Mob Killing
-
కాళ్లు నరికి.. కనుగుడ్లు పీకి
డిస్పూర్ : అస్సాంలోని ఓ గ్రామంలో శుక్రవారం ఉదయం ఓ దారుణం చోటు చేసుకుంది. గ్రామస్థుని మీద దాడి చేసిందనే కోపంతో.. ఊరు వాళ్లు ఓ చిరుతపులిపై దాడి చేసి చంపేశారు. అంతటితో ఊరుకోక దాని కాళ్లను నరికి.. కను గుడ్లను పీకేసి.. తాడుకు కట్టి వేలాడిదీశారు. ఈ దారుణం అస్సాం ఛారొడియో జిల్లాలోని బోర్త్ ప్రాంతంలో ఉన్న వెసిలిపతర్ గ్రామంలో చోటు చేసుకుంది. గత కొన్ని వారాల నుంచి ఈ చిరుత పరిసర ప్రాంతాల్లో బీభత్సాన్ని సృష్టిస్తోంది. గ్రామంలో ప్రవేశించి.. పశుపక్ష్యాదుల మీద దాడి చేసి చంపుతుంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం నీలేశ్వర్ చాంగ్‌మాయి అనే గ్రామస్థుని మీద దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ప్రస్తుతం అతను డిబ్రూగఢ్ అస్సాం మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేటికి కూడా అతని పరిస్థితి విషమంగానే ఉంది. జంతువులను చంపడమే కాక మనుషుల మీద కూడా దాడి చేయడంతో..గ్రామస్థుల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. ఈ విషయం గురించి అటవి శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఓపిక నశించిన గ్రామస్థులు స్వయంగా తామే రంగంలోకి దిగి.. చిరుతను ఇలా దారుణంగా మట్టు పెట్టారు. -
‘వాట్సాప్’నే ఎందుకు టార్గెట్ చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ : వాట్సాప్....సోషల్ మీడియాలోనే ఓ సంచలనం సృష్టించిన ఓ సందేశాల ఆప్. ఒక్క భారతదేశంలోనే 25 కోట్లమంది క్రియాశీల వినియోగదారులు ఉన్నారని చెప్పుకుంటున్న ఈ వాట్సాప్ యాజమాన్యం పట్ల కేంద్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ఒక్క సందేశాలే కాకుండా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌తోపాటు ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను అతి సులువుగా అతి వేగంగా షేర్ చేసుకునే అవకాశం ఉండడంతో అనతికాలంలోనే దీనికి అద్భుత స్పందన లభించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా నకిలీ వార్తల కారణంగా మూక హత్యలు చోటుచేసుకోవడంతో వాట్సాప్ ప్రతిష్ట కాస్త మసకబారింది. నకిలీ వార్తల వ్యాప్తి కారణంగా జరిగిన మూక హత్యల్లో 29 మంది మరణించడంతో ఇలాంటి నకిలీ వార్తలను, వదంతులను ఎవరు వ్యాప్తి చేస్తున్నారో కనుగొనడంతోపాటు వాటిని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌కు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేయడం, ఆ మేరకు వాట్సాప్ యాజమాన్యం ఇప్పటికే తన సాఫ్ట్‌వేర్‌లో పలు మార్పులు తీసుకురావడం తెల్సిందే. ఇటు భారత ప్రభుత్వం, అటు భారత సుప్రీంకోర్టు ఒత్తిళ్ల మేరకు వాట్సాప్ సృష్టికర్తయిన ‘ఫేస్బుక్’ యాజమాన్యం గతవారమే ఫిర్యాదులను స్వీకరించి విచారించే అధికారిని కూడా నియమించింది. కంపెనీ తీసుకున్న చర్యలను వివరించడం కోసం కంపెనీ తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి క్రిస్ డేనియల్స్ కూడా భారత్‌కు పంపించింది. ఆయన భారత్ వచ్చి కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను కలుసుకున్నారు. కంపెనీ తీసుకున్న చర్యల గురించి వివరించారు. కొన్ని సూచనలను స్వీకరించారు. వాట్సాప్ వినియోగదారులు వ్యక్తిగతంగా ఒకేసారి ఐదు మందికి, లేదా ఐదు గ్రూపులకు లేదా వ్యక్తులు, గ్రూపులు కలిసి ఐదుకు మించి సందేశాలు పంపడానికి వీల్లేకుండా వాట్సాప్ నియంత్రించింది. అలాగే వాట్సాప్‌లో వచ్చే సమాచారాన్ని గుడ్డిగా విశ్వసించరాదని, వాటిని అనుమానాస్పదంగానే చూసి నిజా నిజాలను తెలుసుకున్నాకే నమ్మాలని, ఆ తర్వాతనే వాటిని షేర్ చేయాలంటూ రేడియోల్లో, టీవీల్లో గత ఆగస్టు నెల నుంచి వాట్సాప్ కంపెనీ తెగ ప్రచారం మొదలు పెట్టింది. నకిలీ వార్తల వ్యాప్తికి కారణమైంది ఒక్క ‘వాట్సాప్’యే కాదు. ఇతర సోషల్ మీడియాలు, వెబ్సైట్లు, చివరకు కొన్ని టెలివిజన్ ఛానళ్లు కూడా నకిలీ వార్తలను ప్రసారం చేశాయి. అయినా వాటి మీదగా అంతగా దృష్టి పెట్టని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఇప్పుడు మూడో నోటీసును జారీ చేసేందుకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సిద్ధమైనట్లు తెల్సింది. ఏది ఏమైనా సమాచారాన్ని ఎవరు పోస్ట్ చేశారో, ఎక్కడి నుంచి పోస్ట్ చేశారో తెలుసుకునేవిధంగా టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిందేనంటూ ఆ నోటీసులో సంస్థను ఆదేశించే అవకాశం ఉంది. ఇతర సోషల్ మీడియాలను వదిలేసి ఒక్క వాట్సాప్‌నే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేయడానికి కారణం ఏమిటీ? కేంద్ర ప్రభుత్వం నోటీసు మేరకు కోడ్ రూపంలో వెళ్లే సందేశాన్ని ముందుగానే కనుగొని, అది ఎక్కడ ప్రాణం పోసుకుంది? ఎవరు దాన్ని పోస్ట్ చేశారు? కనుగొనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాట్సాప్ అభివృద్ధి చేస్తుందా? అసలు ఇప్పటికే అలాంటి పరిజ్ఞానం అందుబాటులో ఉందా? ఉంటే ఎందుకు ఉపయోగించడం లేదు? ఈ విషయంలో సాంకేతిక విజ్ఞాన పండితులు ఏమంటున్నారు? సామాజిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఇంతకు గోప్యత అంటే ఏమిటీ? ఎందుకా గోప్యత ? ఎవరి మధ్య గోప్యత? గోప్యత అవసరమా, కాదా ? అన్నదే ఇక్కడ చర్చ. భారత్‌లోనే ఎక్కువ యూజర్లు జనాభా ప్రాతిపదికన చూస్తే వాట్సాప్ వినియోగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ భారత్. భారత్‌లో తమకు 25 కోట్ల మంది యూజర్లు ఉన్నారని వాట్సాప్ చెప్పుకోవడం కాస్త అతిశయోక్తే కావచ్చు. కానీ గత రెండేళ్లలో రిలయెన్స్ జియో సృష్టించిన విప్లవం, తక్కువ ధరకు డేటా అందుబాటులోకి రావడం, స్మార్ట్ ఫోన్లు విస్తరించడం తదితర కారణాల వల్ల వాట్సాప్‌కు ఆదరణ విపరీతంగా పెరిగింది. వాట్సాప్ అంటే ఒకరి నుంచి మరొకరికి సందేశాన్ని పంపుకునే సర్వీసు మాత్రమే కాదు. ఒకేసారి 256 మందిని కలిపి ఓ గ్రూపును ఏర్పాటు చేయవచ్చు. మనం పంపించే సందేశం క్షణాల్లో గ్రూపులోని 256 మందికి ఒకేసారి వెళుతుంది. 256 మందిలో కూడా ప్రతి ఒక్కరికి కనీసం పది మందితో కూడిన గ్రూపులు ఉన్నాయనుకుంటే ఆ గ్రూపులన్నీ కూడా సందేశాన్ని లేదా సమాచారాన్ని షేర్ చేసుకుంటే కొన్ని క్షణాల్లో వేలాది మందికి సమాచారం వెళుతుంది. ఇంత వేగంతో ఇంత మందికి ఇంత సులువుగా సమాచారాన్ని, వీడియోలను, డాక్యుమెంట్లను షేర్ చేసే యాప్ మరోటి లేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌పై దృష్టిని కేంద్రీకరించింది. అయితే భారత్‌లో 25 శాతం మంది యూజర్లు ఏ గ్రూపుల్లోను లేనివారేనని కంపెనీ చెబుతోంది. అంటే 75 శాతం మంది గ్రూపుల్లో ఉన్నారన్న మాటే కద! వార్తాపత్రికలకు నియంత్రణా వ్యవస్థ ‘వార్తా పత్రికలు, రేడియోలు, టీవీ ఛానళ్లు చట్టాల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటి నియంత్రణకు వ్యవస్థనే ఉంది. వాటిల్లో వచ్చే నకిలీ వార్తలకు వాటి యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాట్సాప్ సామాజిక సందేశ సర్వీస్ ప్రొఫైడర్ అవడం వల్ల దానిపై ఆ నియంత్రణ లేదు’ అని నల్సర్ లా యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ టీ. ప్రశాంత్ రెడ్డి చెప్పారు. నకిలీ వార్తలు, రెచ్చగొట్టే ప్రసంగాలు ఎక్కడి నుంచి ఎవరు అప్లోడ్ చేశారో తెలుసుకోవాలని ఇప్పుడు ప్రభుత్వం వాంఛిస్తోంది. వాట్సాప్ ‘ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్’ వ్యవస్థ. అంటే ఒక యూజర్ నుంచి మరో యూజర్ వద్దకు సందేశం కోడ్ రూపంలోనే వెళుతోంది. మధ్యలో దాన్ని డీకోడ్ చేసే వ్యవస్థ లేదు. అందువల్ల యూజర్ పంపిన సందేశం వాట్సాప్ యాజమాన్యానికి తెలిసే అవకాశమే లేదు. అసలు తెలుసుకోవాలనే ఆలోచనే ఆ కంపెనీకి ఇంతవరకు లేదు. గోప్యత కారణంగానే మాకు ఆదరణ ‘సున్నితమైన కుటుంబ వ్యవహారాలు, వైద్యానికి సంబంధించిన అంశాలు, బ్యాంకుల లావాదేవీలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని గోప్యంగా ఉంచుతుందన్న నమ్మకంతోనే ఎంతో మంది యూజర్లు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ఆ సమాచారిన్ని పంపిందెవరో కనుగొనే వ్యవస్థ ఉండాలంటే వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుంది. అలా జరిగితే అందుకు సంబంధించి కంపెనీ అంతర్జాతీయంగా పలు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోంది’ అని కంపెనీ అధికార ప్రతినిథి ఒకరు తెలిపారు. బలిపశువును చేయడం భావ్యం కాదు ‘నకిలీ వార్తల కారణంగా మూక హత్యలు జరుగుతున్నాయంటూ వాట్సాప్ లాంటి యాప్‌లను బలి పశువులను చేయడం ప్రభుత్వాలకు ఎంత మాత్రం భావ్యం కాదు. ఇది తమ బాధ్యతలను ఇతరులపై రుద్దడం లాంటిదే. ప్రజలకు సరైన భద్రతను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, పోలీసు వ్యవస్థది. నకిలీ వార్తల పేరిట సందేశాహరులెవరో తెలుసుకోవాలనుకోవడం వ్యక్తిగత స్పేస్‌లోకి జొరబడేందుకు ప్రయత్నించడమే’ అని సాంకేతిక వ్యాసాల వ్యాసకర్త, న్యాయవాది అపర్ గుప్తా అభిప్రాయపడ్డారు. ఇది బాధ్యతల నుంచి తప్పించుకోవడమే ‘సందేశాన్ని డీకోడ్ చేసే సాంకేతిక పరిజ్ఞానమే తమకు లేదని, యూజర్ల గోప్యతను పరిరక్షించేందుకే తాము అటు వైపు ఆలోచించలేదని వాట్సాప్ యాజమాన్యం వాదించడం అర్ధరహితం. యూజర్ల సమాచారాన్ని పర్యవేక్షించాలంటే అదనపు ఉద్యోగులు అవసరం. తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ లాభాలను పొందాలన్నది ఆ కంపెనీ లోలోపలి ఆలోచన. వాట్సాప్.... ఫేస్బుక్, ట్విట్టర్ లాంటిది కాదు. ఇది చట్టానికి లోబడి పనిచేయాల్సిందే. డీకోడ్చేసే సాంకేతిక పరిజ్ఞానం లేదని కంపెనీ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. పత్రికలు, టీవీలు, రేడియోలు చట్టం పరిధిలోకి వచ్చినట్లే వాట్సాప్‌ను కూడా చట్టం పరిధిలోకి తీసుకరావాల్సిందే’ అని అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గోప్యత ఇద్దరు వ్యక్తులు, ఓ కుటుంబానికి సంబంధించినదని, వారు గోప్యంగా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేందుకు ఇతర మార్గాలున్నాయన్నది ఆయన అభిప్రాయం. మధ్యేమార్గమే ఉత్తమం ముఖాముఖి ఛాటింగ్, వ్యక్తిగత సందేశాల జోలికి వెళ్లకుండా మూకుమ్మడి సందేశాలను మాత్రమే కనుగొనే సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టడం సముచితంగా ఉంటుందని ‘మీడియా నామా’కు చెందిన నిఖిల్ పవ్వా అభిప్రాయపడ్డారు. కోడ్ భాషను బ్రేక్ చేయకుండా సమాజానికి హానికలిగించే సమాచారాన్ని ఎవరు పంపించారో తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం ఉండాల్సిందేనని వాట్సాప్‌కు పోటీగా ‘వియ్‌చాట్’కు పనిచేసి ఇప్పుడు ‘ఫిన్‌టెక్ స్టార్టప్’కు అధిపతిగా ఉన్న హిమాన్షు గుప్తా, ఇలినాయీ యూనివర్శిటీలోకి మీడియా కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ హర్ష్ తనేజా అభిప్రాయపడ్డారు. -
అస్సాంలో మరో మూక దాడి
గువాహటి: అస్సాంలో మరో మూక దాడి చోటుచేసుకుంది. జిల్లా సూపరింటెండెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు ఆవులను దొంగిలించి ఆటోలో తరలిస్తున్నారన్న అనుమానంతో నలుగురు వ్యక్తులపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. బుధవారం బిస్వాంత్ జిల్లా డిప్లొంగా టీ ఎస్టేట్‌లో ఈ ఘటన జరిగింది. నలుగురు వ్యక్తులు సంకత్ తంతి అనే వ్యక్తికి చెందిన రెండు ఆవులను దొంగిలించి నంబర్ ప్లేట్ లేని ఓ ఆటోలో పారిపోతున్నారు. సాయం కోసం తంతి అరవగా గ్రామస్తులు వచ్చి వారిని అడ్డుకుని చితకబాదారు. పోలీసులొచ్చి వారిని ఆస్పత్రికి తరలించగా డెబెన్ రాజ్బోంగ్షి (35) అనే వ్యక్తి మృతిచెందారు. -
‘మూక హత్యలతో మళ్లీ దేశ విభజన’
శ్రీనగర్: గోవులను తరలిస్తున్నారనే అనుమానంతో ముస్లింలపై దాడులు, హత్యలకు అడ్డుకట్టపడకుంటే అది మళ్లీ దేశ విభజనకు దారి తీస్తుందని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) నేత, మాజీ ఉపముఖ్యమంత్రి ముజఫర్ హుస్సేన్ బేగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీడీపీ 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘గో సంరక్షకుల పేరుతో ముస్లింలపై దాడులు, మూకహత్యలను అడ్డుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరనున్నాం. ఇప్పటికే 1947లో దేశ విభజన జరిగింది. ముస్లింలపై దాడులు ఇంకా కొనసాగితే అది మరోసారి దేశం విచ్ఛిన్నానికి దారి తీస్తుంది’ అని హెచ్చరించారు. రాష్ట్రంలో మొన్నటి దాకా సాగిన బీజేపీతో పీడీపీ పొత్తు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ముఖ్యంగా కాశ్మీరీలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే కానీ, అధికారం కోసం మాత్రం కాదన్నారు. -
మూకహత్యలకు రాజకీయాలే దన్ను
హాపూర్, ధూలే, మాల్డా, పులికాట్, హజారీబాగ్. దేశంలోని ఈ పట్టణాల పర్యటన కోసం వాటి పేర్లు ఇక్కడ రాయడం లేదు. నవ భారతంలో ప్రజలు సిగ్గుపడే ఘటనలు అంటే మూకహత్యలు ఈ ఊళ్లలో జరిగాయి. హిందూస్తాన్ లోని పట్టణాలు ఇలాంటి హత్యలకు అనువైన ప్రదే శాలుగా మారిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో పశువుల వ్యాపారి రక్బర్ ఖాన్ మూకల దాడిలో మర ణించాడు. 2010 నుంచీ దేశంలో మొదలైన మూక హత్యల్లో ఇది 87వది. అడ్డూఅదుపూ లేని మూకల దాడుల్లో ఇప్పటి వరకూ జరిగిన దాడుల్లో 34 మంది ప్రాణాలు కోల్పోగా, 240 మంది గాయపడ్డారు. 2014 మేలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి నప్పటి నుంచీ 98 శాతం మూకహత్యలు జరిగాయి. ఇలాంటి సంఘటనల్లో 56 శాతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంభవించాయి. ఇలాంటి నేరాలను ఎప్పటి కప్పుడు నమోదు చేసి వివరాలు సేకరించే ఇండియా స్పెండ్ అనే వెబ్సైట్ ఈ విషయాలు వెల్లడించింది. చావులతో కూడా ఈ లెక్కలను గణాంకాల సేకర ణకు ఇవ్వడం లేదు. వివక్షతో విచ్చలవిడిగా ప్రవ ర్తించే మూకలు బలోపేతమౌతూ దేశాన్ని మధ్య యుగాల భారతదేశంగా మార్చుతున్నాయనే వాస్త వాన్ని ఇవి సూచిస్తున్నాయి. మత విద్వేషాలు పెరగ డంతోపాటు చట్టాన్ని అమలు చేయాల్సిన భారత ప్రభుత్వ వ్యవస్థలు అరాచక శక్తులతో రాజీపడటం వల్ల మనుషులు ఆదిమానవులుగా మారుతున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేప థ్యంలో ఈ హత్యలు ప్రారంభం మాత్రమేనని నేను భావిస్తున్నాను. ‘జనం గొడ్డు మాంసం తినడం మానేస్తే మూకహత్యలు ఆగిపోతాయ’ని ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ మాటలు ఈ విషయాన్నే నొక్కి చెబుతున్నాయి. ఇదే పద్ధతిలో మాట్లాడే హైదరాబా ద్‌కు చెందిన బీజేపీ ఎమ్యెల్యే టి. రాజా సింగ్ ‘మొదట గో హత్యల గురించి ఎందుకు ప్రశ్నిం చరు?’ అంటూ రెచ్చగొడుతున్నారు. ఆయన తన పోకడలను వ్యతిరేకించే వారికి ఇలా హెచ్చరిస్తున్నా రనే విషయం మనం మర్చిపోకూడదు. మూకహత్య నిందితులకు ఎమ్మెల్యే మద్దతు! స్థానిక ఎమ్మెల్యే మద్దతు తమకుందని రాజస్తాన్‌లోని ఆల్వార్ మూకహత్య కేసులో నిందితులు ప్రకటిం చుకున్నారని వార్తలొచ్చాయి. ఇలాంటి దుర్మార్గాలకు కేవలం రాజకీయ నేతలేగాక ప్రభుత్వ ఉన్నతాధికా రులు కూడా కారణమౌతున్నారు. ఫలితంగా, దేశం లోని అనేక ప్రాంతాల్లో మత విద్వేషాలతో నిండిపో తున్నాయి. హిందువులు కాని ఇతర మతాల ప్రజల రోజులు దగ్గరపడ్డాయనే ధోరణి ప్రబలిపోతోంది. ఆవుల రవాణా మూకహత్యలకు దారితీసే సంద ర్భాల్లో ఎలాంటి నాగరిక దేశంలోనైనా మొదట పశు వులను గోశాలలకు తరలించడాని కన్నా దాడిలో గాయపడిన మనుషులను ఆస్పత్రికి తరలించడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఆల్వార్ పోలీసులు ఇదే పని చేయడమేగాక, పొరపాటు జరిగిందని చెప్పారు. పశువుల వ్యాపారి పేరు రక్బర్ఖాన్ కావడమే అతని హత్యకు కారణమా? సమాజంలో వర్గ విద్వేషాలు ఉన్నప్పుడు వాటిని వివరంగా వెల్లడించాల్సిన బాధ్యత జర్నలిస్టులకు లేదు. అయితే, ఈ రకమైన ఊచకోతలు ఓ పథకం ప్రకారం జరుగుతున్నట్టు కనిపిస్తే మీడియా వాటి గుట్టు విప్పాల్సిన అవసరం తప్పక ఉంటుంది. ఈ మూక హత్యల్లో మతపరమైన అంశం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, ఇలాంటి దాడు లకు గురైన వారిలో 56 శాతం, బాధితుల్లో 88 శాతం ముస్లింలేనని ఇండియా స్పెండ్ సంస్థ వెల్లడించింది. ఈ నెలలోనే ఉత్తర కర్ణాటకలోని బీదర్‌లో హైదరా బాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహ్మద్ ఆజంను పిల్లలను ఎత్తుకుపోయే వ్యక్తిగా అనుమానించి అప్ప టికప్పుడు గుమిగూడిన జనం కొట్టి చంపారు. ఇలాంటి మూకల దాడుల్లో గోసంరక్షకులైనా లేదా సాధారణ జన సమూహాలైనాగాని ముస్లింలనే పట్టుకు చంపుతున్నారని మలక్‌పేట్ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా అన్నారు. ‘‘ మూకహత్యల పేరుతో ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఈ సంఘటనలు సూచిస్తు న్నాయి. వీటి వెనుక ఉన్నది హిందుత్వ శక్తులే’’ అని ఆయన ఆరోపించారు. కాని, మహ్మద్ ఆజం హత్యలో మతం పాత్ర లేదని బీదర్ ఘటన గురించి తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. దాడి సందర్భంలో 9మంది పోలీసులు ఆజంను, అతని స్నేహితులిద్ద రినీ రెండు వేల మందికిపైగా ఉన్న మూకనుంచి కాపాడటానికి గట్టి ప్రయత్నమే చేశారు. ఆల్వార్‌లో పోలీసులే ఏం చేసిందీ పైన చెప్పాను. ఆల్వార్ వంటి ఘటనలు పరిశీలిస్తే, బలాలా చెప్పింది మనకు ఇబ్బంది కలిగించే వాస్తవమని గుర్తించక తప్పదు. హాపూర్‌లో జరిగిందే బీదర్‌లోనూ ! దాడికి గురైనవారిని ఎలా చూశారనే విషయానికి వస్తే హాపూర్ ఘటన బీదర్‌లో పునరావృతమైంది. బీదర్‌లో దుండగులు టెకీ ఆజం కుడి చేతికి తాడుకట్టి ముఖాన్ని నేల మీద ఈడ్చుకుంటూ పోయారు. ఆ సమయంలో మూకలు అతన్ని కొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఆజం కొన్ని నిమిషాల తర్వాత ఆస్పత్రికి తీసుకెళుతుండగా ప్రాణాలు విడిచాడు. జూన్ నెలలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్‌లో పశువుల వ్యాపారి ఖాసింను ఇదే తీరులో కొట్టి చంపారు. ప్రాణంపోయాక అతని మృత దేహాన్ని పోలీస్ జీపు దగ్గరికి జనం ఈడ్చుకుంటూ పోతుండగా, ముగ్గురు పోలీసులు వారితో పాటు నడిచారేగాని మరణించినవారి శరీరాలను పద్ధతిగా చూడాలనే స్పృహ వారిలో కలగలేదు. మూకలు ఖాసింను ఆవును మాంసం కోసం చంపే వ్యక్తి అని ఆరోపించగా, బీదర్‌లో ఆజంను పిల్లలను తన కారులో అపహరించుకుపోతున్న దొంగగా ముద్రవే శారు. ఇండియాలో 2018లో నోటి మాటగా లేదా వాట్సాప్ సందేశం ద్వారా వ్యాప్తిచేసే అబద్ధాలు అరాచక మూకలు మనుషుల ప్రాణాలు తీయడానికి తోడ్పడుతున్నాయి. ఇలాంటి మూకహత్యలపై ప్రభు త్వాలు స్పందించే తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మూకహత్యల నివారణకు కొత్త చట్టం చేయాలని పార్లమెంటును సుప్రీంకోర్టు కోరినా ఈ దిశగా కేంద్రం ఓ కమిటీ వేయడం మినహా చేసిందేమీ లేదు. శాంతి, భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశ మని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. జార్ఖండ్‌లోని రాంగఢ్‌లో ఓ ముస్లిం మాంసం వ్యాపా రిని కొట్టి చంపిన కేసులో దోషులుగా తేలిన ఏడుగురు హంతకులను కేంద్ర పౌరవిమానయాన మంత్రి జయంత్ సిన్హా సన్మానించారు. ‘ప్రధాని మోదీకి ప్రజాదరణ పెరగడం వల్లే ఇలాంటి మూక హత్యలు జరుగుతున్నాయని మరో కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ చెప్పడం మరీ దారుణం. ‘‘మోదీకి జనాదరణ పెరిగేకొద్దీ ఇలాంటి ఘటనలు జరుగుతాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవార్డులు వెనక్కి ఇచ్చేశారు. యూపీ ఎన్నికలప్పుడు మూకహత్యలు జరిగాయి. 2019 ఎన్నికల సమయంలో మరోటి మొదలవుతుంది’’ అని మేఘవాల్ వివరించారు. పథకం ప్రకారం చేసిన ఇలాంటి దారుణ హత్యలను ఎన్నికల పేరు చెప్పి ఈ బీజేపీ నేత సమర్ధించడం నిజంగా ఆందోళనకరం. బీజేపీ, కాంగ్రెస్ ‘నువ్వంటే–నువ్వు’ ఈ ఘటనలపై పాలకపక్షమైన బీజేపీ ప్రతినిధులు స్పందిస్తూ, కాంగ్రెస్ పాలనలో జరిగిన ఇలాంటి దారుణాల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ‘‘1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచ కోత, అస్సాంలో 1983 నాటి నెల్లీ మూకుమ్మడి హత్యాకాండ, 1947 దేశ విభజనలో జరిగిన హిందూ, ముస్లింల ఊచకోతలు కాంగ్రెస్ పాలనలో జరిగినవే కదా’’ అంటే ఇప్పటి దారుణాలను సమ ర్థించుకుంటున్నారు. అయితే, ఇది బీజేపీ–కాంగ్రెస్ మధ్య వాదన లేదా మాటల యుద్ధం కాదనే విషయం ఈ రెండు పార్టీలు మరిచిపోతున్నాయి. దేశ ప్రజలే రెండు వర్గాలుగా చీలిపోవడంతో జరుగు తున్న హత్యలివి. ఆవుల అక్రమ రవాణాదారు అనే ముద్రవేసి ప్రాణాలు తీసే క్రీడ ఇది. ఇలాంటి ఘట నలపై దర్యాప్తు చేసి, సత్యం ఏమిటో తేల్చాల్సిన వారు ఆ పనిలో విఫలమవుతున్నారు. కిందటేడాది ఏప్రిల్‌లో ఆల్వార్లోనే ఓ మూక చేతుల్లో మరణిం చిన పాల వ్యాపారి పెహ్లూ ఖాన్ ప్రాణాలు విడిచే ముందు తనపై దాడి చేసిన ఆరుగురి పేర్లు చెప్పాడు. కాని, వారిపై సాక్ష్యాధారాలు లేవని దీనిపై దర్యాప్తు జరిపిన సీఐడీ పోలీసులు ఆ ఆరుగురినీ విడిచి పెట్టారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి హత్యలు జరగడం మనం దిగులు పడాల్సిన విష యం. తీవ్ర ఆవేశంతోనో లేదా బాగా రెచ్చగొట్ట డంతోనే ఒక మనిషిని మరో మనిషి చంపడం సాధారణంగా జరుగుతుంది. మూకలు ఇలాంటి అమానుష హత్యలకు పాల్పడుతున్నాయంటే అవి సంపాదించిన అడ్డగోలు ధైర్యమే ఇందుకు కారణం. ఆవులను చంపి మాంసం తినేవారికి సమాజంలో బతికే హక్కు లేదని మూకలకు నూరిపోసే పథకం ప్రకారం ఇలాంటి హత్యలకు మనుషులను సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారంతో కావాలని మామూలు వ్యక్తులను రాక్షసులుగా మార్చేస్తున్నారు. 15 ఏళ్ల జునేద్ఖాన్ కిందటేడాది జూన్‌లో ఇంట్లో ఈద్ జరుపుకోవడానికి తోబుట్టువులతో రైలులో హరియాణాలోని ఇంటికి వెళుతుండగా మూక చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు. హంతకులు అతని సోదరుల గడ్డాలు పట్టుకుని ఎగతాళి చేయడమేగాక, వారిని ఆవు మాంసం తినే వ్యక్తులని ముద్రవేశారు. ఎన్నికలకు ముందు ఇలాంటి హింసా కాండ ఫలి తంగా ప్రజలు రెండు వర్గాలుగా చీలి పోవడాన్ని తమకు ప్రయోజనకరంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతాయనే భయం పీడిస్తోంది. వీటిని కేవలం ట్విట్టర్లో ఖండించడం వల్ల ప్రయోజనం లేదు. మహాత్మాగాంధీ ‘హింద్ స్వరాజ్’ అనే గ్రంథంలో ‘‘ ఆవుపై నా గుండె నిండా ఎంత జాలి ఉన్నా–దాని ప్రాణం కన్నా నా సోదరుడిని కాపాడటానికే నా ప్రాణ త్యాగం చేస్తాను’’ అని రాసిన మాటలు ఈ సందర్భంగా మనకు గుర్తుకొస్తే మంచిది. ఇదే మనం ఆచరించాల్సిన నియమం కావాలి. కానీ, 2018లో ఈ మాటలు ఎవరికీ వినిపించవు, కనిపించవు. - టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
ఎట్టకేలకు కదలిక
