సాక్షి, బీదర్ : కర్ణాటకలోని బీదర్‌లో దారుణం చోటుచేసుకుంది. పిల్లలను ఎత్తుకెళ్లే కిడ్నాపర్లనే అనుమానంతో హైదరాబాదీలపై స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా ముర్కీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ఆజాం మృతిచెందగా.. నగరానికి చెందిన తహ్లా ఇస్మాయిల్, మహమ్మద్ సల్మాన్ గాయపడ్డారు. ఔరాద్ తాలూకా హండికేరాకు చెందిన మహమ్మద్ బషీర్ పిలుపు మేరకు వీరు అతడి స్వగ్రామాన్ని సందర్శించేందుకు నగరం నుంచి వెళ్లారు. బషీర్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వారు వాహనంలో హండికేరా వెళుతుండగా.. మార్గమధ్యంలో బాల్‌కూట్ తండా వద్ద అల్పాహారం తీసుకునేందుకు ఆగారు. ఈ సందర్భంగా ఇటీవల కతార్ నుంచి తిరిగివచ్చిన ఇస్మాయిల్ తాను తీసుకువచ్చిన చాక్లెట్లను స్థానిక బడి పిల్లలకు పంచినట్టు తెలుస్తోంది. వారు చేసిన ఈ మంచిపనే స్థానికులకు అనుమానం కలిగించినట్టు కనిపిస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో ఇటీవల హల్‌చల్ చేసిన వదంతులు, పుకార్ల నేపథ్యంలో వారు పిల్లల కిడ్నాపర్లు అని స్థానికులు అనుమానించారు.
అంతే విచక్షణ కోల్పోయి.. సాటి మనుషులన్న కనికరం లేకుండా మహ్మద్ ఆజాం, అతని స్నేహితులపై దాడి చేశారు. బషీర్ వారికి నిజానిజాలు వివరించేందుకు ప్రయత్నించినా.. కోపోద్రిక్తులైన స్థానికులు పట్టించుకోలేదు. దీంతో అక్కడి నుంచి వారు కారులో తప్పించుకున్నప్పటికీ.. సమీపంలోని ముర్కీ గ్రామంవద్ద రోడ్డుకు అడ్డంగా చెట్టును పడేసి.. వారిని అడ్డుకున్నారు. వారిని కారులో నుంచి బయటకు లాక్కొచ్చి.. రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో మహ్మద్ ఆజాం మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు. విచక్షణ మరిచి దాదాపు 100 మంది స్థానికులు ఆటవికంగా ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులు 30మందిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment