
కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా... అత్యాచారాలకు గురైన శవాలు. మనువాదం, ఫాసిజం, పితృస్వామ్యం దేశంలో నలుదిశలా ఊరేగు తున్నాయి.’ ‘ముళ్ళపొదల్లో ఓ ఆడ శిశువు... చెత్త కుండీలో మరో ఆడ శిశువు... ఇద్దరూ అప్పుడే భూమి మీద పడిన పసికూనలు.’
ఇలాంటి వార్తలు నిత్యం వస్తుంటాయి. ఎన్నో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ మహిళల సామాజిక స్థితిగతుల్లో మార్పు రావటం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఆజాదీ ఎవరిది అన్న ప్రశ్న వస్తుంది. రోజురోజుకూ స్త్రీలపై హింస, వివక్ష రకరకాల రూపంలో పెరిగిపోతూ ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది? ముందు తరాల వారికి హింస లేని సమాజాన్ని అందించ లేమా? ఆకాశంలో సగమైన స్త్రీలు శ్రమ, ఉత్పత్తిలో సగానికి తక్కువ ఏమీ కాదు. కానీ తాను పూర్తిగా పరా ధీనగా జీవిస్తోంది భారత స్త్రీ.
స్త్రీలు ఎప్పుడూ మగవాడి కను సన్నుల్లో జీవించాలి. చిన్నప్పుడు తండ్రి, పెళ్లి తర్వాత భర్త, ముసలితనంలో కొడుకుల అధీనంలో జీవించాలి. ఇలా స్త్రీలను బందీని చేయటం ఈ సమాజం మొదటి నేరం. ఇక ‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ’ అంటూ స్త్రీలను పురుషునికి సొంత ఆస్తిగా మలి చారు. ఇలా భూస్వామ్య, పితృ స్వామిక సంస్కృతిని వ్యవస్థీకృతం చేశారు. ఈ పరిస్థితి మారాలి.
రాజ్యాంగంలోని 14, 15, 16 తదితర అధికరణాలు లింగ వివక్షకు వ్యతిరేకంగా రూపొందించబడ్డాయి. అలాగే అనేక చట్టాలు చేయబడ్డాయి. కానీ అమలుకు నోచుకోని కారణంగా స్త్రీలపై కుటుంబ, లైంగిక హింస రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం, స్వేచ్ఛ, స్వావలంబన లేకపోవడం (ఆర్థిక పరాధీనత) అసమానత, వివక్షలకు మూలం. దీనికి కారణం భూస్వామిక పితృస్వామ్యమే.
ఇక పెట్టుబడిదారీ సంస్కృతి మహిళల శరీరాన్ని వ్యాపార వస్తువుగా మార్చివేసింది. 1961లో వరకట్న నిషేధ చట్టం చేసినప్పటికీ, వరకట్నం గౌరవంగా అమలు చేయ బడుతోంది. ఆడ శిశువులను గర్భంలోనే చంపుతున్నారు. ఫలితంగా దేశంలో స్త్రీల జనాభా తగ్గిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే తరం మూల్యం చెల్లించక తప్పదు.
1991 నుంచి దేశంలో ప్రపంచీకరణ దశ మొదలై పాశ్చాత్య విష సంస్కృతి పెచ్చరిల్లి స్త్రీ శరీరం సరుకుగా, అంగడి బొమ్మగా, విలాస వస్తువుగా మార్చబడింది. ఫలి తంగా స్త్రీలపై లైంగిక హింస పెరిగి పోయింది. ఈ విష సంస్కృతి కారణంగా మన దేశంలో ప్రతి గంటకు ఐదుగురిపై అత్యాచారాలు జరుగు తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
మహిళల సమస్యలు చర్చించుకొని, పరిష్కరించుకోవడానికి చట్ట సభలలో కనీసం స్త్రీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఏనాడూ పార్లమెంట్లో మహిళా ప్రతినిధులు 15 శాతానికి మించి లేరు. సామాజిక పరిణామంలో మొదట స్త్రీలకు మంచి గౌరవం ఉండేది. మాతృస్వామ్య వ్యవస్థే ఇందుకు ఉదాహరణ. ఆ తర్వాత వ్యక్తిగత ఆస్తి,వర్గ సమాజం ఏర్పడ్డాక స్త్రీలకు ఆస్తి హక్కు లేకుండా పోయింది.
దీంతో స్త్రీలకు విలువ పోయి, వంటింటి కుందేలు అయిపోయింది. స్త్రీల దోపిడీకి, వివక్షకు మూలం పెట్టుబడిదారీ మార్కెట్ ఉత్పత్తి విధానం. తీవ్ర ఆర్థిక అసమానతలతో కూడిన ఈ విధానం నశించాలి. సోషలిజం రావాలి. ఇదే స్త్రీల విముక్తికీ, అన్ని సామాజిక సమస్యల పరిష్కారానికీ మార్గం.
– ఎల్. గజేంద్రమ్మ, ఉపాధ్యాయురాలు ‘ 97054 93054
Comments
Please login to add a commentAdd a comment