కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో అమానవీయ ఉదంతం చోటుచేసుకుంది. దైవదూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వైద్యుని మృతదేహాన్ని ఖననం చేయడానికి బదులుగా దహనం చేసిన వైనం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే సింధ్ ప్రావిన్స్‌లో దైవ దూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న షానవాజ్ కంబార్ అనే వైద్యుడు పోలీసులకు లొంగిపోయేందుకు నిరాకరిస్తూ పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఓ పోలీసు ఆ వైద్యునిపై కాల్పులు జరిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కాల్పుల్లో ఆ వైద్యుడు మృతిచెందాడు. కంబార్ మృతదేహాన్ని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అప్పగించారు. మృతునికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె, భార్య ఉన్నారు. అయితే వైద్యునిపై కాల్పులు జరిపిన పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నియాజ్ ఖోసో ఈ సంఘటనను ధృవీకరిస్తూ, ఆ వైద్యునితో పాటు అతని సహచరులు పోలీసులపై కాల్పులు జరిపారని, ఈ నేపధ్యంలోనే తాము ఎదురు కాల్పులు జరిపినట్లు తెలిపారు.
స్థానిక పోలీసు అధికారి షకుర్ రషీద్ మాట్లాడుతూ మృతుని కుటుంబ సభ్యులు తమ స్వగ్రామమైన జాన్‌హీరోలో వైద్యునికి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేసింది. అయితే ఇంతలో కొందరు ఆ మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో వారికి భయపడిన మృతుని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి భయంతో పారిపోయారు. దీంతో ఆ అల్లరి మూక వైద్యుని మృతదేహనికి నిప్పు పెట్టిందని రషీద్ తెలిపారు.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఉమర్‌కోట్ నగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వైద్యుడు సోషల్ మీడియాలో దైవ దూషణతో కూడిన ఒక పోస్ట్ పెట్టారనే ఆరోపణలతో పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295 సీ కింద ఆ డాక్టర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం పోలీసులు అతనిని అరెస్టు చేసేందుకు వచ్చిన తరుణంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: జనాలను ఉరుకులు పెట్టించిన మైసూర్ గజరాజులు
Comments
Please login to add a commentAdd a comment