Women entry in Sabarimala Temple
-
‘ధర్మ’ సందేహాలపై నిర్ణయం తీసుకుంటాం!
న్యూఢిల్లీ: ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించి న్యాయపరమైన ప్రశ్నలు సిద్ధం చేస్తామని, తొమ్మిది మంది సభ్యులున్న విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ ప్రశ్నలపై ఒక నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల వారిని అనుమతిస్తూ తీర్పు నేపథ్యంలో వేర్వేరు మతాల్లో మహిళలపై కొనసాగుతున్న వివక్షకు సంబంధించి కొన్ని పిటిషన్లు దాఖలు కాగా.. దానిపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం తెల్సిందే. ఈ అంశంపై చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. అయితే ఈ విస్తృత ధర్మాసనం ఏఏ అంశాలపై వాదనలు వినాలన్న అంశంపై కక్షిదారుల లాయర్లు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఆ ధర్మ సందేహాలను తామే సిద్ధం చేస్తామని ప్రకటించింది. శబరిమలపై తీసుకున్న నిర్ణయంపై సమీక్ష ఉండదని స్పష్టం చేసింది. ఈ నెల ఆరవ తేదీ మహిళా వివక్షకు సంబంధించి సిద్ధం చేసే ప్రశ్నలతోపాటు, కాలావధికి సంబంధించిన సమాచారాన్ని కక్షిదారులందరికీ అందజేస్తామని చెప్పింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం గత ఏడాది నవంబరులో ఇచ్చిన రిఫరెన్స్ ఆర్డర్ ఆధారంగా తాము మత స్వేచ్ఛ, మసీదులు, దర్గాల్లోకి మహిళల ప్రవేశం, పార్శీ మహిళలను పెళ్లి చేసుకున్న ఇతర మతస్తులకు పార్శీ ప్రార్థన స్థలాల్లో ప్రవేశంపై నిషేధం వంటి అంశాలపై ఒక న్యాయపరమైన విధానాన్ని అభివృద్ధి చేయనున్నామని బెంచ్ తెలిపింది. పదేళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్యవయస్కులకూ శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు బెంచ్ 2018 సెప్టెంబర్ 28న 4:1 మెజార్టీ తీర్పు ఇవ్వడం తెల్సిందే. -
13 నుంచి శబరిమల కేసులో విచారణ
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 13 నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనం ఈ కేసులో వాదనలు విననుంది. శబరిమల అంశంతో పాటు ముస్లిం, పార్శీ మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై కూడా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ.. ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. మసీదులు, దర్గాల్లోకి ముస్లిం మహిళలను అనుమతించకపోవడం.. పార్శీ మహిళలు పార్శీయేతర కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే వారిని అగ్యారీ అనే పవిత్ర స్థలంలోకి ప్రవేశించనీయకుండా నిషేధాజ్ఞలు విధించడం వంటి ఆంక్షలు దేశంలో ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికి సంబంధించి కూడా ధర్మాసనం విచారణ జరపనుంది. -
అతిక్రమిస్తే.. జైలుకు పంపుతాం
న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడానికి వీలుగా పోలీసులు రక్షణ కల్పించాలంటూ కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించడానికి సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ మేరకు ఇద్దరు మహిళా కార్యకర్తలు వేసిన పిటిషన్‌పై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీం శుక్రవారం స్పష్టంచేసింది. ‘‘ఈ అంశం చాలా సున్నితమైనది. దీన్ని మరింత వివాదాస్పదం చేయొద్దు. దీనిపై గతంలోనే ఏడుగురు జడ్జిలతో కూడిన బెంచ్ విచారణ జరిపింది కనక ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేం’’ అని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. ‘శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలని సెప్టెంబర్ 28, 2018లో జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే లేదు. అయితే అదే అంతిమం కాదు’ అని ధర్మాసనం పేర్కొంది. ఏడుగురు జడ్జిలతో కూడిన బెంచ్ అంతిమ నిర్ణయం వెలువరించేవరకు తాము ఎలాంటి ఆదేశాలు జారీచేయలేమని, ఆలయంలోకి మహిళలను అనుమతిస్తే వెళ్లి పూజలు నిర్వహించవచ్చనని పేర్కొంది. గతేడాది ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే లేదని పిటిషనర్ తరపు న్యాయవాది తెలుపగా.. ‘చట్టం మీకు అనుకూలంగానే ఉంది. దాన్ని ఎవరైనా అతిక్రమిస్తే అందుకు కారకులను జైలుకు పంపుతాం’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. -
శరణం అయ్యప్ప!
శబరిమల/తిరువనంతపురం: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు మళ్లీ తెరుచుకున్నాయి. గత ఏడాది సుప్రీంకోర్టు ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఇచ్చిన తీర్పుతో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న దృష్ట్యా ఈసారి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో దేవాలయ తంత్రి(ప్రధాన పూజారి) కందరారు మహేశ్ మోహనరు, మెల్షంటి(ముఖ్య పూజారి) సుధీర్ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి పడి పూజ చేశారు. అనంతరం భక్తులను లోపలికి అనుమతించారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి అప్పటికే వేలాదిగా తరలివచ్చిన భక్తుల అయ్యప్ప శరణు ఘోషతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 10–50 ఏళ్ల మధ్య వయస్సున్న 10 మంది యువతులను తిప్పి పంపినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించే దేవస్థానం బోర్డు భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. పశ్చిమ కనుమల్లోని పెరియార్ పులుల అభయారణ్యం ప్రాంతంలో ఉన్న ఈ ఆలయాన్ని ప్రతి మలయాళ నెలలోని మొదటి ఐదు రోజులతోపాటు మండలపూజ మకరవిళక్కు, విషు పండగల సమయాల్లో మాత్రమే భక్తుల సందర్శన కోసం తెరుస్తారు. మండల–మకరవిళక్కు సందర్భంగా రెండు నెలలపాటు ఆలయం తెరిచి ఉండనుంది. నిషేధాజ్ఞలు లేవు: కలెక్టర్ రుతుక్రమం వయస్సు మహిళలను కూడా ఆలయంలోకి పూజలకు అనుమతించవచ్చంటూ గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం కేరళతోపాటు దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు, వేలాదిగా పోలీసులను మోహరించినప్పటికీ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈసారి ఎలాంటి నిషేధాజ్ఞలు లేవని పత్తనంతిట్ట కలెక్టర్ ప్రకటించారు. శబరిమలకు వెళ్లే దారిలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో దాదాపు 10 వేల మంది పోలీసులను మోహరించారు. భక్తుల కోసం దేవస్వోమ్ బోర్డు పలు సౌకర్యాలు కల్పించింది. నీలాకల్, పంబ, సన్నిధానం ప్రాంతాల్లో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. సన్నిధానం వద్ద 6,500 మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఏపీ మహిళల బృందం వెనక్కి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చిన 30 మంది మహిళల బృందాన్ని పోలీసులు పంబలో అడ్డుకున్నారు. వారి గుర్తింపు పత్రాలు పరిశీలించిన మీదట అందులోని నిషేధిత 10–50 మధ్య వయస్సున్న 10 మందిని తిప్పిపంపి వేశామని పోలీసులు తెలిపారు. పంబ నుంచి శబరిమల ఆలయం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాగా, కేరళ ప్రభుత్వ వైఖరిని పునరుజ్జీవన రక్షణ కమిటీ ఖండించింది. ప్రభుత్వ విధానం కారణంగా ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న వైఖరి క్రమంగా పలుచన కానుందని ఆ కమిటీ జనరల్ సెక్రటరీ పున్నల శ్రీకుమార్ తెలిపారు. శబరిమల రావాలనుకునే మహిళలు తమతో పాటు కోర్టు ఆర్డర్‌ను తెచ్చుకోవాల్సి ఉంటుందన్న కేరళ దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ ప్రకటనపై ఆయన స్పందిస్తూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి ప్రకటన ఎలా చేస్తారు? ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. ఈ విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలి’అని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వ వైఖరిపై హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ స్పందించారు. ఆ ప్రభుత్వం ఎవరికీ రక్షణ కల్పించడంలేదని వ్యాఖ్యానించారు. కేరళ సర్కారు తనకు భద్రత కల్పించినా కల్పించకున్నా ఈ నెల 20వ తేదీ తర్వాత శబరిమల ఆలయ సందర్శనకు వెళ్తానని ఆమె ప్రకటించారు. గత ఏడాది ఉద్రిక్త పరిస్థితుల మధ్య తృప్తి దేశాయ్ ఆలయ సందర్శనకు ప్రయత్నించగా భారీ స్థాయిలో ఆందోళనలు తలెత్తిన విషయం తెలిసిందే. చిన్నారి భక్తురాలిని గుడిలోకి పంపిస్తున్న దృశ్యం -
నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది. దేవాలయ ప్రధాన పూజారి కందరారు మహేశ్ మోహనరు, ముఖ్య పూజారి సుధీర్ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే విషయంలో కేరళ ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాన్ని సందర్శించాలనుకునే మహిళలు సంబంధిత కోర్టు ఆర్డరుతో రావాలని స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు అనుమతిస్తూ 2018లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..శబరిమల సహా మహిళలకు సంబంధించిన ఇతర మతాల్లోని అన్ని వివాదాస్పద అంశాలను విచారించేందుకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, 2018 నాటి∙తీర్పుపై స్టే ఇవ్వలేదు. శబరిమలలోని కీలక ప్రాంతాల్లో 10 వేల మంది పోలీసులను మోహరించనున్నారు. అయితే, నిషేధాజ్ఞలు విధించబోమని పత్తనతిట్ట కలెక్టర్ మీడియాకు తెలిపారు. మా ఆదేశాలను పాటించాల్సిందే! శబరి’ తీర్పుపై జస్టిస్ నారిమన్ న్యూఢిల్లీ: శబరిమలలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడానికి సంబంధించి గురువారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై.. తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ తీర్పును వ్యతిరేకిస్తూ తాను, జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇచ్చిన తీర్పులోని ‘అత్యంత ముఖ్యమైన’ ఆదేశాలను ప్రభుత్వం క్షుణ్ణంగా చదవడమే కాకుండా, కచ్చితంగా అమలు చేయాలని జస్టిస్ నారిమన్ స్పష్టం చేశారు. జస్టిస్ నారిమన్ శుక్రవారం మరో కేసు విచారణ సందర్భంగా మా ఆదేశాల ఉల్లంఘనను సహించబోం. తప్పనిసరిగా అమలు చేయాల్సిందే’ అని జస్టిస్ నారిమన్ తెలిపారు. -
మళ్లీ మొదటికి!
-
విస్తృత ధర్మాసనానికి ‘శబరిమల’
శబరిమల అంశం మతపరమైన ఆచారాలు, విశ్వాసాలకు సంబం ధించి అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడం అంటే, సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అర్థం. మతపరమైన ప్రార్థన స్థలాల్లోకి మహిళలను నిరాకరించే విషయం శబరిమల ఆలయానికి మాత్రమే పరిమితం కాదు. అది ఇతర మతాల అంశాలకూ వర్తిస్తుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం అంశాన్ని.. సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేరళలోని ఈ ఆలయంలోకి రుతుక్రమ వయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం గతేడాది తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును పునఃపరిశీలించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లను సమీక్షించిన సుప్రీంకోర్టు.. ఈ అంశాన్ని విస్తృత స్థాయి ధర్మాసనానికి అప్పగించింది. శబరిమల వంటి అంశం హిందూ మతానికి మాత్రమే పరిమితం కాదన్న కోర్టు.. ముస్లిం, పార్శీ మహిళలపై ఆయా మతాల్లో కొనసాగుతున్న వివక్షనూ పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు, అమ్మాయిల ప్రవేశం అంశాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం ఏడుగురు సభ్యుల విస్తృతస్థాయి ధర్మాసనానికి అప్పగించింది. దశాబ్దాలుగా అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమ వయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పునిచ్చింది. ఈ తీర్పుని పునః పరిశీలించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సమీక్షించిన కోర్టు ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల విస్తృతస్థాయి ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ సందర్భంగా శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తే అది ఒక్క హిందూ మహిళలకే పరిమితంకాదని, ముస్లిం, పార్శీ మహిళలపై ఆయా మతాల్లో జరుగుతున్న వివక్షనూ పరిశీలిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ముస్లిం మహిళలను మసీదు, దర్గాలోకి అనుమతించకపోవడం, పార్శీ మహిళలు.. పార్శీయేతర పురుషులను పెళ్లాడటంపై నిషేధం, బొహ్రా వర్గాల్లో జరుగుతున్న జనన అవయవాల కత్తిరింపుల్లాంటి అంశాలను విస్తృతధర్మాసనం చర్చిస్తుందని కోర్టు పేర్కొంది. సంపూర్ణ న్యాయం అందించేందుకు కోర్టు ఈ అంశాలపై న్యాయవిధానాలను రూపొందించాల్సిన సమయం ఇదేనని తన తొమ్మిదిపేజీల తీర్పుని వెలువరిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత తీర్పుపై స్టే ఇవ్వాలన్న అంశంపై స్పందిస్తూ విస్తృత ధర్మాసనానికి ఈ అంశాన్ని బదిలీ చేయడం అంటే సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అర్థమని సీజేఐ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ నారీమన్, జస్టిస్ ఖన్వీల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం శబరిమల వివాదాన్ని పునఃపరిశీలించే అంశాన్ని 3:2 మెజార్టీ తీర్పుతో విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పు అమలుకాకుండా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే అంశాన్ని ఐదుగురు సభ్యుల బెంచ్ ఆమోదించినా, అన్ని వయస్సుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పుని సమీక్షించాలని కోరడాన్ని జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు విభేదించారు. సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ తీర్పు అనంతరం దాఖలైన 65 పిటిషన్లు, 56 రివ్యూ పిటిషన్లు, కొత్తగా దాఖలైన నాలుగు రిట్ పిటిషన్లు, ఐదు అప్పీళ్ళను డిస్మిస్ చేయడాన్ని ఈ ఇద్దరు న్యాయమూర్తులు వ్యతిరేకించారు. శబరిమల ఒక్కటే కాదు.. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తన తరఫున, జస్టిస్ ఎఎం. ఖన్వీల్కర్, ఇందు మల్హోత్రాల తరఫున తీర్పుని చదివి వినిపిస్తూ ఈ అంశం మతపరమైన ఆచారాలూ, విశ్వాసాలకు సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తిందన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం శబరిమలలాంటి మతపరమైన ప్రార్థనా స్థలాలపై ఒకే రకమైన విధానాలను రూపొందించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ‘మతపరమైన ప్రార్థనాస్థలాల్లోనికి మహిళలను నిరాకరించే విషయం కేవలం శబరిమల ఆలయానికి మాత్రమే పరిమితం కాదనీ. ఇది ఇతర మతాల అంశాలకు వర్తిస్తుంది’ అని కోర్టు వ్యాఖ్యానించింది. 2018 సెప్టెంబర్ తీర్పు ఏం చెప్పింది? శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ధర్మాసనం 4ః1 సభ్యుల ఆమోదంతో తీర్పునిచ్చింది. రుతుక్రమం వయస్సులో ఉండే మహిళలు, అమ్మాయి లను శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని సమానత్వ భావనకు భిన్నమైనదని వ్యాఖ్యానించింది. ఈ యేడాది ఫిబ్రవరిలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ శబరిమల తీర్పుని రిజర్వ్‌లో ఉంచడం తెల్సిందే. తీర్పుకి వ్యతిరేకంగా నాడు వెల్లువెత్తిన నిరసనలు కేరళలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ సుప్రీంతీర్పు(2018)కి వ్యతిరేకంగా నాడు హిందూత్వవాదులు, సంఘ్‌పరివార్ లాంటి సంస్థలు పెద్దఎత్తున నిరసన తెలిపాయి. 10 నుంచి 50 ఏళ్ళలోపు వయస్సు మహిళలు అనేక మంది శబరిమల ఆలయప్రవేశానికి ప్రయత్నించారు. కొందరు సఫలమయ్యారు. మరికొందరు వెనుతిరగాల్సి వచ్చింది. అయ్యప్ప భక్తుల కోసం ఈనెల 17న దేవాలయాన్ని తెరవనున్నారు. దేవాలయం తెరుచుకోవడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ తీర్పు రావడంతో ఆలయంలోకి ప్రవేశంపై సందిగ్ధత నెలకొంది. -
శబరిమల, రాఫెల్‌పై తీర్పు నేడే
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా నెలకొన్న అయో«ధ్య వివాదంపై ఇటీవల తుది తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు మరో మూడు కీలక అంశాలపై తీర్పు ఇవ్వనుంది. శబరిమలలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం, రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంలో అక్రమాలు, రాఫెల్ తీర్పుపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకుగాను దాఖలైన ధిక్కరణ పిటిషన్లపై గురువారం తీర్పునివ్వనుంది. శబరిమల వివాదం.. శబరిమలలో ఉన్న ప్రముఖ అయ్యప్పస్వామి ఆలయంలోకి రుతుక్రమం (10 నుంచి 50 మధ్య వయస్సు)లోని స్త్రీల ప్రవేశంపై నిషేధం ఉంది. ఆలయంలోకి అన్ని వయస్సుల స్త్రీలను అనుమతిస్తూ 2018, సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ అనేక రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ధర్మాసనం వీటిపై విచారణ జరిపి ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వులో ఉంచింది. రఫేల్ వివాదం రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు ఏమీ లేవని కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇస్తూ 2018 డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఈ కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలతో, ఈ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై తీర్పుని మే 10న ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది. అలాగే రాఫెల్‌పై సుప్రీంకోర్టును తప్పుగా అన్వయిస్తూ ‘కాపలాదారు దొంగ’అని ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకుగాను దాఖలైన ధిక్కరణపై పిటిషన్‌పై కూడా ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. -
‘నువ్వు బతికి ఉండొద్దు... చావుపో’
తిరువనంతపురం : బిందు.. ఈ ఏడాది జనవరి మాసంలో దేశవ్యాప్తంగా మార్మోగిన పేరు. కారణం శబరిమలలోకి ప్రవేశించిన మొదటి మహిళ కావడం. శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయ్యప్ప ఆలయంలోకి కేరళకు చెందిన కనకదుర్గ(44), బిందు(42) ప్రవేశించిన చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆలయ ప్రవేశం అనంతరం బిందు ఎన్నో వేధింపులకు గురయ్యారు. అత్తింటి వారితోపాటు.. ఇరుగుపొరుగు వారి విమర్శలు, బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తల దాడులు.. ఇలా ఎన్నో అవమానాలు, వేధింపులకు గురిచేసినా ఆమె నిర్భయంగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. స్కూల్ టీచర్‌గా తన విధులు నిర్వహిస్తూ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే అయ్యప్ప ఆలయ ప్రవేశ వివాదం సద్దుమనిగిందని అనుకుంటున్న సమయంలో మళ్లీ ఆమెకు వేధింపులు మొదలైయ్యాయి. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఆమెను కొంతమంది బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు వేధించారు. ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారు. నువ్వు బతికి ఉండొద్దు చావుపో అంటూ మెరుపు దాడి చేశారు. తనపై జరిగిన దాడిని సోషల్ మీడియా వేదికగా ఖండించారు బిందు. తనపై దాడికి దిగిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. చదవండి : శబరిమలలో కొత్త చరిత్ర ఎన్నికల విధుల్లో భాగంగా బిందు రిజర్వ్ అధికారిగా పట్టంబి నియోజకవర్గానికి వెళ్లారు. అక్కడి ఓ కళాశాలలో ఎన్నికల సామాగ్రిని ఉంచారు. ఆమె విధుల్లో భాగంగా మంగళవారం అక్కడి వెళ్లారు. అక్కడ కొంత మంది వ్యక్తులు తనను గుర్తించి దాడికి యత్నించారని బిందు పేర్కొన్నారు. తన విధులు ముగించుకొని క్యాంపస్‌కు తిరిగి వస్తున్న సమయంలో కొంతమంది దాడి చేశారన్నారు. ’ సాయంత్ర సమయంలో క్యాంపస్ నుంచి బయటకు వెళ్లాను. అక్కడ నా కోసం ఓ గ్రూప్ కాపు కాస్తూ ఉంది. నా దగ్గరకు వచ్చి శబరిమల ఆలయంలోకి వెళ్లింది నువ్వేనా అని ఒకరు అడగ్గా.. నేను సమాధానం చెప్పేలోపే నాపై దాడికి దిగారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ దూషించడం మొదలు పెట్టారు. ’ నువ్వు బతికి ఉండొద్దు.. వెళ్లి చావు’ అంటూ మెరుపు దాడికి యత్నించారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల అధికారిపై దాడి జరగడం దారుణం. ఇది రాజ్యాంగ, ప్రజాస్వామ్యానికే సవాల్‌గా మారుతోంది. నాపై దాడికి ప్రయత్నించిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా. నా పోరాటాన్ని కొనసాగిస్తా’ అని బిందు పేర్కొన్నారు. బిందు చిన్నప్పటి నుంచీ రెబల్. కాలేజీరోజుల్లో కేరళ విద్యార్థి సంఘటన (వామపక్ష విద్యార్థి సంఘం)నాయకురాలిగా పనిచేశారు. కేరళ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. కమిట్మెంట్కు మరోపేరు ఆమె. జెండర్ ఈక్వాలిటీ, సాంఘిక న్యాయ పోరాటాల్లో ముందున్నారు. ఆ విషయాల మీద ఆమె ఇచ్చే ఉపన్యాసాలు వినడం కోసం కేరళలో స్టూడెంట్స్ చెవి కోసుకుంటారు. బిందు వ్యక్తిగత విషయానికి వస్తే ప్రముఖ పొలిటికల్ యాక్టివిస్ట్ హరిరన్ ఆమె భర్త. వాళ్లకు పదకొండేళ్ల కూతురు ఓల్గా. కోజీకోడ్ జిల్లాలోని పోక్కాడ్ ఆమె నివాసం. -
‘51 కాదు 17 మంది మాత్రమే’
తిరువనంతపురం : సుప్రీం కోర్టు తీర్పుకనుగుణంగా దాదాపు 51 మంది 50 ఏళ్ల లోపు వయసున్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించారంటూ కేరళ ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నివేదికలో మగవారి పేర్లు రావడం, 50 ఏళ్ల పైబడిన మహిళలర్లు కూడా ఉండటంతో విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కొత్త నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది. 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు కేవలం 17 మంది మాత్రమే శబరిమల ఆలయంలోకి ప్రవేశించారని ఈ నివేదికలో తెలిపింది. ఈ విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘ఇంతకు ముందు సమర్పించిన నివేదికలో నలుగురు పురుషులు ఉన్నట్లు గుర్తించాము. వారితో పాటు 30 మంది మహిళలు 50 ఏళ్ల వయసు పైబడిన వారిగా గుర్తించి ఆ పేర్లను నివేదిక నుంచి తొలగించినట్లు’ తెలిపారు. ఈ క్రమంలో చివరకూ 50 ఏళ్ల లోపు వయసున్న మహిళలు కేవలం 17 మంది మాత్రమే ఆయంలోకి ప్రవేశించినట్లు కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 2న బిందు, కనక దుర్గ అనే ఇద్దరు 50 ఏళ్లలోపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో కేరళలోని హిందూ నిరసనకారులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు. -
51 మంది మహిళలు దర్శించుకున్నారు
న్యూఢిల్లీ/తిరువనంతపురం: రుతుస్రావ వయసులో ఉన్న 51 మంది మహిళలు ఇప్పటివరకూ శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకున్నట్లు కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేరళ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనానికి అఫిడవిట్‌ను సమర్పించింది. కేరళ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హన్సరియా వాదిస్తూ.. స్వామివారి దర్శనం కోసం రుతుస్రావ వయసులో ఉన్న 7,564 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా, 51 మంది దర్శనం చేసుకున్నారన్నారు. తప్పులతడకగా అఫిడవిట్.. కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్లో అయ్యప్పను దర్శించుకున్న మహిళల ఆధార్, టెలిఫోన్ నంబర్లను బహిర్గతం చేయడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. తమిళనాడుకు చెందిన పరంజ్యోతి(47) అనే పురుషుడి పేరును కేరళ ప్రభుత్వం అఫిడవిట్లో చేర్చినట్లు బయపడింది. అలాగే అఫిడవిట్లో పేర్కొన్న కళావతి మనోహర్ వయస్సు 52 సంవత్సరాలనీ, 43 ఏళ్లు కాదని ఆమె కొడుకు చెప్పారు. ఆ మహిళలకు రక్షణ కల్పించండి.. అయ్యప్పస్వామిని దర్శించుకున్న బిందు(42), కనకదుర్గ(44)లకు భద్రత కల్పించాలని కేరళ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. బిందు, కనకదుర్గల భద్రత మినహా ఈ రిట్ పిటిషన్లో తాము ఇతర అంశాల జోలికి వెళ్లడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కేరళ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ బిందు ఇంటివద్ద నలుగురు అధికారులు, అత్తచేతిలో దాడికి గురై ఆసుపత్రిలో ఉన్న కనకదుర్గకు 19 మందితో రక్షణ కల్పిస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బిందు కోజికోడ్‌లోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా, కనకదుర్గ పౌరసరఫరాల విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
‘వారికి 24/7 రక్షణ కల్పించండి’
న్యూఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు బిందు, కనకదుర్గలకు 24 / 7 రక్షణ కల్పించాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయంలోకి ప్రవేశించినందుకు తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ.. ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించాలని కోరుతూ ఈ ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు బిందు, కనకదుర్గలకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి శబరిమల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసింది. ఆడవారిని ఆలయంలోకి ప్రవేశించకుండా ఆందోళనకారులు అడ్డుగిస్తున్నారు. ఈ క్రమంలో బిందు, కనకదుర్గలు ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. కానీ ఆలయంలోకి వెళ్లి వచ్చినప్పటి నుంచి వారికి బెదిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో జనవరి 15న కనకదుర్గ మీద ఆమె అత్త, బంధువలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాంతో బిందు, కనకదుర్గలు తమకు ప్రాణ హాని ఉందని గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ఆలయంలోకి వెళ్లాలనుకునే మహిళలకు పోలీసు రక్షణ కల్పించేలా కోర్టు ఆదేశించాలని కోరారు. వీరి పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టాలని వీరి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌ను కోరారు. -
మగవారిలా వేషం మార్చి..
తిరువనంతపురం : శబరిమల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికి ఆందోళనకారులు మాత్రం దీన్ని ఖాతరు చేయటం లేదు. మహిళలను ఆలయ ప్రాంగణంలోకి కూడా రానివ్వడంలేదు. అయితే ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా కొందరు మహిళలు ఎలాగోలా ఆలయంలోకి ప్రవేశించి ఇప్పటికే అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరు మహిళలు, మగవారిలా వేషం ధరించి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు. తొమ్మిది మంది అయ్యప్ప భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తుండగా అనుమానం వచ్చిన ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు. ఈ అయ్యప్ప భక్తుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని తెలింది. దాంతో ఆందోళనకారులు సదరు మహిళల్ని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో వారు వెనుతిరగాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఈ నెల 2న అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన కనకదుర్గ అనే మహిళపై ఆమె అత్త, బంధువులు మంగళవారం దాడి చేశారు. -
అయ్యప్ప ఆలయంలోకి వెళ్లిన మహిళపై అత్త దాడి
సాక్షి, తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించిన మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయి. బిందుతో కలిసి ఆయలంలోకి ప్రవేశించిన కనకదుర్గ అనే మహిళను సొంతింటి వాళ్లే చిత్రహింసలు పెట్టారు. అయ్యప్ప దర్శనం అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన కనకదుర్గ నేడు సొంతింటి చేరుకున్నారు.మొదటిసారిగి ఇంటికి వచ్చిన కనకదుర్గపై అత్తింటివారు దాడికి దిగారు.(శబరిమలలో కొత్త చరిత్ర) ఆలయంలోకి ఎందుకు వెళ్లావంటూ కనకదుర్గ అత్త కర్రతో ఆమెను చితకబాదారు. సంస్కృతి, సంప్రదాయాలను మరచి ఎంత చెప్తున్నా వినకుండా అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లి ఆచారాలను మంటగలిపిందంటూ ఆమెపై చేయిచేసుకున్నారు. దీంతో కనకదుర్గ తలకు బలంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కనకదుర్గ ఇంటికి చేరుకున్నారు. తీవ్రగాయాలపాలైన కనకదుర్గను ఆస్పత్రికి తరలించారు. దాడికి దిగిన కనకదుర్గ అత్తపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇది చదవండి : ఆ ఇద్దరూ శబరిమలకు ఎలా వెళ్లారు? -
‘తలకు రంగేసుకుని ఆలయంలోకి వెళ్లాను’
తిరువనంతపురం : అన్ని వయసుల మహిళల్ని అయ్యప్ప ఆలయంలోనికి అనుమతించాలంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు నేలకొన్న సంగతి తెలిసిందే. అనేక ఆందోళనల నడుమ ఇప్పటికే ఎనిమిది మంది మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. వీరేకాక కేరళకు చెందిన మంజు అనే 36 ఏళ్ల మహిళ కూడా ఆలయంలోకి ప్రవేశించానని తెలిపారు. తలకు తెల్లరంగు వేసుకుని అయ్యప్ప దర్శనం చేసుకున్నాని తెలిపారు మంజు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దాంతోపాటు ఎలా తాను అయ్యప్ప సన్నిధిలోకి వెళ్లిందనే వివరాలను కూడా షేర్ చేశారు మంజు. మంజు చెప్పిన వివరాలు.. ‘త్రిస్సూర్ నుంచి జనవరి 8న నా శబరిమల యాత్ర ప్రారంభించాను. అయితే ఆందోళనకారుల నుంచి వ్యతిరేకత ఎదురవకుండా ఉండాలనే ఉద్దేశంతో తలకు తెల్లరంగు వేసుకున్నాను. దాంతో నేను పెద్దవయసు స్త్రీలా కనిపించాను. ఈ ప్రయత్నం నాకు మంచే చేసింది. నన్ను చూసిన ఆందోళనకారులు పెద్దవయసు స్త్రీగా భావించి.. ఆలయంలోకి వెళ్లేందుకు అడ్డు చెప్పలేదు. దాంతో పోలీసుల సాయం లేకుండానే నేను అయ్యప్పను దర్శించుకున్నాను. ఆలయంలోకి ప్రవేశించిన నేను దాదాపు 2 గంటలపాటు సన్నిధానంలో గడిపానం’టూ చెప్పుకొచ్చారు మంజు. ఈ సమయంలో అఖిల భారత అయ్యప్ప సంఘం సభ్యులు తనకు చాలా సాయం చేశారన్నారు మంజు. అయితే గత ఏడాది అక్టోబరులోనే తాను అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి.. విఫలమయ్యానని చెప్పారు మంజు. కానీ ఈ సారి మాత్రం దర్శనం చేసుకోగలిగానని సంతోషం వ్యక్తం చేశారు. -
అట్టుడుకుతున్న కన్నూర్
కన్నూర్/తిరువనంతపురం/న్యూఢిల్లీ: కేరళలో రాజకీయంగా అత్యంత సున్నితమైన కన్నూర్‌తోపాటు పతనంథిట్ట, కోజికోడ్ జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ, సీపీఎం నేతల ఇళ్లు, ఆస్తులపై బాంబు దాడులు జరిగాయి. శబరిమల ఆలయంలోకి 2వ తేదీన 50 ఏళ్లలోపు ఇద్దరు మహిళల ప్రవేశం అనంతరం రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగించడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని సీఎం విజయన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. పలుచోట్ల బాంబు దాడులు సీపీఎం ఎమ్మెల్యే ఏఎన్ షంషీర్‌కు చెందిన మడపీడికయిల్‌లోని ఇంటిపై, వడియిల్ పీడికియలోని బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు వి. మురళీధరన్ పూర్వీకుల నివాసం, తలస్సేరిలోని సీపీఎం నేత పి.శశి ఇంటిపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పొరుగునే ఉన్న కోజికోడ్ జిల్లా పెరంబ్రాతోపాటు శబరిమల ఆలయం ఉన్న పతనంథిట్ట జిల్లా మలప్పురం, ఆదూర్‌లలో శుక్రవారం అర్థరాత్రి, శనివారం వేకువజామున బీజేపీ, సీపీఎం కార్యకర్తలు పరస్పరం దాడులు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అల్లర్లకు సంబంధించి 1,700 మందిని, కన్నూర్ జిల్లాలో హింసాత్మక ఘటనలకు సంబంధించి 260 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శబరిమల అంశాన్ని సున్నితంగా పరిష్కరించడానికి బదులు సీపీఎం ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అన్ని వర్గాల వారు చట్టాన్ని గౌరవించాలన్నదే తమ అభిమతమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ప్రతినిధి ఫర్హాన్ హక్ అన్నారు. శబరిమల వివాదం కారణంగా కేరళలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుం టున్నందున అప్రమత్తంగా ఉండాలని బ్రిటన్ ప్రభుత్వం తమ పౌరులను హెచ్చరించింది. -
‘అతడు బ్రాహ్మణుడు కాదు.. రాక్షసుడు’
శబరిమల : అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రం రణరంగంగా మారింది. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కనక దుర్గ, బిందు అనే ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించి.. అయ్యప్ప దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. మహిళలు ఆలయంలో ప్రవేశించడంతో.. పూజారి కందరు రాజీవేరు ఆలాయాన్ని మూసి వేసి శుద్ధి కార్యక్రమాలు జరిపారు. ఇవి కాస్తా వివాదాస్పందగా మారాయి. దీని గురించి కేరళ మంత్రి జీ సుధాకరన్ మాట్లాడుతూ.. ‘ఎవరైనా తమ సోదరిని అపవిత్రురాలిగా భావిస్తారా’ అంటూ ప్రశ్నించారు. శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన బ్రాహ్మణున్ని రాక్షసుడంటూ విమర్శించారు. ఈ పూజలు నిర్వహించిన వ్యక్తి అసలైన బ్రాహ్మణుడు కాదు. అతనికి అయ్యప్ప పట్ల ఎటువంటి భక్తి, మర్యాద లేవు. ఇతను బ్రాహ్మణుడు కాదు.. బ్రాహ్మణ రాక్షసుడు. ఇలాంటి వాడు తీవ్రవాదిగా కూడా మారతాడన్నారు. -
‘శబరిమల ఆలయంలోకి 8 మంది మహిళలు’
తిరువనంతపురం: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పటివరకు 8 మంది మహిళలు (రుతుక్రమ వయసులో ఉన్నవారు) శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని కేరళ పోలీసులు వెల్లడించారు. అయితే ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన విషయం మాత్రమే అందరికి తెలిసింది. 42 ఏళ్ల బిందు అమ్మిని, 41 ఏళ్ల కనకదుర్గ.. బుధవారం (రెండో తారీఖు) తెల్లవారుజామున అయ్యప్పను దర్శించుకోవడం పెను వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై కేరళలో ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు ప్రవేశించరాదని ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు 2018, సెప్టెంబర్‌లో కొట్టివేసిన సంగతి తెలిసిందే. (ఎమ్మెల్యే, ఎంపీ ఇళ్లపై బాంబు దాడులు) సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎనిమిది మంది మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారన్న పోలీసుల వాదనను శబరిమల కర్మ సమితి తోసిపుచ్చింది. ఎక్కువ మంది మహిళలు శబరిమలకు తరలిరావాలన్న కుట్రలో భాగంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది. అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు శ్రీలంక మహిళ శశికళ చేసిన ప్రయత్నాన్ని ప్రహసనంగా వర్ణించింది. ఎందుకు శుద్ధి చేశారు? ఆలయాన్ని సంప్రోక్షణ చేసిన ప్రధాన పూజారి రాజీవరు కందరావ్ను ట్రావెన్కోర్ దేవస్థానం పాలకమండలి వివరణ కోరింది. బిందు, కనకదుర్గ అనే మహిళలు ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ప్రధాన పూజారి భక్తులందరినీ బయటికి పంపించి, తలుపులు మూసి సుమారు గంట సేపు గర్భగుడిలో సంప్రోక్షణ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆయనను పాలక మండలి వివరణ అడిగింది. (వారు చివరి మెట్టును చేరగలిగారు) -
ఎమ్మెల్యే, ఎంపీ ఇళ్లపై బాంబు దాడులు
కన్నూర్: శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశంతో కేరళలో రాజుకున్న అలజడి ఇంకా చల్లారలేదు. ఆందోళనలు, దాడులతో కేరళ అట్టుడుకుతోంది. కన్నూర్ జిల్లాలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తలాసరీ ప్రాంత ఎమ్మెల్యే, సీపీఎం నాయకుడు ఏఎన్ షమీర్, బీజేపీ ఎంపీ వి మురళీధరన్ నివాసాలతో పాటు పలుచోట్ల శుక్రవారం రాత్రి బాంబు దాడులు జరిగాయి. షమీర్ ఇంటిపైకి దుండగులు నాటు బాంబులు విసిరారు. ఇరిట్టి ప్రాంతంలో సీపీఎం కార్యకర్త కత్తిపోట్లకు గురయ్యాడు. రాష్ట్రంలో దాడులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కుట్రలు చేస్తోందని షమీర్ ఆరోపించారు. కల్లోల పరిస్ధితులను సృష్టించి హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తన ఇంటిపై దాడి వెనుక సీపీఎం హస్తం ఉందని మురళీధరన్ ఆరోపించారు. ఆందోళనకారుల దాడుల్లో 99 ఆర్టీసీ బస్సులకు నష్టం వాటిల్లింది. ధ్వంసమైన బస్సులతో ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కన్నూరు జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని భద్రతా బలగాలను తరలించారు. హింసాత్మక ఘటనలు కొనసాగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధాని మోదీ ర్యాలీ వాయిదా కేరళలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ‘జనవరి 6న పతాన్‌మత్తిట్టాలో జరగాల్సిన ప్రధాని మోదీ పర్యటన ఇతర కార్యక్రమాల కారణంగా వాయిదా పడింది. కేరళలో ప్రస్తుత పరిస్థితులకు, ప్రధాని పర్యటన వాయిదా పడటానికి సంబంధం లేద’ని బీజేపీ ప్రకటించింది. ఈ ఏడాది దక్షిణాదిలో ప్రధాని మోదీ పాల్గొనబోయే మొదటి రాజకీయ ర్యాలీ ఇదే. -
సన్నిధానంలో శ్రీలంక మహిళ
శబరిమల: శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశంతో కేరళలో రాజుకున్న ఉద్రిక్తత శుక్రవారం కూడా కొనసాగింది. దేవస్థానం బోర్డు సభ్యుడి ఇంటితో పాటు మరికొన్నిచోట్ల ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరి అలజడి సృష్టించారు. ఈ సందర్భంగా శబరిమల అయ్యప్పస్వామిని శ్రీలంకకు చెందిన శశికళ(47) అనే మహిళ దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా విడుదల చేశారు. గురువారం అర్ధరాత్రి శశికళ గుడిలోకి చేరుకుని పూజలు నిర్వహించినట్లు కేరళ సీఎం కార్యాలయం తెలిపింది. భర్త శరవణ్, కుమారుడు దర్శన్‌తో కలిసి ఆమె ఆలయానికి వచ్చారని వెల్లడించింది. మరోవైపు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారన్న వాదనల్ని శశికళ ఖండించారు. తాను స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు యత్నించినప్పటికీ పోలీసులు అనుమతించలేదని అన్నారు. ఆలయానికి రాకముందు తాను 41 రోజుల వ్రతం పాటించానని వెల్లడించారు. స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు భక్తుల నుంచి ఎలాంటి నిరసనలు ఎదురుకాలేదని పేర్కొన్నారు. ‘పోలీస్ అధికారులు నన్ను ఎందుకు అనుమతించలేదు? మీరంతా(మీడియా) నా చుట్టూ ఎందుకు నిలబడ్డారు? నేను ఎవరికీ భయపడను’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కుమారుడితో కలిసి తాను మాత్రమే అయ్యప్పస్వామిని దర్శించుకున్నానని శశికళ భర్త శరవణ్ స్పష్టం చేశారు. మరోవైపు భద్రతా కారణాలతోనే శశికళ అలా చెప్పి ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. అయ్యప్పస్వామి దర్శనానికి శుక్రవారం శబరిమల వచ్చిన కయాల్ అనే ట్రాన్స్‌జెండర్‌ను భక్తుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు వెనక్కి పంపారు. బిందు, కనకదుర్గ అనే మహిళలు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి నిరసనగా కొందరు దుండగులు శుక్రవారం తెల్లవారుజామున మలబార్ దేవస్థానం బోర్డు సభ్యులు కె.శశికుమార్ ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరి పరారయ్యారు. అలాగే పతనంతిట్ట ప్రాంతంలోని ఓ మొబైల్ షాపుపై పెట్రోల్‌బాంబు దాడి జరిగింది. 200 మంది అరెస్ట్! సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య హింస తీవ్రంగా చెలరేగుతున్న కన్నూర్‌లో 200 మంది ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అల్లర్లు, గొడవల నేపథ్యంలో 801 కేసులు నమోదుచేసిన పోలీసులు.. 1,369 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. పాలక్కడ్‌తో పాటు కసర్గోడ్ జిల్లా మంజేశ్వరమ్‌లో నిషేధాజ్ఞలు విధించారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు ప్రవేశించరాదని ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు 2018, సెప్టెంబర్‌లో కొట్టివేసిన సంగతి తెలిసిందే. -
శబరిమలలో శ్రీలంక మహిళకు నో ఎంట్రీ
శబరిమల/తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం విషయంలో మరో వివాదం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు శబరిమల చేరుకున్న శ్రీలంకకు చెందిన శశికళ అనే మహిళను ఆలయ అధికారులు అడ్డుకున్నారు. ఆమెకు ఆలయంలోకి ప్రవేశం నిరాకరించారు. బిందు, కనకదుర్గ అనే మహిళలు బుధవారం అయ్యప్ప సన్నిధికి చేరుకున్న సంగతి తెలిసిందే. నిబంధలనకు విరుద్దంగా స్వామి దీక్ష ముసుగులో నల్లని దుస్తులు ధరించి వారు దర్శనం చేసుకున్నారని అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంతో కేరళ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాగా, మండలదీక్ష ఆచరిస్తున్న శశికళను లోనికి వెళ్లకుండా అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. మెడికల్ సర్టిఫికెట్తో పాటు దర్శనానికి వచ్చినా అనుమతి నిరాకరించటంపై శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. శశికళను అడ్డుకోవడం పట్ల రాష్ట ప్రభుత్వంపై మహిళా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. శబరిమలలో కొత్త చరిత్ర వారు చివరి మెట్టును చేరగలిగారు -
రణరంగంగా కేరళ
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశం కేరళను రణరంగంగా మార్చింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగిన హిందూ సంస్థల కార్యకర్తలు రోడ్లకు అడ్డంగా కాలిపోతున్న టైర్లు, గ్రానైట్ పలకలు ఉంచి నిరసనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శబరిమల కర్మ సమితి ఇచ్చిన 12 గంటల హర్తాళ్ పిలుపు మేరకు వందలాది మంది హిందూ అనుకూల సంస్థల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టించారు. అధికార సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులకు కూడా నిరసనల సెగ తాకింది. ఆందోళనకారుల దాడిలో పలువురు పాత్రికేయులు గాయాలపాలయ్యారు. పోలీసులు, సీపీఎం కార్యకర్తలతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగడంతో చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల వ్యవధిలో 266 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 334 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించాలని గవర్నర్ పి. సదాశివం ముఖ్యమంత్రి విజయన్ను ఆదేశించారు. తాజా హింసకు బీజేపీ, ఆరెస్సెస్‌లే కారణమని విజయన్ ఆరోపించారు. మరోవైపు, శబరిమల ఆలయాన్ని ఇద్దరు మహిళలు దర్శించుకున్న తరువాత గర్భగుడిని శుద్ధిచేయడంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బీజేపీ కార్యకర్తలకు కత్తిపోట్లు.. త్రిసూర్‌లో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) కార్యకర్తలతో జరిగిన ఘర్షణలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కత్తిపోట్లకు గురయ్యారు. కోజికోడ్, కన్నూర్, మలప్పురం, పాలక్కడ్, తిరువనంతపురం తదితర పట్టణాల్లోనూ బీజేపీ, శబరిమల కర్మ సమితి కార్యకర్తల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్స్ ప్రయోగించి, లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. పాలక్కడ్‌లో సీపీఎం కార్యాలయంపై దాడికి పాల్పడిన నిరసనకారులు, దాని ముందు నిలిపిన వాహనాల్ని ధ్వంసం చేశారు. కన్నూర్ జిల్లాలోని తాలసెరిలో సీపీఎం నిర్వహణలో ఉన్న బీడీ తయారీ కేంద్రంపై నాటుబాంబు విసిరారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న 10 మందిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. మీడియాపై దాడికి నిరసనగా తిరువనంతపురంలో పాత్రికేయులు ఆందోళనకు దిగారు. బీజేపీ, శబరిమల కర్మ సమితి కార్యక్రమాలను బహిష్కరించాలని కేరళ మీడియా వర్కింగ్ యూనియన్ నిర్ణయించింది. హర్తాళ్ వల్ల దుకాణాలు, ఇతర వాణిజ్య సముదాయాలు మూతపడటంతో జనజీవనం స్తంభించింది. గురువారం కాంగ్రెస్ ‘బ్లాక్ డే’గా పాటించింది. పాతనంతిట్టా జిల్లాలోని పాండలమ్లో సీపీఎం కార్యకర్తలు తమ కార్యాలయ భవనం పైనుంచి రాళ్లు రువ్వడంతో తీవ్రంగా గాయపడిన 55 ఏళ్ల ఉన్నితాన్ చనిపోయారు. బుధవారం సాయంత్రం శబరిమల కర్మ సమితి చేపట్టిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ దాడిలో పాల్గొన్న 9 మందిని గుర్తించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఉన్నితాన్ గుండెపోటుతో మరణించాడని ముఖ్యమంత్రి విజయన్ వెల్లడించారు. చెన్నైలో కేరళ సీఎం దిష్టిబొమ్మ దహనం సాక్షి, చెన్నై: శబరిమల ఆందోళనలు చెన్నైకీ విస్తరించాయి. పల్లవరంలో బీజేపీ కార్యకర్తలు కేరళ సీఎం విజయన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్‌ని అయ్యప్ప ఆలయంలోకి అనుమతించని కేరళ ప్రభుత్వం ఇద్దరు మహిళల్ని మాత్రం బందోబస్తుతో పంపిందని తమిళనాడు బీజేపీ చీఫ్ సౌందరరాజన్ విమర్శించారు. హింస వెనక బీజేపీ, ఆరెస్సెస్: విజయన్ హర్తాళ్ మద్దతుదారులు హింసకు పాల్పడటం వెనక పక్కా ప్రణాళిక ఉందని సీఎం విజయన్ పేర్కొన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ హింసను ప్రేరేపించాయని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. శబరిమలకు వెళ్లిన ఇద్దరిని ప్రభుత్వం తీసుకెళ్లలేదని, వారు సాధారణ భక్తులలాగే ఆలయ సందర్శనకు వెళ్లారని చెప్పారు. వారిని హెలికాప్టర్లో తరలించారన్న వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ హర్తాళ్ చేయడమంటే సుప్రీంకోర్టు తీర్పును శంకించడమేనని పేర్కొన్నారు. మహిళల దర్శనం తరువాత ఆలయాన్ని శుద్ధిచేసిన పూజారుల తీరును కూడా విజయన్ తప్పుబట్టారు. ఢిల్లీలో కేరళ సీఎం విజయన్ దిష్టిబొమ్మను దగ్ధంచేస్తున్న అయ్యప్ప ధర్మ సంరక్షక సమితి సభ్యులు -
ఆ ఇద్దరూ శబరిమలకు ఎలా వెళ్లారు?
దేవుడి సన్నిధే ఒక అలౌకిక అనుభూతి. దాన్ని ఆస్వాదించడానికే ఆలయానికి వెళ్తాం! రుతుచక్ర వయసులో ఉన్న మహిళల శారీరక శుభ్రత ఆధారంగానే అయ్యప్ప దర్శనం ఆడవాళ్లకు ఇవ్వలేదు. రుతుస్రావం ప్రకృతి ఇచ్చిన ప్రత్యుత్పత్తి ప్రక్రియ. అదే లేకపోతే సృష్టే లేదు అనే తర్కంతో దేవుడి దర్శనం కోసం స్త్రీలు ఉద్యమించారు. సాధించారు. నలభై రెండేళ్ల బిందు అమ్మిని, నలభై ఒక్క ఏళ్ల కనకదుర్గ... చట్టం కల్పించిన హక్కును వినియోగించుకున్నారు. ప్యూబర్టీ రాని, మెనోపాజ్ వచ్చిన ఆడవాళ్లే శబరిమల అయ్యప్పను దర్శించుకోవాలనే నియమాన్ని సవరించారు. శబరిమల అయ్యప్పను దర్శించుకున్న మొదటి మహిళలు (రుతుక్రమ వయసులో ఉన్న)గా చరిత్ర సృష్టించారు. మొన్న మంగళవారం రాత్రి (ఒకటవ తారీఖు) ఎర్నాకులం నుంచి బయలుదేరి బుధవారం తెల్లవారు జామున శబరిమల ప్రారంభ ప్రాంతమైన పంపానది దగ్గరకు చేరుకున్నారు. అక్కడ పోలీసుల రక్షణతో శబరిమలకు వెళ్లారు. బుధవారం (రెండో తారీఖు) ఉదయం 3 గంటల 45 నిమిషాలకల్లా ఆలయంలోకి అడుగుపెట్టారు. ఆ ఇద్దరి నేపథ్యం బిందు... ఒక యాక్టివిస్ట్. దళిత్ యాక్టివిస్ట్. కన్నూర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్‌లో ప్రొఫెసర్. చిన్నప్పటి నుంచీ బిందు రెబల్. కాలేజీరోజుల్లో కేరళ విద్యార్థి సంఘటన (వామపక్ష విద్యార్థి సంఘం)నాయకురాలిగా పనిచేశారు. కేరళ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. కమిట్మెంట్కు మరోపేరు ఆమె. జెండర్ ఈక్వాలిటీ, సాంఘిక న్యాయ పోరాటాల్లో ముందున్నారు. ఆ విషయాల మీద ఆమె ఇచ్చే ఉపన్యాసాలు వినడం కోసం కేరళలో స్టూడెంట్స్ చెవి కోసుకుంటారు. బిందు వ్యక్తిగత విషయానికి వస్తే ప్రముఖ పొలిటికల్ యాక్టివిస్ట్ హరిరన్ ఆమె భర్త. వాళ్లకు పదకొండేళ్ల కూతురు ఓల్గా. కోజీకోడ్ జిల్లాలోని పోక్కాడ్ ఆమె నివాసం. కనకదుర్గ.. ఓ భక్తురాలు ... కనకదుర్గ నాయర్ కేరళ రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఉద్యోగి. భర్త ఉన్ని కృష్ణన్. ఇంజనీర్. వాళ్లకు ఇద్దరు పిల్లలు. మలప్పరంలో ఉంటారు. ఓ భక్తురాలిగా శబరిమల దర్శనానికి వెళ్లాలనుకున్నారు. బిందు, కనకదుర్గ ఎలా కలిశారు? సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ స్త్రీల ఆలయ ప్రవేశానికి ఇతరత్రా తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే సరికి రహస్యంగా ప్రణాళికలు వేసుకోవాల్సి వచ్చింది. ఆసక్తి ఉన్న మహిళలు కొంత మంది ‘నవోథన కేరళం శబరిమలయిలెక్కు’ అనే ఒక ఫేస్బుక్ పేజ్ స్టార్ట్ చేశారు. అలా బిందు, కనకదుర్గ ఒకరికొకరు పరిచయం అయ్యారు. డిసెంబర్ 24న మొదటి ప్రయత్నం చేశారు. ఆలయంలో ఆడవాళ్లకు ప్రవేశం లేదు అని గట్టిగా నమ్మే వారి నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఆ దాడి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులు సహా పోలీసులు, మీడియా కంట కూడా పడకుండా ఓ వారం రోజుల పాటు రహస్యంగా ఉండి ఈ నెల ఒకటవ తారీఖున మళ్లీ ప్రయత్నించారు. అలా దైవ దర్శనం సాధించారు. ‘‘దర్శనం అయ్యేదాకా కదిలేది లేదని చాలా మొండిగా ఉన్నాం. దాంతో పోలీసులకు సెక్యూరిటీ కల్పించక తప్పలేదు’’ అని చెప్పారు బిందు. ప్రవేశం కోసం ఇప్పటివరకు ప్రయత్నించిన మహిళలు గుడి తలుపులు తెరిచినప్పటి నుంచి కనీసం పదమూడు మంది మహిళలు దర్శనం కోసం శబరిమల బాట పట్టారు. నీలక్కల్ బేస్‌క్యాంప్ దాకా రాగలిగారు. తర్వాత హేళనకు, హెచ్చరికలకు, దాడులకు గురయ్యి బలవంతంగా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అలా విఫలయత్నం చేసిన మహిళల్లో మొదటి వ్యక్తి సీఎస్ లిబి. అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నాను అని ఫేస్బుక్లో పోస్ట్‌చేసి మరీ బయలుదేరిన లిబిని గుడికి 65 కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకున్నారు వ్యతిరేకులు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలభై ఏళ్ల మాధవిని పంబ నుంచి వెనక్కి పంపించేశారు భక్తులు. ఢిల్లీకి చెందిన సుహాసినీ రాజ్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. హైదరాబాద్ రిపోర్టర్ కవితా జక్కల్ ‘వాలియ నడప్పాంధాల్’ క్యూకాంప్లెక్స్ వరకూ వెళ్లగలిగింది. కవితాతో కలిసి వెళ్లిన మరో యాక్టివిస్ట్ రెహానా ఫాతిమా. ఇతర భక్తులు, ఆడవాళ్ల ఎంట్రీని వ్యతిరేకిస్తున్న వాళ్లు గనుక అడ్డుకోకపోయి ఉంటే రెహాన ఫాతిమా చరిత్ర సృష్టించి ఉండేది. రెహానా మీద ఆగ్రహం ఆమెను వెనక్కి పంపించేంత వరకే ఆగలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిని ధ్వంసం చేసేదాకా సాగింది. అంతేకాదు మతసంబంధమైన నమ్మకాలను కించపరిచిందని రెహానా మీద కేసూ నమోదు చేశారు. ఆ తర్వాత మేరీ స్వీటీ అనే తిరువనంతపురం వాసి యత్నమూ ఫలించలేదు. అనంతరం వచ్చిన ఆరుగురు మహిళలనూ అడ్డగించారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన 47 ఏళ్ల బాలమ్మ అనే మహిళ వెళ్లింది. నడప్పాంధాల్లో ఆమెనూ అడ్డుకున్నారు భక్తులు. -
మహిళల ఆలయ ప్రవేశంపై భగ్గుమన్న కేరళ
-
మహిళల ఆలయ ప్రవేశం.. కేరళలో తీవ్ర ఉద్రిక్తత
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేరళలో ఉద్రిక్తత రాజేసింది. ఆలయ నిబంధనలు, ఆచారాలు మంటకలిశాయని, కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వమే దీనికి కారణమంటూ ఆందోళనలు పెల్లుబిగిస్తున్నాయి. కేరళ బంద్‌కు పిలుపునిచ్చిన యూడిఎఫ్ పక్షాలకు బీజేపీ, అన్ని వర్గాల అయ్యప్ప సంఘాలు మద్దతు పలికాయి. బంద్ ప్రభావంతో కేరళ స్తంభించింది. (శబరిమలలో కొత్త చరిత్ర) ఆందోళన బాట పట్టిన బీజేపీ, హిందూ సంస్థల కార్యకర్తలు వీరంగం సృష్టిస్తున్నారు. కోయంబత్తూరు- పాలక్కాడు, నాగర్ కోయిల్- ట్రివేండ్రం సరిహద్దులు మూసివేయటంతో ఇరువైపుల రవాణా బంద్ స్తంభించింది. ఇరువైపుల బారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. కేరళ వైపు వెళ్లే బస్సులను కోయంబత్తూరు, నాగర్ కోయిల్ లొనే నిలిపివేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేరళలో బంద్ ప్రబావం తీవ్రంగా ఉండటంతో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనన్న ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. -
శబరిమలలో కొత్త చరిత్ర
శబరిమల/తిరువనంతపురం: కొత్త ఏడాది వేళ.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ప్రస్థానంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. శతాబ్దాల సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ రుతుస్రావ వయసులో ఉన్న ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. కేరళకు చెందిన కనకదుర్గ(44), బిందు(42) బుధవారం వేకువ జామున పోలీసు రక్షణతో అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. అన్ని వయసుల మహిళల్ని శబరిమల ఆలయంలోకి అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత రుతుస్రావ దశ (10–50 ఏళ్ల మధ్య)లో ఉన్న మహిళలు అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. దీంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పు మూడు నెలల తరువాత అమలుకు నోచుకున్నట్లయింది. లింగ సమానత్వం కోరుతూ కేరళ వ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు రాష్ట్రం ఒక చివర నుంచి మరో చివర వరకు మానవహారం ఏర్పాటుచేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. మహిళల ప్రవేశం తరువాత ఆలయ ప్రధాన పూజారి భక్తులందరినీ బయటికి పంపించి, తలుపులు మూసి సుమారు గంట సేపు గర్భగుడిలో సంప్రోక్షణ నిర్వహించారు. ఆ తరువాతే ఆలయ తలుపులు తిరిగి తెరుచుకున్నాయి. ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారన్న వార్త తెలియగానే కేరళలోని పలు ప్రాం తాల్లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ పాటించాలని హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. అడ్డంకులు లేవు.. నిరసనలు లేవు పటిష్ట పోలీసు భద్రత నడుమ నల్లటి దుస్తులు, ముఖాలకు ముసుగులు ధరించి కనకదుర్గ, బిందు బుధవారం వేకువజామున 3.38 నిమిషాలకు అయ్యప్ప ఆలయంలో అడుగుపెట్టారు. పంబా నుంచి ఆలయం వైపు మెట్లు ఎక్కుతుండగా, లోపల పూజలు చేస్తున్న సమయంలో తమకు ఎలాంటి నిరసనలు కాలేదని, అంతా సవ్యంగానే సాగిందని వారు తెలిపారు. అక్కడ భక్తులు మాత్రమే ఉన్నారని, వారు తమని అడ్డుకోలేదని వెల్లడించారు. దర్శనం ముగిసిన తరువాత పోలీసులు ఆ ఇద్దరిని గుర్తు తెలియని చోటుకు తరలించారు. కేరళలోని మలప్పురంకు చెందిన కనకదుర్గ పౌర సరఫరా శాఖలో ఉద్యోగి కాగా, కోజికోడ్‌కు చెందిన బిందు కళాశాల లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. తాజా ఘటన నేపథ్యంలో వారిద్దరి ఇళ్ల వద్ద పోలీసు బలగాల్ని మోహరించారు. ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయ మెట్లు ఎక్కుతున్న దృశ్యాల్ని స్థానిక టీవీ చానళ్లు ప్రసారం చేయడంతో ఈ సంగతి రాష్ట్రమంతా తెలిసిపోయింది. ముఖ్యమంత్రి పి. విజయన్ స్పందిస్తూ ‘కొన్ని అడ్డంకుల వల్ల ఇంతకుముందు మహిళలు ఆలయంలోకి ప్రవేశించలేకపోయారు. కానీ ఈ రోజు అలాంటి సమస్యలు లేకపోవడం వల్లే వారు గుడిలోకి వెళ్లగలిగారు. మహిళలు శబరిమల ఆలయంలో అడుగుపెట్టారన్నది నిజం’ అని వ్యాఖ్యానించారు. విజయన్ మొండివైఖరి వల్లే: కాంగ్రెస్ అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ సీఎం విజయన్‌పై మండిపడ్డాయి. ఆలయంలోకి మహిళలు అడుగుపెట్టడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇది సీఎం విజయన్ మొండివైఖరిని సూచిస్తోందని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితాల అన్నారు. విజయన్ ఆదేశాల మేరకు నడుచుకున్న పోలీసులు ఆ ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించారన్నారు. సంప్రోక్షణ కోసం ఆలయాన్ని మూసివేయడం వందశాతం సరైనదేనన్నారు. ప్రతిపక్ష కూటమి యూడీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతుందని తెలిపారు. కేరళ ప్రభుత్వం భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిందని, సీఎం, కమ్యూనిస్టు నాయకులు, వారి భావి తరాలకు అయ్యప్ప ఆగ్రహం తప్పదని రాష్ట్ర బీజేపీ చీఫ్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై హెచ్చరించారు. విజయన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ‘నామజపం’ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న శబరిమల కర్మ సమితి డిమాండ్ చేసింది. కొత్త ఏడాదిలో మహిళలకు ఇది గొప్ప ప్రారంభమని సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ అన్నారు. అట్టుడుకుతున్న కేరళ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేరళలో ఉద్రిక్తత రాజేసింది. ఆందోళన బాట పట్టిన బీజేపీ, హిందూ సంస్థల కార్యకర్తలు వీరంగం సృష్టించారు. తిరువనంతపురంలో సచివాలయం బయట బీజేపీ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. అధికార సీపీఎం, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగి పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో అక్కడి వాతావరణం రణరంగాన్ని తలపించింది. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువు గోళాల్ని ప్రయోగించారు. అతి కష్టం మీద ఆందోళనలను అణచివేసిన పోలీసులు ఇద్దరు మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీపీఎం కార్యాలయాలపై దాడులు జరిగాయి. మలప్పురంలో బీజేపీ కార్యకర్తలు సీఎం విజయన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కొచ్చి, పాతనంతిట్టా, తిరువనంతపురం, కొల్లాంలలో భక్తులు అయ్యప్ప చిత్రపటాలు చేతబూని వీధుల వెంట ర్యాలీలు నిర్వహించారు. కొచ్చిలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పక్కకు లాగేస్తున్న పోలీసులు -
శబరిమల పూజారులపై చర్యలుంటాయా!
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి 50 ఏళ్ల లోపు వయస్సున్న ఇద్దరు మహిళలు ప్రవేశించడం వల్ల అపచారం జరిగిందంటూ బుధవారం కొన్ని గంటల పాటు ఆలయం తలుపులు మూసివేసిన పూజారులు శుద్ధి కార్యక్రమం అనంతరం తలుపులు తెరచి భక్తులను అనుమతించారు. అన్ని వయస్కుల మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం అంటరానితనమే కాదు, అపచారం జరిగిందంటూ శుద్ధి పూజలు నిర్వహించడం కూడా ‘అంటరానితనం’ కిందకే వస్తుంది. ఈ కారణంగా ఈ విషయంలో దేశంలో అన్ని రకాల అంటరానితనాలను నిషేధిస్తున్న భారత రాజ్యాంగంలోని 17వ అధికరణను ఉల్లంఘించడమే. ఈ లెక్కన ఆలయ పూజారులు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే. ఈ ఉల్లంఘనకు 1955లో తీసుకొచ్చిన ‘అంటరానితనం నిషేధ చట్టం’ కింద నేరస్థులకు ఆరు నెలల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఓ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరంలోకి అదే మతానికి చెందిన కొంత మందిని అనుమతించడం, మరికొంత మందిని అనుమతించక పోవడం అంటరానితనమే అవుతుందంటున్న రాజ్యాంగంలోని 17వ అధికరణను స్ఫూర్తిగా తీసుకొనే ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన సుప్రీం కోర్టు బెంచీ గత సెప్టెంబర్ 28వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని అన్ని రకాల అంటరానితనాలను నిషేధించినట్లు రాజ్యాంగంలోని 17వ షెడ్యూల్ స్పష్టం చేసింది. ఎలాంటి సామాజిక కారణాల వల్ల కూడా ఎవరి పట్ల వివక్షత చూపినా అది అంటరానితనమే అవుతుందని కూడా చెప్పింది. అందుకనే ఇది స్వచ్ఛం, అది అపవిత్రం అంటూ మహిళల పట్ట వివక్షత చూపడం కూడా అంటరానితనమే అవుతుందని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో స్పష్టం చేశారు. ఇద్దరు మహిళ అయ్యప్పను సందర్శించుకోవడం వాస్తవమేనంటూ ధ్రువీకరించిన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్.. అపచారమంటూ శుద్ధి చర్యలు తీసుకున్న పూజారులపై కేసు పెట్టగలరా? అన్నది చర్చనీయాంశమైంది. మరోవైపు శుద్ధి పూజల పేరిట శబరిమల ఆలయాన్ని మూసివేసిన పూజారులపై చర్యలు తీసుకుంటామని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. -
శబరిమల ఆందోళనల్లో 1,500 మంది అరెస్టు
తిరువనంతపురం: ఇటీవల శబరిమల ఆలయంలో ఇటీవలి పూజల సందర్భంగా హింసాత్మక చర్యలకు పాల్పడిన వారి కోసం కేరళ పోలీసులు జల్లెడపడుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన 10 నుంచి 50 ఏళ్ల మహిళలపై దాడికి యత్నించిన, హింసాత్మక చర్యలకు పాల్పడిన సుమారు 2 వేల మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎర్నాకులం, కోజికోడ్, పలక్కడ్, త్రిసూర్, కొట్టాయం, అలప్పుజ తదితర ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో దాడులు జరిపి 1,500 మందిని అరెస్టు చేశారు. మరో 210 మంది కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే మండల పూజల నేపథ్యంలో 5వేల అదనపు బలగాలను మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
మహిళలను అడ్డుకుంటుంది ఆరెస్సెస్: కేరళ సీఎం
తిరువనంతపురం: శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటుంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) కార్యకర్తలేనని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. అన్ని వయసుల మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలు ఆలయంలోకి ప్రవేశించే విధంగా తాము అన్ని ఏర్పాట్లు చేశామని విజయన్ స్పష్టం చేశారు. కానీ ఆరెస్సెస్ కార్యకర్తలు మహిళలను ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటూ ఆ ప్రాంతాన్ని యుద్ద ప్రాంతంగా మలిచి భయబ్రాంతులకు గురిచేశారన్నారు. మాస పూజల కోసం గత బుధవారం ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే. అనంతరం అక్కడ ఆందోళనలు చెలరేగడంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఆలయాన్ని మూసివేశారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ భక్తులను అడ్డుకోలేదన్నారు. ఆందోళనకారులు మాత్రమే వాహనాలను ఆపారని, మహిళా భక్తులను, మీడియా వ్యక్తులపై దాడులు చేశారన్నారు. శాంతిభద్రతల అంశంలో ఎటువంటి తప్పిదం జరగలేదన్నారు. ఆలయంలోకి ప్రవేశించిన మహిళలను అయ్యప్పను దర్శించుకోకుండా అడ్డుకున్న ఆలయ ప్రధాన పూజారి చర్యను సీఎం తప్పుబట్టారు. శబరిమలలో శాంతి నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇక సుప్రీం తీర్పు నేపథ్యంలో సుమారు 12 మంది మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఇద్దరైతే గర్భగుడికి కేవలం 50 మీటర్ల దూరంలోనే ఆగిపోయారు. -
శబరిమల ప్రవేశానికి మరో మహిళ యత్నం
