Discrimination of women
-
నొప్పిలోనూ చిన్న చూపా?!
అన్నింటా వివక్ష ఉన్నట్టే.. ఆరోగ్య చికిత్సలోనూ స్త్రీల పట్ల వివక్ష ఉందా?! ఎందుకంటే, పురుషుల కంటే స్త్రీల నొప్పిని వైద్యులు తక్కువ అంచనా వేస్తారని ఇటీవల జరిగిన పరిశోధనలు సూచిస్తున్నాయి. నొప్పితో బాధపడుతున్న పురుషుడిని వాస్తవికవాదిగా చూస్తే, స్త్రీని హిస్టీరికల్, భావోద్వేగాలకు లోనయ్యేవారిలా చూస్తారని ప్రపంచవ్యాప్తంగా జరిగిన 77 అధ్యయనాలు చెబుతున్నాయి. స్త్రీల ఆరోగ్యం విషయంలో ఇంటి నుంచి ఆసుపత్రుల దాకా ప్రపంచవ్యాప్తంగా ఎందుకీ వివక్ష?! తలనొప్పి, కడుపునొప్పి, కాలు, చెయ్యి, మెడ, నడుము నొప్పి.. బాధిస్తోందని హాస్పిటల్‌కి వెళితే అక్కడ అవసరానికి సరైన చికిత్స లభిస్తుందని ఎవరైనా అనుకుంటారు. కానీ చాలా మంది మహిళలు కొత్తరకమైన హింసను ఎదుర్కొంటున్నారని, ఆరోగ్య రక్షణ అందించేవారు పురుషుల కంటే స్త్రీలలో నొప్పిని తక్కువ అంచనా వేస్తున్నారని అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తెలియజేసింది. ఈ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ టీనా దోషి ‘స్త్రీ, పురుష తేడా లేకుండా అందరిలోనూ తలనొప్పి, న డుము, మెడ నొప్పి, కడుపునొప్పి, ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నాయి. అయితే, పురుషుల కన్నా స్త్రీలలో వచ్చే నొప్పుల సంఖ్య ఎక్కువ ఉన్నట్టు కూడా పరిశోధనలు ఉన్నాయి. దీని వల్ల కూడా ఇలాంటి ఒక అభిప్రాయం కలగచ్చు’ అంటారు ఆమె. పరీక్షా గదిలోనూ... మియామీ న్యూరోసైన్స్ లేబొరేటరీలో జరిపిన ఒక అధ్యయనంలో దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్న రోగుల వీడియోలను చూసినప్పుడు అందులోని వైద్య విద్యార్థులు, వైద్యులు స్త్రీల నొప్పిని పురుషుల కంటే తక్కువ అంచనా వేసినట్టు గుర్తించారు. ‘చేయి విరిగిందని ఎక్స్ రే చూపిస్తే వైద్యుడికి ఒక స్పష్టమైన భావం ఉంటుంది. అదే కడుపునొప్పి లేదా తెలియని ఏదైనా రుగ్మత ఉందని సంప్రదిస్తే అంటే నిర్ధారణ పరీక్షల ద్వారా ఇంకా గుర్తించలేని సమస్య అయితే అప్పుడు నొప్పి తాలూకు అంచనా స్త్రీలో మానసికపరమైనదిగా చూడచ్చు’ అంటారు వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా ఉన్న జానిస్ సబిన్. నొప్పి తాలూకు సమస్యను అనుభవించే వ్యక్తికి మాత్రమే నిజంగా ఎలా అనిపిస్తుందో తెలుస్తుంది. వాస్తవమా, కాదా అనే విషయాల్లో బేరీజు వేయడంలో కొంచెం తేడా అయితే ఉండొచ్చు’ అని వివరిస్తారాయన. అనుకోని పక్షపాతం వాస్తవానికి డాక్టర్లు ఉన్నదే రోగులకు సాయం చేయడానికి. ‘కానీ, ప్రపంచవ్యాప్తంగా 77 ‘పెయిన్ స్టడీస్’ పరిశీలిస్తే పురుషులను వాస్తవాలు చెప్పేవారిగా చూసే అవకాశం ఉంది. స్త్రీలలో భావోద్వేగాలకు లోన య్యారేమో అని చూసే అవకాశం ఉంది. కొన్ని దేశాల్లో వర్ణవివక్ష కారణంగా ఆడవారిలోనే పక్షపాతం చూపే అవకాశాలూ లేకపోలేదు’ అంటారు టీనా. ఇంటిలోనే వివక్ష.. ‘వైద్యులదాకా వెళ్లడానికి ముందు మన ఇంటి వాతావరణంలోనే చూద్దాం. పురుషుల నొప్పి కన్నా స్త్రీ నొప్పిని ఇంటిలోనే తక్కువ అంచనా వేస్తారు. స్త్రీ నొప్పి అంటే కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని సర్దుబాటు చేస్తారు. అదే మగవారు ‘నొప్పి’ అంటే కొంత అలెర్ట్ అవుతారు. అలాగే, ఇతర ఆరోగ్య నిపుణులు కూడా పురుషులతో పోల్చితే వ్యాయామాలు చేయడం, ఆహార జాగ్రత్తలు పాటించడం.. వంటివి స్త్రీలలో తక్కువ స్థాయిలో ఉన్నాయని నివేదికలు ఇచ్చారు. మానసిక చికిత్స ద్వారా స్త్రీ నొప్పి నుంచి కోలుకోవడానికి ఎక్కువ ప్రయోజనం పొందితే, పురుషులకు మందులు ఎక్కువ అవసరమవుతున్నాయ’ని అంటారు మియామీ విశ్వవిద్యాలయ డైరెక్టర్ ఎలిజబెత్ లోసెన్. అయితే, ఇప్పటికీ పాత మూస పద్ధతుల ఆధారంగానే మహిళల నొప్పి గురించి విశ్లేషిస్తున్నారని, వారి వాస్తవిక దృక్కోణంలోనూ, ఆధునిక జీవన విధానంలోనూ చాలా తేడా వచ్చిదంటున్నారు పరిశోధకులు. చికిత్సలో వివక్ష ఉండదని, వాస్తవ ప్రపంచానికి దగ్గరగా ఉండేవారిలో శారీరక నొప్పుల సంఖ్య తక్కువనేది నిపుణుల అభిప్రాయం. ఒత్తిడిని బట్టి చికిత్స బయటకు చెప్పుకోలేని మానసిక సమస్యల ప్రభావం శరీరం మీద పడుతుంది. అలాంటి కేసులు ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. మగవారితో పోల్చితే మహిళల్లో యాంగై్జటీ పర్సంటెజీ ఎక్కువ ఉంటుంది. మహిళ మానసిక స్థితిపై ఆమె చుట్టూ ఉన్న వాతావరణం ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇంటి విషయాలు, రిలేషన్స్, పిల్లలకు సంబంధించినవాటిలో ఏదైనా ఒత్తిడికి లోనైనప్పుడు సైకోసోమాటిక్ సమస్యలు వస్తుంటాయి. చికిత్స కోసం హాస్పిటల్‌కు తీసుకెళితే ‘ఏమీ లేదు స్ట్రెస్ అయ్యారు’ అని డాక్టర్ చెబితే ఇంట్లోవాళ్లే ‘నొప్పి ఏమీ లేదు, నువ్వు అనవసరంగా డబ్బులన్నీ ఖర్చుపెట్టిస్తావ్...’ అని కోప్పడేవారుంటారు. ఇది కూడా స్త్రీలలో ఒకరకమైన ఒత్తిడిని పెంచుతుంది. మగవారిలో అయితే ఇంటి బయటి విషయాలమీద దృష్టి ఎక్కువ ఉంటుంది. పొగతాగడం, మద్యం సేవించడం, వ్యసనాలు.. వీటికి సంబంధించిన సమస్యల వల్ల బాడీ పెయిన్స్ రావడం ఎక్కువ గమనిస్తుంటాం. ఇద్దరిలోనూ సమస్య మూలాలను కనుక్కొని చికిత్స చేస్తాం. – డాక్టర్ కె. హరిణి, సైకియాట్రిస్ట్ తేడా లేదు... చికిత్సలో ఆడ–మగ ఇద్దరినీ ఒకే విధంగా చూస్తాం. కొన్ని సందర్భాల్లో ఆడ–మగ సమస్యల్లో కారణాలు వేరు వేరుగా ఉంటాయి. అవి హార్మోన్లలో తేడాల వల్ల వస్తాయి. పేషెంట్లో ఉండే సమస్యను బట్టి చికిత్స ఉంటుంది తప్పితే ఎక్కువ–తక్కువ అంచనా వేయడం ఏమీ ఉండదు. – డాక్టర్. జి.నవోదయ, జనరల్ మెడిసిన్ – నిర్మలారెడ్డి -
ఆర్తిసింగ్ ఐపీఎస్..ఎంటరైతే చాలు..కాకలు తీరిన క్రిమినల్స్ గజగజ వణకాల్సిందే
దేశంలో దాదాపు అన్ని పోలీస్ కమిషనరేట్లలో దాదాపు అందరూ మగ అధికారులే కమిషనర్లు. సినిమాల్లో కూడా హీరోయే పోలీస్ కమిషనర్. కాని ఆర్తి సింగ్ ఈ సన్నివేశాన్ని మార్చింది. మహారాష్ట్రలోని అమరావతికి కమిషనర్‌గా చార్జ్ తీసుకుంది. ప్రస్తుతం దేశంలో ఈమె ఒక్కతే మహిళా పోలీస్ కమిషనర్. రావడంతోటే స్ట్రీట్ క్రైమ్‌ను రూపుమాపాలనుకుంది. ఎస్.. నేను చేయగలను అంటున్న ఆర్తి సింగ్ పరిచయం. 2009. దేశానికి ఎలక్షన్లు. కీలకమైన సమయం. మరోవైపు మావోయిస్టులు తమ కదలికలను పెంచారు. మహారాష్ట్రలోని ‘రెడ్ కారిడార్’ అయిన గడ్చిరోలి ప్రాంతంలో జరిగిన దాడిలో 17 మంది పోలీసులు చనిపోయారు. ఆ సమయంలో అక్కడ గట్టి పోలీస్ ఆఫీసర్ అవసరం. మావోయిస్టుల దాడులను నిరోధించేందుకే కాదు ఎలక్షన్లు సజావుగా జరిగేందుకు కూడా చర్యలు తీసుకోవాలి. కాని చార్జ్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో పై అధికారులకు తట్టిన ఒకే ఒక్క పేరు ఆర్తి సింగ్. ఆమె 2006 బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్. పెద్దగా అనుభవం లేదు. పైగా మహిళా ఆఫీసర్. ‘ఆమె ఏమి చేయగలదు’ అని గడ్చిరోలి ప్రాంతంలోని సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్లు అనుకున్నారు. కాని ఆమె చార్జ్ తీసుకున్నాక వారంతా అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ సమయంలో ఆమె మావోయిస్టుల కదలికలను నివారించడమే కాదు... ఎలక్షన్లను బహిష్కరించండి అన్న వారి పిలుపును గెలవనీకుండా గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ జరిగేలా చూసింది. అందుకే ఆమె పోలీసుల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు పొందింది. అందరూ మూడు నుంచి ఆరు నెలల కాలం చేసి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్లిపోయే చోట ఆమె మూడు సంవత్సరాలు పని చేసింది. ‘నేను చేయగలను అనుకున్నాను. చేశాను’ అంటుంది ఆర్తి సింగ్. ఆమె ఆ కాలంలో చాలా ఆయుధాల డంప్‌ను స్వాధీనం చేసుకుంది. అందుకే ఆమె ట్రాన్స్ఫర్ అయి వెళుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్మానం చేసి అవార్డులు ఇచ్చి పంపాయి. అదీ ఆర్తి సింగ్ ఘనత. ఆడపిల్ల పుడితే ఏంటి? ఆర్తి సింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్. ఆ ప్రాంతంలో ఆడపిల్లల్ని కనడం గురించి స్త్రీలు వివక్ష ఎదుర్కొంటున్నా ఆర్తి కుటుంబంలో అలాంటి వివక్ష ఏదీ ఉండేది కాదు. ఆర్తి ఎంత చదవాలన్నా చదువుకోనిచ్చారు. ‘మా నాన్న సపోర్ట్ చాలా ఉంది’ అంటుంది ఆర్తి. ఆమె బెనారస్ హిందూ యూనివర్సిటీలో మెడిసిన్ చేసి డ్యూటీ డాక్టర్‌గా పని చేస్తున్నప్పుడు గైనకాలజీ వార్డ్‌లో ఆమెకు తల్లులు అందరి నుంచి ఎదురయ్యే ఒకే ఒక ప్రశ్న ‘ఆడిపిల్లా? మగపిల్లాడా?’– ఆడపిల్ల పుడితే వాళ్ల ముఖాలు మాడిపోయేవి. ‘ఆ పరిస్థితి చాలా విషాదం. తల్లిదండ్రులు ఆడపిల్లలను కాకుండా మగపిల్లలను ఎందుకు కోరుకుంటారంటే వారిని రక్షించలేమేమోనన్న ఆందోళనే. అందుకు వారు ఎన్నుకునే ఉపాయం. పెళ్లి. పెళ్లి చేసేస్తే ఆడపిల్ల సేఫ్ అనుకుంటారు. దాంతో బాల్య వివాహాలు, అపరిపక్వ వివాహాలు జరిగిపోతాయి. నేను ఈ పరిస్థితిని మార్చాలంటే డాక్టర్‌గా ఉంటే కుదరదనిపించింది. ఐఏఎస్ కాని ఐపిఎస్ కాని చేయాలనుకున్నాను. నేను పెద్ద ఆఫీసరయ్యి ఆడపిల్లల తల్లిదండ్రులకు సందేశం ఇవ్వాలనుకున్నాను’ అంటుంది ఆర్తి. అయితే బంగారంలాంటి డాక్టర్ చదువు చదివి ఉద్యోగం చేస్తూ కూడా యు.పి.ఎస్.సి పరీక్షలకు హాజరవ్వాలనుకోవడం రిస్క్. ‘కాని నేను చేయగలను అనుకున్నాను’ అంటుంది ఆర్తి సింగ్. ఆమెకు మొదటిసారి అవకాశం రాలేదు. రెండోసారి పంతంగా రాసి ఐ.పి.ఎస్ సాధించింది. కోవిడ్ వారియర్ మహారాష్ట్రలో మాలేగావ్ సెన్సిటివ్ ఏరియా. ఏడున్నర లక్షల మంది ఉండే ఈ టెక్స్టైల్ టౌన్లో మత కలహాలు ఏ పచ్చగడ్డీ వేయకనే భగ్గుమంటాయి. దానికి తోడు అక్కడే గత సంవత్సరం కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఆ సమయంలో అధికారులకు మళ్లీ గుర్తొచ్చిన పేరు ఆర్తి సింగ్. అక్కడ చార్జ్ తీసుకోవడం అంటే ఏ క్షణమైనా కరోనా బారిన పడటమే. కాని ఆర్తి సింగ్ ధైర్యంగా చార్జ్ తీసుకుంది. అంతేకాదు రెండు నెలల కాలంలో కరోనాను అదుపు చేసింది. ‘నేను డాక్టర్ని కనుక ఇల్లు కదలకుండా ఉండటం ఎంత అవసరమో ప్రజలకు సమర్థంగా చెప్పాను. మరోవైపు మా సిబ్బంది ఒక్కొక్కరు కరోనా బారిన పడుతుంటే ధైర్యంగా ఉండటం కష్టమయ్యేది. అయినా సరే పోరాడాను. అలాగే కలహాలకు కారణమయ్యే టిక్‌టాక్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు కట్టడి చేశాను’ అంటుంది ఆర్తి సింగ్. మహిళా కమిషనర్‌గా దేశంలోని కమిషనరేట్లలో అందరూ మగ ఆఫీసర్లు ఉంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్తి సామర్థ్యాలను గుర్తించి విదర్భ ప్రాంతంలోని అమరావతి నగరానికి కమిషనర్‌గా వేసింది. ఆ నగరంలో స్ట్రీట్ క్రైం ఎక్కువ. రౌడీలు తిరగడం, చైన్ స్నాచింగ్‌లు, తన్నులాటలు, ఈవ్ టీజింగ్‌లు.. మోతాదు మించి ఉండేవి. ఆర్తి చార్జ్ తీసుకున్నదన్న వార్తకే అవి సగం కంట్రోల్ అయ్యాయి. మరి కొన్నాళ్లకు మిగిలిన సగం కూడా. ఒత్తిళ్లకు తలొగ్గకుండా పని చేయడం ఆర్తి తీరు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆర్తి ‘నేను చేయగలను’ అనుకోగలిగితే స్త్రీలను చేయలేనిది ఏదీ లేదు అని నిరూపిస్తోంది. -
ఆ చట్టాలు నేటికీ వివక్షాపూరితమే!
హిందూ వివాహాలను 1955 నాటి హిందూ వివాహ చట్టం, ఒప్పంద వివాహంగా మార్చిందన్నది సత్యమే అయినప్పటికీ ఆ ఒప్పందంలో భార్యకు ఏ పాత్రా లేకపోవడం గమనార్హం. అందుకే వివాహ చట్టాలు నేటికీ స్త్రీలపట్ల వివక్ష చూపుతూనే ఉన్నాయి. వివాహానంతరం ఎక్కడ నివాసముండాలి? ఇంటికి మరీ దూరంగా భార్య ఉద్యోగం చేయవచ్చా అనే అంశాలను భర్త మాత్రమే నిర్ణయిస్తుంటాడు. భర్తే కుటుంబ యజమాని (పతియే పరమేశ్వరుడు) కాబట్టి కోర్టులు కూడా భర్తకు అనుకూలంగానే వ్యవహరిస్తుంటాయి. భర్తకు విధేయంగా ఉండటం భార్య పవిత్ర విధి, అతడు ఎంపిక చేసిన స్థలంలోనే ఆమె నివసించాలి అనేదే ఇవాళ్టకీ నడుస్తోంది. మహిళా ఉద్యమం లేవనెత్తిన డిమాండ్ల కారణంగా మహిళలను కూడా చట్టం అనే పరిధిలోకి చేర్చినట్లు మనం గ్రహిస్తాము. నిజానికి, భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 కింద సమానత్వానికి, ఆర్టికల్ 15 కింద వివక్షా రాహిత్యానికి హామీ ఇచ్చింది కానీ కుటుంబం లోపల వివాహ వ్యవస్థలో స్త్రీపై పురుషుడి ఆధిక్యత కొనసాగుతూనే ఉంది. పెళ్లయ్యాక తనకు నచ్చిన ఇంటిలో ఉండటం అనే స్త్రీల హక్కును ఇటీవలి వరకు ఎవరూ గుర్తించలేదు. మహిళకు ప్రాధాన్యం ఇచ్చే న్యాయ సిద్ధాంతం పక్షపాతంతో కూడుకున్నదనీ, అలాంటి న్యాయ మీమాంసకు తటస్థ దృక్పథం ఉండదని సూత్రీకరించవచ్చా? ఫెమినిస్టు కళ్లతో ప్రపంచాన్ని చూడటం లేదా మహిళల హక్కులు అనే భావనే పక్షపాతంతో ఉంటుందనీ ముద్ర వేయవచ్చా? శాసనానికి ఉండే సానుకూల లక్షణం కారణంగా, అది సమాజాన్ని సమర్థంగా మార్చివేసే ఉపకరణంగా పనిచేస్తుందని చెప్పడమంటే మరీ సాధారణీకరించినట్లు అవుతుందని పలువురు ఫెమినిస్టు సిద్ధాంతకారులు వాదిస్తున్నారు. వీరి దృష్టిలో శాసనం అనేది ఒక మొరటైన, పరిమిత స్వభావం కలిగిన పరికరం మాత్రమే. తనను రూపొందించిన సమాజంలోని ఆధిపత్య భావాలతో అది గిరి గీసుకుని ఉంటుందని వీరి అభిప్రాయం. శాసనం అభివృద్ధి క్రమాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు, మహిళా ఉద్యమం లేవనెత్తిన డిమాండ్ల కారణంగా మహిళలను కూడా చట్టం అనే పరిధిలోకి చేర్చినట్లు మనం గ్రహిస్తాము. ప్రత్యేకించి మహిళలు పితృస్వామిక సమాజంలోని పౌరులుగా తమ హక్కులను ప్రకటించడం ప్రారంభమయ్యాక వారిని శాసన పరిధిలో చేర్చడం తప్పనిసరైంది. మహిళా ఉద్యమం డిమాండ్లు... సమానత్వం, ఓటు హక్కు, విద్యా హక్కు, అనేక వృత్తులను చేపట్టడం వంటివే కదా.. ఈ డిమాండ్లతోనే పాశ్చాత్య మహిళలు అనేక సమరాలు చేసి గెలుపొందారు. ఈ పోరాటాలతో ప్రభావితమై, భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 కింద సమానత్వానికి, ఆర్టికల్ 15 కింద వివక్షా రాహిత్యానికి హామీ ఇచ్చింది. స్వేచ్ఛ, స్వాతంత్య్రంతో పాటు సమానత్వ భావన కూడా మన రాజ్యాంగంలో మహిళల పరిరక్షణకు మూలస్తంభాలుగా నిలబడ్డాయి. ఓటు హక్కు, విద్య, ఉపాధిలో సమాన అవకాశాలు, సమాన పనికి సమాన వేతనం వంటివి సమానత్వం అనే భావన కిందికి వచ్చి చేరాయి. అయితే వివాహ చట్టాల కింద గృహవ్యవస్థను మనం పరిశీలించినప్పుడు, ఈ సమానత్వ భావన మహిళలకు హానికరంగా మారుతుంది. మన వివాహ వ్యవస్థలో స్త్రీపురుషులు సమానులు కారు కాబట్టి సమానత్వం అనే రూళ్లకర్ర వీరికి వర్తించదు. సమానత్వం సమానుల మధ్యే ఉంటుంది. సమానత్వ భావనను అసమానుల మధ్య వర్తించినట్లయితే అది మరింత అసమానత్వానికి దారితీస్తుంది. అయితే ఈ వ్యత్యాసం వివాహ చట్టాల్లో అంత స్పష్టంగా కనిపించదు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రూపొందిన 1955 నాటి హిందూ వివాహ చట్టాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు ఇది అత్యంత స్పష్టంగా బోధపడుతుంది. అసమానత్వంతో కూడిన వివాహం వివాహ వ్యవస్థ లోపల మహిళల ప్రతిపత్తి పురుషులతో పోలిస్తే చాలా వ్యత్యాసంతో ఉంటుంది. పురుషుడు సంపాదనాపరుడు, అతడి సంపాదనను ఆర్థిక పదబంధాలతో కొలుస్తారు. మహిళ గృహిణి, అంతేకాకుండా వివాహ వ్యవస్థ లోపల ఆమె అధీనురాలి స్థితిలో ఉంటుంది. ఆమె కుటుంబం, సమాజానికి చెందిన సాంస్కృతిక నియమాలను నిలబెట్టే స్థానంలో ఉంటుంది. అయితే వివాహ చట్టాల్లోపల వధూవరుల మధ్య ఉంటున్న ఈ అసమానతా స్థితిని ఎవరూ గుర్తించరు. ఇక విడాకులకు ప్రయత్నిస్తున్నప్పుడు స్త్రీపురుషులిరువురూ తమ పిటిషన్లను ఒకే నిర్దిష్ట భూమికపై సమర్పించాల్సి ఉంటుంది. అవేమిటంటే – వ్యభిచారం, పారిపోవడం, క్రూరత్వం. విడాకుల లిటిగేషన్లో న్యాయస్థానాల ముందుకు వచ్చే అంశాలను పరిశీలిద్దాం. సమయానికి భోజనం సిద్ధం చేయకపోవడం, భర్త పని నుంచి ఇంటికి తిరిగి రాగానే టీ ఇవ్వకపోవడం (భార్య సంపాదనాపరురాలిగా ఉంటున్నప్పటికీ ఈ సేవ చేయాల్సిందే), సెక్స్‌కి వ్యతిరేకించడం, గర్భాన్ని తీసేసుకోవడం, తన మరుదుల సమక్షంలో లేక బహిరంగంగా ఉంటున్నప్పుడు తలకు వస్త్రం కప్పుకోకపోవడం, వివాహానికి సంకేతమైన సిందూరం లేదా మంగళసూత్రాన్ని ధరించడాన్ని తిరస్కరించడం, ఉమ్మడి కుటుంబానికి దూరంగా విడిగా వేరే ఇంట్లో ఉండాలని డిమాండ్ చేయడం, వరకట్నం తీసుకున్నాడని సెక్షన్ 498ఏ కింద కేసుపెట్టడం వగైరా కారణాలు విడాకుల పిటిషన్లో కనబడుతుంటాయి. విడాకులు కోరుకుంటున్న భార్యలు తమ భర్తల క్రూరత్వానికి వీటినే ఉదాహరణలుగా చూపి కోర్టును అభ్యర్థిస్తుంటారు. అయితే మహిళలు విడాకులు కోరుతూ తమ పిటిషన్లలో చెప్పే కారణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అవి ప్రధానంగా వారి ప్రాథమిక ఉనికికి సంబంధించి ఉంటాయి. అత్తింటి నుంచి తనను బయటకు గెంటేయడం, పదే పదే కట్నాన్ని డిమాండ్ చేయడం, మరింత కట్నం ఇవ్వలేదని భార్య తల్లితండ్రులను అవమానించడం, స్త్రీ ధనంగా వచ్చిన భార్య నగలను, విలువైన వస్తువులను లాక్కుని వాటిని ఆమెకు తిరిగి ఇవ్వకపోవడం, రోజువారీ ఖర్చులకు కూడా డబ్బు ఇవ్వకపోవడం, ఉద్యోగం చేయనీయకుండా అడ్డుకోవడం, ఆమె జీతాన్ని లాగేసుకోవడం, ఆమె నైతిక వర్తనపై నిందలు మోపడం... లైంగికంగా, భావోద్వేగపరంగా, సెక్స్ పరంగా దూషించటం, పిల్లలను తన చెంతకు రానివ్వకపోవడం వంటి కారణాలతో మహిళలు విడాకుల పిటిషన్ సమర్పిస్తుంటారు. పితృస్వామ్య సామాజిక నిర్మాణంలో మహిళలు అనేక సందర్భాల్లో తమ పుట్టింటిని వదిలి భర్త ఇంటికి రావడం కద్దు. తనకు నచ్చిన ఇంటిలో ఉండటం అనే స్త్రీల హక్కును ఇటీవలి వరకు ఎవరూ గుర్తించలేదు. ప్రసవం కోసం భార్యను పుట్టింటికి పంపినప్పుడు, భర్త ఆమె మళ్లీ తన ఇంటికి రాకుండా అడ్డుకుంటాడు. తర్వాత విడాకుల్ని కోరుకుంటాడు. భర్త వాస్తవంగానే తన భార్య పునరాగమనాన్ని నిరోధిస్తున్నప్పుడు నిర్మాణాత్మకంగా వారిని వేరు చేయడం ఎలా అని సూత్రీకరించడానికి కోర్టులకు చాలా సమయం పట్టింది. కాబట్టి విడాకుల భూమిక కూడా స్త్రీపురుషులను వేరు చేస్తోందని గమనించవచ్చు. మహిళల శరీరాలూ... ఆస్తే మరి! ఐపీసీ సెక్షన్ 497 కింద వ్యభిచారంపై చట్టాన్ని పరిశీలించినప్పుడు ఇదేం వైపరీత్యం అనిపించింది. దీన్ని 2018 సెప్టెంబర్‌లో జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టిపడేసిందనుకోండి. 158 సంవత్సరాల ఐపీసీ 497 సెక్షన్ ప్రకారం భర్త అనుమతి లేకుండా భార్యతో ఎవరైనా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది భర్త పట్ల నేరం చేసినట్లు అవుతుంది. కానీ ఇదే సూత్రాన్ని మహిళ పట్ల ఈ చట్టం వర్తింపజేయలేదు. ఈ చట్టం కింద మహిళను శిక్షించలేరు. కానీ ఈ నిబంధన ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తోందని సవాలు చేసినప్పుడు సమానత్వ ప్రతిజ్ఞ నుంచి దాన్ని కాపాడటానికి కోర్టులు పితృస్వామిక సిద్ధాంతంపై ఆధారపడేవి. దీన్ని మహిళకు అనుకూలమైన సంరక్షణ చర్యగా చూసేవారు. మహిళలకు దీనిద్వారా కలిగిన ప్రమాదాన్ని న్యాయప్రక్రియ అరుదుగా మాత్రమే గుర్తించింది. కానీ జెండర్ కోణం నుంచి దీన్ని చూసినప్పుడు మహిళలు నిష్క్రియాత్మకంగా, స్తబ్దుగా ఉంటారని, తమ శరీరాల పట్ల తమ లైంగిక వాంఛల పట్ల కూడా వారు నిర్ణయాలు తీసుకోలేరని ఈ చట్టం భావిస్తున్నట్లు బోధపడుతుంది. వివాహం తర్వాత మహిళ శరీరం భర్తకే చెందుతుందని ఇది భావిస్తోంది. విక్టోరియన్ యుగం లైంగిక నీతి చట్రంపై ఆధారపడి, మహిళతో లైంగిక సంబంధం పెట్టుకునే విషయంలో ఇద్దరు పురుషుల మధ్య సమస్యగా మాత్రమే దీన్ని చూస్తూవచ్చారు. చట్టం ఈ విషయంలో పురుషుడిని మాత్రమే నేరస్థుడిని చేసినప్పటికీ సారాంశంలో ఇది మహిళా వ్యతిరేకమైంది. ఇది మహిళలను చరాస్తిగా, గృహోపకరణంగా భావిస్తూ భార్యపై భర్తకు ఆస్తి హక్కుకు చట్ట సమ్మతి కలిగించేది. ఏ వ్యక్తి అయినా మరొక వ్యక్తి భార్యను అతడి సమ్మతి లేకుండా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది ఆ భర్త హక్కును ఉల్లంఘిస్తున్నట్లుగానే చట్టం భావించేది. ఎందుకంటే తన భార్యతో లైంగిక సంబంధం పెట్టుకునే అంశం కూడా పూర్తిగా భర్తకు చెందిన హక్కుగానే భావించేవారు. ఇలాంటి పురుష పాక్షిక చట్టాన్ని 158 సంవత్సరాల తర్వాత మాత్రమే న్యాయవ్యవస్థ కొట్టి పడేసింది. అంతవరకు పురుషుడు మాత్రమే హేతుబద్దంగా ఆలోచిస్తాడు అని సాధారణంగా సమాజంలో బలపడిన అభిప్రాయమే న్యాయ మీమాంసలో కూడా ఉండేది. రీజనబుల్ మ్యాన్ అనే భావనపై మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీదేవన్ ఇన్ సర్చ్ ఆఫ్ ది ఆర్డినరీ ఉమన్ అనే వ్యాసంలో ప్రశ్నించారు. తటస్థత కూడా పక్షపాతమేనా? ముగించేముందు ఈ వ్యాసం ప్రారంభంలో వేసిన ప్రశ్నను మళ్లీ సంధిస్తున్నాను. ఫెమినిజం దృక్కోణం కానీ దాని వెలుగులో మహిళల హక్కులను ప్రస్తావించడం కానీ పక్షపాత దృష్టి అని ముద్రవేయవచ్చా? దీనికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ సరైన సమాధానం ఇచ్చారు. 2018 అక్టోబర్‌లో ఓపీ జిందాల్ లా స్కూల్లో ఫెమినిజం ఇన్ ప్రాక్టీస్, ఫెమినిస్ట్ లాయరింగ్ అండ్ ఫెమినిస్ట్ జడ్జింగ్ అనే అంశంపై నిర్వహించిన చర్చాక్రమంలో ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రకటన చేశారు.‘ఒక న్యాయమూర్తిగా మీరు రాజ్యాంగంలోని అత్యవసర విలువలను ఎత్తిపడుతూ ఆ రాజ్యాంగ సారాంశమైన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి విలువలను బలపరుస్తారు. ఈ కోణంలో మీరు ఫెమినిస్టు సూత్రాలను వర్తింపజేస్తున్నప్పుడు రాజ్యాంగంలోని సమానత్వ భావనకు మరింత బలం చేకూరుస్తారంతే’. ఈ సందర్భంలోనే రాజ్యాంగమే తనకు తానుగా ఫెమినిస్టుగా ఉందా అన్న ప్రశ్నకు ఆయన చక్కటి సమాధానం ఇచ్చారు. ‘ఫెమినిజం అంటే సామాజిక అంతరాల వ్యవస్థను విచ్ఛిన్నపర్చటమే కదా. సరిగ్గా భారత రాజ్యాంగ లక్ష్యం కూడా అదే. సమాజంలో పరివర్తన జరగాలంటే ఉనికిలో ఉన్న సామాజిక నిర్మాణాలను విచ్ఛిన్నపర్చాల్సిందే’. మన దేశంలోని న్యాయస్థానాల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతోంది కాబట్టి తమను పక్షపాతం చూపుతున్న జడ్జీలుగా ముద్రిస్తారనే భయం వీడి, మహిళా కేంద్రక న్యాయమీమాంసకు వీరు ప్రాధాన్యం ఇవ్వాలి. మహిళల హక్కును కాపాడటానికి మహిళ న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం అవసరం. అదే సమయంలో పితృస్వామిక స్వభావంతో కూడిన తటస్థతను ప్రదర్శించనందుకు వారు క్షమాపణ చెప్పాల్సి వస్తే మహిళా జడ్జీల నియామకం ఒక విఫల ప్రాజెక్టు అయిపోతుంది. కానీ మహిళా జడ్జీల నియామకం ప్రక్రియ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేసినట్లుగా రాజ్యాంగ విలువలను మరింత సమున్నతంగా ఎత్తిపడుతూనే, ఫెమినిస్టు న్యాయమీమాంస పరిణామానికి గణనీయంగా తోడ్పడుతుంది. – ఫ్లేవియా ఏగ్నెస్, మహిళా హక్కుల న్యాయవాది -
‘ధర్మ’ సందేహాలపై నిర్ణయం తీసుకుంటాం!
న్యూఢిల్లీ: ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించి న్యాయపరమైన ప్రశ్నలు సిద్ధం చేస్తామని, తొమ్మిది మంది సభ్యులున్న విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ ప్రశ్నలపై ఒక నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల వారిని అనుమతిస్తూ తీర్పు నేపథ్యంలో వేర్వేరు మతాల్లో మహిళలపై కొనసాగుతున్న వివక్షకు సంబంధించి కొన్ని పిటిషన్లు దాఖలు కాగా.. దానిపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం తెల్సిందే. ఈ అంశంపై చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. అయితే ఈ విస్తృత ధర్మాసనం ఏఏ అంశాలపై వాదనలు వినాలన్న అంశంపై కక్షిదారుల లాయర్లు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఆ ధర్మ సందేహాలను తామే సిద్ధం చేస్తామని ప్రకటించింది. శబరిమలపై తీసుకున్న నిర్ణయంపై సమీక్ష ఉండదని స్పష్టం చేసింది. ఈ నెల ఆరవ తేదీ మహిళా వివక్షకు సంబంధించి సిద్ధం చేసే ప్రశ్నలతోపాటు, కాలావధికి సంబంధించిన సమాచారాన్ని కక్షిదారులందరికీ అందజేస్తామని చెప్పింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం గత ఏడాది నవంబరులో ఇచ్చిన రిఫరెన్స్ ఆర్డర్ ఆధారంగా తాము మత స్వేచ్ఛ, మసీదులు, దర్గాల్లోకి మహిళల ప్రవేశం, పార్శీ మహిళలను పెళ్లి చేసుకున్న ఇతర మతస్తులకు పార్శీ ప్రార్థన స్థలాల్లో ప్రవేశంపై నిషేధం వంటి అంశాలపై ఒక న్యాయపరమైన విధానాన్ని అభివృద్ధి చేయనున్నామని బెంచ్ తెలిపింది. పదేళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్యవయస్కులకూ శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు బెంచ్ 2018 సెప్టెంబర్ 28న 4:1 మెజార్టీ తీర్పు ఇవ్వడం తెల్సిందే. -
ఎస్సీనని ఆలయంలోకి రానివ్వడం లేదు
సిద్దిపేటరూరల్: ఎస్సీ అయిన తనపై ఇతర కులానికి చెందిన కొందరు వివక్ష చూపుతున్నారని లక్ష్మిదేవిపల్లి సర్పంచ్ పెద్ది ఎల్లవ్వ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ..రెండేళ్లుగా గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలను చేయడం ప్రారంభించామన్నారు. నాటి నుంచి ఏటా ఉత్సవాలకు రూ. 10 వేల చొప్పున అందించినా, ఉపసర్పంచ్ ఆంజనేయులు ఇంటి నుంచే శ్రీరామ కల్యాణానికి కావాల్సిన పుస్తెమట్టెలను డప్పుచప్పుల్లతో ఆలయానికి తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆలయం వద్దకు వెళ్లినా ప్రసాదం సైతం పెట్టేవారు కాదన్నారు. ఈ సంవత్సరం గ్రామంలో నిర్మించిన భక్తాంజనేయ ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించడానికి నిర్ణయించామన్నారు. కానీ ఓ వ్యక్తి సహాకారంతో గ్రామ పెద్దలు తనకు సమాచారం ఇవ్వకుండానే వేడుకలను జరిపించారని వాపోయారు. -
పాపం..బాలికలు
సాక్షి ప్రతినిధి ఖమ్మం: ఆధునిక ప్రపంచలోనూ మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆ.. ఆడపిల్లే కదా అని తల్లిదండ్రులు కూడా చిన్నచూపు చూస్తున్నారు. ఏ నాటికైనా పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిందేగా.. పెద్ద చదువులెందుకులే అని చాలామంది భావిస్తున్నారు. కొందరైతే అమ్మాయిలను సర్కారు బడులకు, అబ్బాయిలను ప్రైవేట్ స్కూళ్లకు పంపించే ఆనవాయితీ పాటిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ లెక్కల ప్రకారం ప్రభుత్వ బడుల్లో విద్యార్థినుల సంఖ్య అత్యధికంగా ఉంటే, బాలుర సంఖ్య తక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 292 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా వాటిలో 82,445 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 46,981మంది బాలురు కాగా 35,464 మంది బాలికలు ఉన్నారు. అయితే బాలికల కంటే బాలురు అత్యధికంగా 11,517 మంది ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో 13వ స్థానం సాధించారు. జిల్లా వ్యాప్తంగా 19,127మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా, 16,749మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లా సరాసరి ఉత్తీర్ణత 87.57గా నమోదైంది. వీరిలో 9,614మంది బాలురకు గాను 8,380మంది, 9,513మంది బాలికలకు గాను 8,369మంది ఉత్తీర్ణత సాధించారు. పై చదువులు కష్టం.. జిల్లాలో బాలికలు పైచదువులకు దూరం అవుతున్నారు. 10 వతరగతి వరకు గ్రామస్థాయిలో, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఉంటూ చదువులు సాగిస్తున్నారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత కొందరు ఆర్థిక స్థోమత లేదని, మరి కొందరు ఆడపిల్లను బయటకు పంపడం కుదరదని చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. చదువుల్లో ఆణిముత్యాల్లా రాణిస్తున్నా వనరులు, సమాజంలో పరిస్థితుల ప్రభావం నేపథ్యలో బాలికా విద్య అర్ధంతరంగా ముగించాల్సి వస్తోంది. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో చదివి, పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థిని ఆ తర్వాత ఇంటర్మీడియట్‌కు చేరడం లేదు. కేజీబీవీల్లో చదివిన విద్యార్థినుల్లో కొందరికి తల్లి, మరికొందరికి తండ్రి లేరు. దయనీయ పరిస్థితుల్లో పై చదువులకు వెళ్లలేకపోతున్నారు. పాఠశాలల్లో ప్రతిభ చాటుకున్నప్పటికీ..ఆ తర్వాత ఇళ్లకు పరిమితం కావాల్సి వస్తోంది. ఇంటర్‌తోనే పెళ్లి.. నేటికీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు తండాలు, కుగ్రామాల్లో బాలికలకు పదో తరగతి తర్వాత పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. పైచదువులు చదవాలని ఉన్నా హాస్టల్ సౌకర్యం, సీట్లు దొరక్క చదువులు మధ్యలో మానేసి ఇళ్ల వద్ద ఉంటున్నారు. అటోఇటో ఇంటర్మీడియట్ చదివించి..అక్కడితో ఆపుజేయిస్తున్నారు. పెళ్లి తతంగం పూర్తి చేయించి, అత్తారింటికి సాగ నంపుతున్నారు. -
దేశంలో తొలి మహిళా ఇమామ్!
మలప్పురం: ఇటీవల దళితుల్ని ఆలయాల్లో పూజారులుగా నియమించిన కేరళలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. దేశచరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళ శుక్రవారం ప్రార్థనల(జుమ్మా నమాజ్)కు ఇమామ్‌గా వ్యవహరించింది. మలప్పురంలోని ఖురాన్ సున్నత్ సొసైటీ కార్యదర్శి జమిథా(34) తమ సంస్థ కార్యాలయంలో శుక్రవారం నమాజ్‌కు నేతృత్వం వహించారు. ఈ ప్రార్థనలకు పలువురు మహిళలు సహా 80 మంది హాజరయ్యారు. ఈ విషయమై జమిథా స్పందిస్తూ.. పవిత్ర ఖురాన్ పురుషులు, స్త్రీల మధ్య ఎలాంటి వివక్ష చూపదని చెప్పారు. మహిళలు ఇమామ్ కాకూడదని ఖురాన్లో ఎక్కడా లేదని వెల్లడించారు. -
స్త్రీ వివక్ష తగదు
కిరణ్, పద్మజ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘వధుకట్నం’. గొట్టిముక్కల భార్గవ దర్శకుడు. షేక్ బాబూసాహెబ్ నిర్మాత. ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘‘స్త్రీ వివక్ష నేపథ్యంలో సాగే కథాంశమిది. సమాజంలో మహిళల సంఖ్య తక్కువైతే ఎలా ఉంటుంది? అనే అంశానికి కామెడీని మిక్స్ చేసి ఈ కథ తయారు చేశాం’’ అని దర్శకుడు తెలిపారు. జనవరిలో పాటల రికార్డింగ్, ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు.