విశ్లేషణ
ఒకే వారంలో మహిళలపై అత్యాచారం, దాడి, హింసకు సంబంధించిన అనేక కథనాలతో దేశం అట్టుడికిపోయింది. ప్రతి కథనం మునుపటి కథనం కంటే మరింతగా కలవరపెడుతోంది. మహిళలపై హింస నేడు చీకటి సందుల్లోనే కాకుండా పని స్థలాలు, బహిరంగ ప్రదేశాలు, ఆన్‌లైన్ లో కూడా జరుగుతోంది. ఈ హింసాత్మక చర్యలు ఆకస్మికంగా సంభవిస్తున్నవి కావు.
జీవితంలోని ప్రతి అంశంలోనూ స్త్రీలు ఎదుర్కొంటున్న తీవ్రమైన అసమానతలను ఇవి ప్రతిబింబిస్తున్నాయి. ఈ పరిస్థితులు కాగితంపై ఉన్న చట్టాలకూ, ఆచరణలో వాటి అమలుకూ మధ్య కలవరపెడుతున్న అనుసంధాన లేమిని వెల్లడిస్తున్నాయి. ఈ గాథలు చీకట్లోనే మగ్గిపోవడానికి ఎంతమాత్రమూ వీలు లేదు. మార్పు ఇప్పటికే మొదలు కావాల్సింది!
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో ఇటీవలి కేసు... మహిళల భద్రత విషయంలో ఉన్న సమస్యల తీవ్రతనూ, అత్యంత సురక్షితంగా భావించే పరిస రాలలో కూడా వారు ఎదుర్కొంటున్న సర్వవ్యాప్త హింసనూ గుర్తు చేస్తోంది.
శిక్షణలో ఉన్న ఒక యువ వైద్యురాలు అనేక గంటలపాటు విధి నిర్వహణను పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, తగిన భద్రత ఉంటుందని భావించిన ఆసుపత్రి ఆవరణలోనే ఆమెపై లైంగికదాడి జరిపి హత్య చేశారు. ఈ భయానక నేరం ఒక విడి సంఘటన కాదు.
మన సమాజంలోని ప్రతి అంశంలోనూ విస్తరిస్తున్న, మహిళ లపై హింసకు సంబంధించిన విస్తృతమైన అంటువ్యాధిలో ఇదొక భాగం. ఒకే వారంలో మహిళలపై అత్యాచారం, దాడి, హింసకు సంబంధించిన వార్తలతో దేశం అట్టుడికిపోయింది. ప్రతి కథనం అంతకుమునుపటి కథనం కంటే మరింతగా కలవరపెడుతోంది. ఇవి వార్తలలోని కేవలం పాదసూచికలు కాదు. సగం జనాభా భద్రత విషయంలో విఫలమైన సమాజంపై ఇవి స్పష్టమైన నేరారోపణలు.
మహిళలపై హింస నేడు చీకటి సందుల్లోనే కాకుండా పని స్థలాలు, బహిరంగ ప్రదేశాలు, ఆన్‌లైన్‌లో కూడా జరుగుతోంది.
మహిళలపై నేరాలు దారుణంగా పెరుగుతున్నాయని ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’(ఎన్సీఆర్‌బీ) వార్షిక నివేదిక వెల్లడించింది. ఒక్క 2022లోనే 4,45,256 కేసులు నమోదయ్యాయి. ఇది ప్రతి గంటకు దాదాపు 51 ఎఫ్‌ఐఆర్‌లకు సమానం. 2020, 2021 సంవత్సరాల నుంచి భయంకరమైన పెరుగుదలను ఈ డేటా వెల్లడిస్తోంది.
ప్రతి లక్ష జనాభాకు మహిళలపై నేరాల రేటు 66.4గా ఉంది. అయితే ‘క్రైమ్ ఇన్ ఇండియా 2022’ నివేదిక ప్రకారం, అలాంటి కేసులలో ఛార్జ్‌షీట్ రేటు 75.8గా నమోదైంది. నమోదైన మొత్తం కేసులలో, 18.7 శాతం వరకు మహిళలపై దౌర్జన్యానికి పాల్పడే ఉద్దేశ్యంతో దాడికి పాల్పడినవే. కాగా 7.1 శాతం అత్యాచారం కేసులుగా నమోదయ్యాయి. ఈ భయంకరమైన గణాంకాలు వాస్తవ ఘటనల్లో అతి చిన్న భాగాన్ని మాత్రమే సూచిస్తున్నాయి. భయం, అవమానం లేదా సామాజిక ఒత్తిడి కారణంగా అసంఖ్యాకమైన కేసులు వెలుగులోకే రావు.
మరింత ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, ఈ హింసాత్మక చర్యలు ఆకస్మికంగా సంభవిస్తున్నవి కావు. జీవితంలోని ప్రతి అంశంలోనూ స్త్రీలు ఎదుర్కొంటున్న తీవ్రమైన అసమానతలను ఇవి ప్రతిబింబిస్తాయి. స్త్రీలు సరుకులుగా కుదించబడినప్పుడు, హింస అనేది రోజు వారీ సంఘటనగా మారుతుంది. ఈ హింస భౌతిక దాడికి మాత్రమే పరిమితమైనది కాదు; ఇది ఆర్థికపరమైన, భావోద్వేగపరమైన వేధింపు వరకు విస్తరించింది. ముఖ్యంగా పని స్థలాల్లో అధికార చలన సూత్రాలు తరచూ మహిళలకు వ్యతిరేకంగా ఉంటాయి.
సాధారణంగా లైంగిక వేధింపుల నిరోధక చట్టంగా పిలుస్తున్న, ‘‘పనిస్థలంలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, పరిహారం) చట్టం, 2013’ వంటి చట్టాలను మహిళల రక్షణ కోసం రూపొందించారు. కానీ వాస్తవికత దానికి భిన్నమైన చిత్రాన్ని చూపు తోంది. లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని చట్టం ఆదేశించినప్పటికీ, ఈ కమిటీల నిర్మాణం సహజంగానే లోప భూయిష్టంగా ఉంది.
అదే సంస్థకు చెందిన సీనియర్ ఉద్యోగులతోపాటు ఒక ఎన్జీవో లేదా అలాంటి సంస్థకు చెందిన బయటి సభ్యులతో కూడిన ఈ కమిటీలు, బాధితురాలికి న్యాయం చేయడం కంటే కూడా కంపెనీ ప్రయోజనాలను పరిరక్షించడానికే తరచుగా ప్రాధాన్యత ఇస్తాయి. అధికారిక చలనసూత్రాలు (కమిటీ సభ్యులు కంపెనీలో స్వార్థ ప్రయో జనాలను కలిగి ఉండవచ్చు) నిజమైన విచారణను, జవాబుదారీ తనాన్ని నిరుత్సాహపరిచే వాతావరణాన్ని సృష్టిస్తాయి.
అయితే ఈ సవాళ్లు నేడు పని స్థలాలను దాటి విస్తరించాయి. ప్రారంభంలో అవకాశాలు, అనుసంధానం కోసం ఉద్దేశించిన ఇంట ర్నెట్, ఇప్పుడు మహిళలకు సంబంధించిన కొత్త యుద్ధభూమిగా మారింది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2021లో సైబర్ క్రైమ్ సంఘటనల సంఖ్య 2019తో పోలిస్తే 18.4 శాతం పెరిగింది.
మహిళలను లక్ష్యంగా చేసుకున్న సంఘటనలు గణనీయంగా 28 శాతానికి పెరిగాయి. 2021లో నమోదైన 52,974 సైబర్ నేరాల్లో 10,730 అంటే 20.2 శాతం మహిళలపై నేరాల కేసులు. వ్యక్తిగత సమాచారం బయటపెట్టడం వంటి వాటి నుండి ప్రతీకారం తీర్చుకునే పోర్న్, ఆన్ లైన్ వేధింపుల వరకు, పాత రకాల హింసలను కొనసాగించడానికి డిజిటల్ రంగం కొత్త మార్గాలను అందిస్తోంది.
ఇంటర్నెట్‌లో అజ్ఞాతంగా ఉండటం అనేది నేరస్థులకు ధైర్యాన్నిస్తుంది. కాగా, కఠినమైన సైబర్ చట్టాలు లేకపోవడం, చట్టపరమైన సహాయం నెమ్మదిగా ఉండటం బాధితులకు హాని చేస్తున్నాయి.
మనం ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తాము? ప్రస్తుత పరిస్థితులు కాగితంపై ఉన్న చట్టాలకూ, ఆచరణలో వాటి అమలుకూ మధ్య కల వరపెడుతున్న అనుసంధాన లేమిని వెల్లడిస్తున్నాయి. లైంగికదాడి కేసులలో 95 శాతం అపరిష్కృతంగా ఉంటున్నాయని ‘ఎన్ సీఆర్‌బీ’ 2021 నివేదిక నొక్కి చెబుతోంది.
ఈ గణాంకాలు స్త్రీల దుఃస్థితి పట్ల వ్యవస్థ అలసత్వంతో పాటు, తరచుగా ఉదాసీనతను కూడా సూచిస్తు న్నాయి. న్యాయ విచారణలో జాప్యం, సానుభూతి లేని పరిపాలనా వ్యవస్థ అనేవి బాధితులు ముందుకు రాకుండా వారిని మరింత నిరుత్సాహపరుస్తాయి.
లైంగిక వేధింపుల నిరోధక చట్టం, దానిని పోలి ఉండే ఇతర చట్టాలు అవసరమైనప్పటికీ, అవి సరిపోవు. హాని సంభవించిన తర్వాత మాత్రమే సమస్యను పరిష్కరిస్తాయి. పైగా పనికి సంబంధించిన దైహిక, లింగ స్వభావాన్ని సవాలు చేయడంలో విఫలమవు తాయి. ఇది మహిళలకు మొదటి దశలోనే హాని చేస్తుంది.
కాబట్టి నిష్పాక్షికత, న్యాయబద్ధతను నిర్ధారించడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీ కూర్పు విషయంలో పునః మూల్యాంకనంతో ప్రారంభించి, తక్షణ సంస్కరణలు అవసరం. సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించి, అది కొనసాగేలా చూడడం యజమానుల బాధ్యత. అలా చేయడంలో విఫలమైతే వారిపై కఠినమైన జరిమానాలు విధించాలి.
ఇది చట్టపరమైన వైఫల్యం మాత్రమే కాదు, సామాజిక వైఫల్యం కూడా! సమానత్వం కోసం మాత్రమే కాకుండా ప్రాథమిక గౌరవం కోసం పోరాడుతుండే మహిళలు తరచుగా బాధామయ జీవితాల్లో నిశ్శబ్ద శృంఖలాల పాలవుతుంటారు. ప్రతీకారం, ఉద్యోగ నష్టం, వ్యక్తిత్వ హననాల భయం చాలామందిని నోరు విప్పకుండా చేస్తుంది. ఇది శిక్ష పడుతుందనే భయం లేని సంస్కృతి వృద్ధి చెందడానికి వీలు కలిగిస్తుంది. అధికార శక్తులు దోపిడీకి పాల్పడుతూనే ఉండటం, బాధితులు తరచుగా ఎటువంటి సహాయం లేకుండా మిగిలిపోవడం అనేది ఒక విష వలయం.
చట్టపరమైన రక్షణలు, పెరుగుతున్న అవగాహన పురోగతిని సూచిస్తున్నప్పటికీ, సంఖ్యలు మాత్రం మరో కథను చెబుతున్నాయి. అది ఆచరణలో కంటే సిద్ధాంతంలోనే ఎక్కువగా ఉనికిలో ఉంటున్న చట్టాలతోపాటు, ప్రతి మలుపులోనూ మహిళల విలువను తగ్గించే సామాజిక వ్యవస్థ వైఫల్య గాథ.
ఈ గాథలు చీకట్లోనే మగ్గిపోవడానికి వీలు లేదు. అవి మన శ్రద్ధను, మన ఆగ్రహాన్ని, మరీ ముఖ్యంగా మన చర్యను డిమాండ్ చేస్తున్నాయి. మార్పు ఎప్పుడో మొదలు కావాల్సింది!
వి. విజయ సాయి రెడ్డి
వ్యాసకర్త రాజ్యసభ సభ్యులు;
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment