పాపం..బాలికలు | Discrimination on girls | Sakshi
Sakshi News home page

పాపం..బాలికలు

Published Tue, Feb 27 2018 9:35 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

Discrimination on girls - Sakshi

సాక్షి ప్రతినిధి ఖమ్మం: ఆధునిక ప్రపంచలోనూ మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆ.. ఆడపిల్లే కదా అని తల్లిదండ్రులు కూడా చిన్నచూపు చూస్తున్నారు. ఏ నాటికైనా పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిందేగా.. పెద్ద చదువులెందుకులే అని చాలామంది భావిస్తున్నారు. కొందరైతే అమ్మాయిలను సర్కారు బడులకు, అబ్బాయిలను ప్రైవేట్‌ స్కూళ్లకు పంపించే ఆనవాయితీ పాటిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ లెక్కల ప్రకారం ప్రభుత్వ బడుల్లో విద్యార్థినుల సంఖ్య అత్యధికంగా ఉంటే, బాలుర సంఖ్య తక్కువగా ఉంది.

జిల్లా వ్యాప్తంగా 292 ప్రైవేట్‌ పాఠశాలలు ఉండగా వాటిలో 82,445 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 46,981మంది బాలురు కాగా 35,464 మంది బాలికలు ఉన్నారు. అయితే బాలికల కంటే బాలురు అత్యధికంగా 11,517 మంది ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో 13వ స్థానం సాధించారు. జిల్లా వ్యాప్తంగా 19,127మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా, 16,749మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లా సరాసరి ఉత్తీర్ణత 87.57గా నమోదైంది. వీరిలో 9,614మంది బాలురకు గాను 8,380మంది, 9,513మంది బాలికలకు గాను 8,369మంది ఉత్తీర్ణత సాధించారు.

పై చదువులు కష్టం..
జిల్లాలో బాలికలు పైచదువులకు దూరం అవుతున్నారు. 10 వతరగతి వరకు గ్రామస్థాయిలో, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఉంటూ చదువులు సాగిస్తున్నారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత కొందరు ఆర్థిక స్థోమత లేదని, మరి కొందరు ఆడపిల్లను బయటకు పంపడం కుదరదని చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. చదువుల్లో ఆణిముత్యాల్లా రాణిస్తున్నా వనరులు, సమాజంలో పరిస్థితుల ప్రభావం నేపథ్యలో బాలికా విద్య అర్ధంతరంగా ముగించాల్సి వస్తోంది. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో చదివి, పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థిని ఆ తర్వాత ఇంటర్మీడియట్‌కు చేరడం లేదు. కేజీబీవీల్లో చదివిన విద్యార్థినుల్లో కొందరికి తల్లి, మరికొందరికి తండ్రి లేరు. దయనీయ పరిస్థితుల్లో పై చదువులకు వెళ్లలేకపోతున్నారు. పాఠశాలల్లో ప్రతిభ చాటుకున్నప్పటికీ..ఆ తర్వాత ఇళ్లకు పరిమితం కావాల్సి వస్తోంది.

ఇంటర్‌తోనే పెళ్లి..
నేటికీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు తండాలు, కుగ్రామాల్లో బాలికలకు పదో తరగతి తర్వాత పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. పైచదువులు చదవాలని ఉన్నా హాస్టల్‌ సౌకర్యం, సీట్లు దొరక్క చదువులు మధ్యలో మానేసి ఇళ్ల వద్ద ఉంటున్నారు. అటోఇటో ఇంటర్మీడియట్‌ చదివించి..అక్కడితో ఆపుజేయిస్తున్నారు. పెళ్లి తతంగం పూర్తి చేయించి, అత్తారింటికి సాగ నంపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement