
‘హిందువులను మోదీ అవమానించారు’
న్యూఢిల్లీ: గో రక్షకులను సంఘ విద్రోహ శక్తులుగా పేర్కొని ప్రధాని మోదీ వారిని అవమానించారని విశ్వ హిందూ పరిషత్ విమర్శించింది. వీహెచ్‌పీ అగ్రనేత ప్రవీణ్ తొగాడియా మాట్లాడుతూ ‘గో రక్షకుల వివరాలు సేకరించాల్సిందిగా మోదీ రాష్ట్రాలను ఆదేశించారు. హిందువులు గోవును రక్షించడానికి ప్రాణాలను సైతం అర్పిస్తారు. కాబట్టి ఆయన జాతి పరంగా జాబితా సిద్ధం చేయమన్నట్లే’ అని తప్పుపట్టారు.
దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోదీ.. గో హంతకులకు క్లీన్చిట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అదే సమయంలో గోరక్షకులను బాధితులుగా మారుస్తున్నారని మండిపడ్డారు. గోమాతనే కాకుండా, హిందువులను కూడా మోదీ అవమానించారని తొగాడియా విమర్శించారు.