మూడేళ్లు గడిచాక... దాదాపు 48మంది మరణించాక... ఒక చట్టం చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించాక కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మూక దాడులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయటం కోసం ఉన్నతాధికారుల కమిటీ, మంత్రుల బృందం ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. మూక దాడులు జరిగినప్పు డల్లా ఆరోపణలు రావడం, వాటిని బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు ఖండించడం, ఎదురు దాడి చేయడం తప్ప దాడుల్ని ఆపడానికి ఎలాంటి చర్యలు అవసరమన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు. మూక దాడులు జరగకుండా చూడమని రాష్ట్రాలనూ, కేంద్ర పాలిత ప్రాంతాలనూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నెల మొదట్లో కోరింది. పిల్లల్ని అపహరించుకుపోతున్నారన్న అను మానంతో వ్యక్తులను కొట్టి చంపుతున్న ఘటనలు ముదిరాక ఈ పని చేసింది. గోరక్షణ పేరుతో మూకలు చెలరేగినప్పుడే ఇలాంటి ప్రయత్నం జరిగితే... ఈ అనాగరిక హత్యాకాండను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నదన్న సంకేతాలు వెళ్తే పరిస్థితి ఇంతగా దిగజారేది కాదు. రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లాలో శనివారం జరిగిన ఉదంతమే దీనికి రుజువు. మూక దాడులు జరిగినప్పుడల్లా పోలీసులు నిందితుల్ని కాపాడుతున్నారని, అరెస్టులో అల సత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు రావడం రివాజు. తాజా ఉదంతంలో పోలీసుల ప్రవర్తన మరింతగా దిగజారింది. ఉన్మాదులు తీవ్రంగా కొట్టడంతో ఒంట్లో ప్రతి అవయమూ చిట్లిపోయి నెత్తుటి ముద్దలా మారిన బాధితుడి గురించి వారు అసలు పట్టించుకోనేలేదు. గో రక్షక భటుల్లా మారి అక్కడున్న రెండు ఆవులనూ గోశాలకు తరలించేలా చూసి, ఆ తర్వాత ఓ దుకాణం వద్ద తాపీగా టీ తాగి అటుపై అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, అక్కడినుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు మనిషిని తీసుకెళ్లారంటే అది అబద్ధమవుతుంది. అతని మృత దేహాన్ని తీసుకెళ్లారని చెప్ప టమే సబబు. ఘటన జరిగింది మొదలు ఆసుపత్రికి తీసుకెళ్లేవరకూ చూస్తే మూడుగంటల సమ యం పట్టింది. ఈ సమయంలో బాధితుడు ఎంతసేపు ప్రాణాలతో ఉన్నాడోగానీ... ముందు నడి రోడ్డుపై, ఆ తర్వాత పోలీస్ వ్యాన్‌లో, అటుపై పోలీస్‌స్టేషన్‌లో నరకయాతన అనుభవించి ఉంటాడు. తమకు పశువులే తప్ప మనుషుల ప్రాణాలంటే లెక్కలేదని చెప్పే ఉన్మాద మూకలకూ, ఈ పోలీసులకూ తేడా ఏమైనా ఉందా? మూక దాడుల్ని చూసీచూడనట్టు వదిలేయటమే కాదు... అలాంటి దాడుల్లో పాల్గొన్నవారికి వెన్నుదన్నుగా ఉంటున్న ప్రభుత్వాల తీరువల్లే ఈ దుస్థితి ఏర్పడింది. ఇదే అల్వార్ జిల్లాలో ఇంతవరకూ అయిదుగుర్ని ఉన్మాద మూకలు పొట్టనబెట్టుకోగా... వారిలో చాలామంది బెయిల్‌పై బయటికొచ్చారు. నిరుడు ఏప్రిల్‌లో 55 ఏళ్ల పాల ఉత్పత్తిదారును ఇదే సాకుతో గోరక్షక మూక తీవ్రంగా కొట్టి చంపింది. చనిపోయే ముందు బాధితుడిచ్చిన మరణ వాంగ్మూలంలో దాడికి కారకులైన అయిదుగురి పేర్లిస్తే... పోలీసులు మాత్రం వారంతా ఘటన జరిగినప్పుడు వేరేచోట ఉన్నారని తేల్చి అసలు అరెస్టే చేయలేదు! రాజస్తాన్ ప్రభుత్వం ఏ ఉదం తంలోనూ బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం అందించలేదు. తాజా ఉదంతంలో మాత్రం రూ. లక్షా 25 వేలు ఇస్తామని ప్రకటించింది. అదే పెద్ద ఔదార్యమనుకోవాలి! దాడిలో మరణించిన రక్బార్‌ఖాన్ పశువులు అమ్మడం కొనడం ప్రధాన వ్యాపకంగా ఉండే రబారీ సంచారతెగకు చెందిన వాడు. ఆ తెగలో హిందువులూ ఉంటారు. ముస్లింలూ ఉంటారు. వందల ఏళ్లనుంచి రబారీ తెగ ఆ వ్యాపారమే చేస్తోంది. గోరక్షణ మూకల ఆగడాలు మితిమీరుతున్నాయి గనుక దాన్ని ప్రస్తుతానికి మానుకోవాలని కొందరు హితవు చెప్పినా, ఇది తప్ప తమకు బతుకుతెరువు లేదని ఆ తెగ మొత్తు కుంటోంది. గుజరాత్ నుంచి రాజస్తాన్ వరకూ ఉండే వందల కిలోమీటర్ల దూరం వీరు నడిచి పోతూ పశువుల సంతలో కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తారు. గొర్రెలు, ఒంటెలు, ఎడ్లు, ఆవులు... ఇలా వేటిని తోలుకుంటూ వెళ్లినా మూక ఎదురుపడినప్పుడల్లా కప్పం కట్టి బతుకు కొనుక్కుంటు న్నామని ఆ తెగ అంటోంది. గోరక్షణ పేరుతో జరిగిన దాడులతోపాటు పిల్లల్ని అపహరిస్తున్నారన్న అనుమానంతో కొట్టి చంపుతున్న కేసులు కూడా ఈమధ్య పెరిగాయి. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి హింసాయుత వాతా వరణాన్ని ఎలా పెంచుతుందో చెప్పడానికి మూకదాడులే ఉదాహరణ. 2015 వరకూ గోరక్షణ దాడుల్లో అత్యధికభాగం అంటే 76 శాతం ఉత్తరాదిలో జరిగాయని, ఆ తర్వాత కాలంలో అవి దాదాపు దేశమంతా వ్యాపించాయని ‘ఇండియాస్పెండ్’ వెబ్సైట్ గణాంకాలు చెబుతున్నాయి. చిత్రమేమంటే జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) దగ్గర అసలు గోరక్షకæ దాడుల లెక్కలే లేవు! పిల్లల్ని అపహరించడానికొచ్చారన్న అనుమానంతో 2012లో ఒకే ఒక దాడి జరగ్గా నిరుడు జనవరినుంచి లెక్కేస్తే 69 మూకదాడి ఉదంతాల్లో 33మంది చనిపోయారని ఆ వెబ్సైట్ వెల్లడిం చింది. గోరక్షక మూకల దాడుల్ని అదుపు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావటం పర్యవ సానంగానే అవి వేరే రకాల దాడులకు చోటిచ్చాయి. కనీసం ఈ దశలోనైనా కదిలినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇప్పుడు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆధ్వర్యంలో ఉన్న తాధికారుల కమిటీ పరిస్థితిని ఎదుర్కొనడానికి ఎలాంటి చర్యలు అవసరమో పక్షంరోజుల్లో సూచి స్తుంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని మంత్రుల బృందం వాటిని పరిశీలించి ప్రధానికి తుది సిఫార్సులు చేస్తుంది. ఈ కమిటీకి ఎలాంటి గడువూ లేదు. మూకదాడుల నియం త్రణకు చట్టం తీసుకురావాలని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది. దానికి అనుగుణంగా సీఆర్పీసీలో కొత్తగా ఒక నిబంధన చేర్చాలని ఈ కమిటీలు సిఫార్సు చేస్తాయో లేక రాష్ట్రాల స్థాయిలో చట్టా లుంటే సరిపోతుందని చెబుతాయో వేచిచూడాలి. అయితే ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను సైతం నేరాల్లో సహ భాగస్వాములుగా పరిగణిస్తే తప్ప ఈ దాడులు ఆగవు. -
బెయిల్‌పై నిందితులు.. మంత్రి ఘన స్వాగతం
రాంచీ : ఓ వైపు కేంద్రం నకిలీ వార్తలు, వదంతుల వల్ల దేశంలో పెరిగిపోతున్న హింసను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంటే... మరోవైపు స్వయంగా అధికార పార్టీ నేతలే హింసాత్మక చర్యలకు పాల్పడిన వారికి ఘనస్వాగతం పలకడం వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. గో మాంసం అమ్ముతున్నాడనే నెపంతో ఓ ముస్లిం వ్యక్తిని చంపి జైలుకెళ్లి, ఆపై బెయిల్‌పై వచ్చిన వారికి పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా. ఆ వివరాలిలా.. గో మాంసం అమ్ముతున్నాడనే నేపంతో గతేడాది జూన్ 29న జార్ఖండ్ రాంఘడ్‌కు చెందిన అలిముద్దిన్ అన్సారీ(40) అనే వ్యక్తిపై 12 మంది దాడి చేశారు. ఈ దాడిలో అన్సారీని తీవ్రంగా కొట్టడంతో అతను అక్కిడిక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో 11 మందికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించింది. మరొకరు మైనర్ కావడంతో అతన్ని జువైనల్ హోంకు తరలించింది. శిక్ష పడిన వారిలో స్థానిక బీజేపీ నాయకుడు కూడా ఉన్నారు. అయితే కోర్టు తీర్పును జయంత్ సిన్హా వ్యతిరేకించారు. కేసును మరోసారి సమీక్షించాలని, సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ హైకోర్టు వీరిలో 8 మందికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సిన్హా తన ఇంటి వద్ద వీరికోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెయిల్ మీద వచ్చిన వారికి స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలకడమే కాక వారిని పూల మాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ ఎమ్మేల్యే శంకర్ చౌదరీ ‘మీ ఎనిమిది మంది తరుపున వాదించి, మీకు బెయిల్ వచ్చేలా చేసిన అడ్వకేట్ బీబీ త్రిపాథికి మీరు కృతజ్ఞతలు తెలపాలి. అతను మీ పాలిట దేవుడు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీడియాలో ప్రసారం కావడంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉండగా జయంత్ సిన్హా ఎన్నికైంది కూడా రాంఘడ్ నియోజక వర్గం నుంచే కావడం గమనార్హం. -
పుకార్ల హత్యలు.. ఆనందంలో త్రిపుర : సీఎం
అగర్తలా : త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అనుమానితులుగా కనిపిస్తే మూకుమ్మడిగా దాడి చేస్తున్న ఘటనలపై మీరేంమంటారు? అని విప్లవ్‌ను మీడియా ప్రతినిధులు అడుగ్గా.. రాష్ట్రం ఆనందంలో ఉందని సమాధానం ఇచ్చారు. ‘నా ముఖం చూడండి. ఆనందంతో ఎంతలా వెలిగిపోతోందో’ అచ్చూ నాలానే రాష్ట్రంలోని ప్రజలు ఆనందంతో ఉన్నారని విప్లవ్ పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత నోరు జారానని తెలుసుకున్న సీఎం తప్పుగా అర్థం చేసుకోవద్దని మీడియా ప్రతినిధులను కోరారు. అగర్తల విమానాశ్రయాన్ని ఉద్దేశించి అన్నానని వివరణ ఇచ్చారు. ఈ ఎయిర్‌పోర్టుకు ఇటీవల ‘మహారాజా వీర్ విక్రమ్ మాణిక్య కిశోర్ ఎయిర్‌పోర్టు’గా నామకరణం చేశారు. గత నెల 28న త్రిపురలో మూడు ‘మాబ్ లించింగ్’ (కొట్టి చంపడం) ఘటనలు జరిగాయి. పిల్లల కిడ్నాపర్లుగా భావించి ఇద్దరిని, కిడ్నీ స్మగ్లర్ల్‌గా అనుమానించి కొట్టి చంపారు. -
వాట్సప్ రూమర్లతో.. ఏడుగురి హత్య!
జార్ఖండ్‌లోని సింగ్భూమ్ జిల్లాలో కొంతమంది పిల్లలను ఎత్తుకుపోతున్నారంటూ వాట్సప్‌లో వదంతులు వ్యాపించడంతో రెండు వేర్వేరు ఘటనల్లో గ్రామస్తులు కొంతమందిని పట్టుకుని చితక్కొట్టారు. దాంతో ఏడుగురు మరణించారు. ఈ కేసులో 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగలేదని పోలీసులు అంటున్నారు. వికాస్ కుమార్‌వర్మ, గౌతమ్ కుమార్ వర్మ, గంగేష్ గుప్తా అనే ముగ్గురినీ నగాడి అనే ప్రాంతంలో గ్రామస్తులు పట్టుకుని చితక్కొట్టి ప్రాణాలు తీసేశారు. వికాస్, గౌతమ్‌ల నాయనమ్మపై కూడా దారుణంగా దాడి జరిగింది. ఇక రాజానగర్‌లో కూడా నలుగురు వ్యక్తులను సొసొమౌలి గ్రామస్తులు పట్టుకుని వాళ్లు కిడ్నాపింగ్ గ్యాంగ్ సభ్యులన్న అనుమానంతో కొట్టి చంపేశారు. కొంతమంది వ్యక్తులు పిల్లలను కిడ్నాప్ చేసి, వాళ్ల శరీర భాగాలను అమ్మేస్తున్నారంటూ వాట్సప్‌లో రూమర్లు వ్యాపించాయి. దాంతో అనుమానాస్పదంగా కనిపించిన ఈ ఏడుగురినీ గ్రామస్తులు పట్టుకుని చితక్కొట్టి మరీ ప్రాణాలు బలిగొన్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులు చాలా శాంతంగా ఉంటారని, అయితే రూమర్ల కారణంగా వారిలో భయం పుట్టి అదే ఇలాంటి ఘటనలకు దారితీసిందని పోలీసు ఉన్నతాధికరులు అంటున్నారు. పోలీసులు వచ్చినప్పుడు కూడా గ్రామస్తులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని వాళ్లను అక్కడకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఆ సందర్భంగా చేసిన దాడిలో కొందరు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. పోలీసులు వేసుకొచ్చిన కార్లు, జీపులను కూడా తగలబెట్టేశారు. ఏడుగురి హత్యలు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జంషెడ్పూర్ ప్రాంతంలో వందలాది మంది గ్రామస్తులు పోలీసులతో గొడవపడ్డారు. వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేసి, బాష్పవాయు గోళాలు ప్రయోగించాల్సి వచ్చింది. -
ఆ హత్యపై మౌనం వీడిన మోదీ
-
ఆ హత్యపై మౌనం వీడిన మోదీ
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన దాద్రి ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి స్పందించారు. ఇలాంటి ఘటనలు విచారకరమని, దురదృకరమని, బీజేపీ ఇలాంటి వాటికి అస్సలు మద్దతివ్వబోదని స్పష్టం చేశారు. గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి గ్రామంలో గోవధ వార్తలు బయటకొచ్చి మహ్మద్ అఖ్లాఖ్ అనే ముస్లిం వ్యక్తి ఆ గోవు మాంసం ఉందని కారణంతో గ్రామంలోని పలువురు హిందువులు అతడిపై దాడి చేసి కొట్టి చంపారు. అతడి కుమారుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మతపరమైన అంశాలను ప్రాథమికంగా చేసుకొని కొందరు హిందువులు కావాలనే దాడులు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపట్ల స్పందించడానికే పలువురు కేంద్రమంత్రులు తొలుత వెనుకాడినా అనంతరం స్పందించారు. కానీ ప్రధాని ఈ ఘటనపట్ల ఇప్పటి వరకు ఏ విధంగాను స్పందించలేదని విమర్శలు వచ్చాయి. ఇంతలోనే ఆయన దాద్రి ఘటనను ప్రస్తావించారు. ఓ బెంగాల్ పత్రికతో మోదీ మాట్లాడుతూ'దాద్రి, గులాం అలీ కార్యక్రమం అడ్డుకోవడంవంటి ఘటనలు నిజంగా విచారకరం. దురదృష్టకరం. ఈ ఘటనల వెనుక కీలక అంశమేమిటి? బీజేపీ ఇలాంటి ఘటనలకు మద్దతివ్వబోదు. ప్రతిపక్షాలు ఇలాంటి ఘటనలను రాజకీయాలు చేస్తున్నాయి. వాటి బూటకపు లౌకికత్వానికి బీజేపీ విరుద్ధం' అని చెప్పారు. దీంతోపాటు పాక్ సింగర్ గులాం అలీపై, పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరి పుస్తక విడుదల కార్యక్రమం సందర్భంగా శివసేన పార్టీ కార్యకర్తలు ఇంక్ దాడి ఘటనను కూడా ప్రధాని మోదీ ఖండించారు.