పశ్చిమ ఆఫ్రికా దేశం గినియాలో దారుణం చోటుచేసుకుంది. బంగారం వ్యాపారిని హత్య చేసినట్లు అనుమానిస్తున్న నలుగురు నిందితులను ప్రజలు జైల్లోంచి బయటకు లాక్కొచ్చి కొట్టి చంపారు. గినియాలోని కురోస్సా అనే చిన్న పట్టణంలో కబా కమరా అనే వ్యక్తి బంగారం వ్యాపారం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి హత్య చేశారు. పోలీసులు హత్య కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న 16 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు.
ఇంతలోనే హత్యకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు వదిలేయడానికి ప్రయత్నిస్తున్నారని పట్టణంలో వదంతులు వ్యాపించాయి. అంతే.. ప్రజలు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. జైలుపై దాడి చేసి.. హత్యకు పాల్పడినట్లు భావిస్తున్న నలుగురిని బయటకు లాక్కొచ్చారు. పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలు నలుగురిని చావబాదారు. నలుగురిలో ముగ్గురు దెబ్బలకు తాలలేక మృతి చెందగా, ఒకరిని ప్రాణాలతో ఉండగానే తగులబెట్టారు. నలుగురి మృతదేహాలు బహిరంగ ప్రదేశంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. ఈ దాడిలో పాల్గొన్నవారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని గినియా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.