సాక్షి, న్యూఢిల్లీ : ‘మేము ఓటర్లలో సగం. దేశంలో పెరిగిపోతున్న మూక హత్యలకు వ్యతిరేకంగా మేము ఈ సారి ఓటు వేస్తాం. పట్టపగలు, పలువురు చూస్తుండగా ఈ హత్యలు జరుగుతుండడం దారణం. మా రాజ్యాంగ హక్కులు హరించుకుపోయాయి. మా భావప్రకటనా స్వేచ్ఛను అణచి వేస్తున్నారు’ అని 58 ఏళ్ల మంజూ శర్మ వ్యాఖ్యానించారు. ఆమె ఓ సామాజిక కార్యకర్త. గురువారం నాడు ఢిల్లీ మండి హౌజ్ నుంచి జంతర్ మంతర్‌కు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మహిళల్లో ఆమె ఒకరు.
మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, రైతులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, కళాకారులకు సంబంధించిన పలు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన ఈ ర్యాలీలో కొన్ని వందల మంది మహిళలు పాల్గొన్నారు. వీరంతా ఒక్క ఢిల్లీ నుంచే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, అజ్మీర్, చెన్నై, అహ్మదాబాద్ నగరాల నుంచి కూడా వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ మహిళలకు పిలుపు ఇవ్వడంలో భాగంగానే ఈ ర్యాలీ జరిగిందని ర్యాలీలో పాల్గొన్న సామాజిక కార్యకర్త షబ్నమ్ హష్మీ తెలిపారు. పెద్దనోట్ల రద్దు కారణంగా దేశంలో ఎంతో మంది మహిళలు ఉద్యోగాలను కోల్పోయారని ఆమె చెప్పారు.
పితృస్వామిక వ్యవస్థ, ఫాసిజం, కులతత్వం నశించాలంటూ ర్యాలీలో పాల్గొన్న పలువురు మహిళలు నినదించారు. సోమాసేన్, సుధా భరద్వాజ్ అనే సామాజిక కార్యకర్తలను విడుదల చేయాలంటూ కూడా వారు ప్లే కార్డులను ప్రదర్శించారు. పుణెకు సమీపంలోని భీమా కోరెగావ్‌లో సమావేశంలో పాల్గొన్న తొమ్మిది మందితోపాటు ఈ ఇరువురిని జూన్ నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజు జరిగిన విధ్వంసకాండకు ఆ సమావేశమే కారణం అంటూ వారిపై కేసులు నమోదు చేశారు.
దేశంలో విద్వేష రాజకీయాలు పెరిగిపోయి విధ్వంసం, హింసాత్మక సంఘటనలు పెరిగిపోయాయని, మహిళలకు భద్రత కరవైందని, మరోపక్క నిరుద్యోగం పెరిగిపోయిందని, ఈ ఎన్నికల్లో ప్రధానాంశం నిరుద్యోగమేనని 50 ఏళ్ల అఫ్రోజ్ గుల్జార్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మహిళ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నట్లు ర్యాలీలో పాల్గొన్న పలువురు మహిళలు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment