సాక్షి, న్యూఢిల్లీ : అది రాంచీలోని జయప్రకాష్ నారాయణ్ కేంద్ర కారాగారం. శుక్రవారం వర్షం పడుతున్నా లెక్క చేయకుండా రెండు బృందాలు జైలు వెలుపల ఆత్రుతతో ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాయి. జైలు తలుపులు తెరుచుకున్నప్పుడల్లా ఆ రెండు బృందాలు ఒకరికొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంతలో జైలు తలుపులు తెరచుకోగానే ఆరుగురు వ్యక్తులు బయటకు వచ్చారు. అంతే రెండు బృందాలు పోటీ పడి వారి వద్దకు దూసుకెళ్లి వారి మెడల్లో దండలు వేశాయి. తమ వెంట రావాలంటే తమ వెంట రావాలంటూ ఆ ఆరుగురు వ్యక్తులను ఆహ్వానించాయి. ఆ రెండు బృందాల్లో ఒకటి రామ్‌గఢ్ మాజీ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు శంకర్ చౌధరి అనుచర బృందం కాగా, మరో బృందం కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా విధేయుడైన రామ్‌గఢ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పప్పు బెనర్జీ అనుచర బృందం.
చివరకు ఆ రెండు బృందాల మధ్య ఏదో అంగీకారం కుదిరింది. ఆ ఆరుగురు నిందితులు పప్పు బెనర్జీ వెంట కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ఇంటికి వెళ్లారు. ఆయన అక్కడ ఆ ఆరుగురు వ్యక్తులకు బంతిపూల దండలతో సాదరంగా స్వాగతం చెప్పారు. ఆయన వారికి స్వీట్లు కూడా తినిపించారు. అటు జైలు ముందు, ఇటు జయంత్ ఇంటి ముందు సత్కార ఆర్భాటాలు చూస్తుంటే బ్రిటీష్ కాలం నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. దేశ స్వాతంత్య్రం కోసం జైలుకెళ్లి తిరుగొచ్చిన వీరులకు ఇలాగే సత్కారం లభించేది. ఇప్పుడు సత్కారం అందుకుంటున్న ఈ వీరులెవరు? వారు దేనికోసం పోరాటం జరిపారు?
సత్కారం అందుకున్న ఆరుగురు వ్యక్తులు ఏడాది క్రితం జరిగిన అమీలుద్దీన్ అన్సారీ హత్య కేసులో శిక్ష పడిన నేరస్థులు. వారికి జార్ఖండ్ ట్రయల్ కోర్టు ఆ ఆరుగురు సహా 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, అది పెద్ద శిక్షంటూ దాన్ని రద్దు చేసిన జార్ఖండ్ హైకోర్టు జూన్ 29న బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లాంఛనాలు పూర్తిచేసి ఏడుగురు నేరస్థుల్లో ఒకరు గురువారమే జైలు నుంచి విడుదలకాగా, ఆరుగురు శుక్రవారం విడుదలయ్యారు. మరో నలుగురు జైలు నుంచి ఇంకా విడుదల కావాల్సి ఉంది. వారి న్యాయపోరాటానికి మొత్తం ఖర్చును జయంత్ సిన్హా పెట్టారని పప్పు బెనర్జీ చెబుతుండగా, ఆయన క్రెడిట్ కోసం కేసు చివరి దశలో జోక్యం చేసుకున్నారని, మొదటి నుంచి కేసుకు ఖర్చు పెడుతున్నదే తానని మాజీ బీజేపీ ఎంపీ శంకర్ చౌధరి మీడియాతో వ్యాఖ్యానించారు. హంతకులతో కలిసి దిగిన జయంత్ సిన్హా ఫొటో జాతీయ పత్రికల్లో ప్రముఖంగా రావడంతో చౌధరి నొచ్చుకున్నారు.
నాడు ఏంజరిగింది?
అమీలుద్దీన్ అన్సారీ హత్య 2017, జూన్ 27వ తేదీ ఉదయం జరిగింది. రామ్‌గఢ్ జిల్లాలోని మనువా గ్రామానికి చెందిన అన్సారీ బొగ్గుల వ్యాపారి. ఆ రోజున మారుతీ వ్యాన్‌లో రామ్‌గఢ్‌కు వెళ్లారు. అక్కడ ఓ అల్లరి మూక ఆయన కారును అడ్డగించి ఆవును చంపి మాంసాన్ని కారులో తరలిస్తున్నావంటూ వాగ్వాదానికి దిగారు. రామ్‌గఢ్ జిల్లా బీజేపీ మీడియా ఇంచార్జి నిత్యానంద్ మెహతో (శిక్షపడిన వారిలో ఒకరు) అన్సారీని కారు నుంచి లాగగా అల్లరి మూక ఆయన్ని కొట్టడం మొదలుపెట్టింది. దీన్ని అల్లరి మూకలో ఒకరిద్దరు సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసి ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో పెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అన్సారీ 16 ఏళ్ల కుమారుడు సహబాన్ ఆ వీడియోను చూశారు. తండ్రిని కాపాడుకోవాలనే తొందరలో ఆ కుర్రాడు డ్రైవింగ్ రాకపోయినా తండ్రి స్కూటర్‌ను తీసి స్టార్ట్ చేశారు. ఒక్కసారిగా గేర్ మార్చి వదిలేయడంతో అది ముందుకు ఎగిరి పడిపోవడంతో కాలుకు గాయం అయింది. తల్లి వచ్చి స్కూటర్ ఎందుకు తీశావంటూ కొట్టబోతే వాట్సాప్ వీడియోను చూపించారు. అప్పుడు అన్సారీ భార్య, కుమారుడు ఇరుగు పొరుగు వారి సహాయంతో హుటాహుటిన రామ్‌గఢ్ వచ్చారు. అప్పటికే అన్సారీ రోడ్డుపై శవంగా పడి ఉండగా, ఆయన మారుతి వ్యాన్‌ను అల్లరి మూక ధ్వంసంచేసి తగులబెట్టింది. ఆ వీధిలో దాదాపు 200 కిలోల మాంసం ముద్దలు పడి ఉండడం కూడా ఫొటోల్లో కనిపించింది. అవి కారులో నుంచి పడ్డాయనే దానికి వీడియోలో కూడా ఎలాంటి ఆధారం లభించలేదు. అంత పెద్ద మొత్తంలో మాంసం తీసుకెళ్లడానికి అన్సారీ మాంసం వ్యాపారీ కాదు. ఇంట్లో ఫంక్షన్ కూడా లేదు. ఆ మాంసం ముద్దలు ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పటికీ మిస్టరీనే.
11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష
కేసును విచారించిన రామ్‌గఢ్ పోలీసులు నిందితులందరిని వీడియో ఆధారంగా అరెస్ట్ చేశారు. జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేసును త్వరితగతిన విచారించి మొత్తం 11 మంది దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గోరక్షణ పేరిట జరిగిన దాడి కేసులో శిక్ష పడిన మొదటి కేసు, పెద్ద కేసు ఇదే. కేసు విచారణ సందర్భంగా కీలక సాక్షి తన భార్యతో పాటు కోర్టుకు వచ్చారు. అన్సారీ కుమారుడు సహబాన్‌తో (అప్పటికి స్కూటర్ నడపడం నేర్చుకున్నారు) ఆమెను స్కూటర్‌పై పంపారు. స్కూటర్‌పై వెళుతున్న వీరిని వెనక నుంచి ఓ ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన సాక్షి భార్య మరణించింది.
సాక్షిని బెదిరించడంలో భాగంగానే ఈ యాక్సిడెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు చేసినా భయపడకుండా అన్సారీ భార్య, కుమారుడు పోరాడటం వల్ల నేరస్థులకు శిక్ష పడింది. నేరస్థులకు ఎలాంటి శిక్షను కోరుకుంటున్నారని తుది విచారణలో కోర్టు జడ్జీ ప్రశ్నించినప్పుడు కూడా అన్సారీ భార్య ‘నా భర్త హత్య కేసులో న్యాయం చేయండని కోరుతున్నాను. అంతుకుమించి నేనేమి చెప్పలేను. నాకేమీ అక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు. శిక్ష పడిన నేరస్థుల్లో స్థానిక బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నారు.
అంత ఉన్నత చదువులు చదివి కూడా
విడుదలైన వారిని స్వాగతించడంలో బీజేపీ నాయకులు ఇక్కడ పోటీ పడుతుంటే అంత ఉన్నత చదువులు చదివిన జయంతి సిన్హాకు ఏమైందంటూ సోషల్ మీడియా తీవ్రంగా విమర్శిస్తోంది. ఢిల్లీ ఐఐటీలో డిగ్రీ, పెన్సిల్వేనియా యూనివర్శిటీలో ఎంఎస్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చేసిన జయంత్ సిన్హా కొంతకాలం బాస్టన్‌లోని ‘మ్యాక్‌కిన్సే అండ్ కంపెనీ’లో పనిచేసి భారత్‌కు వచ్చి రాజకీయాల్లో స్థిరపడ్డారు. జయంత్ సిన్హాను బీజేపీ హయాంలో కేంద్రంలో విదేశాంగ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా పనిచేసిన తండ్రి యశ్వంత్ సిన్హా కూడా ఘాటుగానే విమర్శించారు.
అప్పుడు నేను ‘నాలాయక్’:యశ్వంత్ సిన్హా
‘ఒకప్పుడు నేను మంచి కొడుక్కి మంచి తండ్రిని కాదు (నాలాయక్ బాప్ ఆఫ్ లాయక్ బేటా). ఇప్పుడు మా పాత్రలు తిరగబడ్డాయి. అదే ట్విట్టర్ మహిమ. నా కొడుకు చర్యను నేను ఎప్పటికీ ఆమోదించలేను. నాకు తెలుసు ఇది కూడా మరింత ఛండాలానికి దారితీస్తుంది. అయినా నీవెప్పటికీ గెలవవు’ యశ్వంత్ సిన్హా తన కుమారుడిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
Earlier I was the Nalayak Baap of a Layak Beta. Now the roles are reversed. That is twitter. I do not approve of my son's action. But I know even this will lead to further abuse. You can never win.
— Yashwant Sinha (@YashwantSinha) 7 July 2018
Comments
Please login to add a commentAdd a comment