సుమారు 300 మంది భారతీయులు ప్రయాణిస్తున్న ఒక విమానాన్ని ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో నిర్బంధించడం అంతర్జాతీయ వార్తగా మారింది. నికరాగ్వాకు వెళ్తున్న ఇలాంటి వాళ్లందరూ అక్కడి నుంచి తమ దేశంలోకి అక్రమంగా వస్తున్నారని అమెరికా ఆరోపణ. ఫ్రెంచ్ అధికారులతో ఈ సమాచారాన్ని పంచుకున్న అమెరికన్ నిఘా వర్గాలు న్యూఢిల్లీని మాత్రం చీకట్లో ఉంచాయి. ఈ వార్తను పతాక శీర్షికల్లో వచ్చేలా చేయడం ద్వారా అక్రమ వలస రాకెట్‌ను సమర్థంగా బహిర్గతం చేయాలని వారు కోరుకున్నారు. తమ అమెరికా కలల్ని నెరవేర్చే అక్రమ ముఠాలకు భారీగా డబ్బులు ముట్టచెబుతూ, జనాలు తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. సమగ్ర వలస విధాన సంస్కరణల అవసరాన్ని ఈ ఉదంతం సూచిస్తుంది.
తమ వలస, జాతీయతా చట్టంలో అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ నవంబర్ 21న ఒక నిబంధనను పొందుపర్చింది. నికరాగ్వాకు ప్యాసింజర్ విమానాల్లో రివాజుగా విదేశీయులను తీసుకెళ్తున్న వారిని గుర్తించి, వారి ప్రయత్నాలను విఫలం చేయడానికీ, అలాంటి వారిని శిక్షించడానికీ సంబంధించిన నిబంధన అది. విదేశీయులను ప్రమాదకరమైన భూభాగం, జలమార్గాల ద్వారా అమెరికాలోకి నెట్టడమే మానవ రవాణా చేస్తున్న వారి ఉద్దేశం అని అమెరికా విదేశీ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆ సమయంలో భారతదేశంలో ఎవరికీ పెద్దగా తెలియని ఈ ప్రకటన, నాలుగు కీలక అంశాలను పేర్కొంది.
ఒకటి, చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా అమెరికాకు రాబోయే వలసదారుల కోసం కొత్త అక్రమ రవాణా కేంద్రంగా నికరాగ్వా ఉద్భవించింది. రెండు, నేరస్థ ముఠాలు వలస వచ్చేవారి నుండి ’భారీ–స్థాయిలో డబ్బు’ను వసూలు చేస్తు న్నాయి, వారిని తీవ్ర ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. మూడు, అటు వంటి అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించినా, ఎలాగైనా వారిని తమ తమ దేశాలకు అమెరికా తిప్పి పంపుతుంది. నాలుగు, నికరాగ్వా లోకి చార్టర్ విమానాలను పంపించే కంపెనీల యజమానులు, అధి కారులు, సీనియర్ అధికారులతో కఠినంగా వ్యవహరించడానికి అమె రికా పాలనాయంత్రాంగం సిద్ధమవుతోంది.
అమెరికా చట్టంలోని సెక్షన్ 212 (ఎ)(3)(సి) ‘యునైటెడ్ స్టేట్స్‌లో ప్రవేశించడం లేదా తీవ్రమైన అమెరికన్ ప్రతికూల విదేశాంగ విధాన పరిణామాలను కలిగి ఉన్న ఏ దరఖాస్తుదారుని అయినా సరే మినహాయించడానికి విదేశాంగ శాఖ మంత్రిని అమెరికా అనుమ తిస్తుంది’. నికరాగ్వా బడా ముఠాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి సహాయకులకు వ్యతిరేకంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ నిబంధనను ఉపయోగించడానికి పథక రచన చేశారని నవంబర్ ప్రకటన పేర్కొంది. నికరాగ్వాకు అలాంటి విమానాలను నడుపుతున్న వారినీ, అమెరికా–మెక్సికో సరిహద్దులోని చివరి గమ్య స్థానానికి వలసదారులను తీసుకువెళ్లేవారినీ వదిలిపెట్టబోమని అమె రికా విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది. దురదృష్టవశాత్తు, వాషింగ్టన్ చేసిన ఈ రెండవ హెచ్చరిక కూడా భారతదేశం దృష్టిలోకి రాకుండా పోయింది.
