ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్
రాంచి : జార్ఖండ్ మూకదాడిలో మృతి చెందిన తబ్రేజ్ అన్సారీ కుంటుబానికి రూ. 5 లక్షల నష్ట పరిహారం అందజేస్తామని ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ గురువారం ప్రకటించారు. మృతుడి భార్యకు ఈ మొత్తాన్ని ఇస్తామన్నారు. తబ్రేజ్ అన్సారీ భార్యకు ఢిల్లీ వక్ఫ్ బోర్డులో ఉద్యోగంతో పాటు న్యాయ సహాయం అందించనున్నట్టు తెలిపారు. గతవారం జార్ఖండ్‌లోని సెరైకేలా ఖర్సావన్ జిల్లాలో తబ్రేజ్ అన్సారీని దొంగగా భావించి కొంతమంది అతన్ని స్తంభానికి కట్టేసి కర్రలతో చితకబాదుతూ మూకదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జై శ్రీరామ్’, ‘జై హనుమాన్’ నినాదాలు చేయాలంటూ తబ్రేజ్‌పై అల్లరి మూక దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం రాజ్యసభలో స్పందించారు. ఈ మూకదాడి తనను బాధించిందన్నారు. దాడి చేసిన నేరస్తులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రతిపక్షాలు ఈ ఘటనను ఆసరాగా తీసుకొని జార్ఖండ్ ‘మూకదాడులకు నిలయం’ అంటూ విమర్శించడం సరికాదన్నారు. జార్ఖండ్ రాష్ట్రాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. ఈ ఘటనలో 11 మందిని అరెస్టు చేసి దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment