలీసులు హత్య కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న 16 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు. ఇంతలోనే హత్యకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు వదిలేయడానికి ప్రయత్నిస్తున్నారని పట్టణంలో వదంతులు వ్యాపించాయి. అంతే.. ప్రజలు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. జైలుపై దాడి చేసి.. హత్యకు పాల్పడినట్లు భావిస్తున్న నలుగురిని బయటకు లాక్కొచ్చారు. పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలు నలుగురిని చావబాదారు. నలుగురిలో ముగ్గురు దెబ్బలకు తాలలేక మృతి చెందగా, ఒకరిని ప్రాణాలతో ఉండగానే తగులబెట్టారు. నలుగురి మృతదేహాలు బహిరంగ ప్రదేశంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. ఈ దాడిలో పాల్గొన్నవారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని గినియా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. -
ముగ్గుర్ని కొట్టి చంపిన గ్రామస్తులు
పట్నా: తండ్రీ కొడుకులపై కాల్పులు జరిపి, ఒక బాలుడి మరణానికి కారణమైన వ్యక్తులను గ్రామస్తులు హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బీహార్‌లోని సీతామారి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ ఉన్నతాధికారి హరి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం తమ మొబైల్ షాప్‌ను మూసివేసి ఇంటికి వెళ్తుండగా తండ్రీకొడుకులైన అవద్ కిశోర్ , రత్నేష్(12)లను సాయుధులైన నలుగురు దుండగులు అడ్డుకున్నారు. వారి మధ్య స్వల్ప వివాదం జరిగింది. దీంతో వారు తండ్రీ కొడుకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈఘటనలో కొడుకు అక్కడికక్కడే చనిపోగా, తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహావేశానికి లోనయ్యారు. ఘటనా స్థలం నుంచి పారిపోతున్న నలుగురిపైన దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. పట్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. -
గ్యాంగ్‌స్టర్‌ను కొట్టి చంపిన గ్రామస్తులు
మీరట్: ముఠా సభ్యుడ్ని హత్యచేసిన గ్యాంగ్‌స్టర్‌ను గ్రామస్తులు కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్‌లో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం హతుడు హస్మత్ పాటు మరో ముగ్గురు ఒకహత్యకేసులో నిందితులు. ఆరునెలల క్రితం నలుగురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈమధ్యనే పోలీసుల కస్టడీనుంచి తప్పించుకున్న హస్మత్ తమ అరెస్టులకు కారణం షాబీర్ అని కక్ష పెంచుకున్నాడు. తన గ్యాంగ్ రహస్యాలను పోలీసులకు చేరవేస్తున్నాడనే కోపంతో, అనుమానంతో రగిలిపోయాడు. అంతే....షాబీర్ గ్రామం ఇంద్రిష్పూర్కి వెళ్లి అతినిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో షాబీర్ అక్కడిక్కడే చనిపోయాడు. కాల్పుల శబ్దం విన్నగ్రామస్తులు, విగతజీవిగా మారినషాబీర్ ను చూసి కోపోద్రిక్తులై హస్మత్ను చుట్టుముట్టి కట్టెలతో దారుణంగా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరేలోపే హస్మత్ ప్రాణాలొదిలాడు.