న్యూఢిల్లీ/పంబా: శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు సోమవారం మరో మహిళ విఫలయత్నం చేసింది. బిందు అనే దళిత మహిళా కార్యకర్త వినతి మేరకు పోలీసులు ఆమెను కేరళ ఆర్టీసీ బస్సులో పంబ వద్దకు తీసుకువచ్చారు. అయితే, అక్కడ పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించిన బీజేపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆమెను జీపులో ఎక్కించుకుని సురక్షిత ప్రాం తానికి తరలించారు. కాగా, సోమవారం రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసి వేయనున్న నేపథ్యంలో మరికొందరు మహిళలు ప్రవేశించేందుకు ప్రయత్నించవచ్చనే సమాచారంతో సుప్రీం తీర్పు మేరకు కేరళ సర్కారు ఆలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. సుప్రీంకోర్టులో 19 రివ్యూ పిటిషన్లు శబరిమల తీర్పుపై దాఖలైన పలు రివ్యూ పిటిషన్ల విచారణ తేదీని నేడు సుప్రీంకోర్టు ఖరారు చేయనుంది. సన్నిధానంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కేరళతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సంఘాలు ఆందోళన లు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రివ్యూ పిటిషన్లను అత్యవసరమైనవిగా పరిగణించి విచారణ చేపట్టాలంటూ పిటిషన్ దాఖలైంది. -
యుద్ధక్షేత్రంగా శబరిమల
నిలక్కళ్/పత్తనంతిట్ట/పంబ: సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో గత కొన్నిరోజులుగా ఉధృతమైన నిరసనలు జరుగుతుండగానే శబరిమల ఆలయం ఐదు రోజుల మాస పూజల కోసం బుధవారం తెరచుకుంది. కొండ దిగువ ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనలు, హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో నిషేధిత వయస్సుల్లోని మహిళలెవ్వరూ పవిత్ర ఆలయ పరిసరాల్లోకి చేరుకోలేకపోయారు. 10 ఏళ్లలోపు, 50 ఏళ్ల పైబడిన వయసున్న బాలికలు, వృద్ధురాళ్లు అతి తక్కువ సంఖ్యలోనే అయ్యప్ప స్వామి గుడికి వెళ్లారు. రుతుస్రావం అయ్యే వయస్సుల్లో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధం ఉండగా, ఆ నిషేధాన్ని గత నెల 28న ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. కాగా, బుధవారం సాయంత్రం ఆలయ ప్రధాన పూజారులు ఉన్నిక్రిష్ణన్ నంబూద్రి, కందారు రాజీవారులు గర్భగుడిని తెరిచి దీపం వెలిగించారు. సంప్రదాయం ప్రకారం తొలిరోజు ఆలయంలో పూజ నిర్వహించకుండా రాత్రి 10.30 గంటలకు తలుపులు మూసేస్తారు. ఉద్రిక్తంగానే కొండ పరిసరాలు శబరిమల కొండ పరిసరాల్లో బుధవారం మహిళలు సహా అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో కొండకు వెళ్లే దారులకు చేరుకుని, నిషేధిత వయస్సు అమ్మాయిలు, స్త్రీలను ఆలయానికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు. వాహనాలు, బస్సులను తనిఖీ చేసి వారిని దించేశారు. విధులపై శబరిమలకు వెళ్తున్న పలు వార్తా చానళ్ల మహిళా పాత్రికేయులనూ నిరసనకారులు బెదిరించి, వారి వాహనాలను ధ్వంసం చేశారు. మరోవైపు స్త్రీలను అడ్డుకునే వారిని నిరోధించేందుకు కేరళ ప్రభుత్వం ఆలయానికి వెళ్లే దారుల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది. నిరసనలకు నేతృత్వం వహిస్తున్న అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిలక్కళ్, పంబల్లో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనల్లో పలువురికి గాయాలయ్యాయి. రిపోర్టర్లు, ఫొటో జర్నలిస్టులు కలిపి 10 మంది మీడియా వ్యక్తులకు గాయాలయ్యాయనీ, వారి పరికరాలు ధ్వంసమయ్యాయని మంత్రి జయరంజన్ చెప్పారు. పంబ, నిలక్కళ్లలో 144 సెక్షన్‌ను విధిస్తున్నట్లు పాతనంతిట్ట జిల్లా యంత్రాంగం ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ మద్దతు.. ఆందోళనకారులకు కేరళలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు బీజేపీ తమ మద్దతు ప్రకటించింది. పోలీసుల లాఠీ చార్జీకి నిరసనగా శబరిమల యాక్షన్ కౌన్సిల్ ఇచ్చిన 12 గంటల బంద్ పిలుపునకు బీజేపీ, ఇతర ఎన్డీయే పార్టీలు మద్దతు తెలిపాయి. బీజేపీ ఎంపీ మురళీధరన్ మాట్లాడుతూ ప్రభుత్వం తన మొండిపట్టును వదిలి ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ ఈ అంశాన్ని హిందూ పునరుజ్జీవనం, హిందూ ఛాందసవాదాలకు మధ్య జరుగుతున్న పోరాటంగా చూడాలన్నారు. ప్రజలు చట్టం పక్షాన నిలిచి, చట్టం ముందు అందరూ సమానులన్న నియమాన్ని పాటించాలని కోరారు. కాగా, ఆలయానికి వస్తున్న మహిళలకు సరైన భద్రత కల్పించాల్సిదిగా జాతీయ మహిళా కమిషన్ కేరళ పోలీసులను కోరింది. పోలీసుల రక్షణలో వెనుదిరిగిన ఏపీ మహిళ శబరిమలకు వెళ్లేందుకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాధవి (45) అనే మహిళ ప్రయత్నించారు. బుధవారం ఉదయం ఆమె తన కుటుంబంతో కలసి స్వామి అయ్యప్ప మార్గం గుండా కొండ ఎక్కేందుకు యత్నించారు. మధ్యలో అయ్యప్ప భక్తులు ఆమెను అడ్డుకుని వెనక్కు వెళ్లిపొమ్మన్నారు. అయినప్పటికీ పోలీసుల రక్షణ మధ్య మరికొంత దూరం కొండ ఎక్కిన అనంతరం ఆమె పంబకు తిరిగొచ్చారు. పంబకు చేరుకునే వరకు పోలీసులు ఆమెకు రక్షణగా ఉన్నారు. మాధవి ఆలయానికి వెళ్లి ఉంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత గుడిలోపలికెళ్లిన తొలి మహిళగా ఆమె నిలిచేవారు. -
తీర్పును ఇలా అడ్డుకుంటారా?
ఈ నెల 18 నుంచి శబరిమల ఆలయాన్ని భక్తుల సందర్శనార్ధం తెరవనున్నారు. అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అమలు నిలిపివేసి, తక్షణమే పునర్విచారణ జరపాలని దాఖలు చేసిన పిటీషన్లను వరుస క్రమంలోనే పరిశీలనకు తీసుకుంటాం తప్ప అత్యవసరమైనవిగా పరిగణించబోమని సుప్రీం కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీర్పును అడ్డుకుంటామని, మహిళలను ససేమిరా ఆలయంలోకి అనుమతించమని మితవాద, మతవాద శక్తులు చేస్తున్న ప్రకటనలు, చర్యలు మన రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేస్తున్నాయి. మహిళలు ఎవరైనా ఆలయంలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిని రెండు ముక్కలుగా నరికి ఒకదానిని ఢిల్లీకి, మరొకదానిని సీఎం విజయన్‌కు పంపుతామని కేరళ బీజేపీ నేత, సినీనటుడు కొల్లం తులసీ బెది రించాడు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను ఇడియట్స్ అని నిందించాడు. ఎవరైనా మహిళలు ఆలయ ప్రవేశం చేస్తే ఏడుగురు సభ్యులున్న తమ బృందం ఆత్మాహుతి చేసుకుం టుందని కేరళ శివసేన ప్రకటించింది. శబరిమల వైపు ప్రయాణించే ప్రతి వాహనాన్ని అడ్డుకుని వయసులో ఉన్న మహిళలను కిందికి దింపేసే చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీనంతటికీ కారణం.. శబరిమల తీర్పు ఆ విధంగా వస్తుందని మతశక్తులు వూహించలేకపోవడమే. అలాగే పునర్విచారణకు తక్షణమే స్వీకరించే అవకాశం లేదని సుప్రీంకోర్టు చెబుతుందని కూడా వూహించకపోవటంతో ఆ శక్తులు హతాశులై మనోభావాల పేరుతో శాంతి భద్రతల సమస్యల సృష్టికి పూనుకున్నాయి, దానిలో భాగంగా మహిళలను ముందుకు తెస్తున్నాయి. ఇటీవల అనేక దేశాలలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు మితవాద శక్తులు మహిళలను రంగంలోకి దించే ధోరణి పెరిగింది. భారతదేశంలోనూ, మేము నమ్మినదాని కోసం ప్రాణాలిస్తాం, మాదారికి అడ్డు వచ్చిన వారిని అంతమొందించటానికి కూడా వెనుకాడబోమని మతఛాందసవాద శక్తులు ప్రకటించడమే కాకుండా ఆచరించడం కూడా తెలిసిందే. శబరిమలలో కూడా ప్రస్తుత వివాదంపై మహిళలనే ముందుపీటిన పెట్టి సుప్రీంకోర్టు తీర్పును అడ్డుకునే వ్రయత్నాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టే దీనిపై తగు చర్యలు తీసుకోవడం అవశ్యం. -ఎం. కోటేశ్వరరావు, హైదరాబాద్ -
శబరిమల వద్ద తీవ్ర ఉద్రిక్తత
నీలక్కల్ : శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు వెళుతున్న వారిని ఆందోళనకారులు మార్గ మధ్యంలో అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబాన్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. సన్నిదానం వరకు వెళ్లేందుకు తెలుగు భక్తురాలు ప్రయత్నించగా.. ఆందోళన కారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో ఆమె మధ్యలోనే వెనుదిరిగారు. అంతటితో ఆగని ఆందోళనకారులు నీలక్క క్యాంప్ వద్ద ఆగిన మీడియా వాహనాలపై దాడి చేశారు. ఈ దాడి వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం (నేటి) సాయంత్రం నుంచి ఐదు రోజులపాటు తెరుచుకోనుంది. అన్ని వయసుల స్త్రీలను ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఆలయాన్ని భక్తుల కోసం తెరవడం ఇదే ప్రథమం. తీర్పుకు వ్యతిరేకంగా కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్వామియే శరణమయ్యప్ప అంటూ భజన చేస్తూ మహిళలు సహా అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లేందుకు ప్రధాన ద్వారమైన నిలక్కళ్ వద్దకు చేరి నిషేధిత వయస్సుల్లోని స్త్రీలను కొండ ఎక్కనివ్వకుండా అడ్డుకుంటున్నారు. పంబా బేస్ క్యాంప్ సమీపం నుంచే నిరసనకారులు 10 నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు శబరిమల ఆలయంలోకి రాకుండా అడ్డగిస్తున్నారు. -
కొనసాగుతున్న శబరిమల నిరసనలు
తిరువనంతపురం/ముంబై: అన్ని వయస్సుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేరళలో వామపక్ష ఎల్డీఎఫ్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అయ్యప్ప భక్తులు కోచిలో భారీ ర్యాలీ తీశారు. మహారాష్ట్రలోనూ నిరసన ర్యాలీలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే.. అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నట్లు మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రకటించారు. మహిళల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమా, కాదా అన్న విషయాన్ని కాంగ్రెస్, బీజేపీలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కోచిలోని శివాలయం నుంచి భారీ సంఖ్యలో ర్యాలీగా బయలుదేరిన భక్తులు..అయ్యప్ప స్వామి ఫొటోల ప్లకార్డులను పట్టుకుని భక్తి గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. వీరిలో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఉన్నారు. ముంబై, థానే, నవీ ముంబైలకు చెందిన అయ్యప్ప భక్తులు ఆజాద్ మైదాన్‌లో నిరసన ర్యాలీ తెలిపారు. శబరిమల ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు కేరళ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతృత్వంలో ప్రారంభమైన ‘లాంగ్‌మార్చ్’ శనివారం కొల్లామ్ జిల్లాలోకి ప్రవేశించింది. ‘తృప్తి సవాల్ విసరడానికే శబరిమల వస్తున్నారు తప్ప భక్తురాలిగా కాదు. ఉద్రిక్తతలను సృష్టించ వద్దని ఆమెను కోరుతున్నా’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై అన్నారు. -
‘శబరిమల’ నిరసన హింసాత్మకం
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. కేరళ దేవాదాయ మంత్రి కదంకపల్లి సురేంద్రన్ అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) గురువారం చేసిన యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. తొలుత ఆందోళనకారులు సురేంద్రన్ ఇంటి వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను బద్ధలుకొట్టడానికి ప్రయత్నించారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు తొలుత జల ఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. బీజేపీ, కాంగ్రెస్‌ల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి జిల్లాల్లో సభలు నిర్వహించి ప్రజలకు తన వైఖరి తెలియజేయాలని సీపీఎంనేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకు పూర్వమే ఆరెస్సెస్ కోరింది.. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని కోరుతూ 12 ఏళ్ల క్రితమే ఆరెస్సెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని మంత్రి సురేంద్రన్ అన్నారు. బీజేపీ తలపెట్టిన 5 రోజుల ‘లాంగ్‌మార్చ్’ను..అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చేపట్టిన రథయాత్రతో పోల్చారు. ‘లాంగ్‌మార్చ్‌ను చూస్తుంటే నాకు రథయాత్ర గుర్తుకొస్తోంది. అన్ని వయసున్న మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పించాలని ఆరెస్సెస్ 12 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారు’ అని అన్నారు. మసీదుల్లోకి అనుమతించాలి.. శబరిమల తీర్పు స్ఫూర్తితో అన్ని మసీదుల్లోకి కూడా మహిళలను అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేరళకు చెందిన ముస్లిం మహిళా హక్కుల సంఘం నిసా యోచిస్తోంది. మహిళలను కేవలం ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలనే కాకుండా వారిని ఇమామ్‌లుగా కూడా నియమించాలని ఉద్యమించనుంది. -
మహిళలే నిరసిస్తే ఎలా అయ్యప్పా!
సాక్షి, న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు సెప్టెంబర్ 28వ తేదీన సంచలన తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా అయ్యప్ప ఆలయంలో మహిళలకు తగిన సౌకర్యాలు కల్పిస్తామంటూ కేరళ ప్రభుత్వం చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ అక్టోబర్ రెండవ తేదీన ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు మంగళవారం నాటికి ఊపందుకున్నాయి. ఈ రోజు నుంచి సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఆందోళనలను తీవ్రతరం చేయాలని కోచిలో సోమవారం నాడు జరిగిన 41 హిందూ సంఘాల నేతలు నిర్ణయించారు. వీరిలో ఆరెస్సెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ. గోపాలన్కుట్టీ కూడా పాల్గొన్నారు. ఆందోళనా కార్యక్రమాల కోసం ఆరెస్సెస్ ఓ కార్యాచరణ సమితి కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్ర బీజేపీ శాఖ కూడా ఆందోళనకు మద్దతు ప్రకటించింది. (శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు) సెప్టెంబర్ 28వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆరెస్సెస్ నాయకుడు పీ. గోపాలన్ కుట్టీ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. ‘సుప్రీం కోర్టు తీర్పును సంఘ్ పరివార్ శిరసావహిస్తోంది. కులం, లింగ వివక్ష లేకుండా ఆలయంలోకి వెళ్లే సమాన హక్కు భక్తులందరికి ఉండాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ కేరళ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై మాట్లాడుతూ ‘ఆలయాల్లోకి మహిళల ప్రవేశంపై వివక్ష చూపడాన్ని బీజేపీ ఎంత మాత్రం అనుమతించదు’ అని వ్యాఖ్యానించారు.‘మహిళల ప్రవేశాన్ని నియంత్రిస్తున్న ఆలయ యజమాన్యాల మనస్తత్వం మారాలి’ అని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషీ గతంలో పలుసార్లు వ్యాఖ్యానించారు. (తీర్పులు కాదు..సంప్రదాయాలే ముఖ్యం!) ఓటు బ్యాంకు రాజకీయాలే సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అక్టోబర్ రెండున ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు మరుసటి రోజుకే ఊపందుకొని వేల సంఖ్యలో ప్రజలు తరలి వస్తుండడంతో ఆరెస్సెస్, బీజేపీ నాయకులు ఒక్కసారిగా మాట మార్చారు. ఆందోళన బాట పట్టారు. ముంబైలోని హాజి అలీ దర్గాలోకి, శని శింగ్నాపూర్ ఆలయాల్లో మహిళలను అనుమతించాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేసినప్పుడు అదే పార్టీ ఇక్కడ అందుకు విరుద్ధంగా వ్యవహరించడమంటే ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ, ఆరెస్సెస్‌లు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఆరోపించారు. ఈ రోజు చర్చలకు రావాల్సిందిగా ఆయన పంపిన ఆహ్వానాన్ని ఆందోళన చేస్తున్న హిందూ సంఘాలన్నీ తిరస్కరించాయి. అయ్యప్ప సేవా సంఘంతో మొదలు సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అక్టోబర్ రెండవ తేదీన ఏ రాజకీయ పార్టీతోని సంబంధంలేని అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం పండలంలో శాంతియుతంగా ప్రదర్శన జరిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నాయర్ సర్వీస్ సొసైటీ ‘నామ జప యాత్ర’ పేరిట నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. శబరిమల పూజారుల కుటుంబానికి చెందిన రాహుల్ ఈశ్వర్ నాయకత్వంలోని అయ్యప్ప ధర్మసేన, విహెచ్పీ నుంచి బహిష్కతుడైన ప్రవీణ్ తొగాడియా స్థాపించిన అంతరాష్ట్రీయ హిందూ పరిషత్ సహా దాదాపు హిందూ సంస్థలు నేడు నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నాయి. (శబరిమల తీర్పును సవాల్ చేయం..) ఈ ప్రదర్శనల్లో మగవారికన్నా మహిళలే ఎక్కువగా పాల్గొనడం మరీ విచిత్రం. రాష్ట్రంలో 28 శాతం జనాభా కలిగిన ఎఝావా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ‘శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం’తోపాటు ఆదివాసీ, దళిత సంఘాలు నిరసన ప్రదర్శనల్లో పాల్గొనక పోవడమూ విÔó షమే. నిరసన ప్రదర్శనలను ఈ సంఘాల వారు అగ్రవర్ణాల ఆదిపత్య రాజకీయాలుగా వర్ణిస్తున్నాయి. చదవండి: శబరిమల: ‘మైలాచారాన్ని’ మరచిన సుప్రీంకోర్టు అయ్యప్పల ‘రివ్యూ’కు మోక్షం లేదా!? -
రివ్యూ పిటిషన్ వెయ్యబోం: కేరళ
తిరువనంతపురం: అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని కేరళ సర్కారు స్పష్టం చేసింది. అక్టోబర్ 16న భక్తులందరికీ దర్శనాలకు అనుమతించనున్న నేపథ్యంలో మహిళా భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు చేయాలని ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు నిర్ణయించింది. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం వందలాది మంది అయ్యప్ప భక్తులు (అందులో మహిళలూ ఉన్నారు) కేరళలోని జాతీయ రహదారులను నిర్భందించారు. -
అందరివాడు అయ్యప్ప
-
శబరిమలలో మహిళల ప్రవేశంపై సంచలన తీర్పు
న్యూఢిల్లీ: శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని పక్కనబెడుతూ అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. రుతుస్రావాన్ని కారణంగా చూపుతూ ప్రస్తుతం 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగానికి విరుద్ధం, అక్రమమని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పులో వెల్లడించింది. ఐదుగురు సభ్యుల బెంచ్ 4:1 మెజారిటీతో ఈ తీర్పు చెప్పింది. జస్టిస్ మిశ్రాతోపాటు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌లు ఆలయంలోకి స్త్రీల ప్రవేశానికి అనుకూలంగా తీర్పునివ్వగా మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం వారితో విభేదించారు. మతపరమైన ఏ విశ్వాసాలను కొనసాగించాలి, ఏ సంప్రదాయాలను రద్దు చేయాలనేది కోర్టులు నిర్ణయించాల్సిన అంశం కాదని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు. రుతుస్రావం అయ్యే వయసులో ఉన్న మహిళలకు ఆలయ ప్రవేశం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించగా.. తాజా తీర్పుపై భిన్న స్పందనలు వెలువడుతున్నాయి. లింగ సమానత్వం కోసం పోరాటంలో ఇదో కీలక విజయమని పలువురు మహిళా సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తుండగా, ఈ తీర్పు దురదృష్టకరమని కొన్ని హిందూ భక్త సంఘాలు, అయ్యప్ప భక్తులు పేర్కొంటున్నారు. తీర్పును అమలు చేస్తామని శబరిమల ఆలయ పరిపాలనను చూసుకునే ట్రావన్‌కోర్ దేవస్థాన మండలి తెలిపింది. భక్తిలో వివక్ష చూపలేం: జస్టిస్ మిశ్రా మహిళలకు ప్రవేశంపై శబరిమల ఆలయం పెట్టిన ఆంక్షలు తప్పనిసరి మత సంప్రదాయాలేమీ కాదనీ, మతం అనేది మనిషిని దైవత్వంతో అనుసంధానించే జీవన విధానమని జస్టిస్ మిశ్రా తన తీర్పులో పేర్కొన్నారు. భక్తిలో వివక్షను చూపలేమనీ, పురుషాధిక్య విధానాలతో ఆధ్యాత్మికతలో లింగ సమానత్వాన్ని పాటించకుండా ఉండలేమన్నారు. ‘ఆయప్ప భక్తులంతా హిందువులే. వారు ప్రత్యేక వర్గమేమీ కాదు. శరీర ధర్మ కారణాల ముసుగులో మహిళలను అణచివేయడం చట్టబద్ధం కాదు. నైతికత, ఆరోగ్యం తదితర కారణాలతో మహిళలను పూజలు చేయకుండా అడ్డుకోలేం. పురుషులు ఆటోగ్రాఫ్‌లు పెట్టేంత ప్రముఖులు అవుతున్నా మహిళలు సంతకం పెట్టే స్థితిలో కూడా లేరు’ అని అన్నారు. అయ్యప్ప భక్తులు ప్రత్యేక వర్గమన్న దేవస్థానం వాదనను జస్టిస్ మిశ్రా తోసిపుచ్చుతూ, ‘అయ్యప్ప భక్తులంటూ ప్రత్యేక వర్గంగా ఎవరూ లేరు. హిందువులెవరైనా శబరిమల ఆలయానికి వెళ్లొచ్చు. ఈ దేశంలోని ఇతర అయ్యప్ప ఆలయాల్లో మహిళలకు ప్రవేశం ఉంది. శబరిమలలో నిషేధమెందుకు? శబరిమల ఆలయం బహిరంగ ప్రార్థన స్థలమే. అయ్యప్పను పూజించేవారు ప్రత్యేక వర్గమేమీ కాదు’ అని స్పష్టం చేశారు. వచ్చే నెల 2న జస్టిస్ మిశ్రా పదవీ విరమణ పొందనుండగా, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన ఇచ్చిన చివరి తీర్పు ఇదే. తనతోపాటు జస్టిస్ ఖన్విల్కర్ తరఫున కూడా జస్టిస్ మిశ్రాయే 95 పేజీల తీర్పును రాశారు. మిగిలిన న్యాయమూర్తులు ఎవరికి వారు తమ తీర్పులు వెలువరించారు. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నారిమన్‌లు కూడా జస్టిస్ మిశ్రా అభిప్రాయాలతో తమ తీర్పుల్లో ఏకీభవించారు. రుతుస్రావం అయ్యే వయసులో ఉన్న మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26లకు విరుద్ధమని ఆయన జస్టిస్ నారిమన్ పేర్కొన్నారు. శబరిమల ఆలయ ప్రవేశం విషయంలో మహిళలపై వివక్ష చూపుతున్న కేరళ హిందూ బహిరంగ ప్రార్థనా స్థలాల నిబంధనలు–1965లోని 3(బి) నిబంధనను కూడా కొట్టేయాలని ఆయన అన్నారు. అది అంటరానితనమే: జస్టిస్ చంద్రచూడ్ వయసు, రుతుస్రావం స్థితి ఆధారంగా మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం అంటరానితనం కిందకే వస్తుందని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు. అది మహిళ గౌరవానికి భంగం కలిగించడంతోపాటు, పురుషుల కన్నా స్త్రీలు తక్కువనేలా ఉంటుందని అన్నారు. ‘రుతుస్రావం కారణంగా మహిళలు శుభ్రంగా లేరనే కారణం చూపుతూ వారిని గుడిలోకి రానివ్వకపోవడం ఓ రకమైన అంటరానితనమే. రాజ్యాంగంలోని 17వ అధికరణం ప్రకారం అది అక్రమం’ అని చంద్రచూడ్ తన 165 పేజీల తీర్పులో పేర్కొన్నారు. పునః సమీక్ష కోరతాం: అయ్యప్ప ధర్మసేన సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమనీ, త్వరలోనే ఈ తీర్పుపై తాము పునఃసమీక్ష కోరతామని అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్ చెప్పారు. శబరిమల ఆలయ మాజీ పూజారి మనవడైన రాహుల్ మాట్లాడుతూ ‘మేం తప్పకుండా సుప్రీంకోర్టులో మా పోరాటం కొనసాగిస్తాం. అక్టోబరు 16 వరకు ఆలయం మూసే ఉంటుంది. కాబట్టి అప్పటివరకు మాకు సమయం ఉంది’ అని వెల్లడించారు. మహిళలు సహా పలువురు భక్తులు కూడా తాము విశ్వాసాలను నమ్ముతామనీ, సుప్రీంకోర్టు తీర్పు విచారకరమన్నారు. శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు తాంత్రి కందరారు రాజీవారు మాట్లాడుతూ తీర్పు తనను నిరాశకు గురిచేసినప్పటికీ, కోర్టు ఆదేశాలను అమలు చేయాలని దేవస్థానం నిర్ణయించిందన్నారు. తీర్పును కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్వాగతించారు. ఇదొక అద్భుత తీర్పు అనీ, హిందూ మతాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని కేరళ మత సంస్థల శాఖ మంత్రి సురేంద్రన్ అన్నారు. మహారాష్ట్రలోని శని శింగ్నాపూర్ ఆలయంలోకి కూడా మహిళల ప్రవేశం కోసం గతంలో ఉద్యమం చేపట్టిన తృప్తీ దేశాయ్ తాజా సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. స్త్రీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు అభించిన విజయంగా ఆమె సుప్రీం తీర్పును అభివర్ణించారు. పురుషాధిక్య, అహంకార ఆలయ పాలక మండలికి ఈ తీర్పు చెంపపెట్టు అన్నారు. త్వరలోనే తాను శబరిమల ఆలయాన్ని సందర్శిస్తానని ఆమె చెప్పారు. అవి రెండు పరస్పర విరుద్ధ హక్కులు జస్టిస్ ఇందు మల్హోత్రా దేశంలో లౌకిక వాతావరణం ఉండేలా చేసేందుకు పురాతన విశ్వాసాలను రద్దు చేయాలనుకోవడం సమంజసం కాదని జస్టిస్ ఇందు మల్హోత్రా తన తీర్పులో పేర్కొన్నారు. సమానత్వ హక్కు, అయ్యప్ప స్వామిని పూజించడానికి మహిళలకు ఉన్న హక్కు.. ఈ రెండు పరస్పర విరుద్ధమైనవని ఆమె అన్నారు. ‘ఈ అంశం శబరిమలకే పరిమితంకాదు. ఇతర ఆలయాలపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శబరిమలలో పూజలు చేయడం ఒక మత సంప్రదాయం. దానిని కాపాడాలి. హేతుబద్ధ భావనలను మతపరమైన విషయాల్లోకి తీసుకురాకూడదు. మత సంప్రదాయాలపై న్యాయసమీక్ష జరగడం సరికాదు. కోర్టులు హేతుబద్ధతను, నైతికతను దేవుణ్ని పూజించే విధానంపై రుద్దలేవు. కొందరిని అనుమతించడం లేదంటే దాని అర్థం వారంతా అంటరానివారని కాదు. ఆలయ సంప్రదాయాలు, నమ్మకాలపై అది ఆధారపడి ఉంటుంది. భారత్‌లో భిన్న మత విధానాలు ఉన్నాయి. ప్రార్థించేందుకు ఉన్న ప్రాథమిక హక్కును సమానత్వ సిద్ధాంతం ఉల్లంఘించజాలదు’ అని ఆమె తన తీర్పులో వెల్లడించారు. సామాజిక రుగ్మతలైన సతీసహగమనం వంటి అంశాల్లో తప్ప, మతపరమైన విశ్వాసాల్ని తొలగించే అధికారం కోర్టులకు లేదని ఆమె అన్నారు. ఈ ఆలయాల్లోనూ నో ఎంట్రీ హరియాణలోని కార్తికేయ ఆలయం, రాజస్తాన్‌లోని రణక్పూర్ గుడి తదితరాల్లోనూ మహిళలను అనుమతించరు. క్రీ.పూ ఐదో శతాబ్దానికి చెందిన కార్తికేయుడి ఆలయం హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా పెహోవాలో ఉంది. కార్తికేయుడు బ్రహ్మచారి. అందుకే ఈ ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే వారిని దేవుడు శపిస్తాడని భక్తుల నమ్మకం. రాజస్తాన్‌లోని పాలి జిల్లాలో ఉన్న జైన ఆలయం రణక్పూర్ గుడిలోకి మహిళలకు ప్రవేశం లేదు. క్రీ.శ. 15వ శతాబ్దంలో నిర్మాణమైన దేవాలయాల సమూహ ప్రాంతమిది. ఈ ఆలయ సముదాయంలోకి రుతుస్రావం అయ్యే వయసులో ఉన్న మహిళల ప్రవేశం నిషిద్ధం. అసోంలోని బార్పెటా పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ ఆలయం పట్బౌసి సత్రాలోకి రుతుస్రావమయ్యే స్త్రీలు రాకూడదనే నిబంధన ఉంది. 2010లో అప్పటి అసోం గవర్నర్ జేబీ పట్నాయక్ ఈ ఆలయ అధికారులను ఒప్పించి 20 మంది మహిళలకి ఆలయ ప్రవేశం కల్పించారు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు మహిళల్ని అనుమతించినా మళ్లీ నిషేధం విధించారు. తిరువనంతపురంలోని ప్రఖ్యాత పద్మనాభస్వామి ఆలయంలో మహిళలకు ప్రవేశంపై కొన్ని పరిమితులున్నాయి. స్త్రీలు పద్మనాభుడికి పూజలు చేయవచ్చు. కానీ గర్భగుడిలోకి వెళ్లరాదు. వివాదం ఇలా ప్రారంభం 2006లో జ్యోతిష్కుడు ఒకరు ఆలయంలో దేవప్రశ్నం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఎవరో మహిళ ఆలయంలోకి ప్రవేశించిందన్నారు. వెంటనే కన్నడ నటి, ప్రస్తుత కర్ణాటక మంత్రివర్గంలో సభ్యురాలు జయమాల తాను శబరిమల ఆలయంలోకి వెళ్లి అయ్యప్పస్వామి విగ్రహాన్ని తాకినట్లు చెప్పారు.దీంతో శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశంపై వివాదం ముదిరింది. ఆ తర్వాత మహిళలకు ప్రవేశం నిరాకరణను సవాల్ చేస్తూ సీనియర్ అడ్వకేట్ ఇందిర జైసింగ్ ఆధ్వర్యంలో మహిళా లాయర్లు కోర్టుకెక్కారు. వందల ఏళ్ల సంప్రదాయాల్ని కాదనే హక్కు కోర్టుకి ఉండదనీ, అలాంటి అంశాల్లో పూజారులదే తుది నిర్ణయమంటూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పుని లాయర్ల బృందం సుప్రీం కోర్టులో సవాల్‌చేసింది. శబరిమల ఆలయానికి ప్రాముఖ్యత ఉందనీ, ప్రభుత్వాలు, కోర్టులు జోక్యం చేసుకోకూడదని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు వాదించింది. అయ్యప్పస్వామి నైష్టిక బ్రహ్మచారి, అందుకే రుతుస్రావ వయసులో మహిళల్ని రానివ్వడం లేదని చెప్పింది. దీన్ని మహిళలపై వివక్షగా చూడకూడదంది. హిందూమతంలోని వైవి«ధ్యాన్ని అర్థం చేసుకోలేక పిటిషినర్లు దానిని వివక్షగా చూస్తున్నాయని బోర్డు ఆరోపించింది. కొందరు మహిళా భక్తులు బోర్డుకు మద్దతుగా నిలిచారు. శబరిమల కేసు పూర్వాపరాలు... ► 1990: శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశంపై నిషేధాన్ని తొలగించాలంటూ ఎస్.మహేంద్రన్ అనే వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ► 1991, ఏప్రిల్ 5: కొన్ని వయస్సుల మహిళలపై తరాలుగా కొనసాగుతున్న నిషేధాన్ని సమర్ధిస్తూ కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ► 2006 ఆగస్టు 4: శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ పిటిషన్ వేసింది. ► 2007 నవంబర్: పిటిషన్‌కు మద్దతుగా కేరళలోని ఎల్డీఎఫ్ సర్కారు అఫిడవిట్ దాఖలు. ► 2016 ఫిబ్రవరి 6: కేరళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. మతాచారాన్ని పాటించే భక్తుల హక్కును పరిరక్షిస్తామని తెలిపింది. ► 2016 ఏప్రిల్ 11: మహిళల ప్రవేశంపై నిషేధం వల్ల స్త్రీ, పురుష సమ న్యాయ భావనకు ప్రమాదం ఏర్పడిందని కోర్టు వ్యాఖ్య. ► 2016 ఏప్రిల్ 13: ఆలయ సంప్రదాయం పేరుతో ప్రవేశాలను అడ్డుకోవడంలో హేతుబద్ధత లేదన్న సుప్రీంకోర్టు. ► 2016 ఏప్రిల్ 21: మహిళలను అనుమతించాలంటూ హింద్ నవోత్థాన ప్రతిష్టాన్, నారాయణాశ్రమ తపోవనమ్ పిటిషన్లు. ► 2016 నవంబర్ 7: అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలనే వాదనకు మద్దతు తెలుపుతూ కేరళ అఫిడవిట్ వేసింది. ► 2017 అక్టోబర్ 13: ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. -
ఆలయ నిబంధన అసంబద్ధం: సుప్రీం
న్యూఢిల్లీ: 41 రోజుల పాటు ఐహిక వాంఛలకు దూరంగా ఉండి, అనంతరం శబరిమల ఆలయాన్ని దర్శించాల న్న నిబంధన అసాధ్యమైన, ఆచరణ సాధ్యం కానిదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం లేదన్న నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం వాదనలు కొనసాగాయి. ‘కేవలం 10 నుంచి 50 ఏళ్ల వయస్సున్న మహిళలకు మినహాయించి.. ఈ దేవాలయంలోకి అన్ని కులాలు, మతాల వారికి ప్రవేశం ఉంది. ఈ ఆలయ సందర్శనకు ముందు 41 రోజుల పాటు పవిత్రంగా, ఐహిక వాంఛలకు దూరంగా ఉండటం మహిళలకు సాధ్యంకాకపోవడమే వారిని అనుమతించకపోవడానికి కారణం’ అని ధర్మాసనానికి దేవస్థానం తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ తెలిపారు. -
శబరిమలలో మహిళల నిరోధం అందుకే..
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల ఆలయంలోకి పురుషుల తరహాలో మహిళలూ వెళ్లి పూజలు చేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ట్రావన్‌కోర్ దేవస్ధానం బోర్డు గురువారం స్పందించింది. ఈ ఆలయంలో స్వామి విశిష్టత ఆధారంగానే రుతుక్రమం ఉన్న మహిళల ప్రవేశాన్ని నిరోధిస్తున్నామని స్పష్టం చేసింది. దైవం స్వాభావిక విశిష్టత, ఆలయ చరిత్ర కారణంగానే అలాంటి మహిళలను ఆలయంలోపలికి అనుమతించడం లేదని దేవస్ధానం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సుప్రీం కోర్టుకు నివేదించారు. శబరిమల అయ్యప్ప బ్రహ్మచారి కావడంతోనే ఆలయంలో ఈ పద్ధతి అనుసరిస్తున్నారని సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ వాదించారు. ఇతర అయ్యప్ప దేవవాలయాల్లో మహిళలను లోపలికి అనుమతిస్తున్నారని వివరించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా కలుగచేసుకుని వారికి (మహిళలు) శబరిమల ఆలయంపైనే విశ్వాసం ఉండవచ్చని, దేశంలో ఎన్నో జగన్నాధ్ ఆలయాలున్నా పూరీ జగన్నాధ ఆలయానికే భక్తులు పోటెత్తుతుండటాన్ని ప్రస్తావించారు. శబరిమల దైవంపై మహిళలకు విశ్వాసం ఉంటే ఆలయ సంప్రదాయాలను, పద్ధతులను వారు గౌరవించాలని సింఘ్వీ వాదించారు. ఈ క్రమంలో మతపరంగా అనుసరించే పద్ధతులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండవచ్చా అని సుప్రీం బెంచ్ ప్రశ్నించింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. -
ఆలయ ప్రవేశం రాజ్యాంగ హక్కు
న్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాత శబరిమల అ య్యప్ప స్వామి ఆలయంలో మహిళలూ పూజలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎటువంటి వివక్షకు తావులేకుండా పురుషులతోపాటు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని, అది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొంది. ఆలయంలోకి 10 నుంచి 50 మధ్య వయసు గల మహిళల ప్రవేశంపై శబరిమల దేవస్వమ్ బోర్డు నిషేధం విధించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ పక్షాన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, అమికస్ క్యూరీగా రాజు రామచంద్రన్ వాదించారు. మహిళలను ఆలయంలోకి రానివ్వక పోవటం ప్రాథమిక హక్కులను నిరాకరించడం, అంటరానితనం పాటించడం వంటిదేనన్నారు. ఆల యంలోకి మహిళల అనుమతికి సంబంధించి ఎటువంటి చట్టాలు లేనప్పటికీ వారిని పూజలు చేయకుండా అడ్డుకోవటం వివక్ష చూపడమేనని కోర్టు పేర్కొంది. ‘ పురుషులకు ఉన్న చట్టాలే మహిళలకూ వర్తిస్తాయి. మహిళలకు ఆలయ ప్రవేశానుమతి చట్టాలపై ఆధారపడి లేదు. అది ఆర్టికల్స్ 25, 26 ప్రకారం రాజ్యాం గం కల్పించిన హక్కు’ అని తెలిపింది. రాష్ట్రం లోని అన్ని ఆలయాల్లోకి మహిళల ప్రవేశంపై సంపూర్ణ మద్దతు ఇస్తామంటూ కేరళ ప్రభుత్వ లాయరు తెలపడంపై స్పందించిన కోర్టు.. ‘పిటిషనర్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు వాదనలు వినాల్సిన అవసరం లేకపోవటం ఒక్కటే దీని వల్ల కలిగిన ప్రయోజనం. 2015లో ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించిన కేరళ ప్రభుత్వం.. రెండేళ్ల తర్వా త 2017లో అనుమతి నిరాకరించింది. కాలా న్ని బట్టి మీరు నిర్ణయాలు మార్చుకుంటున్నా రు’ అని వ్యాఖ్యానించింది. ఇదే అంశంలో యంగ్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు కొనసాగనున్నాయి. మహిళలకు శబరిమల ఆ లయ ప్రవేశం నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ గత ఏడాది అక్టోబర్‌లో దాఖలైన పిటి షన్ను కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ బెంచ్ మహిళలను ఆలయం లోకి నిరాకరించడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందా లేదా అనే దానితోపాటు కీలకమైన అంశాలపై వాదనలు వింటుంది. 12 ఏళ్ల న్యాయపోరాటం ► 1965 నాటి కేరళలోని హిందూ ప్రార్థనా స్థలాల (ప్రవేశ అధికారం)నిబంధన 3(బి) కింద ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధానికి చట్టబద్ధత కల్పించారు. ► ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 2006లో ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. లింగభేదం ఆధారంగా పౌరుల పట్ల వివక్ష చూపరాదని, అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న రాజ్యాంగ నిబంధనకు ఇది విరుద్ధంగా ఉందని, మతాచారాలను పాటించే స్వేచ్ఛకు కూడా భంగం కలిగిస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. ► విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు అదే ఏడాది కక్షిదారులకు నోటీసులిచ్చింది. ► 2008 మార్చి7న ఈ కేసును త్రిసభ్య బెంచ్‌కు అప్పగించగా ఏడేళ్ల పాటు ఎలాంటి పురోగతీ లేదు. ► 2016 జనవరి 11న సుప్రీంకోర్టు బెంచ్ మళ్లీ కేసు విచారణను మొదలు పెట్టింది. ► కేసు విషయంలో కేరళ ప్రభుత్వం మూడుసార్లు తన వైఖరిని మార్చుకోవడం గమనార్హం. 2006లో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం పిటిషన్‌ను సవాలు చేయరాదని నిర్ణయించగా, తర్వాత పగ్గాలు చేపట్టిన యూడీఎఫ్ సర్కారు మహిళలపై నిషేధాన్ని సమర్థించింది. మళ్లీ అధికారం చేపట్టిన ఎల్డీఎఫ్ తన పూర్వ వైఖరినే వ్యక్తపరిచింది. ► త్రిసభ్య బెంచ్ 2017లో కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. -
హిందువు అంటే హిందువే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: 'హిందూ మతంలో పురుష హిందువు, మహిళా హిందువు అన్న భేదమే లేదు. హిందువు అంటే హిందువే' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమలలో మహిళల ప్రవేశంపై శతాబ్దాలుగా ఉన్న నిషేధం ఎత్తివేత అంశంపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. హిందూ మతంలో స్త్రీ-పురుష భేదం లేదని, హిందువులంతా హిందువులేనని ఈ సందర్భంగా జడ్జిలు వ్యాఖ్యానించారు. దేవాలయాల్లోకి మహిళల రాకను అడ్డుకోవడమంటే రాజ్యాంగం వారికి ఇచ్చిన సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని వారు స్పష్టం చేశారు. అయితే శబరిమలలోకి మహిళల రాకను నిషేధించే సంప్రదాయాన్ని కొనసాగించాల్సిందేనని ఆలయ ట్రస్టు, కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించాయి. శబరిమలలో కొలువైన అయ్యప్ప బ్రహ్మచారి అని, పిల్లలకు జన్మనిచ్చే మహిళల రాక వల్ల ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లవచ్చునని పేర్కొన్నాయి. సనాతన ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా చేసే వాదన రాజ్యాంగం కల్పించిన హక్కుల ముందు నిలబడే ఆస్కారంలేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.