Sakshi Guest Column Story On Indian Women About Manipur Issue, Details Inside - Sakshi
Sakshi News home page

Manipur Issue: ఇది భారతీయ మహిళల గురించి...

Published Fri, Jul 28 2023 12:41 AM | Last Updated on Fri, Jul 28 2023 8:58 AM

Sakshi Guest Column On Indian Women About Manipur Issue

ఒక రిపోర్టర్‌గా, నేను దశాబ్దాలుగా లెక్కలేనన్ని భయంకర ఘటనలను చూశాను. కానీ ఆ వీడియోలో ఉన్నది వేరే – ఇద్దరు మహిళల దుస్తుల్ని విప్పి, నగ్నంగా ఊరేగించారు. వారిలో ఒకరిని తర్వాత క్రూరంగా సామూహిక అత్యాచారం చేశారు. ఇది చూసిన ప్రతి భారతీయ మహిళ హృదయం బద్దలైపోయింది. ఈ భయంకరమైన కేసు గురించి తనకు (వీడియో బయటికి రాకముందు) తెలియదని మణిపుర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ అంటున్నారా? లేక తనకు తెలిసిందనీ, కానీ చర్య తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాననీ ఒప్పుకుంటున్నారా? ఎలాగైనా సరే, ఇది ఆయన అసమర్థతను లేదా నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తుంది. బీరేన్‌ సింగ్‌ రాజీనామా చేయాలి లేదా ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి!

‘‘ఆ వీడియోలో ఉన్న స్త్రీలకు జరిగింది అనుభవించడం కంటే నేను మరణాన్ని ఎంచు కుంటాను,’’ అని మణిపుర్‌ కుకీ సమాజానికి చెందిన హక్కుల కార్యకర్త గ్లాడీ హుంజన్‌ నాతో అన్నారు. కన్నీళ్లు ధారాపాతంగా కారు తున్నందున ఆమె పదాలను కూడా  కూడగట్టుకోలేక పోయారు. నిరాశ, నిస్సహాయత, కోపం, వేదనతో ఆమె ఏడ్చినప్పుడు, నేను కూడా ఏడ్చాను. 

ఒక రిపోర్టర్‌గా, నేను దశాబ్దాలుగా లెక్కలేనన్ని భయంకర ఘటనలను చూశాను. కానీ ఆ వీడియోలో ఉన్నది వేరే – ఇద్దరు మహిళల దుస్తుల్ని విప్పి, నగ్నంగా ఊరేగించారు. ఒక మూక వాళ్లను తోసుకుంటూ, నెట్టుకుంటూ వచ్చింది. వారిలో ఒకరిని తర్వాత క్రూరంగా సామూహిక అత్యాచారం చేశారు. ఇది చూసిన ప్రతి భారతీయ మహిళ హృదయం బద్దలైపోయింది.

గుమికూడినవాళ్లు చూస్తుండగానే మూక ద్వారా లైంగిక వేధింపు లకు గురైన 21 ఏళ్ల మహిళ గురించీ, ఆమెను రక్షించడానికి ప్రయత్నించినందుకు అక్కడికక్కడే మూక చంపేసిన ఆమె సోదరుడి గురించీ నేను ఆలోచిస్తూనే ఉన్నాను. అతడి వయస్సు కేవలం 19 సంవ త్సరాలు.

ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మందలింపులు రెండు నెల లుగా జడత్వంలో ఉండిపోయిన ఒక ముఖ్యమంత్రిని నిద్ర లేపాయి. అకస్మాత్తుగా, కొన్ని గంటల వ్యవధిలో, ప్రధాన నింది తుడిని అరెస్టు చేశారు.

కాబట్టి, ఇన్ని రోజులు ఎన్‌. బీరేన్‌ సింగ్‌ ఈ ఘటనపై ఉద్దేశ పూర్వకంగా వేరే దృష్టితో చూస్తున్నారా లేక ఏం జరిగిందో ఆయనకు నిజంగానే తెలియదా? ఎలా భావించినా ఆయన (ఇప్పటికే తగ్గి పోయిన) విశ్వసనీయత గురించి సానుకూల మాట రాదు.

నన్ను వివరించనివ్వండి 
ఈ సామూహిక అత్యాచారం, హత్యా ఘటన మే 4న జరిగినట్లు మనకు తెలుసు. జీరో ఫస్ట్‌ ఇన్వెస్టిగేషన్‌ రిపోర్ట్‌ (జీరో–ఎఫ్‌ఐఆర్‌)గా పిలిచే మొదటి పోలీసు ఫిర్యాదును మే 18న దాఖలు చేశారు. 2012లో జరిగిన సామూహిక అత్యాచారం తర్వాత, జస్టిస్‌ జేఎస్‌ వర్మ ప్యానెల్‌ ప్రవేశపెట్టిన విధానం ఇది. లైంగిక వేధింపుల బాధితురాలు భారత దేశంలో ఎక్కడైనా, అధికార పరిధితో సంబంధం లేకుండా పోలీసు కేసును దాఖలు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్‌ను సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు పంపుతారు. ఈ కేసులో జూన్‌ 21న సంబంధిత పోలీస్‌ స్టేషన్ కు ఎఫ్‌ఐఆర్‌ను పంపారు.

60 రోజులకు పైగా, అత్యాచారం–హత్య ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ను ఎవరూ పట్టించుకోలేదు. ఈ వీడియో బయటపడి, దేశం మొత్తాన్ని ఆగ్రహానికి గురి చేసి ఉండకపోతే, రేపిస్టులు, హంతకులు ఇంకా బయటే ఉండేవారు. కాబట్టి, లైంగిక వేధింపులకు సంబంధించిన ఈ భయంకరమైన కేసు గురించి తనకు తెలియదని సింగ్‌ అంగీకరి స్తున్నారా? లేక తనకు తెలిసిందనీ, కానీ చర్య తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాననీ ఒప్పుకుంటున్నారా?

ఎలాగైనా సరే, ఇది ఆయన అసమర్థతను లేదా నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తుంది. బీరేన్‌ సింగ్‌ రాజీనామా చేయాలి లేదా ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి. ఈ ఒక్క అతి భయానక సంఘటన వల్ల మాత్రమే కాదు, గత రెండు నెలలుగా ఆయన దారుణ వైఫల్యాల కారణంగా ఆయన్ని తొలగించాలి. ఇంకా జాతీయ పతాక శీర్షికలకు ఎక్కని ఇతర అత్యాచారాలు, హత్యా ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అవును, వాస్తవానికి, జాతి విభజనకు సంబంధించి రెండు వైపులా బాధితులు, నేరస్థులు ఉన్నారు.

నిజమేమిటంటే, బీరేన్‌ సింగ్‌ ఆఖరికి తన సొంత శాసన  సభ్యులను కూడా రక్షించడంలో విఫలమయ్యారు. ఉదాహరణకు వుంగ్‌జగిన్‌ వాల్తే గురించి ఆలోచించండి. ఆయన సింగ్‌ సహచరుడు, భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు, ముఖ్యమంత్రి సలహాదారు. ఆయనపై దాడి జరిగింది. ఆయన మాట్లాడలేని, నడవలేని స్థితిలో ఢిల్లీలోని ఆసుపత్రి బెడ్‌లో కట్లతో పడి ఉన్నారు. తమ కుటుంబం ఎప్పటికీ మణిçపుర్‌కు తిరిగి వెళ్లదని ఆయన భార్య అన్నారు.

నిజమేమిటంటే, స్థానిక పరిపాలనలోని అన్ని విభాగాలు జాతుల పరంగా చీలిపోయినప్పటికీ, ఇప్పటికీ విశ్వసనీయతను కలిగి ఉన్న ఏకైక వ్యవస్థ సైన్యం మాత్రమే. మైతేయిలు, కుకీల మధ్య బఫర్‌ జోన్‌లను ఏర్పాటు చేస్తున్నది సైన్యమే; ఇరువైపులా కమ్యూనిటీ నాయకులతో చర్చలను ప్రారంభించిందీ సైన్యమే. పైగా ఇటీవలి ఒక వీడియోలో చెప్పినట్లుగా, ‘మానవీయంగా ఉండటం బలహీనతకు సంకేతం కాదు’ అని సైన్యం భారతీయులకు గుర్తు చేస్తోంది. ఇంకా గుర్తుంచుకోండి, మణిపుర్‌లోని అనేక ప్రాంతాలలో సైన్యం సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి చెందిన చట్టపరమైన రక్షణ లేకుండా పనిచేస్తోంది.

ఆ వీడియో కీలకమైన సాక్ష్యాలను అందించిందనీ, వ్యక్తులను గుర్తించడంలో పోలీసులకు సహాయపడిందనీ బీరేన్‌ సింగ్‌ పేర్కొ న్నారు. అలా అయినప్పుడు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ లోని కొందరు అధికారులు మణిపుర్‌పై నివేదికలను, ప్రదర్శనలను (వీటిలో నావి కూడా ఉన్నాయి) ఆపమని కోరడం విడ్డూరం కాదా? ఆ మహిళలను గుర్తించేలా ఉన్నవీ, లేదా దాడికి సంబంధించిన క్రూర త్వాన్ని తెలిపేవీ చూపడానికి ఏ మీడియా హౌస్‌ను కూడా అనుమతించకూడదు. అలాంటి వీడియోలను బ్లాక్‌ చేయాలి. అయితే, నిర్దిష్టమైన సంపాదకీయ రక్షణతో ఆ వీడియోను ప్రస్తావిస్తున్నప్పుడు కూడా దాని చుట్టూ ఉన్న మీడియా కవరేజీని తొలగించడం అంటే, మణిపుర్‌ భయానక స్థితిని వివరంగా చెప్పడాన్ని తీవ్రంగా అడ్డుకోవడమే అవుతుంది.

‘‘ఇది కుకీలు లేదా మెయితీల గురించి కాదు... ఇది భారతీయ మహిళల గురించి. మొత్తం భారతీయ మహిళల గురించి’’ అని గ్లాడీ హుంజన్‌ చిన్నపిల్లలా ఏడుస్తూ నాతో చెప్పారు. ఈ వీడియో చూసి భారతీయ మహిళలమైన మనం వణికిపోయిన సమయంలోనే,లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ పార్లమెంటేరియన్ కు ఢిల్లీ పోలీసుల నుంచి అనూహ్యంగా బెయిల్‌ వచ్చింది. పైగా అత్యాచార దోషి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు పెరోల్‌ వచ్చింది.

మణిపుర్‌ గురించి, ఆ వైరల్‌ వీడియో గురించి మనందరం పట్టించుకోవాలి. మణిపుర్‌ ప్రజలలో విశ్వాసాన్ని పునరుద్ధరించ డానికి రాష్ట్ర పతి పాలన విధించడమే ప్రారంభ చర్య అవుతుంది.

బర్ఖా దత్‌
వ్యాసకర్త ప్రముఖ పాత్రికేయురాలు
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement