మూడేళ్లు గడిచాక... దాదాపు 48మంది మరణించాక... ఒక చట్టం చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించాక కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మూక దాడులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయటం కోసం ఉన్నతాధికారుల కమిటీ, మంత్రుల బృందం ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. మూక దాడులు జరిగినప్పు డల్లా ఆరోపణలు రావడం, వాటిని బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు ఖండించడం, ఎదురు దాడి చేయడం తప్ప దాడుల్ని ఆపడానికి ఎలాంటి చర్యలు అవసరమన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు.
మూక దాడులు జరగకుండా చూడమని రాష్ట్రాలనూ, కేంద్ర పాలిత ప్రాంతాలనూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నెల మొదట్లో కోరింది. పిల్లల్ని అపహరించుకుపోతున్నారన్న అను మానంతో వ్యక్తులను కొట్టి చంపుతున్న ఘటనలు ముదిరాక ఈ పని చేసింది. గోరక్షణ పేరుతో మూకలు చెలరేగినప్పుడే ఇలాంటి ప్రయత్నం జరిగితే... ఈ అనాగరిక హత్యాకాండను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నదన్న సంకేతాలు వెళ్తే పరిస్థితి ఇంతగా దిగజారేది కాదు. రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లాలో శనివారం జరిగిన ఉదంతమే దీనికి రుజువు.
మూక దాడులు జరిగినప్పుడల్లా పోలీసులు నిందితుల్ని కాపాడుతున్నారని, అరెస్టులో అల సత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు రావడం రివాజు. తాజా ఉదంతంలో పోలీసుల ప్రవర్తన మరింతగా దిగజారింది. ఉన్మాదులు తీవ్రంగా కొట్టడంతో ఒంట్లో ప్రతి అవయమూ చిట్లిపోయి నెత్తుటి ముద్దలా మారిన బాధితుడి గురించి వారు అసలు పట్టించుకోనేలేదు. గో రక్షక భటుల్లా మారి అక్కడున్న రెండు ఆవులనూ గోశాలకు తరలించేలా చూసి, ఆ తర్వాత ఓ దుకాణం వద్ద తాపీగా టీ తాగి అటుపై అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, అక్కడినుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు మనిషిని తీసుకెళ్లారంటే అది అబద్ధమవుతుంది. అతని మృత దేహాన్ని తీసుకెళ్లారని చెప్ప టమే సబబు. ఘటన జరిగింది మొదలు ఆసుపత్రికి తీసుకెళ్లేవరకూ చూస్తే మూడుగంటల సమ యం పట్టింది.
ఈ సమయంలో బాధితుడు ఎంతసేపు ప్రాణాలతో ఉన్నాడోగానీ... ముందు నడి రోడ్డుపై, ఆ తర్వాత పోలీస్ వ్యాన్‌లో, అటుపై పోలీస్‌స్టేషన్‌లో నరకయాతన అనుభవించి ఉంటాడు. తమకు పశువులే తప్ప మనుషుల ప్రాణాలంటే లెక్కలేదని చెప్పే ఉన్మాద మూకలకూ, ఈ పోలీసులకూ తేడా ఏమైనా ఉందా? మూక దాడుల్ని చూసీచూడనట్టు వదిలేయటమే కాదు... అలాంటి దాడుల్లో పాల్గొన్నవారికి వెన్నుదన్నుగా ఉంటున్న ప్రభుత్వాల తీరువల్లే ఈ దుస్థితి ఏర్పడింది. ఇదే అల్వార్ జిల్లాలో ఇంతవరకూ అయిదుగుర్ని ఉన్మాద మూకలు పొట్టనబెట్టుకోగా... వారిలో చాలామంది బెయిల్‌పై బయటికొచ్చారు. నిరుడు ఏప్రిల్‌లో 55 ఏళ్ల పాల ఉత్పత్తిదారును ఇదే సాకుతో గోరక్షక మూక తీవ్రంగా కొట్టి చంపింది.
చనిపోయే ముందు బాధితుడిచ్చిన మరణ వాంగ్మూలంలో దాడికి కారకులైన అయిదుగురి పేర్లిస్తే... పోలీసులు మాత్రం వారంతా ఘటన జరిగినప్పుడు వేరేచోట ఉన్నారని తేల్చి అసలు అరెస్టే చేయలేదు! రాజస్తాన్ ప్రభుత్వం ఏ ఉదం తంలోనూ బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం అందించలేదు. తాజా ఉదంతంలో మాత్రం రూ. లక్షా 25 వేలు ఇస్తామని ప్రకటించింది. అదే పెద్ద ఔదార్యమనుకోవాలి! దాడిలో మరణించిన రక్బార్‌ఖాన్ పశువులు అమ్మడం కొనడం ప్రధాన వ్యాపకంగా ఉండే రబారీ సంచారతెగకు చెందిన వాడు. ఆ తెగలో హిందువులూ ఉంటారు.
ముస్లింలూ ఉంటారు. వందల ఏళ్లనుంచి రబారీ తెగ ఆ వ్యాపారమే చేస్తోంది. గోరక్షణ మూకల ఆగడాలు మితిమీరుతున్నాయి గనుక దాన్ని ప్రస్తుతానికి మానుకోవాలని కొందరు హితవు చెప్పినా, ఇది తప్ప తమకు బతుకుతెరువు లేదని ఆ తెగ మొత్తు కుంటోంది. గుజరాత్ నుంచి రాజస్తాన్ వరకూ ఉండే వందల కిలోమీటర్ల దూరం వీరు నడిచి పోతూ పశువుల సంతలో కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తారు. గొర్రెలు, ఒంటెలు, ఎడ్లు, ఆవులు... ఇలా వేటిని తోలుకుంటూ వెళ్లినా మూక ఎదురుపడినప్పుడల్లా కప్పం కట్టి బతుకు కొనుక్కుంటు న్నామని ఆ తెగ అంటోంది.
గోరక్షణ పేరుతో జరిగిన దాడులతోపాటు పిల్లల్ని అపహరిస్తున్నారన్న అనుమానంతో కొట్టి చంపుతున్న కేసులు కూడా ఈమధ్య పెరిగాయి. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి హింసాయుత వాతా వరణాన్ని ఎలా పెంచుతుందో చెప్పడానికి మూకదాడులే ఉదాహరణ. 2015 వరకూ గోరక్షణ దాడుల్లో అత్యధికభాగం అంటే 76 శాతం ఉత్తరాదిలో జరిగాయని, ఆ తర్వాత కాలంలో అవి దాదాపు దేశమంతా వ్యాపించాయని ‘ఇండియాస్పెండ్’ వెబ్‌సైట్ గణాంకాలు చెబుతున్నాయి.
చిత్రమేమంటే జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) దగ్గర అసలు గోరక్షకæ దాడుల లెక్కలే లేవు! పిల్లల్ని అపహరించడానికొచ్చారన్న అనుమానంతో 2012లో ఒకే ఒక దాడి జరగ్గా నిరుడు జనవరినుంచి లెక్కేస్తే 69 మూకదాడి ఉదంతాల్లో 33మంది చనిపోయారని ఆ వెబ్‌సైట్ వెల్లడిం చింది. గోరక్షక మూకల దాడుల్ని అదుపు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావటం పర్యవ సానంగానే అవి వేరే రకాల దాడులకు చోటిచ్చాయి. కనీసం ఈ దశలోనైనా కదిలినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాలి.
ఇప్పుడు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆధ్వర్యంలో ఉన్న తాధికారుల కమిటీ పరిస్థితిని ఎదుర్కొనడానికి ఎలాంటి చర్యలు అవసరమో పక్షంరోజుల్లో సూచి స్తుంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని మంత్రుల బృందం వాటిని పరిశీలించి ప్రధానికి తుది సిఫార్సులు చేస్తుంది. ఈ కమిటీకి ఎలాంటి గడువూ లేదు. మూకదాడుల నియం త్రణకు చట్టం తీసుకురావాలని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది. దానికి అనుగుణంగా సీఆర్‌పీసీలో కొత్తగా ఒక నిబంధన చేర్చాలని ఈ కమిటీలు సిఫార్సు చేస్తాయో లేక రాష్ట్రాల స్థాయిలో చట్టా లుంటే సరిపోతుందని చెబుతాయో వేచిచూడాలి. అయితే ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను సైతం నేరాల్లో సహ భాగస్వాములుగా పరిగణిస్తే తప్ప ఈ దాడులు ఆగవు.
Comments
Please login to add a commentAdd a comment