వందలాదిమంది అనుమానిత భారతీయులను తీసుకెళుతున్న లెజెండ్ ఎయిర్‌లైన్స్(రొమేనియన్ సంస్థ) విమానం ఇంధనం నింపు కోవడం కోసం ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో దిగుతోందన్న సమాచారాన్ని సేకరించిన అమెరికన్ ప్రభుత్వ నిఘావర్గాలు, వ్యవ స్థీకృత నేరాలపై పోరాడే ఒక ఫ్రెంచ్ ప్రభుత్వ విభాగానికి ఉప్పందించాయి. అట్లాంటిక్ సముద్ర ప్రాంతం పొడవునా నిఘా సమాచారాన్ని పంచుకోవడం అనేది ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మారుస్తుందన్నది దీని వెనుక ఉద్దేశం. కానీ ఇది కలవరపెట్టే ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది: అలాంటి నిఘా సమాచారాన్ని న్యూఢిల్లీతో ఎందుకు పంచుకోలేదు? అత్యవసర పరిస్థితుల కోసం తగినంతగా సన్నద్ధత లేని ఒక విమానాశ్రయంలో, నాలుగు రోజుల పాటు భారతీయ ప్రయాణికులు నిర్బంధించబడ్డారు.
వాషింగ్టన్ లోని విశ్వసనీయ వర్గాల ప్రకారం, అమెరికన్ అధికా రులు ఆ విమానాన్ని ఎగరడానికి ముందే ఆపాలని అనుకోలేదు. పతాక శీర్షికల్లోకి వచ్చేలా చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో చర్యలు తీసుకునేలా అక్రమ వలస రాకెట్‌ను సమర్థవంతంగా బహిర్గతం చేయాలని వారు కోరుకున్నారు. ఎవరి తోడూ లేని మైనర్ ప్రయాణీకు లను కూడా కలిగి ఉన్న ఆ విమానం వాట్రీ విమానాశ్రయం వద్ద ముట్టడిలో ఉండగానే అది ప్రపంచవ్యాప్తంగా వార్తలను సృష్టించింది. యూరప్ టీవీల్లో అతిపెద్ద వార్తగా మారిన ఈ అసాధారణ సంఘటన కారణంగా, ఈశాన్య ఫ్రాన్స్‌లో క్రిస్మస్ వేడుకలకు, పారిస్‌లోని అధికా రిక వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది.
పశ్చిమ దేశాలకు వలస వచ్చే వారికోసం వేటాడే నేరస్థ ముఠాలు ఈ ఉదంతం కారణంగా, కనీసం కొంతకాలం అయినా ఇలాంటి విమాన వలసలకు ప్రయత్నించవు. అమెరికన్ విదేశాంగ శాఖ శిక్షా త్మకమైన వలస చట్టాన్ని అమలు చేయడానికి కొన్ని వారాల ముందు, హైతీ తన రాజధాని నుండి నికరాగ్వాకు అన్ని విమానాలను నిలిపి వేసింది. భారతదేశంలాగే, ప్రస్తుతం హైతీ కూడా అక్రమ వలసలకు ఒక వనరుగా ఉందని అమెరికా పేర్కొంది.
సంపన్న దేశాలకు తమను అక్రమంగా తరలించేందుకు లక్షల రూపాయలు అప్పులు చేసి నికరాగ్వాకు వెళ్లే విమానం ఎక్కుతున్నారు భారతీయులు. ప్రభుత్వం ఈ నష్టాన్ని నివారించడంలో ఆలస్యం చేసింది. ఎట్టకేలకు డిసెంబరు 21న ఆర్భాటంగా, ఆకర్షణీయమైన సంక్షిప్త నామంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువత, నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం క్రమబద్ధమైన సహాయకరమైన వలసను ప్రోత్సహించే ‘ప్రయాస్’ కార్యక్రమం అది. అంతర్జాతీయ వలస చట్రానికి సంబంధించిన విషయాలపై మెరుగైన అవగాహనను ప్రోత్సహించడానికి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయం కోసం ఒక రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం.
నికరాగ్వాకు ఇటీవల కనీసం రెండు విమానాల్లో వెళ్లిన భారతీయులను ఎవరూ గుర్తించలేదని పోలీసులు ఇప్పుడు చెబుతున్నారు. అనేక వందల మంది భారతీయ అక్రమ వలసదారులు దొరకకుండా తప్పించుకు పోతుండటాన్ని నాటకీయంగా చూపించే తమ ప్రయత్నంలో అమెరికా, ఫ్రెంచ్ ప్రభుత్వాల నేరనిరోధక ఏజెన్సీలు... ప్రధానంగా పంజాబ్, గుజరాత్‌ల నుండి యూరప్ గుండా పశ్చిమ అర్ధ గోళానికి వలసదారులను చేర్చడం కోసం పనిచేస్తున్న విస్తృత నేరస్థ నెట్‌వర్క్ గురించి భారతదేశాన్నే కాకుండా ఐక్యరాజ్యసమితిని కూడా చీకటిలో ఉంచాయి. ప్రయాస్ అనేది ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ వలస సంస్థ, భారతీయ అంతర్జాతీయ వ్యవహారాల మండలి... ఉమ్మడి ప్రాజెక్ట్.
మరో విడ్డూరం ఏమిటంటే, లెజెండ్ ఎయిర్‌లైన్స్ చార్టర్ ఫ్లైట్ ఉదంతం వెలుగులోకి రావడానికి ఒక వారం ముందు, ‘నమోదు కాని రిక్రూట్‌మెంట్ ఏజెంట్ల వల్ల మోసపోతున్న విదేశీ ఉద్యోగార్థుల సంఖ్య భారీగా పెరిగింది’ అని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులపై వేటు వేయడం ప్రపంచ స్థాయిలో జరుగుతోంది. ‘చాలా తూర్పు యూరోపియన్ దేశాలు, కొన్ని గల్ఫ్ దేశాలు, మధ్య ఆసియా, ఇజ్రాయెల్, కెనడా, మయన్మార్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్‌లలో వీటికి సంబంధించి కేసులు నమోదవుతున్నాయి’ అని హెచ్చరించింది.
పార్లమెంట్‌లోని ప్రతి సెషన్ లోనూ, అక్రమ వలసల శాపం గురించి జీరో అవర్‌లో పెద్ద మొత్తంలో ప్రశ్నలు వస్తుంటాయి. భారత విదేశాంగ మంత్రి లోక్‌సభలో ఒక ప్రకటన చేస్తూ ఈ సమస్య సంక్లి ష్టత రీత్యా తాము నిస్సహాయంగా ఉంటున్నట్టు పేర్కొన్నారు. ‘బహి ష్కరణ ఉత్తర్వులు వచ్చే వరకు విదేశాలు చాలావరకు తమ తమ దేశాల్లో అక్రమంగా ఉంటున్న వారి గురించి సమాచారాన్ని అందించవు’ అని చెప్పారు.
‘విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటున్న లేదా పని చేస్తున్న భారతీయుల సంఖ్యపై మన దౌత్య కార్యాలయాల వద్ద ఎటువంటి విశ్వసనీయమైన డేటా లేదు’ అని అంగీకరించారు. ఇది షాకింగ్‌గా ఉందని చెబితే సమస్యను తక్కువ అంచనా వేయడమే అవుతుంది. వాట్రీ విమానాశ్రయ ఘటన ఉదంతం, సమస్య తీవ్ర తనూ, సమగ్ర వలస విధాన సంస్కరణల అవసరాన్నీ సూచిస్తుంది. ఈ విషయంలో విఫలమైతే ఎక్కువ మంది భారతీయులు... అంత ర్జాతీయ నేరస్థ ముఠాల బాధితులుగా మారతారు.
కేపీ నాయర్
వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకులు
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment