న్యూఢిల్లీ: ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించి న్యాయపరమైన ప్రశ్నలు సిద్ధం చేస్తామని, తొమ్మిది మంది సభ్యులున్న విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ ప్రశ్నలపై ఒక నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల వారిని అనుమతిస్తూ తీర్పు నేపథ్యంలో వేర్వేరు మతాల్లో మహిళలపై కొనసాగుతున్న వివక్షకు సంబంధించి కొన్ని పిటిషన్లు దాఖలు కాగా.. దానిపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం తెల్సిందే. ఈ అంశంపై చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. అయితే ఈ విస్తృత ధర్మాసనం ఏఏ అంశాలపై వాదనలు వినాలన్న అంశంపై కక్షిదారుల లాయర్లు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఆ ధర్మ సందేహాలను తామే సిద్ధం చేస్తామని ప్రకటించింది.
శబరిమలపై తీసుకున్న నిర్ణయంపై సమీక్ష ఉండదని స్పష్టం చేసింది. ఈ నెల ఆరవ తేదీ మహిళా వివక్షకు సంబంధించి సిద్ధం చేసే ప్రశ్నలతోపాటు, కాలావధికి సంబంధించిన సమాచారాన్ని కక్షిదారులందరికీ అందజేస్తామని చెప్పింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం గత ఏడాది నవంబరులో ఇచ్చిన రిఫరెన్స్ ఆర్డర్ ఆధారంగా తాము మత స్వేచ్ఛ, మసీదులు, దర్గాల్లోకి మహిళల ప్రవేశం, పార్శీ మహిళలను పెళ్లి చేసుకున్న ఇతర మతస్తులకు పార్శీ ప్రార్థన స్థలాల్లో ప్రవేశంపై నిషేధం వంటి అంశాలపై ఒక న్యాయపరమైన విధానాన్ని అభివృద్ధి చేయనున్నామని బెంచ్ తెలిపింది. పదేళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్యవయస్కులకూ శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు బెంచ్ 2018 సెప్టెంబర్ 28న 4:1 మెజార్టీ తీర్పు ఇవ్వడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment