ఈ పెళ్లి ఆపేద్దాం
సాక్షి, హైదరాబాద్: మెహదీపట్నంలోని ఓ ప్రాంతంలో ఈ నెల 26న ఓ పెళ్లి జరగనుంది. ఒక్కగానొక్క కూతురు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పనుల్లో పెళ్లికూతురు తల్లిదండ్రులు, బంధువులు హడావిడిగా ఉన్నారు. అయితే శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు అకస్మాత్తుగా ఆ ఇంటికి వెళ్లారు. పెళ్లి కూతురు వివరాలు అడిగారు. తల్లిదండ్రులకు విషయం అర్థమై అధికారులను బతిమిలాడుకోవడం మొదలుపెట్టారు.
‘వయసు చిన్నదే కావొచ్చు, కానీ అమ్మాయి పెద్దగా కనిపిస్తుంది, అయినా ఇంత మంచి సంబంధం మళ్లీ మాకు రాదు వదిలిపెట్టండి’ అని వేడుకున్నారు. అధికారులు అమ్మాయికి, తల్లిదండ్రులకు, బంధువులకు కౌన్సిలింగ్ చేశారు. తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయి.. అధికారులు అడగ్గానే చదువుకుంటానని చెప్పింది. అంతే వెంటనే అమ్మాయిని నింబోలిగడ్డ సమీపంలో ఉన్న బాలల సమితిలో చేర్పించారు.
ఇలా ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 400లకు పైగా బాల్య వివాహాలను అధికారులు నియంత్రించారు. చిన్నారి పెళ్లి కూతుళ్ల సంఖ్య విషయానికొస్తే కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ప్రతి నెలా పాతిక పెళ్లిళ్లు అవుతున్నాయక్కడ. తర్వాతి స్థానాల్లో ఖమ్మం, వరంగల్ జిల్లాలున్నాయి. చివరి స్థానంలో ఉన్న హైదరాబాద్‌లో కూడా అధికారులు ఇరవై పెళ్లిళ్లను ఆపారు. మెదక్‌లో 48, రంగారెడ్డిలో 52 పెళ్లిళ్లను ఆపారు.
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ లక్ష్మి మాట్లాడుతూ, ‘నిరక్షరాస్యులైన కొందరు తల్లిదండ్రుల్లో మార్పు రాకపోయినా ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. జిల్లా అధికారులకు బాల్య వివాహాల సమాచారం వేగంగా వస్తోంది. మా అధికారులు.. పోలీసులు, ఎమ్మార్వో, మీడియా సాయంతో వివాహాలను విజయవంతంగా నియంత్రిస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్స్ వల్ల భవిష్యత్‌లో బాల్య వివాహాల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది’ అని తెలిపారు.